ఆంధ్ర మెడికల్‌ కాలేజ్: అయిదు రోజుల వ్యవధిలో ఇద్దరు వైద్య విద్యార్థినుల ఆత్మహత్య

ఒత్తిడి, చదువు
ఫొటో క్యాప్షన్, శ్రావణి, శైలజ
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజ్ (ఏఎంసీ) లో అయిదు రోజుల వ్యవధిలో ఇద్దరు వైద్య విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు.

వారిలో ఒకరు సెప్టెంబర్ 24న, ఇంకొకరు సెప్టెంబర్ 28న ఆత్మహత్య చేసుకున్నారు.

వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి బీబీసీతో చెప్పారు.

1923లో ప్రారంభమైన ఆంధ్ర మెడికల్‌ కాలేజ్‌ 2023లో వందేళ్లు పూర్తి చేసుకుంది.

ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న వైద్య కళాశాలలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని మానసిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సెప్టెంబర్ 28న విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్‌లో ఈఎన్టీ విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 27 ఏళ్ల డి. శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు.

చినవాల్తేరులోని ఆమె అద్దెకుంటున్న ఇంటిలోనే ఈ ఘటన జరిగినట్లు విశాఖ మూడో పట్టణ పోలీసులు బీబీసీకి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అప్పలనాయుడు బీబీసీతో చెప్పారు.

"హైదరాబాద్‌కు చెందిన డి. శ్రావణి ఆంధ్ర వైద్య కళాశాలలో ఈఎన్టీ విభాగంలో పీజీ చదువుతూ...విశాఖ చినవాల్తేరులో అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఆమె తల్లిదండ్రులు కువైట్‌లో ఉద్యోగాలు చేస్తుంటారు. సోమవారం ఉదయం ఆమె తన గదిలో మృతి చెంది కనిపించారు. పక్కింటివారు గుర్తించి మాకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌‌కు తరలించాం. మెడిసిన్ చదవడం తనకు ఇష్టం లేదని శ్రావణి తరచూ చెప్పి బాధపడేదని తోటి విద్యార్థులు చెప్పారు" అని సీఐ అప్పలనాయుడు తెలిపారు.

పోలీసులు అందించిన సమాచారంతో హైదరాబాద్ నుంచి వారి తల్లిదండ్రులు విశాఖ చేరుకున్నారు. కొద్దిరోజుల కిందట వారు కువైట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

ఆంధ్ర మెడికల్ కాలేజ్
ఫొటో క్యాప్షన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్

శ్రావణి తల్లి డి. పద్మ బీబీసీతో మాట్లాడారు.

"శ్రావణి శుక్రవారం (25.09.26) ఫోన్ చేసింది. అమ్మా నాకు చదవడం ఇష్టం లేదు. నేను శనివారం సంతకాలు పెట్టించుకుని నా సర్టిఫికేట్లు పట్టుకుని ఆదివారం హైదరాబాద్ వచ్చేస్తాను అని చెప్పింది. సరే అంత కష్టం ఉంటే నీ ఇష్టం అని చెప్పాం. కానీ సోమవారం శ్రావణి చనిపోయిందనే వార్త తెలిసింది" అని పద్మ చెప్పారు.

"బాగా చదువుకునేది. కానీ ఏదీ ఓపెన్‌గా మాట్లాడేది కాదు. ఏదో ఇబ్బంది పెట్టుంటారని అనుకుంటున్నాం" అని పద్మ చెప్పారు.

అయితే దీనిపై ఎటువంటి పోలీసు కంప్లైట్ ఇవ్వలేదని ఆమె తెలిపారు.

సెప్టెంబర్ 24న కూడా...

దీనికి ముందు సెప్టెంబరు 24న ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చివరి సంవత్సరం చదువుతున్న విశాఖపట్నానికి చెందిన విద్యార్థిని పి. శైలజ విశాఖ రామనగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.

ఆమె స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస.

"శైలజ కుటుంబం విశాఖలోని రామ్‌నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. పీజీ ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతుండగా...ఈ పరీక్షల్లో తొలి రెండు పరీక్షలకు హాజరైన శైలజ...గురువారం (24.09.26) మూడో పరీక్షకు వెళ్లాల్సి ఉంది. పరీక్షకు సిద్ధమవ్వాలని చెప్పడానికి ఉదయం ఎనిమిది గంటల సమయంలో తల్లి ఆమె గది వద్దకు వెళ్లి చూసేసరికి... శైలజ గదిలో మృతి చెంది కనిపించారు. పరీక్షల ఒత్తిడితోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని తల్లిదండ్రులు చెప్పారు. శైలజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నాం" అని సీఐ అప్పలనాయుడు తెలిపారు.

శైలజ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే అందుకు వారు నిరాకరించారు.

ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్‌ వై. సంధ్యాదేవి
ఫొటో క్యాప్షన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్‌ వై. సంధ్యాదేవి

ఏఎంసీ ప్రిన్సిపల్ ఏమన్నారంటే...

ప్రాథమికంగా పరీక్షల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానన్న ఒత్తిడి, నిరాశల ప్రభావం ఉండి ఉండొచ్చునని తాము భావిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వై.సంధ్యాదేవి బీబీసీకి చెప్పారు.

ఇద్దరు విద్యార్థినులు తమ విభాగాల్లోని సీనియర్లకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి తెలిపారు.

"హైదరాబాద్‌కు చెందిన శ్రావణి...ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఏఎంసీలో ఈఎన్టీ పీజీ చదువుతున్నారు. కానీ అది చదవడం ఇష్టం లేదని తన సర్టిఫికేట్లు ఇప్పించాల్సిందిగా శనివారం (26.09.26) లేఖ రాశారు. ఆ రోజు నేను సెలవులో ఉండటంతో ఆ రోజు శ్రావణికి కళాశాల సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు, సోమవారం శ్రావణి కళాశాలకు రాలేదు. రూంకి వెళ్లి చూస్తే చనిపోయి కనిపించింది" అని డాక్టర్ సంధ్యాదేవి చెప్పారు.

శ్రావణి మృతికి ముందు, ఆమె వ్యక్తిగతంగా లేదా చదువుకు సంబంధించిన సమస్యలను కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకురాలేదని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సంధ్యాదేవి తెలిపారు.

"ప్రస్తుతం తాను చదువుతున్న కోర్సు కొనసాగించడం తనకు ఇష్టం లేదని పేర్కొంటూ ఆమె విభాగాధిపతికి లేఖ ఇచ్చారు. వేరే రంగంలోకి వెళ్లాలనుకుంటున్నానని, ఈఎన్‌టీ కోర్సుపై ఆసక్తి లేదని శ్రావణి అంటుండేవారని తెలిసింది. కోర్సు మానేయడానికి కారణం ఏంటని ఇతర విద్యార్థులు ఆమెను అడిగినా, అది వ్యక్తిగత విషయమని చెప్పేదని విద్యార్థులు తెలిపారు. తన సమస్యలను శ్రావణి పంచుకుని ఉంటే కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఆమెకు సహాయం చేసేవారు" అని డాక్టర్ సంధ్యాదేవి బీబీసీతో అన్నారు.

పని ఒత్తిడి ఉండదని, సమస్యలను దాచుకోకుండా సహచరులు, అధ్యాపకులతో పంచుకోవాలని, విపరీత నిర్ణయాలకు వెళ్లవద్దని ఆమె కోరారు.

తన బిడ్డ టార్చర్ వల్లే చనిపోయిందని మీడియాతో శ్రావణి తల్లి అన్న మాటలపై డాక్టర్ సంధ్యాదేవి స్పందించారు.

"ఇబ్బంది అనే పదం బాధలో అని ఉండవచ్చు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు" అని బీబీసీతో అన్నారు.

ఈ ఏడాది జూలైలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

"ఫోరెన్సిక్ కోర్సు చేస్తున్న అతడు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అతడికి పలుమార్లు కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చాం. అయినప్పటికీ దురదృష్టవశాత్తూ అతడు మృతి చెందాడు" అని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి తెలిపారు.

జూలైలో అతని మరణం తర్వాత సెప్టెంబరు 24న ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చివరి సంవత్సరం విద్యార్థిని పి.శైలజ, సెప్టెంబరు 28న ఈఎన్‌టీ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని వై.శ్రావణి మృతి చెందారు. ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు పీజీ విద్యార్థినులు, గత మూడు నెలలుగా చూసుకుంటే మగ్గురు ఏఎంసీ వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. సమస్యలు చెప్తే కౌన్సిలింగ్ చేస్తాం" అని డాక్టర్ సంధ్యాదేవి బీబీసీతో చెప్పారు.

కాగా ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో వరుసగా పీజీ విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పందించారు. ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ. విష్ణువర్ధన్‌ను ఆదేశించారు.

ఆత్మహత్య
ఫొటో క్యాప్షన్, శ్రావణి తల్లి పద్మ(కుడివైపు)

ఒత్తిడే కారణం కాదు: మానసిక శాస్త్ర నిపుణులు

వైద్య విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు అకడమిక్‌ ప్రెజర్‌ ఒక్కటే కారణం కాదని ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌ ఎంవీఆర్‌ రాజు బీబీసీతో అన్నారు.

పీజీ వైద్య విద్యార్థుల్లో 31.2 శాతం మంది జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్లు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నివేదిక తెలిపిందని ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు తెలిపారు.

చదువు, పరీక్షలు, భవిష్యత్తుపై భయం, కుటుంబ అంచనాలు, వ్యక్తిగత సమస్యలు, ఒంటరితనం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని విశ్లేషించారు.

"ప్రస్తుతం తల్లిదండ్రులు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర బాధ్యతల్లో బిజీగా మారడంతో పిల్లలతో క్రమం తప్పకుండా మాట్లాడే సమయం తగ్గిపోయిందని, వారిని సరిగా గమనించడం లేదు" అని ప్రొఫెసర్‌ ఎంవీఆర్‌ రాజు బీబీసీకి చెప్పారు.

పిల్లలు సరిగ్గా భోజనం చేస్తున్నారా? నిద్రపోతున్నారా? ఒంటరిగా ఉంటున్నారా? స్నేహితులతో కలుస్తున్నారా? సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? వంటి మార్పులను తల్లిదండ్రులు, అధ్యాపకులు గమనించాలి. అవి ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిలో సహజంగా కనిపించే లక్షణాలని గుర్తించాలన్నారు.

విద్యార్థులపై కేవలం మార్కులు, పనితీరు కోసం ఒత్తిడి చేయకుండా కళాశాలల్లో క్రమంతప్పకుండా కౌన్సెలింగ్‌, గోప్యమైన ఫిర్యాదు సహాయ వేదికలు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్‌ ఎంవీఆర్‌ రాజు సూచించారు.

  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)