రూ. 2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీ ఉంటుందా? గెజిట్‌లో ఏముంది

ఫొటో సోర్స్, Thomas Fuller/SOPA Images/LightRocket via Getty Images
యూపీఐ చెల్లింపుల విధానాన్ని వినియోగిస్తున్న లక్షల మంది ప్రజల మనసుల్లో ప్రస్తుతం కొన్ని సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి.
ఈ సందేహాలకు కారణం కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఒక నోటిఫికేషన్.
దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో "రూ. 2000 వరకు జరిగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు.. అలాగే రూపే డెబిట్ కార్డుతో రూ. 2000 వరకు చెసే చెల్లింపులపైనా ఎటువంటి ఛార్జీలు విధించరాదు" అని స్పష్టం చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం.. "ఈ మార్గాల్లో డబ్బు పంపే లేదా స్వీకరించే వారి నుంచి బ్యాంకులు లేదా ఇతర పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి రుసుము వసూలు చేయడానికి లేదు"
ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10ఏ కింద జారీ చేసింది.

ప్రజలు ఏమనుకుంటున్నారు?
సోషల్ మీడియా వేదికల్లో యూపీఐ వినియోగదారుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వ నోటిఫికేషన్‌లో రూ. 2000 పరిమితి ఎందుకు పేర్కొన్నారు?
ఇప్పటివరకు యూపీఐ ద్వారా ఎంత మొత్తంలో చెల్లింపులు చేసినా వినియోగదారుల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయడంలేదు.
ఈ కొత్త నోటిఫికేషన్ ద్వారా భవిష్యత్‌లో రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే మార్గాన్ని ప్రభుత్వం తెరిచిందా? అని ప్రజలు అడుగుతున్నారు.
ఈ అనుమానం పూర్తిగా నిరాధారమని కూడా చెప్పలేం. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్‌లో రూ. 2000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలను మాత్రమే స్పష్టంగా "నో ఛార్జ్" కేటగిరీలో ఉంచారు.
అయితే దీనర్థం రూ. 2000 కంటే ఎక్కువ మొత్తాలపై ప్రస్తుతం ఛార్జీలు అమలులోకి వచ్చాయని కాదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

ఫొటో సోర్స్, Ministry of Finance
కాంగ్రెస్ ఆరోపణలు
యూపీఐ చెల్లింపుల ద్వారా ప్రజల నుంచి అదనపు వసూళ్లకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
పార్టీ చెప్పినదాని ప్రకారం, ప్రభుత్వం రూ. 2,000కు మించిన ప్రతి యూపీఐ చెల్లింపులపై 0.5 శాతం రుసుం విధించే యోచనలో ఉంది.
2026 సెప్టెంబర్ 14న విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో మాత్రం రూ. 2000 వరకు యూపీఐ ద్వారా చెల్లింపులపై ఎలాంటి రుసుం ఉండదని పేర్కొంది.
కాంగ్రెస్ వాదన ప్రకారం, ఒకవేళ కొత్త విధానం అమల్లోకి వస్తే రూ. 5000 చెల్లింపుపై రూ. 25, రూ. 10,000 చెల్లింపుపై రూ. 50 అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ ఎక్స్ పోస్టులో "నరేంద్రమోదీ ప్రజల నుంచి వసూళ్లకు కొత్త ప్రణాళిక రూపొందించారు. రూ. 2000కు పైబడిన ప్రతి యూపీఐ చెల్లింపుపై 0.5 శాతం ఛార్జీ వసూలు చేయాలని యోచిస్తున్నారు. అంటే 5000 కొనుగోలుకి రూ. 25 , 10,000 కొనుగోలుకి రూ. 50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది" అని తెలిపింది.
అయితే బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది.
"కాంగ్రెస్ మరోసారి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది" అని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాలు ఏంటి?
ప్రస్తుతం యూపీఐ వినియోగదారుడి నుంచి చెల్లింపులు చేయడానికి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జీ వసూలు చేయడం లేదు.
2026 ఆగస్టులో కూడా ప్రభుత్వం సామాన్య వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని, అలాగే పీ2పీ(వ్యక్తి నుంచి వ్యక్తికి) లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ప్రకటించింది.
భవిష్యత్‌లో ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) విధించినా, అది పరిమిత సంఖ్యలోని వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
ఎండీఆర్ అంటే ఏంటి
ఇక్కడ ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. ఎండీఆర్, వినియోగదారుని నుంచి నేరుగా వసూలు చేసే ఛార్జీ ఒకటి కాదు.
ఎండీఆర్ అనేది చెల్లింపు వ్యవస్థలో వ్యాపార సంస్థలు(మర్చంట్స్) బ్యాంకులకు, పేమెంట్ సేవల ప్రొవైడర్స్‌కు చెల్లించే రుసుము.
అంటే ఎండీఆర్ అమల్లోకి వచ్చినా, యూపీఐ చెల్లింపు చేసే వినియోగదారుడి నుంచి ప్రతి ట్రాన్సాక్షన్‌కు అదే మొత్తాన్ని తప్పనిసరిగా వసూలు చేయబోరు.
ప్రభుత్వం ఆగస్టులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే.. "యూపీఐ వినియోగదారులపై ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉండవు, పీ2పీ చెల్లింపులు ఉచితంగానే ఉంటాయి".
మరి రూ. 2000 పరిమితిని ఎందుకు పేర్కొన్నారు
ఇదే ఈ మొత్తం వివాదంలో ప్రధాన ప్రశ్న.
ప్రస్తుతం ప్రభుత్వ కొత్త నోటిఫికేషన్ ప్రకారం రూ. 2,000 వరకు ఉన్న యూపీఐ చెల్లింపులు స్పష్టంగా "నో ఛార్జ్ "పరిధిలోకి వస్తాయి.
కానీ రూ. 2000 మించిన యూపీఐ లావాదేవీలపై ఎంత రుసుం ఉంటుంది? ఎప్పుడు అమలవుతుంది? అసలు అమలవుతుందా?? అనే అంశాలపై ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి వివరాలు లేవు.
అందువల్ల, రూ. 2000 మించిన యూపీఐ చెల్లింపులపై ఇప్పటికే ఛార్జీలు అమల్లోకి వచ్చాయని చెప్పడం సరైనది కాదు. అయితే పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలపై భవిష్యత్‌లో ఎండీఆర్ లేదా ఇతర రకాల రుసుములు విధిస్తారా లేదా అన్న ప్రశ్న మాత్రం ఇంకా తెరపై ఉంది.
ప్రజల్లో ఉన్న ముఖ్యమైన సందేహాలు
1.రూ. 2000 కంటే ఎక్కువ చెల్లింపులకు రుసం వసూలు చేస్తారా?
సమాధానం: ప్రస్తుతానికి లేదు. ఎలాంటి ఛార్జీల వసూళ్ల పద్ధతి అమల్లోకి రాలేదు.
2. యూపీఐ ద్వారా రూ. 2000 కంటే ఎక్కువ పంపితే బ్యాంక్ డబ్బు కట్ చేస్తుందా?
సమాధానం: ప్రస్తుతం అలాంటి కొత్త ఛార్జీ ఏదీ అమల్లోకి లేదు.
3. ప్రతి యూపీఐ లావాదేవీపై ఛార్జీ విధిస్తారా?
సమాధానం: ప్రస్తుతం అలా చెప్పలేదు. పీ2పీ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ఇప్పటికే తెలిపింది.
4. రూ. 2000కు పైబడిన చెల్లింపులపై ఎండీఆర్ విధిస్తారా?
సమాధానం: ప్రభుత్వం భవిష్యత్‌లో కొన్ని పరిమిత వ్యాపార లావాదేవీలపై చిన్న మొత్తంలో ఎండీఆర్ ఉండే అవకాశాన్ని సూచించింది. అయితే దాని రేటు ఎంత? ఎప్పటి నుంచి అమలు? అనే విషయాలు ఇంకా నిర్ణయించలేదు.
5. దీని వల్ల సాధారణ ప్రజలు ఒకరికొకరు డబ్బు పంపే పీ2పీ లావాదేవీలపై ప్రభావం ఉంటుందా?
సమాధానం: లేదు, ప్రభుత్వం పీ2పీ ట్రాన్సాక్షన్లు ఉచితంగా కొనసాగుతాయని ప్రకటించింది. కాబట్టి ప్రస్తుతం ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపితే ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























