ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. స్నేహితులై.. చివరకు అక్కాచెల్లెళ్లమని తెలుసుకున్నారు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, గీతాపాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇది బాలీవుడ్ సినిమాను తలపించే కథ.
భారత్‌లో పుట్టిన ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు నలభైల్లో ఉన్నారు. వారిద్దరినీ చిన్నప్పుడు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. నెదర్లాండ్స్‌లో దాదాపు ఒకే ప్రాంతంలో పెరిగిన ఈ ఇద్దరికీ ఇప్పుడు తాము అక్కాచెల్లెళ్లమని తెలిసింది.
మీనా గెల్టింక్, మినాల్ టిజెన్‌లు 1980ల మొదట్లో పుట్టారు. పుట్టిన కొన్ని నెలలకే ముంబయిలోని రెండు అనాథ శరణాలయాల నుంచి రెండు కుటుంబాలు వారిని దత్తత తీసుకున్నాయి.
వాళ్లను దత్తత తీసుకోవడంలో సహకరించిన ఓ దత్తత సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మీనా, మినాల్ తొలిసారి కలుసుకున్నారు.
అప్పుడు వాళ్లు టీనేజ్‌లో ఉన్నారు. తమ రూపురేఖలు, ప్రవర్తనలో ఉన్న పోలికలను చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు
ఇప్పుడు 43 ఏళ్ల వయసులో ఉన్న మీనా ఆ రోజును గుర్తుతెచ్చుకున్నారు.

''పిల్లలను దత్తత తీసుకున్న కుటుంబాలన్నీ కలుసునేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు. దత్తత తీసుకున్న పిల్లలందరినీ ఒకచోట చేర్చి సరదాగా గడపడానికి, ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోడానికి, కలిసి భోజనం చేయడానికి ముందు రోజు సాయంత్రం ఏర్పాట్లు చేశారు.
మీన, మినాల్ ఇద్దరూ స్నేహితులో కలిసి అక్కడికి వచ్చారు. వాళ్ల రూపాలు ఒకేలా ఉండడాన్ని గమనించిన స్నేహితులే వారిద్దరినీ పరిచయం చేశారు.
''వాళ్లు అద్దంలో మీ ఇద్దరినీ చూసుకోండి అన్నారు. ఆమెదీ, నాదీ ముక్కు ఒకేలా ఉంది. మా నవ్వు కూడా ఒకేలా ఉంది. భోజనం చేస్తున్నంతసేపూ నేను ఆమెనే చూస్తూ ఉన్నాను'' అని అప్పటి విషయాన్నిగుర్తుచేసుకుంటూ నెదర్లాండ్స్ నుంచి మీనా బీబీసీతో చెప్పారు.
‘అక్కాచెల్లెళ్లమేమో అనిపించేది’
మరుసటిరోజు జరిగిన సమావేశంలో ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరి ఫోన్ నంబర్లు, అడ్రస్‌లను మరొకరు తీసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు కాంటాక్ట్‌లో ఉండాలని మాట ఇచ్చుకున్నారు.
తాము రక్త సంబంధీకులమని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా వారి మధ్య వెంటనే ఒక అనుబంధం ఏర్పడింది. ఎన్నో సంవత్సరాల పాటు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకున్నారు. ఒకరినొకరు సిస్ అని పిలుచుకునేవారు. ఎందుకంటే తమకు ఒకరి గురించి మరొకరికి అలా అనిపించేదని మీనా చెప్పారు.
స్కూల్, స్నేహితులు, అబ్బాయిలు, బయటకు వెళ్లడం, డ్యాన్స్ వంటి విషయాల గురించి రాసుకునేవారు. తాము ఆడే ఆటల గురించి, సంగీతం గురించి మాట్లాడుకునేవారు. ఇద్దరికీ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ సంగీతం అంటే చాలా ఇష్టమని తెలుసుకున్నారు.
15సంవత్సరాల క్రితం వారి మధ్య సంబంధాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అయిన మీనా అప్పట్లో తనకు మొదటి బిడ్డ పుట్టడంతో తను చాలా బిజీ అయిపోయాయని చెప్పారు. మరోవైపు మినాల్ ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Meena Geltink
డీఎన్ఏ పరీక్షల్లో తెలిసిన వెంటనే...
2017లో భారత్ నుంచి దత్తత తీసుకున్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన మరో సమావేశానికి మీనా హాజరయ్యారు. అక్కడ ఆమె డీఎన్ఏ పరీక్షల గురించి విన్నారు. దీంతో తాను కూడా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
డీఎన్ఏ మ్యాచ్‌లను చూపే యాప్ వాడేవారు.. దాదాపు పదేళ్లపాటు ఆమెకు ఎలాంటి డీఎన్ఏ మ్యాచ్ కనిపించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఫోన్‌లో స్పేస్ కోసం మీనా ఆ యాప్‌ను తొలగించారు.
''మే 20న ఫేస్‌బుక్‌లో మినల్ నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది. నన్ను గుర్తుపట్టావా అని ఆమె అడిగారు. ఏప్రిల్‌లో నెదర్లాండ్స్‌లోని తన తల్లిదండ్రులను కలవడానికి వచ్చినప్పుడు ఆమె డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నారు. తన పరీక్ష ఫలితానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా నాకు పంపారు''
''నేను మళ్లీ ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. చాలా టెన్షన్‌గా అనిపించింది. చివరకు లాగిన్ అయ్యేవరకు 10సార్లు తప్పు పాస్‌వర్డ్ కొట్టాను. ఫలితం మాత్రం ఎలాంటి సందేహానికీ తావు లేకుండా ఉంది.
వందశాతం మ్యాచ్ అయినట్టు తేలింది.
''నాకు ఫుల్ సిస్టర్ అని మ్యాచ్ వచ్చింది. అంటే మేం జన్మత: ఒకే తల్లి,తండ్రికి పుట్టాం అని అర్ధం.
నాకు ఒక్కసారిగా అడ్రినలిన్ ఎక్కించినట్టుగా అనిపించింది. నేను ఏడ్చాను. చాలాకాలంగా ఎదురుచూస్తున్న, నా జీవితంలో తప్పిపోయిన పజిల్ ముక్క మినాల్ అనిపించింది. మేం ఒకరినొకరం అక్కాచెల్లెళ్లమని పిలుచుకున్నాం. ఈ డీఎన్ఏ మ్యాచ్‌తో మాకు అంతర్లీనంగా అనిపించింది నిజమేనని నిర్ధరణ అయింది'' అని మీనా వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
ఆనందభాష్పాలు..కౌగిలింతలు, నవ్వులు...
ఆ పాత స్నేహితురాళ్లు అక్కాచెల్లెళ్లుగా తొలిసారి ఆగస్టులో ఒక రోజున పార్కులో కలుసుకున్నారు.
వారి కలయికలో ఆనందభాష్పాలు, కౌగిలింతలు, నవ్వులు కనిపించాయి'' అని వాళ్ల గురించి రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి తొలి సెల్ఫీ తీసుకున్నారు.
44 ఏళ్ల మినాల్ ఫ్రాన్స్‌లో తన పార్ట్‌నర్, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. డీఏన్ఏ ఫలితాలొచ్చినప్పుడు తొలుత తనకు వచ్చిన మ్యాచ్ 30 ఏళ్ల క్రితం మొదటిసారి కలిసినప్పుడు తనను గట్టిగా పట్టుకున్న అదే టీనేజ్ అమ్మాయిదని గుర్తించలేకపోయానని మినాల్ చెప్పారు.
సోషల్ మీడియాలో ఫోటోలు చూశాకే ఆమెకు విషయం అర్ధమైంది.
'' మీనా: సిస్టర్ అని ఉంది. నేను నమ్మలేకపోయా. మేం అక్కాచెల్లెళ్లం అని తెలీకముందే స్నేహితులం. నిజానికి మేం అప్పటి నుంచే అక్కాచెల్లెళ్లం. కానీ అప్పటికి మాకా విషయం తెలియదు'' అని మినాల్ చెప్పారు.
మీనా, మినాల్‌ను 1980ల్లో రెండు అనాథాశ్రమాల నుంచి రెండు వేర్వేరు డచ్ కుటుంబాలు దత్తత తీసుకున్నాయి.
నెదర్లాండ్స్‌లోని ఓ చిన్న గ్రామంలో ప్రేమాభిమానాలున్న కుటుంబంలో పెరిగానని మీనా చెప్పారు.
''మా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ టీచర్లు. నిజానికి వాళ్లే నాకు స్కూల్లో కూడా టీచర్లు. వాళ్లు నాతో చాలా ప్రేమగా ఉండేవారు'' అని మీనా తెలిపారు.
ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆమె తల్లి ఇప్పటికీ అదే గ్రామంలో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Meena Geltink
ముంబయి వీధుల్లో కలిసి నడవాలని...
2003లో మీనా 19 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు, గోవా నుంచి దత్తత తీసుకున్న తన తమ్ముడితో కలిసి ముంబయిలోని అనాథ శరణాలయాన్ని సందర్శించారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి తెలుసుకోడానికి రెండు వారాల పాటు రికార్డులను పరిశీలించారు. ''ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను. నా తల్లి ఎవరనే విషయం తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. కానీ అనాథశరణాలయం నా బయోలాజికల్ తల్లిదండ్రుల గురించి ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు'' అని ఆమె చెప్పారు.
మే నుంచి మీనా, మినల్ ఇద్దరూ రోజు విడిచి రోజు మాట్లాడుకుంటున్నారు. వారు ఒకరి కుటుంబంతో మరొకరు కలిశారు.
మేం ఒకరిమాటలను మరొకరం ఎలా పూర్తిచేస్తామో, ఎలా తలలూపుతామో, ఒకేలా ఎలా నడుస్తామో అందరూ గమనిస్తున్నారని మీనా చెప్పారు.
తాము అక్కాచెల్లెళ్లమనే విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకునే దశలోనే ఉన్నామని ఆమె అన్నారు.
''కొన్నిసార్లు మేం రెండు గంటల పాటు మాట్లాడుకుంటూ సమయమే మర్చిపోతాం. ఒక్కసారిగా కిరాణా సరుకులు కొనాలని, పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావాలని గుర్తుకొస్తుంది.
తామిద్దరం మొదటిసారి తాము కలిసిన ప్రదేశానికి వెళ్లాలనుకున్నారు.
''మేమిద్దరం కలిసి ఎప్పుడైనా భారత్‌కు రావాలని, ముంబయి వీధుల్లో కలిసినడవాలని కోరుకుంటున్నాం.
మేమిద్దరం చాలా ఒంటరిగా భావించిన సందర్భాలున్నాయి. నేను మా నాన్నను కోల్పోయినప్పుడు, లేదా ప్రేమలో విఫలమవడం వంటివి. ఆ సమయంలో మేం ఒకరికొకరం తోడుగా ఉండలేకపోయామని ఇప్పుడు బాధపడుతున్నాను. మేం మా సంతోషాన్ని పంచుకుని ఉండేవాళ్లం. కష్టసమయాల్లో ఒకరికొకరం సహాయం చేసుకుని ఉండేవాళ్లం'' అని మీనా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























