లాడ్కీ బహిన్: మహిళలకు నగదు ఇచ్చే ఈ స్కీమ్‌లో 29వేల మంది పురుషులు కూడా చేరారు..

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
- రచయిత, మయూరేష్, జోయా మతీన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
రెండేళ్ల కిందటి వరకు నిర్మలా బావస్కర్ పేరు మీద సొంత బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.
మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లాలో నివసించే ఈమె వితంతువు. ఇళ్లలో పనిమనిషిగా జీవనోపాధి పొందుతున్నారు. గతంలో ఆమె పత్రాలపై వేలిముద్ర మాత్రమే వేసేవారు. ఇంట్లోకి వచ్చే డబ్బుపై ఆమెకు ఎలాంటి నియంత్రణ ఉండేది కాదు.
'ముఖ్యమంత్రి మాఝీ లాడ్కీ బహిన్ యోజన'లో చేరిన తర్వాత ఆమె పరిస్థితి మారింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ నగదు బదిలీ పథకాలలో ఒకటి. 2024లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు కొద్దినెలల ముందే దీనిని ప్రారంభించారు. అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 అందించే ఈ పథకం, కోట్లమందికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా రాష్ట్రంలోనే ఒక బలమైన రాజకీయ నినాదంగా మారింది.
నిర్మలా బావస్కర్‌కు నెలనెలా అందే ఈ చిన్న మొత్తం కోసం మొదటిసారి బ్యాంక్ ఖాతా అందుబాటులోకి వచ్చింది. తనది అని చెప్పుకోగల ధనం సమకూరింది. "ఇది చిన్న మొత్తమే అయినా, మాకు ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా వైద్య ఖర్చుల విషయంలో. దీనివల్ల నాకు ఎంత ప్రోత్సాహం లభించిందంటే, నేను రాయడం కూడా నేర్చుకున్నా" అని ఆమె తెలిపారు.
ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్న 2.6 కోట్లకు పైగా మహిళల్లో నిర్మల ఒకరు. అయితే ప్రస్తుతం ఈ పథకం అమలు తీరుపై విమర్శలు, పరిశీలనలు వ్యక్తమవుతున్నాయి.

రూ. 35.41 కోట్లు అదనం
గత నెలలో కాగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ లాడ్కీ బహిన్ మొదటి ఆర్థిక సంవత్సరంలో రూ. 332.37 కోట్లు వెచ్చించింది. అంటే కేటాయించిన బడ్జెట్ కంటే రూ. 35.41 కోట్లు అదనంగా ఖర్చు చేసింది.
మరోవైపు, ప్రభుత్వం చేపట్టిన పరిశీలన ప్రక్రియలో భాగంగా 90 లక్షలకు పైగా లబ్ధిదారులను తొలగించారు. తప్పనిసరి గుర్తింపు తనిఖీలు పూర్తి చేయకపోవడం, అర్హత లేకపోవడం వల్లనే వీరిని తొలగించినట్లు తేలింది.
ఆడిట్ రిపోర్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. అర్హత లేని లబ్ధిదారుల గుర్తింపు, వారి నుంచి సొమ్ము రికవరీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే కార్యాలయం బీబీసీకి తెలియజేసింది. అయితే, ఆడిటర్ గుర్తించిన లోపాలపై మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

ఫొటో సోర్స్, Sharad Badhe
రాజకీయంగా ప్రాధాన్యం
2024 జూన్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం 'లాడ్కీ బహిన్' పథకాన్ని ప్రారంభించినప్పుడు, ఈ నెలవారీ చెల్లింపులు మహిళల ఆర్థిక స్వాలంబునకు దోహదపడటమే కాకుండా కుటుంబాల రోజువారీ ఖర్చులకు అండగా నిలుస్తాయని తెలిపింది.
ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పటికే అలాంటి ఇతర సంక్షేమ పథకాలు పొందుతున్న కుటుంబాలను మినహాయించి, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన 21 నుంచి 65 ఏళ్ల వయస్సు గల అర్హులైన మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు.
పథకం ప్రారంభించిన సమయం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ, మరో రెండు ప్రాంతీయ పార్టీల కూటమి అయిన నాటి అధికార 'మహాయుతి'.. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్న తర్వాత ఈ పథకాన్ని ప్రకటించారు.
ఆ తర్వాత ఐదు నెలలకు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'లాడ్కీ బహిన్' అత్యంత కీలక అంశంగా మారింది. మహిళలు చేసే వేతనం లేని శ్రమకు గుర్తింపుగా దీనిని ప్రభుత్వం అభివర్ణించగా, ప్రతిపక్షాలు మాత్రం ఇది ఓట్ల కొనుగోలు అని విమర్శించాయి. అయినప్పటికీ, తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ నగదు బదిలీ చేస్తామని ప్రతిపక్షాలు కూడా హామీ ఇచ్చాయి.
మహాయుతి కూటమి ఊహించిన దానికంటే చాలా స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ విజయానికి 'లాడ్కీ బహిన్' పథకమే కీలక కారణమని ఆ కూటమి నాయకులు విశ్లేషించారు.
ఎన్నికల తదనంతర 'లోక్‌నీతి-సీఎస్డీఎస్' సర్వే ప్రకారం, ఈ పథకం మహాయుతికి ఎంతగానో లబ్ధి చేకూర్చింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో సగానికి పైగా అధికార కూటమికి ఓటేశారు. ప్రతిపక్షానికి ఓటేసినవారు మూడో వంతు మాత్రమే ఉన్నారు. ఇక లాడ్కీ బహిన్ లబ్ధిదారుల్లో మహాయుతికి మద్దతు ఏకంగా 54 శాతానికి పెరిగింది.
అయితే, ఈ పథకం ప్రభావాన్ని మితిమీరి అంచనా వేయలేమని పరిశోధకులు అంటున్నారు. పురుషులతో పోలిస్తే మహాయుతికి మద్దతుగా ఓటేసిన మహిళలు కేవలం మూడు శాతం మాత్రమే ఎక్కువ. అందువల్ల మహిళలంతా ప్రత్యేకంగా ఒక సంక్షేమ ఓటు బ్యాంకుగా మారారని నిర్ధరణకు రావడం తొందరపాటే అవుతుందని సీఎస్డీఎస్ పరిశోధకురాలు రాజేశ్వరి దేశ్‌పాండే పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
90 లక్షల మందికి తొలగింపు
మహారాష్ట్ర ఒక్కటే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు మహిళల కోసం ఇలాంటి నగదు బదిలీ పథకాలను అమల్లోకి తెచ్చాయి. ఇప్పుడు దేశంలో దాదాపు సగం మంది ఓటర్లు మహిళలే. ఈ పథకాల ఆకర్షణ స్పష్టంగానే కనిపిస్తోంది. రోడ్లు, ఆసుపత్రుల మాదిరిగా కాకుండా.. ప్రతి నెలా నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాలోనే డబ్బు పడుతుంది. ఇది తక్షణమే, స్పష్టంగా కనిపించే వ్యక్తిగత ప్రయోజనం.
అయితే, ఈ ప్రజాదరణే పథకాలను వేగంగా ప్రారంభించి, కోట్లాది మందిని చేర్పించాలనే ఒత్తిడిని పెంచుతోంది. ఇందులో ఉండే ప్రమాదాలను కాగ్(ఆడిటర్) రిపోర్ట్ స్పష్టం చేసింది.
కేటాయించిన పరిమితికి మించి ఖర్చు చేయడమే కాకుండా, ఎలాంటి తక్షణ అవసరం లేకపోయినా గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ప్రభుత్వం రూ. 155.86 కోట్లను ప్రత్యేక ఖాతాల్లోకి మళ్లించడాన్ని ఆడిటర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విధానం ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయడంతో పాటు ప్రభుత్వ ఖర్చులపై శాసనసభ పర్యవేక్షణను తగ్గిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.
ఈ తనిఖీ ప్రక్రియ మరొక సమస్యను కూడా వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ను తప్పనిసరి చేసిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య 2.63 కోట్ల నుంచి దాదాపు 1.7 కోట్లకు తగ్గిందని అదితి తట్కరే తెలిపారు.
సమాచార హక్కు చట్టం కింద 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పొందిన వివరాల ప్రకారం.. తొలగించిన వారిలో దాదాపు 62 లక్షల మంది (సుమారు మూడింట రెండు వంతులు) కేవలం ఈ-కేవైసీ పూర్తి చేయనివారే. దీని గురించి ప్రశ్నించగా, ఇది మోసానికి నిదర్శనంగా భావించకూడదని తట్కరే బీబీసీ మరాఠీకి వెల్లడించారు.
ఆదాయం, వయస్సు పరిమితులు దాటడం, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం, ఇప్పటికే మరొక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతుండటం లేదా ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ ప్రయోజనాన్ని పొందడం వంటి కారణాల వల్ల మరికొందరిని పథకం నుంచి తొలగించారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం దాదాపు 29,000 మంది పురుషులు, సుమారు 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ చెల్లింపులు అందుకున్నారు. ఈ సొమ్మును ప్రభుత్వం రికవరీ చేస్తోందని అదితి తట్కరే చెప్పారు, అయితే ఇప్పటివరకు ఎంత సొమ్ము తిరిగి వచ్చిందో మాత్రం వెల్లడించలేదు.
ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం సంగతేంటి?: నీరజ్ హతేకర్
ఈ పరిణామాలు నగదు బదిలీ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల సుదీర్ఘ కాలంలో పడే ఆర్థిక భారంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చాయి.
అయితే, తక్కువ, అనిశ్చిత ఆదాయాలు ఉన్న మహిళలకు లాడ్కీ బహిన్ పథకం నిజంగానే మేలు చేసిందని సంక్షేమ ఆర్థికవేత్త నీరజ్ హతేకర్ అభిప్రాయపడ్డారు.
లేబర్ ఫోర్స్ డేటాను ఉటంకిస్తూ మహారాష్ట్రలోని మహిళలు సగటున రోజుకు రూ. 300 వరకు సంపాదిస్తున్నారని ఆయన తెలిపారు. నెలకు 20 రోజులు పని దొరికినా, వారి ఆదాయం రూ. 6,000 నుంచి 7,000 మాత్రమే ఉంటుందని, ఈ నేపథ్యంలో నెలకు ఇచ్చే రూ. 1,500 "చాలా పెద్ద మొత్తం" అని ఆయన పేర్కొన్నారు.
అయితే, మహిళల మీద ఈ రకమైన ఖర్చులు చేయడం కాకుండా, ఆరోగ్య సంరక్షణ, విద్య, శిశు సంరక్షణ కేంద్రాలు, రవాణా వంటి ప్రజారోగ్య, సామాజిక మౌలిక వసతుల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా వారి అవసరాలను తీర్చవచ్చని ఆయన వాదించారు.
ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మరో ఆర్థికవేత్త అజిత్ రానాడే సూచించారు.
"ఈ పథకాలకు నిధులు మళ్లించి ఎన్నికల్లో గెలవవచ్చు, కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగే దీర్ఘకాలిక నష్టం పరిస్థితి ఏమిటి? దానిపై ఎప్పుడూ ఆడిట్ జరగదు" అన్నారు.
ఈ ఆడిట్ నివేదిక భవిష్యత్తులో ఈ పథకం నిర్వహణ తీరుపై ప్రభావం చూపవచ్చు. కానీ, నిర్మలా బావస్కర్ లాంటి మహిళలకు మాత్రం 'లాడ్కీ బహిన్' పథకం జీవితంలో ఇప్పటికే మార్పు తెచ్చింది.
ఈ డబ్బు ఆమె కుటుంబాన్ని పేదరికం నుంచి పూర్తిగా బయటకు తీసుకురాకపోవచ్చు. కానీ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె పేరు మీద ఉన్న ఖాతాలో డబ్బు జమ అయ్యేలా చేసింది.
"ఇది నా సొంత డబ్బు. నాకు కావలసింది అదే" అని నిర్మలా బావస్కర్ అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























