13 ఏళ్లుగా సముద్రంలో భార్య కోసం వెదుకుతున్న భర్త

ఫొటో సోర్స్, Yasuo Takamatsu
- రచయిత, బెకా జాన్స్
- హోదా, బీబీసీ రిపోర్టర్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
జపాన్‌లోని ఈశాన్య మియాగి ప్రాంతంలోని ఒనగావా రేవు నుంచి ప్రతి నెలా రెండుసార్లు ఓ చిన్న చేపల వేట పడవలో యాసువో తకమాత్సు సముద్రంలో కొన్ని కిలోమీటర్ల దూరం వెళతారు.
ఫేస్ మాస్క్, ఎయిర్ ట్యాంక్, వెయిట్ బెల్ట్ ధరించి సముద్రం లోతుల్లోకి వెళ్లడం 13 ఏళ్లుగా ఆయనకు అలవాటుగా మారిపోయింది.
తను ప్రయాణించే బోటు కొంత దూరం వెళ్లిన తర్వాత ఆయన చల్లని సముద్ర జలాల లోతుల్లోకి దూకుతారు.
తన భార్య యుకోను కబళించిన అదే సముద్రంలోకి ఆయన మళ్లీ మళ్లీ దూకుతుంటారు.
జపాన్ ఈశాన్య తీరాన్ని 2011లో సునామీ ధ్వంసం చేసింది. అప్పుడే తాను పని చేస్తున్న బ్యాంకు భవనం పైకప్పు మీద ఉన్న యుకో కొట్టుకుపోయారు. ఆ భారీ అల దాదాపు 10 కీలోమీటర్ల మేర తీరాన్ని దాటి భూభాగంలోకి చొచ్చుకు వచ్చింది.

ఆ రోజు ఉదయాన్నే యాసువో ఆమెను బ్యాంకు దగ్గర దింపారు. ఆ కొద్ది దూరం ప్రయాణంలోనే రాత్రి భోజనానికి ఏం తినాలనే విషయం గురించి మాట్లాడుకున్నారు.
సునామీ హెచ్చరిక వచ్చిన తర్వాత యుకో, 12 మంది సహోద్యోగులు బ్యాంకు భవనం పైకి చేరుకున్నారు.
అక్కడి నుంచే ఆమె తన భర్తకు మెసేజ్ చేశారు. 'నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను' అనే మెసేజ్ పంపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సందేశం చూశాక తన భార్య సురక్షితంగా ఉన్నారని యాసువో భావించారు. కానీ సునామీ నుంచి ప్రాణాలతో బయటపడిన వారు ఆశ్రయం పొందుతున్న మున్సిపల్ ఆసుపత్రికి వెళ్లి చూస్తే ఆయనకు తన భార్య కనిపించలేదు.
'ఆమె సునామీ అలల్లో కొట్టుకుపోయిందని నాకు చెప్పారు' అని వివరించారు. 'ఆ మాట విన్నాక కుప్పకూలిపోయాను, శక్తిహీనుడిగా మారిపోయా, నేను కూడా నీటిలో కొట్టుకుపోయినట్టు అనిపించింది' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Hiromi Tanoue
నీళ్లు తగ్గుముఖం పట్టిన తర్వాత జపాన్ తీరంలో కొన్ని వారాలపాటు వేలాది మృతదేహాలు లభ్యమయ్యాయి.
కానీ యుకో లాంటి చాలా మంది బాధితుల ఆచూకీ ఇంకా దొరకలేదు.
ఇది జరిగిన రెండేళ్ల వరకు జపనీస్ కోస్ట్ గార్డ్ డైవర్లు సముద్రంలోకి వెళ్లి మృతదేహాలు, వారికి సంబంధించిన వస్తువులను వెతికి తీసుకొస్తున్న విషయాన్ని యాసువో చూస్తూనే ఉన్నారు.
అప్పుడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.
'నేను కూడా డైవింగ్ నేర్చుకోవాలనుకున్నా. డైవింగ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆమెను కలుసుకుంటానని అనిపించింది' అని చెప్పారు.
యాసువో తన 50ల్లో మొదలుపెట్టి 60ల్లో కూడా డైవింగ్ చేస్తూనే ఉన్నారు.
ఆయన 760కిపైగా డైవ్‌లు పూర్తి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
చెరిగిపోని గుర్తులు
జపాన్‌లో చనిపోయినవారిని తమ నిత్యజీవితంలో స్మరించుకుంటూనే ఉంటారు. వారిని తమ జీవితాల్లో భాగంగా చూస్తారు.
కుయో అనే బౌద్ధ ఆచారం ప్రకారం మరణించిన వారికి ప్రశాంతత చేకూర్చడం కోసం సమాధి వద్ద నైవేద్యాలు సమర్పించి, ప్రార్థిస్తారు.
అయితే, యుకో భౌతికకాయం లభించకపోవడంతో యాసువో అటువంటి స్మరణ చేయలేకపోతున్నారు.
దీంతో ఆమె కోసం అన్వేషణగా మొదలైన ఆయన డైవింగ్ ఇప్పుడు ఒక ఆచారంగా, స్మరణ, కార్యక్రమంగా మారిపోయింది.
'పదేపదే నీటిలోకి డైవ్ చేస్తుంటే, బహుశా ఆమెకు నాకు సమీపంలోనే ఉండవచ్చని అనిపిస్తుంది' అని యాసువో అన్నారు. 'ఇది సమాధిని సందర్శించడం కంటే చాలా భిన్నమైన అనుభూతి. ఎందుకంటే ఆమె సమాధిలో లేదు కదా. ఇది ఆమెను కలుసుకోవడానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యాసువో విశ్వాసాన్ని ఆ విపత్తు పరీక్షిస్తోంది.
ఆయన సముద్రం అడుగునకు వెళ్లినప్పుడు ఏళ్ల తరబడి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన విధ్వంసాన్ని చూసి బాధపడతారు.
'అక్కడి శిథిలాలు చూస్తే అందులో నుంచి ఆమె పైకి రావడం అసాధ్యమనిపిస్తుంది. అలా అనుకున్నప్పుడు కన్నీళ్లు ఉబికి వస్తుంటాయి'
అయితే సముద్రం పట్ల యాసువోకు ద్వేషం లేదు. కాలక్రమేణా, ప్రకృతి వైపరీత్యాలు అనివార్యమని, అవి మనిషి నియంత్రించలేనివని అంగీకరించాల్సి వచ్చింది.
'దాని పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఒకప్పుడు సునామీ అలజడి సృష్టించింది. కానీ మరోవైపు చూస్తే అక్కడ ఎన్నో అద్భుతమైన వస్తువులు పట్టుకోవచ్చు, అందమైన దృశ్యాలూ కనిపిస్తాయి’’ అంటారు.
ఈ విధంగా పదేపదే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ప్రజల మనస్తత్వానికి యాసువో ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన నివసించే పసిఫిక్ తీరప్రాంతంలోని తోహూకులో సునామీలు, భూకంపాలు రావడం సాధారణమే. ప్రకృతి శక్తిని, అలాగే మనుషులు కూడా ప్రకృతిలో అంతర్భాగమేననే విషయాన్ని గుర్తు చేస్తూ తీర ప్రాంతమంతా దేవాలయాలు, విపత్తుల అవశేషాలు కనిపిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Hiromi Tanoue
డైవ్‌కి వెళ్లే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ యాసువో నవ్వుతూ చాలా సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటారు. యుకో గురించి ఆయన చెబుతున్నప్పుడు బాధను దిగమింగుతూ హాస్యధోరణితో మాట్లాడతారు.
'మేం మళ్లీ కలిస్తే ఆశ్చర్యంగా ఆమె మొదట నాతో చెప్పే మాట 'నువ్వు బాగా ముసలివాడివైపోయావ్' అని అంటుందేమో’ అంటుంటారు.
అయితే ఆయనకు ఈ డైవ్‌లు ఆత్మపరిశీలనకు ఒక అవకాశంలా ఉంటాయి. సముద్ర ఉపరితలం నుంచి 50 మీటర్ల లోతులో విధ్వంసాల కారణంగా ఛిన్నాభిన్నమైన సముద్ర గర్భంలోని భూభాగంపైన ఆయన ఈదుతూ ఉన్నారు.
'సముద్రగర్భంలో రకరకాల భౌగోళిక ఆకృతులు కనిపిస్తాయి. వాటిలో కొన్ని కొండల్లా ఉంటాయి, వాటిపై తేలుతూ, ఎత్తు నుంచి వాటిని చూస్తున్నట్టు అనుభూతి పొందవచ్చు' అని ఆయన అన్నారు. 'అందుకే అక్కడ ఉండటం కొంతవరకు ఆకాశంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది' అని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Hiromi Tanoue
యుకోను కలసుకోవడానికి ముందే యాసువో ఈ సముద్రం ఒడ్డునే పెరిగారు. ఆ నీటిలోనే ఈత కొట్టడం, చేపలు పట్టడం నేర్చుకున్నారు. ఆ సముద్రమే తన జీవితాన్ని తీర్చిదిద్దింది.
ఇప్పుడు సముద్రంలోని శిథిలాలను చూస్తే ప్రకృతిలో నిరంతరం సాగే మార్పుల చట్రంలో అవి ఒక భాగమని ఆయన భావిస్తారు.
'సగం నుజ్జునజ్జు అయిపోయినట్టు కనిపించే కార్లు ఉన్నాయి. మరికొన్ని వస్తువులు సముద్ర గర్భంలోని కృత్రిమ పగడపు దిబ్బలుగా మారిపోయాయి. అక్కడకి చేపలు వస్తుంటాయి. అక్కడే గుడ్లు కూడా పెడతాయి'
15 ఏళ్లు గడిచినా ఆయన గుండెల్లో బాధ తగ్గలేదు. సముద్రం కూడా ఆయన జీవితం నుంచి దూరం కాలేదు.
ఇది ఆయన 763వ డైవ్. త్వరలోనే యుకోకు దగ్గరగా ఉండేందుకు ఆయన మరోసారి నీటిలోకి వెళ్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































