దిల్లీ: 'అత్యంత బొద్దు శునకం' కోసం ఆసక్తికర పోటీ, ఫైనల్స్‌కు 8 శునకాలు

fattest dog of Delhi
ఫొటో క్యాప్షన్, హీరో, తారా, గూగూ (ఎడమ నుంచి కుడికి) టైటిల్ కైవసానికి పోటీ పడుతున్నాయి
    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

దిల్లిలో ఓ అసాధారణ ఎన్నికల హడావిడి నడుస్తోంది. 'బొద్దుగా ఉండే శునకాన్ని' ఎంపిక చేయడానికి వేలాదిమంది ఓటర్లు, ప్రచారకర్తలు పోటీ పడుతున్నారు.

ఫ్యాట్ డాగ్స్ ఆఫ్ దిల్లీ (Fat Dogs of Delhi) పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి వచ్చిన ఒక ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. బొద్దుగా ఉండే శునకాన్ని ఎన్నుకోవడానికి ఈ పేజీని డిజైన్ చేశారు. మీకు ఇష్టమైన బొద్దుగా ఉండే కుక్కలను నామినేట్ చేయాలన్న నిర్వాహకుల పిలుపుతో నాకౌట్ పోటీ మొదలైంది.

ఇది సరదాగానే ప్రారంభమైంది. కానీ రానురాను పోటీలో తీవ్రత పెరిగింది. మద్దతుదారులు తాము పంపిన కుక్కలకు ఓటు వేయాలని ప్రచారం మొదలు పెట్టారు. వాటికి మద్దతుగా వీడియోలు పోస్టు చేశారు. మరికొందరు మీమ్స్‌ సృష్టించారు.

అనేక దశల్లో ఆన్‌లైన్ ఓటింగ్ జరిగిన తరువాత బుధవారం ఫైనల్ జరగనుంది. అతి కొద్ది కాలంలోనే ఈ పోటీ వేల మందిని ఆకట్టుకుంది. అదే స్థాయిలో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీకి ఫాలోవర్స్ పెరిగారు.

ఈ పోటీలో పాల్గొంటున్న చాలా కుక్కలకు ప్రత్యేకంగా యజమానులంటూ లేరు. అవి వీధుల్లో, గ్రామాల్లో, ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నవే. వీటిని స్థానికులు, దుకాణదారులు, కార్మికులు ఆహారం అందించి, సంరక్షించి పేర్లు పెట్టారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ టోర్నమెంట్ నడుస్తుండగానే పోటీలో పాల్గొన్న రెండు శునకాలు చనిపోయాయి. దీంతో వాటిని ఫాలో అవుతూ, ఓటు వేస్తున్న వారంతా తమ నివాళి అర్పించారు.

ఈ పేజీని నడుపుతున్న వ్యక్తితో బీబీసీ మాట్లాడింది. అయితే తన పేరు బయటపెట్టవద్దని చెప్పారు. ఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు నిర్వహిస్తున్న వివిధ నాకౌట్ పోటీల నుంచే ఈ ఆలోచన వచ్చిందని ఆ వ్యక్తి చెప్పారు.

'ప్రజలు ఒకరితో ఒకరు సరదాగా మమేకం కావడానికి ఇలాంటిది ఎందుకు చేయకూడదు' అని అన్నారు.

fattest dog of Delhi
ఫొటో క్యాప్షన్, తుది రేసులో ముందంజలో ఉన్న శునకాల్లో ఒకటి

గూగూ, కుత్తాసింగ్...

మొదట ఈ పోటీకి వచ్చిన 64 నామినేషన్లను ఆమోదించారు. వాటి పేర్లు చాలా విచిత్రంగా, విభిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇందులో ఉత్తర భారతంలో ప్రసిద్ధ వంటకం దహీ బల్లా పేరు కూడా ఉంది. అలాగే మహాకుత్తేశ్వర్ అనేది మరో భిన్నమైన పేరు. దేవతలు, దేవాలయాలకు సంబంధించిన పేరులో హిందీ పదం చేర్చారు. గూగూ, రాంబాబు, కుత్తాసింగ్ లాంటి ఆకట్టుకునే పేర్లు కూడా ఉన్నాయి.

ఓటింగ్ సెప్టెంబర్ 24న ప్రారంభమైంది.

మొదటి రౌండ్‌లో 64 పోటీపడగా వాటిని 32 గ్రూపులుగా చేశారు. ప్రతి గ్రూపు నుంచి ఒక కుక్కను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇలా చివరి దశ పోటీకి 32 అర్హత సాధించగా మిగిలినవి నిష్క్రమించాయి.

మంగళవారం వరకు ఎలిమినేషన్ రౌండ్స్ జరిగాయి

తుది పోటీకి కేవలం 8 మాత్రమే మిగిలాయి.

‘ఈ స్పందన అనూహ్యం’

పోటీ ప్రారంభమైనప్పటి నుంచి శునకాల మద్దతుదారులే ఈ టోర్నీకి ప్రచారం కల్పించారు. తాము బరిలో దింపిన శునకాన్ని గెలిపించుకునేందుకు క్యాంపెయిన్స్ రన్ చేశారు. పోస్టర్స్, మీమ్స్, రీల్స్ క్రియేట్ చేశారు. స్నేహితులను, ఇతరులను సంప్రదించి ఓటు వేయాలని అభ్యర్థించారు. అందుకే ఇది దిల్లీని దాటి కోల్‌కతా, కేరళ వరకు పాకింది. మద్దతుదారులు తమకు నచ్చిన శునకాన్ని ఎంచుకొని దాని తరఫున ప్రచారం చేశారు.

ఈ స్పందన పోటీ నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది.

'ఇంత పెద్ద స్పందన వస్తుందని ఊహించలేదు' అని నిర్వాహకులు బీబీసీకి తెలిపారు. దీనికి అదనంగా తన సోషల్ మీడియా ఖాతా ఫాలోవర్స్ సంఖ్య పెరిగినట్టు చెప్పుకున్నారు. 'ప్రస్తుతం మన మధ్య ఉన్న ఈ స్ఫూర్తి నాకు బాగా నచ్చింది' అన్నారు.

fattest dog of Delhi
ఫొటో క్యాప్షన్, తమకు ఇష్టమైన కుక్కలకు ఓటు వేయాలంటూ వినియోగదారులు రూపొందించిన ఆన్‌లైన్ పోస్టర్

విమర్శలూ ఉన్నాయి

మరోవైపు ఈ పోటీ మరికొందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇది కుక్కల్లో ఊబకాయాన్ని ప్రోత్సహించే ప్రమాదం ఉండదా అని కొందరు అనుమానపడుతున్నారు.

అధిక బరువు కుక్కల్లో అనేక సమస్యలకు కారణమవుతుంది. వాటి జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ఇలా జంతువుల పరిమాణాన్ని ప్రశంసించడం అంటే వాటికి అధికంగా ఆహారం పెట్టడాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోటీ మాదిరిగానే టోర్నీలో ఫైనల్‌కు చేరిన జాబితా కూడా ఆసక్తిగా ఉంది.

గూగూ 46 కిలోల బరువుతో ఫైనల్‌కు చేరిన సంకరజాతి శునకం. ఇది బరువు తగ్గేందుకు దిల్లీలోని ఒక జంతుసంరక్షణ కేంద్రంలో ఉంటోంది.

దీనికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తూ ఆహారాన్ని నియంత్రిస్తున్నారు. గూగూను పోటీలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ... 2021లో మొదట దాన్ని ఒక పార్క్‌లో చూశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిణామంలో సగం కంటే తక్కువ ఉండేదని వివరించారు.

పోటీ మొదలైనప్పటి నుంచి గూగూ కోసం మద్దతుదారులు విపరీతమైన ప్రచారం చేశారు. ఓటు వేయాలని సోషల్ మీడియాలో అభ్యర్థించారు. దీన్ని కొందరు గోట్(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా ప్రకటించేశారు.

ఈ పోటీకి అనూహ్యంగా వచ్చిన ఈ మద్దతును వీధి జంతువులకు సహాయ కార్యక్రమంగా మలిచేందుకు నిర్వాహకులు భావిస్తున్నారు. విరాళాలు సేకరిస్తున్న జంతుసంక్షేమ సంఘాలు, వ్యక్తులను తమ పేజీ హైలైట్ చేస్తున్నట్టు తెలిపారు.

fattest dog of Delhi
ఫొటో క్యాప్షన్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అభిమానులను దహీ బల్లా,కుత్తేశ్వర్‌ సంపాదించుకున్నారు

వాడివేడి చర్చ... సరదా పోటీ

దిల్లీలోె వీధి కుక్కల ఉనికి, వాటి నిర్వహణ అంశంపై చాలా తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ ఈ సరదా పోటీ జరుగుతోంది.

దిల్లీలో వీధి కుక్కల సంఖ్య సుమారు 10 లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా. శివారు ప్రాంతాలైన నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లలో కూడా వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని మున్సిపాలిటీ వర్గాలు చెబుతున్నాయి.

చాలా ప్రాంతాల్లో ప్రజలు వీధి కుక్కలను సామూహిక పెంపుడు జంతువులుగా చూస్తారు. వాటిని జాగ్రత్తగా సాకుతారు. ఆహారం పెడతారు. అయితే కుక్కకాట్లు, క్రూరంగా ఉండే కుక్కల మందులు, రేబీస్ వ్యాధి ప్రమాదాలు మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలను భయపెడుతున్నాయి.

దిల్లీ ప్రేమకు గుర్తు

రేబీస్‌కు దారి తీస్తున్న కుక్కకాట్ల ముప్పు పెరుగుతోందనే ఆందోళనతో గతేడాది సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ పరిసరాల్లో వీధి కుక్కలన్నింటినీ జంతుసంరక్షణ కేంద్రాలకు తరలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై జంతు ప్రేమికులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తర్వాత ఈ ఆదేశాల్లో మార్పులు జరిగాయి. వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసి, టీకాలు వేసి అవి తిరిగే ప్రాంతాల్లో విడిచి పెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ పోటీ జంతువులపై దిల్లీకి ఉన్న ఆప్యాయతను తెలియజేస్తుందని శునకాల కోసం ప్రచారం చేస్తున్న వారు చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఫైనల్ కోసం, నిర్వాహకులు దిల్లీవ్యాప్తంగా మూడు ప్రదేశాల్లో బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వలంటీర్ల పర్యవేక్షణలో, ప్రజలు తమకు ఇష్టమైన కుక్కకు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో ఓటు వేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

వారాల తరబడి ప్రచారం, వేలాది ఓట్ల పోలైన తర్వాత అత్యంత బొద్దుగా ఉంటూ ప్రజలను ఆకట్టుకున్న దిల్లీ విజేత ఎవరో తేలిపోనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)