'25 ఏళ్ల క్రితం మా అమ్మానాన్నను అరెస్ట్ చేశారు, వారు బతికున్నారో లేదో ఇప్పటికీ తెలియడం లేదు'

ఫొటో సోర్స్, Hanna Petros Solomon
- రచయిత, టెస్‌ఫాలెమ్ అరీయా, టెక్లెమరియమ్ బెకీట్
- హోదా, బీబీసీ టిగ్రిన్యా
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
హన్నా పెట్రోస్ సోలమన్ కన్నీళ్లు పెట్టుకుంటూ పాతికేళ్ల కిందటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తనతో పాటు తన తోబుట్టువులు అనాథలుగా మారిన క్షణాలను ఆమె తలుచుకున్నారు.
ఎరిట్రియాలో 25 ఏళ్ల కిందట ఆమె తండ్రిని అరెస్టు చేసి, విచారణ కూడా లేకుండా జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆమె తల్లిని కూడా నిర్బంధించారు. నాటి నుంచి నేటి వరకు వారిద్దరి సమాచారం ఎవరికీ తెలియలేదు.
చివరిసారిగా తన తండ్రిని, తనకు 10 ఏళ్ల వయస్సున్నప్పుడు చూశానని ఆమె బీబీసీతో చెప్పారు.
అప్పుడు ఆయనో క్రీడాకారుడిలా భుజంపై టవల్ వేసుకొని జాగింగ్‌కు వెళ్లారని, అదే తాను తన తండ్రిని చివరి సారి చూడటమని అని ఆమె గుర్తు చేసుకున్నారు.
''ఆయన రోజూ పొద్దునే వ్యాయామం చేసేవారు'' అని ఆమె చెప్పారు.

సుదీర్ఘ కాలం సాగిన విముక్తి పోరాటం తర్వాత 1993లో ఇథియోపియా నుంచి ఎరిట్రియా స్వాతంత్య్రం పొందింది. ఆ పోరాటంలోనే హన్నా తల్లిదండ్రులు తొలిసారి కలుసు కున్నారు.
ఆ యుద్ధానికి సంబంధించిన సీనియర్ లీడర్లలో హన్నా తండ్రి పెట్రోస్ సోలమన్ ఒకరు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పోషించిన కీలక పాత్రకు గానూ చాలామంది ఆయనను జాతీయ హీరోగా భావిస్తారు.
స్వాతంత్య్రం వచ్చాక ఆయన ఎరిట్రియాకు రక్షణ మంత్రిగా, ఆ తర్వాత విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అయితే ఆయనకు సమస్యలు మొదలయ్యే సమయానికి మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు.
ఎరిట్రియా చరిత్రలో చీకటి అధ్యాయం
అది 2001 మే. అప్పుడు పెట్రోస్ సోలమన్ సహా మరో 14 మంది హై ప్రొఫైల్ రాజకీయ నాయలకులంతా కలిసి అధ్యక్షుడు ఇసైయాస్ అఫేవెర్కీకి ఒక బహిరంగ లేఖ రాశారు.
స్వాతంత్య్రం వచ్చాక ఆమోదించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని, జాతీయ ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. వీరంతా 'జీ-15'గా పేరు పొందారు.
ఇథియోపియాకు వ్యతిరేకంగా పోరాడిన 'ఎరిట్రియన్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్' (ఈపీఎల్‌ఎఫ్) నాయకుడైన ఇసైయాస్, ఈ విమర్శలను సహించలేకపోయారు.
తన తండ్రిని మంత్రి పదవి నుంచి తొలగించారనే విషయం హన్నాకు తెలియదు. రోజూ వెళ్లినట్టే ఆ రోజు కూడా ఆయన వ్యాయమం చేయడానికి బయటకు వెళ్లారని హన్నా అనుకున్నారు.
9/11 దాడుల తర్వాత ప్రపంచం దృష్టి అంతా అమెరికా వైపే మళ్లింది. ఈ దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాతే ఇసైయాస్ అగ్రహం ఏ స్థాయికి చేరిందో దేశానికి అర్థమైంది. అది ఎరిట్రియా చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.
దేశ అధ్యక్షుని ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 18 తెల్లవారుజామున రాజధాని అస్మారాలోని 11 మంది సీనియర్ ప్రభుత్వ అధికారుల ఇళ్ల ముందు భద్రతా దళాలు మోహరించాయి.
ట్రాక్‌సూట్‌లో బయటకు వెళ్తున్న పెట్రోస్‌ను భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయనకు ఏమైందో కుటుంబ సభ్యులకు తెలియలేదు. తల్లి ఆస్టర్ యోహాన్స్ చదువు నిమిత్తం అమెరికాలో ఉండటంతో, హన్నాతోపాటు ఆమె ముగ్గురు తోబుట్టువులు తమ నాన్నమ్మ దగ్గర ఉండేవారు.
పెట్రోస్ కనిపించకుండా పోయిన కొన్ని రోజుల తర్వాత అసలేం జరిగిందో తమకు అర్థమైందని ఆనాటి చేదు జ్ఞాపకాలను హన్నా గుర్తు చేసుకున్నారు.
''మా నాన్న దేశాన్ని అమ్మేశారని నా తోటి విద్యార్థులు నాతో అన్నారు'' అని హన్నా చెప్పారు.

ఫొటో సోర్స్, Hanna Petros Solomon
‘మా నాన్న దేశాన్ని అమ్మేశారని నాతో చెప్పారు’
''పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో నాకు అప్పుడే అర్థమైంది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నా తండ్రిని, ఆయన సహచరులను జనాలు ఎలా చిత్రీకరించారో తెలిశాక నా గుండె పగిలిపోయింది'' అని హన్నా గుర్తు చేసుకున్నారు.
పెట్రోస్‌కు జరిగింది తెలిసి అమెరికాలో ఉన్న ఆస్టర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. పిల్లలకు పాస్‌పోర్టులు మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వ అధికారులను కోరగా, వారు నిరాకరించారు. ఆమెను వెంటనే దేశానికి తిరిగి రావాలని చెప్పారు.
రెండేళ్ల పాటు మానసిక వేదన అనుభవించాక, ప్రభుత్వ అధికారుల నుంచి హామీలు లభించడంతో ఆమె తిరిగి రావడానికి సిద్ధమయ్యారు.
హన్నా, ఆమె తోబుట్టువులు తమ తల్లి రాక కోసం ఆరాటపడ్డారు. కానీ, అదే సమయంలో వారు భయపడ్డారు కూడా.
''నిన్ను కూడా అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి?'' అని ఫోన్‌లో తల్లిని అడిగినట్లు హన్నా గుర్తు చేసుకున్నారు.
తనకేమీ కాదని ఆస్టర్ చెప్పినట్లు హన్నా తెలిపారు.
''నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం నా పిల్లలను పెంచుకోవడానికి మాత్రమే వస్తున్నా'' అని ధైర్యం చెప్పినట్లు హన్నా గుర్తు చేసుకున్నారు.
ఎరిట్రియాకు వచ్చాక ఎలాంటి ప్రమాదం ఉండబోదని స్వయంగా అధ్యక్షుడు ఇసైయాస్ తన తల్లికి హామీ ఇచ్చారనే విషయం హన్నాకు ఆ తర్వాత తెలిసింది.
ఆస్టర్ కోసం 2003 డిసెంబర్ 11న అస్మారా అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబమంతా ఎదురు చూసింది. కానీ, ఇతర ప్రయాణికులతో పాటు ఆమె బయటకు రాలేదు. తల్లి కోసం తెచ్చిన పూలతో పాటు వారి ఆశలు కూడా వాడిపోయాయి.
''అది చాలా సుదీర్ఘమైన నిరీక్షణ. చివరికి మేం ఆశ వదులుకుని ఇంటికి తిరిగి వచ్చేశాం'' అని హన్నా చెప్పారు.

ఫొటో సోర్స్, Hanna Petros Solomon
కార్షెల్లీ జైలులో నిర్బంధం
''మొదట మేం అమెరికాలోని స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేశాం. వారు ఆమెకు విమానాశ్రయంలో వీడ్కోలు పలికినట్టు చెప్పారు'' అని హన్నా అన్నారు.
ఆ తర్వాత విమానాశ్రయం నుంచి ఒక అధికారి ఫోన్ చేసి, ఆస్టర్ సామాగ్రిని తీసుకెళ్లమని కోరారు. అప్పుడే ఆమె దేశానికి వచ్చిందని, కానీ ఇంటికి రావడం లేదని వారికి అర్థమైంది.
తర్వాత, ఆమె ఆచూకీ కోసం చేసిన వినతులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా, ఇకపై దీని గురించి విచారించొద్దని హన్నా నాన్నమ్మను అధికారులు హెచ్చరించారు.
అస్మారాలోని కీలక ప్రదేశంలో ఉన్న 'కార్షెల్లీ' అనే జైలులో ఆస్టర్‌ను బంధించినట్లు కుటుంబ సభ్యులకు తరువాత తెలిసింది.
సెప్టెంబర్ 18, 19 తేదీల్లో అరెస్ట్ అయిన ఇతరులతో పాటు హన్నా తండ్రి పెట్రోస్‌ను మారుమూల ప్రాంతంలోని అత్యంత రహస్యమైన 'ఎలా-ఎరో' జైలులో బంధించినట్లు భావిస్తున్నారు.
దేశద్రోహం ఆరోపణలు మోపుతూ అదుపులోకి తీసుకున్న వీరెవరినీ కోర్టులో హాజరుపరచలేదు. బంధువులను కలవడానికి కూడా అనుమతించలేదు.
అదే సమయంలో కొత్తగా ప్రారంభమైన స్వతంత్ర పత్రికలన్నింటినీ ప్రభుత్వం మూసివేసింది. వాటి సంపాదకులను, విలేకరులను అదుపులోకి తీసుకుంది. వారిని కూడా ఎలా-ఎరో జైలులోనే బంధించినట్లు భావిస్తున్నారు.
ఖైదీలు ఎక్కడున్నారు? వారు బతికే ఉన్నారా లేదా? అనే అంశంపై ఎరిట్రియా ప్రభుత్వంతో సహా యూకేలోని ఎరిట్రియన్ ఎంబసీని బీబీసీ సంప్రదించగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఆర్మీలో నిర్బంధ సేవ నుంచి తప్పించుకోవడానికి, మంచి అవకాశాల కోసం వేల మంది ఎరిట్రియన్ యువత దేశం విడిచి వెళ్లారు. హన్నా కూడా పాస్‌పోర్ట్ లేకుండా రహస్యంగా సరిహద్దు దాటి వెళ్లారు.
ఇప్పుడు హన్నా వయస్సు 35 ఏళ్లు. వివాహమై అమెరికాలో ఉంటున్నారు. ఆమె మానసిక గాయాల నిపుణురాలుగా పనిచేస్తున్నారు.
అయినప్పటికీ, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నుంచి ఆమె ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు.
తల్లిదండ్రుల పాత ఫోటోలను చూస్తూ ఆమె ఆవేదనకు గురవుతుంటారు. వారు అరెస్టు కాకముందు గడిపిన సంతోషకరమైన రోజులు, ఆ నవ్వులు, కుటుంబ కలయికలు, పుట్టినరోజు వేడుకల జ్ఞాపకాలు ఎక్కడ చెరిగిపోతాయో అని భయపడుతున్నారు.
''మా నాన్న ఎప్పుడూ అందరినీ ఇంటికి పిలిచేవారు. అవి చాలా మంచి రోజులు'' అని హన్నా గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Sherifo and Aster family
నైట్ డ్రెస్‌లో ఉండగానే తీసుకెళ్లారు
ఇబ్రహీం షెరీఫో కూడా ఇలాగే భావిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ కూడా పాలకపక్షమైన 'పీపుల్స్ ఫ్రంట్ ఫర్ డెమోక్రసీ అండ్ జస్టిస్' (పీఎఫ్‌డీజే)లో సీనియర్ సభ్యులు. 25 ఏళ్ల క్రితం అరెస్టయిన జీ-15 బృందంలో వారు కూడా ఉన్నారు.
ఆ సమయంలో ఆయన వయస్సు 13 ఏళ్లు.
''నాకు 2001 సెప్టెంబర్ 18 ఒక చీకటి రోజు. కేవలం నాకే కాదు, ఎరిట్రియాకు అక్కడి ప్రజలకు కూడా అది చీకటి రోజు. ఎందుకంటే చట్టం, ప్రజాస్వామ్యం రెండూ నిర్బంధానికి గురైన రోజు అది'' అని ఆయన బీబీసీకి చెప్పారు.
ఇబ్రహీంకు ఇప్పుడు 38 ఏళ్లు. నెదర్లాండ్స్‌లో నివసిస్తున్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేస్తున్నారు.
ఆయన తండ్రి మహమూద్ అహ్మద్ షెరీఫో, నిర్బంధానికి ముందు స్థానిక ప్రభుత్వ మంత్రిగా, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
ఇబ్రహీం తన తల్లి ఆస్టర్ ఫిస్సేహాట్సియన్‌తో కలిసి తన పిన్ని ఇంట్లో ఉన్నారు. ఉదయాన్నే భద్రతాధికారులు తలుపు తట్టి నైట్‌డ్రెస్ లోనే ఉన్న తన తల్లిని తీసుకెళ్లడం ఇంకా గుర్తున్నట్లు ఆయన చెప్పారు.
తండ్రి గురించి భయపడి ఇబ్రహీం వెంటనే దగ్గరలోనే ఉన్న తన ఇంటికి పరిగెత్తారు. కానీ, వ్యాయామానికి వెళ్లినప్పుడే ఆయనను కూడా అధికారులు తీసుకెళ్లారని ఇబ్రహీంకు తెలిసింది.
రిస్క్‌లు ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు లేని తమకు ఆశ్రయమిచ్చి, అండగా నిలిచిన స్నేహితులకు, బంధువులకు జీవితాంతం రుణపడి ఉంటామని హన్నా, ఇబ్రహీం చెప్పారు.
తమ తల్లిదండ్రులు పాటుపడిన ఆశయాలు, సంస్కరణల పట్ల వారు ఎంతో గర్వపడుతున్నారు.
''వారికి మనస్సాక్షి ఉంది. తాము పోరాడి సాధించిన స్వాతంత్య్రాన్ని ఇసైయాస్, ఆయన ముఠా హరించడాన్ని చూస్తూ వారు ఊరుకోలేకపోయారు. వారు బతికే ఉన్నారో లేదో మా కుటుంబాలకు తెలియజేయాలి'' అని ఇబ్రహీం డిమాండ్ చేశారు.
రాజకీయ ఖైదీల జ్ఞాపకాలను పూర్తిగా తుడిచిపెట్టేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు.

ఇన్నేళ్లుగా ఆచూకీ లేకుండా పోయిన ఎంతోమంది బాధితుల ఆవేదన కూడా ప్రపంచానికి తెలియాలని హన్నా కోరుకుంటున్నారు.
ఐక్యరాజ్యసమితితో సహా పలు మానవ హక్కుల సంఘాలు జీ-15 ఖైదీలను ' ఆదర్శాల కోసం జైలుపాలైనవారిగా' భావిస్తున్నాయి. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పుడు అధ్యక్షుడు ఇసైయాస్ వయస్సు 80 ఏళ్లు. 1997లో ఆమోదించిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. ఒక్కసారి కూడా ఎన్నికలు నిర్వహించకుండానే అధికారంలో ఉన్నారు.
తండ్రి కనిపించకుండా పోయే ముందు రోజు రాత్రి తనకు ఏదో 'చెడు జరుగుతుందనే అనుమానం' వచ్చిందని హన్నా చెప్పారు. దీంతో ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన కాళ్లను తన కాళ్లతో తాడుతో బంధించానని హన్నా గుర్తు చేసుకున్నారు.
''ఉదయం ఆయన లేవగానే తన కాళ్లు కట్టి ఉన్న సంగతిని గ్రహించారు . వాటి ముడిని విప్పుకోవడానికి ఆయన నా కాళ్లను లాగడంతో నాకు మెలకువ వచ్చింది. బయటకు వెళ్లవద్దని ఆయనను వేడుకున్నా. కానీ, తిరిగి వచ్చేస్తానని ఆయన నాకు మాట ఇచ్చారు'' అని హన్నా గుర్తు చేసుకున్నారు.
తల్లిదండ్రులకు ఏదైనా సందేశం పంపగలిగే అవకాశం వస్తే ఏం చెబుతారని అడిగినప్పుడు ''మా గురించి ఆందోళన చెందొద్దు. మీరు మీ పట్టుదలతో నాటి విముక్తి పోరాటాన్ని ఎలా నెగ్గారో, అలాగే ఈ కష్టాన్ని కూడా జయించి మా దగ్గరకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాం'' అని ఆమె బదులిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























