లయన్స్ మేన్: 40 అడుగుల టెంటకిల్స్‌తో బస్ అంత పెద్ద జెల్లీ ఫిష్

లయన్స్ మేన్ జెల్లీఫిష్‌, ఐస్టిన్ మోర్గాన్, వేల్స్

ఫొటో సోర్స్, Iestyn Morgan

ఫొటో క్యాప్షన్, పెంబ్రోక్‌షైర్ తీరం సమీపంలో లయన్స్ మేన్ జెల్లీఫిష్ కనిపించింది.
    • రచయిత, "ఆస్కార్ ఎడ్వర్డ్స్, పాల్ పిగోట్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

వేల్స్ తీరంలో భారీ లయన్స్ మేన్ జెల్లీఫిష్‌ను చూసిన ఓ ఫ్రీ డైవర్, తన 'అదృష్టాన్ని నమ్మలేకపోతున్నట్లు' చెబుతున్నారు. ఈ లయన్స్ మేన్ జెల్లీఫిష్ సుమారు 10 నుంచి 15 మీటర్ల (సుమారు 32 నుంచి 49 అడుగుల వరకు) పరిమాణంతో దాదాపు 'బస్సు అంత పొడవు' ఉందని పెంబ్రోక్‌షైర్‌కు చెందిన ఐస్టిన్ మోర్గాన్ చెప్పారు.

'మన సముద్రాలు ఎదుర్కొంటున్న ముప్పుల' గురించి అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా కోసం వీడియోలు రికార్డ్ చేసే ఈ 21 ఏళ్ల పర్యావరణ పరిరక్షకుడు, వేల్స్‌లో తాను లయన్స్ మేన్‌ను చూడటం ఇదే తొలిసారని చెప్పారు.

స్కాట్లాండ్ తీరంలోని చల్లని జలాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. లయన్స్ మేన్ కుడితే నొప్పిగా ఉన్నప్పటికీ అది ప్రమాదకరం కాదని ఒక మెరైన్ బయాలాజిస్ట్ తెలిపారు.

పెంబ్రోక్‌షైర్‌లోని ట్రెఫిన్ బీచ్ సమీపంలో ఈదుతుండగా నీటిలో దాని టెంటకిల్స్ కనిపించాయని మోర్గాన్ చెప్పారు.

"ముందు మూడు కనిపించాయి, ఆ తర్వాత 10.., ఆపై 20కి చేరాయి. అవి అలా వస్తూనే ఉన్నాయి" అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ జెల్లీఫిష్ చాలా పెద్దగా ఉండటంతో దాని టెంటకిల్స్ కూడా కంటికి కనిపించనంత దూరం నీటిలో వ్యాపించాయి. అది యూకే జలాల్లో సహజంగా కనిపించే కంపాస్ జెల్లీఫిష్ అని మోర్గాన్ మొదట భావించారు. కానీ, అది చాలా పెద్దదిగా ఉందని తర్వాత గ్రహించారు.

"అది కచ్చితంగా ఒక బస్సు లేదా చిన్న రైలు పొడవు ఉంటుంది. అది అంత పెద్దగా ఉండటాన్ని నేను నమ్మలేకపోయాను" అన్నారాయన.

పొడవైన టెంటకిల్స్ కారణంగా లయన్స్ మేన్ జెల్లీఫిష్‌కు ఆ పేరు వచ్చిందని, దానికి 'సింహానికి ఉన్నంత అందం, పదును' ఉంటాయని ది వైల్డ్‌లైఫ్ ట్రస్ట్స్ పేర్కొంది.

నీటిలో కనిపించిన పొడవాటి టెంటకిల్స్

లయన్స్ మేన్ జెల్లీఫిష్ శరీరం 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. అయితే, వేటాడేందుకు ఉపయోగించే టెంటకిల్స్ మాత్రం 30 నుంచి 36.5 మీటర్లకు(సుమారు 98 నుంచి 119 అడుగుల వరకు) పైగా ఉంటాయి. దీంతో ఇది భూమిపై ఉన్న అత్యంత పొడవైన జంతువులలో ఒకటిగా నిలిచింది.

మోర్గాన్ వీడియోలో ఈ జలచరం అసాధారణ పొడవు స్పష్టంగా కనిపించిందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌కు చెందిన మెరైన్ బయోలాజిస్ట్ డాక్టర్ కాథీ లూకాస్ చెప్పారు.

స్కాట్లాండ్‌లో ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు, చుట్టుపక్కల జెల్లీఫిష్‌లు లేకపోయినా డైవర్ల శరీరాలకు టెంటకిల్స్ ముక్కలు అంటుకునేవని ఆమె అన్నారు.

"ఈ టెంటకిల్స్ చాలా పొడవుగా, సన్నగా ఉండటం వల్ల కంటికి కనిపించకపోవచ్చు. అవి శరీరం నుంచి విడిపోయిన తర్వాత కూడా కుడతాయి" అని కాథీ లూకాస్ తెలిపారు.

లయన్స్ మేన్ జెల్లీఫిష్‌, ఐస్టిన్ మోర్గాన్, వేల్స్

ఫొటో సోర్స్, Iestyn Morgan

ఫొటో క్యాప్షన్, లయన్స్ మేన్ జెల్లీఫిష్ టెంటకిల్స్ 30 మీటర్లకు పైగా పొడవు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన జంతువుల్లో ఇదీ ఒకటి.

'కుడితే నొప్పి'

వీటి కాటు చాలా దారుణంగా, నొప్పిగా ఉన్నప్పటికీ, దానివల్ల ప్రాణాపాయం అయితే ఉండదని కాథీ లూకాస్ చెప్పారు.

"వాటిని తాకకపోవడమే మంచిది. ఒకవేళ మీ చర్మానికి టెంటకిల్స్ అంటుకుంటే, చేతితో కాకుండా ఒక కర్రతో వాటిని తీసేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు" అని ఆమె సలహా ఇచ్చారు.

వేసవి చివర్లో లేదా శరదృతువులో లయన్స్ మేన్ జెల్లీఫిష్‌లు అప్పుడప్పుడూ వేల్స్ తీరానికి చేరుకుంటాయని, కానీ యూకేలో వాటి ప్రధాన ఆవాసం మాత్రం స్కాట్లాండ్ అని కాథీ లూకాస్ చెప్పారు.

"మీరు నేరుగా వాటి వైపు ఈదుకుంటూ వెళ్తేనే అసలు సమస్య. లయన్స్ మేన్ కుడితే కలిగే బాధను ఎవరూ కోరుకోరు" అన్నారామె.

వేల్స్ తీరంలో పెరుగుతున్న జెల్లీఫిష్‌ల సంఖ్య

తాను వీడియోలు తీస్తున్న సమయంలో వేల్స్ జలాల్లోకి జెల్లీఫిష్‌లు మరింత ఎక్కువగా రావడం గమనించానని మోర్గాన్ చెప్పారు. వెచ్చని నీటిలో ఉండే జీవజాతులు ఇక్కడ ఎక్కువగా కనిపించడం ఇందులో భాగమేనని ఆయన అన్నారు.

"గత పరిస్థితులతో పోల్చి చూసేందుకు నాకు గత వేసవి అనుభవాలు పెద్దగా లేవు. కానీ, కొన్ని వారాల క్రితం కెమెరాను నీటిలోకి పంపినప్పుడు మధ్యధరా సముద్రానికి చెందిన ట్రిగ్గర్‌ఫిష్ నాకు కనిపించింది" అని మోర్గాన్ తెలిపారు.

సముద్ర పర్యావరణాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తాను రూపొందిస్తున్న కంటెంట్ ఎంతో సంతృప్తిని ఇస్తోందని మోర్గాన్ చెప్పారు. అయితే, తన ప్రాజెక్ట్‌లో భాగంగా ఏ జలచరానికీ హాని కలగకూడదనే విషయంలో తాను ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటానని స్పష్టం చేశారు.

"జంతువులను వేటాడేందుకు వెళ్తున్నాననే భావన కలిగించేలా దీనిని మార్చాలని నేను అనుకోవడం లేదు. నేను కేవలం నీటిలోకి వెళ్తాను, వీడియో తీస్తాను, ఈదుతాను" అని మోర్గాన్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)