స్మిత్ మచ్చర్: విమానంలోని వందమందికి పైగా ప్రాణాలను కాపాడిన ఈ కెప్టెన్ ఎవరు?

ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ అరేబియా, పైలట్
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో కత్తిపోట్లకు గురైన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తాను స్పృహ కోల్పోవడానికి ముందు కాక్‌పిట్ తలుపు తెరిచినట్టు తెలుస్తోంది.

బెన్‌ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన సంభాషణలో ఇజ్రాయెల్ ప్రయాణికుడు యానివ్ హయూన్ ఈ విషయం చెప్పారు.

"మచ్చర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తన పరిస్థితిని అర్ధం చేసుకుని, మా కోసం తలుపు తెరిచి, ఆ తర్వాత స్పృహ కోల్పోయారని నాకర్ధమైంది'' అని హయూన్ అన్నారు.

దీనిపై నెతన్యాహు 'ఎక్స్‌'లో ఓ పోస్ట్ చేశారు.

"కత్తి దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ఎదురుదాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిని ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు. దీనివల్ల ఆకాశంలో ఒక పెద్ద ప్రమాదం జరగకుండా నివారించగలిగారు'' అని ఆ పోస్ట్‌లో నెతన్యాహు ప్రశంసించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సోషల్ మీడియాలో స్మిత్ మచ్చర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఒక ఇరాన్ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిపై స్పందించారు. ''నా భర్త ఒక పైలట్. కాక్‌పిట్ తలుపును లోపలి నుంచి అన్‌లాక్ చేసే స్విచ్ కాక్‌పిట్‌లో ఉంటుందని ఆయన నాకు చెప్పారు. కాబట్టి కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పృహ కోల్పోక ముందు సహాయం కోసం పిలవడమే కాకుండా ఆ స్విచ్‌ను కూడా నొక్కి ఉండొచ్చు. దానివల్ల ఫ్లైట్ అటెండెంట్లు, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లగలిగారు" అని ఆ మహిళ తన పోస్ట్‌లో తెలిపారు.

''కాక్‌పిట్ తలుపు లాక్ చేసి ఉంటే ఎవరూ లోపలికి వెళ్లి విమానాన్ని కాపాడలేకపోయేవారు. ఆయనకు సెల్యూట్. ఆ ఒక్క నిర్ణయం విమానంలో ఉన్న అందరి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ అరేబియా, పైలట్
ఫొటో క్యాప్షన్, కాక్‌పిట్ లోపలి నుంచి వీడియో తీసి పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో అసఫ్ రెరగావిమ్ సాయపడ్డారు.

ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ...

గాయపడిన వ్యక్తికి పలువురు ప్రయాణికులు ప్రాథమిక చికిత్స అందించారని ఇజ్రాయెల్ వెబ్‌సైట్ జెరూసలేం పోస్ట్ తెలిపింది.

వారిలో ఇజ్రాయెల్ డెంటిస్ట్ షోటా ముసాయేవ్ కూడా ఉన్నారు. తబుక్ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన తర్వాత మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు.

మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన తల, చేతుల నుంచి చాలా రక్తం కారుతోందని ముసాయేవ్ ఇజ్రాయెల్ మీడియాకు తెలిపారు. షోటా ముసాయేవ్ ప్రాథమిక చికిత్స చేయడంతోపాటు రక్తస్రావాన్ని ఆపారు. మచ్చర్ అప్పుడు కోలుకున్నారు. అయితే విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మచ్చర్ పరిస్థితి మళ్లీ విషమించిందని డెంటిస్ట్ చెప్పారు.

కో పైలట్ తనపై కత్తితో దాడి చేశారని మచ్చర్ మాటల ద్వారా చెప్పగలిగారని ముసాయేవ్ అన్నారు.

ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ అరేబియా, పైలట్
ఫొటో క్యాప్షన్, ఫై దుబాయ్‌లో చేరకముందు స్మిత్ మచ్చర్ స్పైస్‌జెట్‌లో పదేళ్లకు పైగా పనిచేసినట్టు లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉంది.

అనుభవమున్న పైలట్

స్మిత్ మచ్చర్ ఎంతో అనుభవమున్న పైలట్. కొత్త పైలట్లకు శిక్షణ కూడా ఇచ్చారు.

ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు భారత విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో పదేళ్లకు పైగా పనిచేశారని లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉంది. ట్రైనింగ్ కెప్టెన్‌గా, కొత్త పైలట్లకు మెంటర్‌గా పనిచేశారు.

బోయింగ్ 737-800, 737 మ్యాక్స్ 8, మ్యాక్స్ 9 విమానాల్లో సుమారు 9,750 గంటలు ప్రయాణించారు. మచ్చర్‌కు పిల్లలు ఉన్నారని లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉంది.

ఆయన ముంబయికి సమీపంలోని ఘట్కోపర్‌కు చెందినవారనీ, ప్రస్తుతం దుబాయిలో ఉంటూ కెప్టెన్‌గా పని చేస్తున్నారని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక వెబ్‌సైట్ వెల్లడించింది.

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో స్మిత్ మచ్చర్ బ్యాచిలర్ డిగ్రీ చేశారనీ, ఆయన సోదరుడు కూడా పైలట్‌గా పని చేస్తున్నారని వెబ్‌సైట్ వెల్లడించింది.

ప్రస్తుతం మచ్చర్‌ను వాయువ్య సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారని, ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

స్మిత్ మచ్చర్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హీరో అని కొనియాడారు. కో-పైలట్ కత్తితో చేసిన దాడిని తిప్పికొట్టి, కాక్‌పిట్ తలుపు తెరిచి, సహాయం కోసం పిలవడం ద్వారా విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేయడానికి జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో సహాయపడ్డారని ట్రంప్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)