ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఫొటో సోర్స్, NANI/FB
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకి చెందిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు. విశాఖలో మంగళవారం ఉదయం నాని హఠాన్మరణం పొందారని ఆయన సన్నిహితుడు డాక్టర్ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.
2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఓటమి తర్వాత, నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో లేనప్పటికీ ప్రస్తుతం టీడీపీలోనే ఆయన కొనసాగుతున్నారు.
కాపు సామాజికవర్గంలో గుర్తింపు ఉన్న నేతగా ఆళ్ల నాని ఎదిగారు. ఆయన బీకాం వరకు చదివారు. ఏలూరు పట్టణానికి చెందిన నాని కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు ఉపముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.

వైఎస్ అనుచరుడిగా రాజకీయాల్లోకి
మొదటి నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఏలూరు నగర రాజకీయాల్లో వివిధ కార్యకలాపాలు నిర్వహించిన నాని, తొలుత యూత్ కాంగ్రెస్ నేతగా వ్యవహరించారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2009లో వరుసగా రెండోసారి ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆళ్ల నానిని వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు.
2019లో నాని తిరిగి వైసీపీ అభ్యర్థిగానే ఏలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించారు. మొదటి నుంచి వైఎస్ కుటుంబ సన్నిహితుడిగా పేరొందిన నానికి వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. అదే ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగానూ పనిచేశారు.

ఫొటో సోర్స్, X/@ncbn
2024 ఓటమి తర్వాత టీడీపీలోకి
2024లో జరిగిన ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నాని, ఏడాదిన్నర కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న నాని టీడీపీలో చేరడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
2024లో ఓటమి తర్వాత నాని ఎక్కువగా విశాఖలోని స్వగృహంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారని ఆయన సన్నిహితుడు డాక్టర్ ప్రసాద్ బీబీసీకి తెలిపారు.
చంద్రబాబు, జగన్, లోకేశ్ సంతాపం
ఆళ్ల నాని మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
ఆళ్ల నాని హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఎక్స్'లో పేర్కొన్నారు. 56 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆయన దూరమవ్వడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆకస్మిక మృతి పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వైసీపీ తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది. ఆయన మృతి తనను కలచివేసిందని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని జగన్ ప్రార్థించినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
నాని మృతి చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' ద్వారా తెలిపారు. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ, కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























