స్పెర్మ్ వేల్: ఈ తిమింగలం తలలోని రహస్య అవయవం ఓడలను ముంచేస్తుందా? దీని తలలో వీర్యం ఉంటుందా

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, అన్నా బ్రెసెనిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
అది 1820 నవంబర్ 20 ఉదయం... అప్పటికే తిమింగలం దాడి నుంచి ఒకసారి తప్పించుకున్నారు 15 ఏళ్ల థామస్ నికర్సన్. ఆ తిమిగలం థామస్ ఉన్న పడవకు రంధ్రం చేసింది. పడవలోకి నెమ్మదిగా నీరు చేరుతోంది.
నికర్సన్, ఆయన సహచరులు తిమింగలాల వేటకోసం వచ్చిన ప్రధాన(పెద్ద) నౌక వైపు వేగంగా వెళ్తున్నారు... తాము సురక్షితంగా ఉన్నామనే వారు అనుకున్నారు. కానీ ఇంతలోనే మరో భారీ తిమింగలం తమవైపు దూసుకురావడాన్ని గమనించారు ఎస్సెక్స్ అనే తిమింగలాల వేట నౌకను నడుపుతున్న నికర్సన్. దీంతో నౌకలో కెప్టెన్ తర్వాత ముఖ్యమైన అధికారి(షిప్ ఫస్ట్ మెట్) ఓవెన్ చేజ్‌ను ఆయన అప్రమత్తం చేశారు.
"ఆ తర్వాత సిబ్బందిలో గందరగోళం చెలరేగింది. చివరకు నౌకను ఏదో ఢీకొన్న శబ్దం గట్టిగా వినిపించింది"అని నికర్సన్ ఆ ఘటన జరిగిన 50 ఏళ్ల తర్వాత రాశారు.
ఆ తిమింగలం ఎస్సెక్స్ నౌకను ఎంత బలంగా ఢీకొట్టిందంటే నౌకలో ఉన్నవాళ్లంతా ఎగిరిపడ్డారు. ఆ తర్వాత తిమింగలం నౌక నుంచి సుమారు 900 అడుగులు (270 మీటర్లు) దూరం వెళ్లి, చాలా వేగంగా మళ్లీ నౌక వైపు దూసుకొచ్చింది. రెండోసారి ఢీకొట్టడంతో నౌక ముందుభాగం మొత్తం ధ్వంసమైంది. చివరికి ఎస్సెక్స్ మునిగిపోయింది.
కానీ అంతపెద్ద నౌకను ముంచడం ఆ తిమింగలానికి ఎలా సాధ్యమైంది?

ఈ ఘటన ఒక నవలలోని సన్నివేశంలా మీకు అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఎస్సెక్స్ నౌక మునిగిన సంఘటనే హెర్మన్ మెల్‌విల్ రాసిన మొబి-డిక్ నవలకు ప్రేరణ.
ఆ పుస్తకం ప్రచురితమైన 175 ఏళ్ల తర్వాత ఇప్పుడు పరిశోధకులు స్పెర్మ్ వేల్ తనకంటే అనేక రెట్లు పెద్దదైన నౌకను ఎలా ముంచగలదో వివరించే ఆధారాలను కనుగొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వివరణను 200 ఏళ్ల క్రితమే ఎస్సెక్స్ షిప్ ఫస్ట్ మెట్ అయిన ఓవెన్ చేజ్ కరెక్ట్‌గా ఊహించారు.
తిమింగలాల ఈ "సూపర్ పవర్" కూడా వేటగాళ్లు ఎంతో విలువైనదిగా భావించే నూనె ఉండే ప్రదేశంలోనే ఉంది.. అంటే దాని తలలో.

ఫొటో సోర్స్, BBC/ Serenity Strull
తలలోని రహస్యం అవయవం
స్పెర్మ్ వేల్ తల చాలా పెద్దగా ఉంటుంది.
నిజానికి దాని శరీరం పొడవులో దాదాపు మూడో వంతు తలే ఉంటుంది.
సుమారు 9 కిలోల బరువు ఉండే దాని మెదడు, భూమిపై ఉన్న అన్ని జంతువుల మెదడుకన్నా పెద్దది.
దాని నుదురు భాగంలో "స్పెర్మసెటి" అనే పెద్ద, కొవ్వుతో కూడిన మెత్తని అవయవం ఉంటుంది. ఇది స్పెర్మ్ వేల్‌కు ప్రత్యేకమైన అవయవం.
ఇందులో స్పెర్మసెటి అనే నూనె లాంటి పదార్థం నిండి ఉంటుంది. పాతకాలంలో తిమింగలాలను వేటాడేవారు ఈ పదార్థాన్ని వీర్యం అని పొరపాటు పడేవారు. అందుకే దీనికి "స్పెర్మసెటి" అనే పేరు వచ్చింది.
స్పెర్మసెటికి డిమాండ్
తిమింగలాలను వేటాడేవారికి స్పెర్మసెటి నూనె డిమాండ్ చాలా ఉండేది.
ఎందుకంటే ఈ నూనె అధిక నాణ్యత కలిగిన ఇంధనంగా ఉపయోగపడేది.
అలాగే దీన్ని గట్టిపడేలా చేసి సబ్బులు, కొవ్వొత్తులు వంటి వస్తువులను తయారు చేసేవారు.
18వ, 19వ శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల స్పెర్మ్ వేల్స్‌ను చంపారు.
స్పెర్మ్ వేల్స్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో స్పెర్మసెటి సేకరించినప్పటికీ, అది అసలు దేనికి పని చేస్తుందో ఇప్పటికీ పూర్తిగా తెలియదు.
స్పెర్మసెటి అవయవం పోరాటానికి ఉపయోగించే ఆయుధం కావచ్చు అని ఒక థియరీ ఉంది.
"నిజానికిది మా ఊహ కాదు. మొదటగా ఊహించింది ఓవెన్ చేజ్" అని పదవీ విరమణ చేసిన ఎవల్యూషనరీ బయాలజిస్ట్ డేవ్ క్యారియర్ అంటున్నారు.
"18వ శతాబ్దానికి చెందిన ఒక వేటగాడు తిమింగలం నుదురు ఒక ఆయుధంలా పనిచేస్తుందని వాదించారు. దాన్ని పరీక్షించడానికే మేం పరిశోధన మొదలుపెట్టాం" అని ఆయన చెప్పారు.
రెండు శతాబ్దాలుగా జీవశాస్త్రవేత్తలు చేజ్ ఆలోచనలను పెద్దగా పట్టించుకోలేదు.
"ఆ తిమింగలాల వేటగాడి అనుభవం, అవగాహన బహుశా సరైనవే" అని క్యారియర్ అభిప్రాయపడ్డారు.
2002లో ప్రచురించిన ఒక అధ్యయనంలో క్యారియర్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
స్పెర్మ్ వేల్ తలలో బాగా అభివృద్ధి చెందిన "మెలన్" అనే కొవ్వుతో కూడిన అవయవం, బలమైన దెబ్బ కొట్టే ఒక ఆయుధంలా పరిణామం చెంది ఉండవచ్చని ఆయన సూచించారు.
మగ స్పెర్మ్ వేల్ తన ప్రత్యర్థిని హిప్పోపొటామస్‌లా బలంగా, ప్రాణాలుతీసేంతలా ఢీకొట్టగలదని ఈ సిద్ధాంతం చెబుతుంది.
"తిమింగలాలు క్షీరదాలు. అవి జింకలు, పొట్టేళ్లవంటి జంతువులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఆ జంతువుల్లో మగ జంతువులు కొమ్ములతో ఢీకొంటూ పోటీ పడతాయి. కాబట్టి ఈ ప్రవర్తన వాటి పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చి ఉండవచ్చు" అని క్యారియర్ అంటున్నారు.
తలతో ఫైటింగ్
స్పెర్మ్ వేల్‌లు తిమింగలాల వేట నౌకను కాకుండా ఒకదానితో ఒకటి తలలతో ఢీకొంటూ పోరాడుతున్న దృశ్యాలను ఇటీవల కెమెరాలో బంధించారు హవాయి యూనివర్శిటీలో ఎకోఫిజియాలజిస్ట్‌గా పనిచేస్తున్న అలెక్ బర్స్లెమ్.
ఈ సంఘటన బలియారిక్ దీవులు, అజోర్స్ ప్రాంతాల సమీపంలో జరిగింది.
"అనుకోకుండా ఈ వీడియో తీశా" అని బర్స్లెమ్ చెప్పారు.
తిమింగలాలు తమ తలతోనే ఎందుకు పోరాడతాయి? ఎందుకంటే తల శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం కదా..ప్రత్యర్థిని ఢీకొట్టడానికి, వాటినవే ఎందుకు ప్రమాదంలోకి నెట్టుకోవాలి? అని ఎవరికైనా అనిపించవచ్చు.
స్పెర్మ్ వేల్ తలలోని ఆ అవయవం దెబ్బను గ్రహించే సామర్థ్యం(కుషనింగ్) కలిగి ఉంటుంది. అందువల్ల తిమింగలాలు తమ తలను బలంగా ఢీకొట్టినప్పటికీ వాటికి పెద్దగా నష్టం కలగకపోవచ్చని 2015లో జరిగిన ఒక అధ్యయనం పెర్కొంది.
స్పెర్మ్ వేల్ తలలోని స్పెర్మసెటి, ఇతర కొవ్వు కణజాలం కలిసి సహజమైన కుషన్‌లా పనిచేస్తాయి. అందుకే తన తలకు నష్టం కలిగే ప్రమాదాన్ని తగ్గించుకుంటూ...దాని తలను ఉపయోగించి మరో తిమింగలాన్ని బలంగా ఢీకొట్టగలదు.

ఫొటో సోర్స్, Getty Images
షిప్ లాగ్ బుక్స్ ఏం చెబుతున్నాయి..
ఇలా తలతో ఢీకొట్టడాన్ని చిన్న వయసున్న స్పెర్మ్ వేల్స్‌లో గమనించారు బర్స్లెమ్.
చిన్న వయసున్న ఒక మగ స్పెర్మ్ వేల్ అత్యంత బలంగా ఢీకొట్టినట్టు ఆయన నమోదు చేశారు.
అది మరో తిమింగలం వైపు సెకనుకు 15 అడుగుల (4.5 మీటర్ల) వేగంతో దూసుకెళ్లి, దాని సహచర తిమింగలాన్ని సుమారు 460 కిలోన్యూటన్ బలంతో ఢీకొట్టింది.
అదే వేగంతో ఒక పెద్ద స్పెర్మ్ వేల్ ఢీకొంటే, దాని బలం సుమారు 1,200 కిలోన్యూటన్‌తో సమానంగా ఉంటుందని బర్స్లెమ్ అంచనా వేశారు.
ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే..గంటకు 65 కిలో మీటర్ల వేగంతో వస్తున్న ఒక బస్సు మనల్ని ఢీకొట్టినట్లుగా ఉంటుందని ఆయన వివరించారు.
"ఈ బలాన్ని ఒక నౌకపై ప్రయోగిస్తే, చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. చరిత్రలో.. తిమింగలాలు కేవలం మూడు నౌకలపై మాత్రమే దాడి చేశాయి" అని నాంటకెట్‌లోని హిస్టారికల్ సొసైటీలో ప్రధాన క్యురేటర్ మైఖేల్ హారిసన్ చెబుతున్నారు. ఈ సంస్థ వద్ద అసలైన షిప్ లాగ్ బుక్స్, చారిత్రక వస్తువుల అద్భుతమైన సేకరణ ఉంది.
అయితే ఒక తిమింగలం కనిపించినప్పుడు ప్రధాన నౌక నుంచి సముద్రంలోకి దింపే చిన్న, ఓపెన్ పడవలపై తిమింగలాలు తరచుగా దాడి చేసేవి.
"ఈ సంఘటనల్లోని ఉత్కంఠను, భయం తీవ్రతను షిప్ లాగ్ బుక్స్ చాలాసార్లు పూర్తిగా నమోదుచేయలేకపోయాయి" అని హారిసన్ అంటున్నారు.
ప్రధాన నౌకపై దాడి చేసిన మూడు సందర్భాల్లోనూ దాడి చేసింది స్పెర్మ్ వేల్ మాత్రమే.
1851లో దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఒక స్పెర్మ్ వేల్ ఆన్ అలెగ్జాండర్ అనే నౌకపైకి దూసుకొచ్చి పూర్తిగా ధ్వంసం చేసింది.
1902లో గాలాపగోస్ దీవుల సమీపంలో ప్రయాణిస్తున్న ద కాథలీన్ అనే నౌకను కూడా ఒక స్పెర్మ్ వేల్ ధ్వంసం చేసింది.
ఎసెక్స్ నౌకకు ఎదురైన దురదృష్టమే సముద్రయాన చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాణాలతో బయటపడే పోరాటాల్లో ఒకటిగా నిలిచింది.
మునిగిపోతున్న ప్రధాన నౌకను విడిచిపెట్టి, ఆ రోజు 20 మంది మూడు చిన్న తిమింగలాల వేట పడవల్లోకి ఎక్కారు. వారు సమీప భూమికి 1,300 మైళ్ల దూరంలో ఉన్నారు.
కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలు సముద్రయాన చరిత్రలోని అత్యంత భయానకమైన కథల్లో ఒకటిగా మారాయి. అలాగే అవే సంఘటనలు హెర్మన్ మెల్‌విల్ రాసిన మొబి-డిక్ నవలకు ప్రేరణగా నిలిచాయి.
ఫోనిక్ లిప్స్
"డ్రోన్ కెమెరా గమనించనప్పుడు..సహజ వాతావరణంలో స్పెర్మ్ వేల్స్ తమ తలను ఢీకొట్టే ఆయుధంలా ఎంత తరచుగా ఉపయోగిస్తాయో తెలియదు. అలాగే అసాధారణంగా ఉన్న పెద్ద మెలన్ అవయవం అసలు ఏ ప్రయోజనం కోసం ఉందో కూడా పూర్తిగా అర్థం కాలేదు" అని బర్స్లెమ్ అంటున్నారు.
స్పెర్మసెటి సంబంధించి మరికొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అది ఒకటి కంటే ఎక్కువ పనులకు ఉపయోగపడే అవకాశం ఉంది.
తిమింగలాలు "మంకీ లిప్స్" అనే నిర్మాణాల సహాయంతో శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి వాటి ముక్కు ముందు భాగంలో ఉండే ఫోనిక్ లిప్స్.
ఈ శబ్దం నీటిలో ముందుకు మాత్రమే కాకుండా, వెనుకవైపు కూడా ప్రయాణిస్తుంది. వెనుకకు వెళ్లిన శబ్దం వాటి తల వెనుక భాగంలో ఉన్న స్పెర్మసెటి అవయవం చివరి గోడను తాకుతుంది.
ఈ రెండు శబ్దాల కలయికను ఒక ఆడ స్పెర్మ్ వేల్ విన్నప్పుడు, మగ తిమింగలం స్పెర్మసెటి ఎంత పెద్దదో అంచనా వేయగలదని, దాని ఆధారంగా అది తనతో జతకట్టడానికి ఇష్టపడేంత పెద్ద మగ తిమింగలమా కాదా కూడా గుర్తించగలదని బర్స్లెమ్ చెబుతున్నారు.
"ఈ తిమింగలాల గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. అవి మనతో పాటు భూమిపై కొనసాగుతూ ఉండేలా చూడటానికి ప్రాధాన్యత ఇవ్వాలి" అని బర్స్లెమ్ అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































