‘సౌదీలో మరణదండన ఎదుర్కొంటున్న మా అబ్బాయిని కాపాడండి’

బల్జిందర్ సింగ్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై పఠాన్‌కోట్‌కు చెందిన బల్జిందర్ సింగ్‌కు సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించారు.
    • రచయిత, గుర్‌ప్రీత్ చావ్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

''ఇప్పుడు మా అబ్బాయిని మోదీ ప్రభుత్వం లేదా స్వయంగా మోదీ మాత్రమే కాపాడగలరు. మిగిలిన దారులన్నీ మూసుకుపోయాయి. మేం సౌదీ అరేబియాలో సుప్రీంకోర్టు సహా అన్ని కోర్టులలో ప్రయత్నించాం. కానీ శిక్షను తగ్గించలేదు''

పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ జిల్లాలోని సుజన్‌పూర్ ప్రాంతంలోని ఫిరోజ్‌పూర్‌ కలాన్ గ్రామానికి చెందిన బల్జిందర్ సింగ్ వృద్ధ తల్లిదండ్రుల మాటలు ఇవి.

మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ఆరోపణల కేసులో బల్జిందర్ సింగ్‌కు సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించారు. బల్జిందర్‌ను కాపాడాలంటూ ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.

బల్జిందర్ సింగ్ సౌదీ అరేబియాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసేవారు. పంజాబ్‌లోని బల్జిందర్ సింగ్ ఇల్లు బంధువులు, పాత్రికేయులు, ఇలా వచ్చిపోయేవారితో నిత్యం హడావుడిగా ఉంటోంది. బల్జిందర్‌కు వృద్ధులైన తన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారి ముఖాలు ఆందోళన, నిస్సహాయతతో కనిపిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

బల్జిందర్ సింగ్ 2024 నుంచి సౌదీ అరేబియా జైలులో ఉంటున్నారని ఆయన కుటుంబం చెప్పింది. అంతకుముందు ఆయన ఉపాధి నిమిత్తం 2017 నుంచి దుబయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసేవారు.

2023లో సెలవు తీసుకున్న తర్వాత ఆయన మళ్లీ విదేశాలకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు.

''2024 ఫిబ్రవరి 6న బల్జిందర్ సింగ్ దుబయ్ నుంచి సౌదీ అరేబియాకి ట్రక్‌లో ప్రయాణిస్తున్నారు. సౌదీ సరిహద్దుకు ముందు, ఆయన కొద్దిసేపు ఆగినప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న తన వృద్ధ తండ్రి వీడియో చూపి, ఆయనకు మెడిసిన్స్ ఇవ్వమని కోరుతూ ఓ పాకెట్ ఇచ్చారు'' అని బల్జిందర్ సింగ్ కుటుంబం తెలిపింది. వృద్ధుడి అనారోగ్యాన్ని గమనించి, బల్జిందర్ ఆ ప్యాకెట్‌ను తీసుకువెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పారు.

అయితే, దుబయ్-సౌదీ సరిహద్దు వద్ద ట్రక్‌ను తనిఖీ చేయగా, బల్జిందర్ తీసుకున్న ప్యాకెట్‌లో మాదకద్రవ్యాలు లభించాయనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు.

ప్యాకెట్‌ను తీసుకువెళ్లడానికి సౌదీ అరేబియాకు రావాల్సిన వ్యక్తిని కూడా ఈ కేసులో అరెస్టు చేసినట్లు బల్జిందర్ సింగ్ కుటుంబం తెలిపింది. కేసు విచారణ సందర్భంగా ఆయనకు కూడా మరణ శిక్ష విధించారని కుటుంబ సభ్యులు చెప్పారు.

బల్జిందర్ సింగ్
ఫొటో క్యాప్షన్, బల్జిందర్ సింగ్ ఫిబ్రవరి 2024 నుంచి సౌదీ అరేబియా జైలులో ఉన్నారు.

బల్జిందర్ సింగ్ కుటుంబం ఏం చెబుతుంది?

తమ కుటుంబం ఒక సాధారణ, సుఖమయ జీవితాన్ని గడిపేదని బల్జిందర్ తండ్రి జస్విందర్ సింగ్ చెప్పారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ విదేశాలలోనే పనిచేస్తున్నారు. ఆ కుటుంబం తమను తాము అమృత్‌ధారి గురుసిక్కు కుటుంబంగా పేర్కొంది.

కానీ, బల్జిందర్ అరెస్టు తర్వాత, ఆ కుటుంబం పరిస్థితి మారిపోయింది.

"మేం వివిధ కోర్టులలో కేసును ఎదుర్కోవడానికి ప్రయత్నించాం. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మరణశిక్షను సమర్థించింది" అని జస్విందర్ సింగ్ చెప్పారు.

దీంతో ఈ కుటుంబమంతా కేంద్ర ప్రభుత్వంపైనే ఆశ పెట్టుకుంది.

తన భర్తను అరెస్టు చేసినప్పటి నుంచి ఇంట్లో పరిస్థితి మారిపోయిందని బల్జిందర్ భార్య సునీల్ లతా తెలిపారు.

"మేం పంజాబ్‌లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన చాలా మంది నాయకులను కలిశాం. సహాయం కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఈమెయిల్ పంపాం" అని సునీల్ లతా చెప్పారు.

దుబయ్‌లో నివసిస్తున్న బల్జిందర్ తమ్ముడు కూడా సహాయం కోసం విజ్ఞప్తి చేస్తూ.. భారత ప్రభుత్వానికి ఒక ఈమెయిల్, భారత రాయబార కార్యాలయానికి ఒక లేఖ పంపారు.

కానీ, ఇంకా ఎటువంటి స్పందన రాలేదని ఆ కుటుంబం చెబుతోంది.

''నా భర్త ఎప్పుడూ మత్తుపదార్థాలు తీసుకోలేదు. భారత్‌లో ఆయనపై ఎలాంటి కేసులు లేవు. బల్జిందర్ ఒక అమృత్‌ధారి గురుసిక్కు. అనారోగ్యంతో ఉన్న ముసలివారి కోసమే ఆయన మెడిసిన్ ప్యాకెట్ తీసుకెళ్తున్నారు'' అని సునీల్ లతా తెలిపారు.

తన 12 ఏళ్ల కూతురు పెద్దగా ప్రశ్నలు అడగదని, కానీ తన చిన్న కొడుకు మాత్రం పదేపదే తన తండ్రి గురించి అడుగుతాడని సునీల్ లతా చెప్పారు.

పిల్లలు అడిగే చాలా ప్రశ్నలకు తన వద్ద సమాధానాలు లేవని ఆమె తెలిపారు. మరోవైపు, ఈ మానసిక ఆందోళన కారణంగా వృద్ధులైన బల్జిందర్ సింగ్ తల్లిదండ్రులు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

సౌదీ అరేబియాలో బల్జిందర్ సింగ్‌కు మరణ శిక్ష ఖరారు చేసిన తర్వాత.. చివరిగా తమ ఆశలన్నీ కేంద్ర ప్రభుత్వంపైనే మిగిలాయని బల్జిందర్ సింగ్ కుటుంబం చెబుతోంది.

సౌదీ అరేబియాతో సంప్రదింపులు జరిపి, బల్జిందర్ సింగ్ శిక్ష తగ్గింపు కోసం ప్రయత్నించాలని ఆ కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.

బల్జిందర్ సింగ్ తల్లిదండ్రులు
ఫొటో క్యాప్షన్, బల్జిందర్ సింగ్‌కు శిక్ష నుంచి ఉపశమనం పొందేలా చేయాలని భారత ప్రభుత్వానికి ఆయన కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.

న్యాయవాది ఏం చెబుతున్నారు?

బల్జిందర్ సింగ్ దోషిగా తేలడాన్ని సవాల్ చేస్తూ సౌదీ అరేబియా సుప్రీంకోర్టులో ప్రత్యేక న్యాయపరమైన అభ్యర్థన దాఖలు చేసిన లాయర్ అక్బర్ అల్-ముతైరీ, ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా అందించారు.

ఈ కేసులో తన పాత్ర సుప్రీంకోర్టు ముందు జరిగే ప్రత్యేక న్యాయపరమైన అభ్యర్థనకు సంబబంధించిన విచారణకు మాత్రమే పరిమితమని, అదే వ్యాజ్యానికి చివరి దశ అని ఆయన వివరించారు.

ట్రయల్ కోర్టులో లేదా అప్పీల్ కోర్టులో కానీ తాను బల్జిందర్ సింగ్‌ తరఫున వాదించలేదని ఆయన చెప్పారు. ఈ రెండు దశలోనూ బల్జిందర్ సింగ్ తరఫున వాదించడానికి ఏ న్యాయవాది హాజరు కాలేదని ఆయనకు అందిన సమాచారంలో ఉంది.

బల్జిందర్ సింగ్ దోషిగా నిర్ధరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తానో ప్రత్యేక న్యాయపరమైన అభ్యర్థనను దాఖలు చేశానని, ఆయనకు అనుకూలంగా అన్ని చట్టపరమైన ఆధారాలను, వాదనలను సమర్పించానని ఆ న్యాయవాది పేర్కొన్నారు.

తాజిర్ కింద విధించిన మరణ శిక్షను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు సమర్థించడంతో.. తన పిటిషన్‌పై విచారణ ముగిసిందని అక్బర్ అల్ -ముత్తేరి తెలిపారు.

ప్రస్తుతం బల్జిందర్ సింగ్ కుటుంబం భారత ప్రభుత్వ జోక్యాన్ని కోరుతోంది.

ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారులతో చర్చించి మరణశిక్ష నుంచి ఉపశమనం కల్పించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలని బల్జిందర్ కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)