బాబ్ అల్-మండెబ్: హూతీల దూకుడుతో ఇది మరో హార్ముజ్ జలసంధి అవుతుందా?

ఫొటో సోర్స్, EPA
యెమెన్‌కు చెందిన హూతీలు, బాబ్ అల్-మండెబ్ జలసంధిలోని ఒక కీలకమైన ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారని, తద్వారా ఐరోపాను ఆసియాతో కలిపే ఈ నౌకా రవాణా మార్గంపై తమ పట్టును మరింత బిగించారని నివేదికలు చెబుతున్నాయి.
ప్రభుత్వ దళాలు శుక్రవారం పెరిమ్ ద్వీపం నుంచి వైదొలగాయని అధికారులు తెలిపారు.
ఇరాన్ మద్దతున్న హూతీలు వారంపాటు దూకుడుగా ముందుకు సాగిన తర్వాత ఇప్పుడు యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీరం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
బాబ్ అల్-మండెబ్ తీరం వెంబడి భారీగా దళాలు మోహరిస్తున్నారని సైనికులు వాహనాల్లో తిరుగుతున్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. సుమారు 36 కిలోమీటర్ల వెడల్పు ఉన్న బాబ్ అల్-మండెబ్ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలుపుతుంది.
సైనిక వర్గాల సమాచారం ప్రకారం, హూతీలు మోఖా ఓడరేవు నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఒకరోజు తర్వాత పెరిమ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

గత బుధవారం రాత్రి ప్రభుత్వ అనుకూల దళాలతో జరిగిన భీకర ఘర్షణల తర్వాత హూతీ మద్దతుదారులు నగరంలోకి ప్రవేశించారని దీంతో అనేక కుటుంబాలు తమ ఇళ్లను వదిలి పారిపోయాయని మోఖాలో స్థానికులు తెలిపారు.
ఇది ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా జరిగిందని ఒక వ్యక్తి బీబీసీ న్యూస్ అరబిక్‌కు చెందిన మిడిల్ ఈస్ట్ లైఫ్‌లైన్ కార్యక్రమంలో చెప్పారు.
"ఆ ప్రాంతమంతటా భయాందోళనలు వ్యాపించాయి. గాయపడిన ప్రజలు వీధుల్లో పడి ఉండగా, వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని హృదయవిదారక దృశ్యాల మధ్య ప్రజలు పారిపోవాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Gallo Images via Getty
వారం రోజుల క్రితం సౌదీ మద్దతున్న ప్రభుత్వ అనుకూల దళాలపై ఈ బృందం తన తాజా దాడిని ప్రారంభించినప్పటి నుంచి వందల మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
కనీసం 46వేల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ఈ పోరాటం కారణంగా కేవలం 24 గంటల్లోనే 14 వందల మంది జలసంధిని దాటి తమ దేశానికి వచ్చారని జిబౌటీ ఆర్థిక మంత్రి ఇలియాస్ మౌసా దవాలే తెలిపారు.
ఈ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి.

ఫొటో సోర్స్, EPA
సౌదీ నౌకల రవాణాకు ముప్పు
సెప్టెంబర్ 11న టెలివిజన్‌లో ప్రసారమైన ఒక ప్రసంగంలో ఎర్ర సముద్రం గుండా ప్రయాణించవద్దని సౌదీ నౌకలను హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరేయా హెచ్చరించారు.
అంతర్జాతీయ నౌకల రవాణాకు ఎలాంటి ముప్పు కలిగించబోమని హూతీలు తెలిపారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోయినప్పటి నుంచి సౌదీ అరేబియా తన చమురు ఎగుమతుల కోసం ఈ మార్గంపైనే ఆధారపడింది.
కేవలం సౌదీ అరేబియా నుంచి వచ్చే నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామని హూతీలు పునరుద్ఘాటించారు.
కానీ గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలపై మాత్రమే దాడి చేస్తామని ఈ బృందం గతంలో చెప్పి, వాస్తవానికి వారితో ఎలాంటి సంబంధాలు లేని అనేక నౌకలపై దాడి చేసినందున షిప్పింగ్ కంపెనీలు ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, టెలిగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్‌లో, హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారియా తమ బృందం "భారీ స్థాయిలో తీవ్ర ప్రభావం చూపే సైనిక చర్య" ను ప్రకటించబోతోందని తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
బాబ్ అల్-మండెబ్ ఎందుకంత ముఖ్యమైంది?
బాబ్ అల్-మండెబ్ జలసంధి ఎర్ర సముద్రానికి అరేబియా వైపున ఉన్న యెమెన్, ఆఫ్రికా వైపున జిబౌటీ, ఎరిట్రియాకు మధ్య ఉంది.
హిందూ మహాసముద్రం, ఏడెన్ గల్ఫ్ నుంచి వచ్చే నౌకలు సూయజ్ కాలువను చేరుకోవడానికి దీని గుండా వెళ్ళాలి.
1869లో సూయజ్ కాలువ తెరిచినప్పుడు 115 కిలోమీటర్ల పొడవు, 36 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో ఒక కీలకమైన అనుసంధానంగా మారింది.
ఇది ఐరోపా, ఆసియా మధ్య సముద్ర మార్గంలో దూరాన్ని తగ్గించింది. ఎర్ర సముద్ర మార్గం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి.
ప్రపంచ సముద్ర రవాణాలో సుమారు నాలుగోవంతు దీని గుండానే సాగుతుంది.
యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ఈ మార్గం గుండా ప్రపంచ చమురు సరఫరాలో 20శాతం రవాణా అవుతుంది.
బాబ్ అల్-మండెబ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ చమురు సరఫరాలో మరో 12శాతానికి అంతరాయం కలుగుతుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
చమురు రవాణాలో కీలక మార్గం
ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ షిప్పింగ్‌కు అంతరాయం కలిగించక ముందు మధ్యప్రాచ్యం ఆసియా దేశాల నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే సుమారు ఐదు మిలియన్ బ్యారెళ్ల చమురు ప్రతిరోజూ దీని గుండా ప్రయాణించేదని యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.
అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా జరిగే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ రవాణాలో 8 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇది ప్రపంచ ఇంధన సరఫరాకు ఒక ముఖ్య మార్గంగా మారింది.
హార్ముజ్ జలసంధిని మూసివేసినప్పటి నుంచి ప్రపంచ వాణిజ్యంలో ఎర్ర సముద్రం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.
యాన్బు ఓడరేవు నుంచి చమురు ఎగుమతులకు సౌదీ అరేబియా బాబ్ అల్-మండెబ్‌ను రవాణా కేంద్రంగా ఉపయోగించడం ప్రారంభించింది. రియాద్ తన తూర్పు క్షేత్రాల నుంచి ప్రతిరోజూ లక్షల బ్యారెళ్ల ముడి చమురును పైప్‌లైన్ ద్వారా అక్కడికి పంపుతుంది.
ముడి చమురు, గ్యాస్‌తోపాటు బాబ్ అల్-మండెబ్ జలసంధి తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గంలో భాగంగా ఉంది. దీని జలాల గుండా ప్రతిరోజూ డజన్ల కొద్దీ సరకు రవాణా నౌకలు ప్రయాణిస్తాయి.
2021లో పనామా జెండాఉన్న 'ఎవర్ గ్రీన్' అనే సరకు రవాణా నౌక సూయజ్ కాలువలో చిక్కుకుపోయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రవాణా ఎలా నిలిచిపోయిందో ఇప్పుడు ఈ సముద్ర మార్గం మూతపడినా సరిగ్గా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.

ఫొటో సోర్స్, Houthi Military Media via Reuters
హూతీల పాత్ర
2014లో హూతీలు యెమెన్ ప్రభుత్వాన్ని కూలదోయడంతో ప్రారంభమైన అంతర్యుద్ధం వల్ల యెమెన్ దెబ్బతింది.
ప్రభుత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమి జోక్యం చేసుకున్న తర్వాత 2015లో ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చింది.
ఈ పోరాటం వల్ల లక్షన్నర మందికిపైగా మరణించారని ప్రపంచంలో అత్యంత దారుణమైన మానవీయ సంక్షోభాల్లో ఇదొకటని 2.2 కోట్ల మందికి ఏదో ఒక రూపంలో సహాయం అవసరమైందని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి.
2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
కానీ జూలైలో ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు సౌదీ అరేబియాపై "సముద్ర ఆంక్షలు" ప్రకటించి ఎర్ర సముద్రంలోని సౌదీ విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, ట్యాంకర్లపై క్షిపణి, డ్రోన్ దాడులు ప్రారంభించడంతో ఈ ఒప్పందం విచ్ఛిన్నం కావడం మొదలైంది.
హూతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని ఓడరేవులు, విమానాశ్రయాలపై సౌదీ దిగ్బంధనానికి ప్రతీకారంగానే ఈ ఆంక్షలు విధించినట్లు వారు తెలిపారు.
గాజా యుద్ధ సమయంలో, హూతీలు బాబ్ అల్-మండెబ్ జలసంధిలో క్షిపణులు, డ్రోన్లతో 100కుపైగా వాణిజ్య నౌకలపై దాడి చేసి, రెండు నౌకలను ముంచి, నలుగురు నావికులను హతమార్చారు.
2023 నవంబర్‌లో హూతీలు ఎర్ర సముద్రంలో జపాన్ నిర్వహిస్తున్న బ్రిటన్ యాజమాన్యంలోని ఒక సరకు రవాణా నౌకను హెలికాప్టర్ ఉపయోగించి హైజాక్ చేసింది.
ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని హూతీలు పేర్కొన్నప్పటికీ, ఈ దాడులు విచక్షణారహితమైనవిగా విస్తృతంగా ప్రచారమయ్యాయి.
దీంతో ప్రపంచంలోని అనేక అతిపెద్ద షిప్పింగ్, ఆయిల్ కంపెనీలు ఆ ప్రాంతం గుండా తమ రవాణాను నిలిపివేశాయి.
హూతీలు లొంగిపోయారన్న అమెరికా వాదనలు దానికి ప్రతిగా అమెరికాయే వెనక్కి తగ్గిందన్న హూతీల వాదనల మధ్య ఆ దాడులు చివరికి తగ్గుముఖం పట్టాయి.
కానీ అవి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
ఒకవేళ హూతీలు కీలకమైన బాబ్ అల్-మండెబ్ జలసంధిపై నియంత్రణ సాధిస్తే అది అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు ఒక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలకు మరింత ప్రమాదం కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, West Asia News Agency / Reuters
ప్రపంచవ్యాప్త నౌకల రవాణాపై ఒత్తిడి
అరబిక్‌లో బాబ్ అల్-మండెబ్ అంటే "కన్నీళ్ల ద్వారం" లేదా "దుఃఖ ద్వారం" అని అర్థం.
బలమైన ప్రవాహాలు, అనూహ్యమైన గాలుల నుంచి సముద్రపు దొంగతనం, ఘర్షణల వరకు ఉన్న ప్రమాదాలను ఈ పేరు ప్రతిబింబిస్తుంది.
2008, 2012 మధ్య, బాబ్ అల్-మండెబ్ జలసంధి, దాని చుట్టుపక్కల జలాల్లో అనేక సముద్రపు దొంగల దాడులు జరిగాయి.
ప్రధానంగా సోమాలి సమూహాలు ఓడ సిబ్బందిని అపహరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశాయి.
ఆ ఘటనలు ఆ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడానికి అంతర్జాతీయ సమాజాన్ని షిప్పింగ్ కంపెనీలను ఒత్తిడి చేశాయి.
బాబ్ అల్- మండెబ్ మార్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఇంధన మార్కెట్లను మరింత ఒత్తిడిలో పడేస్తాయి.
గల్ఫ్‌లో షిప్పింగ్‌కు అంతరాయం కలగడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు సంక్షోభానికి ముందు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి100 డాలర్లకు పైగాపెరిగాయి.
వినియోగదారుల ఉత్పత్తుల నుంచి వ్యవసాయ సరకుల వరకు విస్తృత శ్రేణి వస్తువుల ప్రపంచ వాణిజ్యంపై దీని ప్రభావం కనిపిస్తోంది.
మరో కొత్త సముద్ర మార్గానికి అంతరాయం కలగడం వల్ల ధరలు మరింత పెరిగి ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణ వలన కలిగే ఆర్థిక పర్యవసానాలు తీవ్రతరం కావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























