23 ఏళ్ల తరువాత తల్లిని కలిశాడు.. 2 నెలల్లోనే మళ్లీ ఇల్లొదిలి వెళ్లిపోయాడు

సుందరి, ప్రకాశం
ఫొటో క్యాప్షన్, తల్లితో ప్రకాశం
    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

" ఇకపై నన్ను విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లనని చెప్పాడు. మాకంటే ఎక్కువగా అతని అక్కచెల్లెళ్లు (సుందరి అక్కచెల్లెళ్ల కూతుళ్లు) నా కొడుకుని చూడాలని ఆత్రుతగా ఉన్నారు. ప్రకాశంను ఊరికి తీసుకువెళ్లాలి. నా కొడుకు జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. ఇకపై అతన్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా ఏకైక బాధ్యత".. అని సుందరి చెప్పారు.

23 ఏళ్ల క్రితం కోయంబత్తూరు నుంచి తప్పిపోయి, పంజాబ్‌లో వెట్టిచాకిరీ అనుభవించిన తన కొడుకు ప్రకాశంను కలుసుకున్న సమయంలో తల్లి సుందరి, బీబీసీతో ఈ విషయాలు చెప్పారు.

సుందరి జులై 28న తన కుమారుడిని కలిశారు. ఆయన్ను పంజాబ్ నుంచి రక్షించి, కోయంబత్తూరు తీసుకొచ్చారు.

తన ఇంట్లోనే ఆయన్ను బాగా చూసుకున్నారు. కానీ, ఈ నెల (సెప్టెంబర్) 26వ తేదీ నుంచి ఆమె కొడుకు ప్రకాశం మళ్లీ కనిపించకుండా పోయారు.

నీలాంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సుందరి, తన కుమారుడు మళ్లీ కనపడితే మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పిస్తానని బీబీసీకి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పంజాబ్‌లో చిత్రహింసలకు గురై..

ప్రకాశం ఎన్నో ఏళ్ల పాటు తన కుటుంబానికి దూరమై, తిరిగి కలవడం గురించిన ఆశ్చర్యకరమైన కథ ఇది.

విరుదునగర్ జిల్లా, తిరుచుళి తాలూకాలోని పూమాలైపట్టి ఆనైకుళం గ్రామానికి చెందిన సుందరి, ఆమె భర్త రామ్మూర్తి 40 ఏళ్ల క్రితం తమ ఇద్దరు కుమారులతో కలిసి పని కోసం కోయంబత్తూరుకు వచ్చారు.

వారు మొదట కౌండంపాలయంలోని ఎరుకంపెని ప్రాంతంలో ఉన్నారు.

ఆ తర్వాత 2003లో, వారి పెద్ద కుమారుడు ప్రకాశం ఒక చిన్న గొడవకు కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. వారు ఆయన ఆచూకీ ఎక్కడా కనుగొనలేకపోయారు.

పోలీసు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆయన అదృశ్యమైన రెండు నెలల తర్వాత.. వారి ఇంటికి సమీపంలోని కిరాణా దుకాణానికి ఫోన్ చేసిన ప్రకాశం.. చెన్నైలో ఉన్నట్లు చెప్పారు.

ఆయన అది తప్ప మరే ఇతర వివరాలు ఇవ్వలేదు. మళ్లీ మాట్లాడతాడేమోనని వారి కుటుంబం ఎంతో ఎదురుచూసింది. కానీ, తిరిగి ఫోన్ రాలేదు.

ఆ తర్వాత తాను చెన్నైలోని చాలా చోట్ల ప్రకాశం కోసం వెతికినా దొరకలేదని ఆయన తల్లి సుందరి గతంలో బీబీసీకి వివరించారు.

ప్రకాశం కనిపించకుండాపోయిన కొన్నేళ్ల తర్వాత... సుందరి కుటుంబం కౌండంపాలయం నుంచి నీలాంబూర్ ఆచ్చాంకుళం ప్రాంతానికి మారిపోయారు.

ఎలక్ట్రికల్ అసిస్టెంట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసిన రామ్మూర్తి 2021లో క్యాన్సర్‌తో మరణించినట్లు సుందరి చెప్పారు.

సుందరి, ఆమె చిన్న కొడుకు ప్రభు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. తమ పెద్ద కొడుకు ప్రకాశం బతికున్నాడో లేదో తెలియదు.

కానీ, గతేడాది జూన్‌లో తిరుప్పూర్‌కు చెందిన జర్నలిస్ట్ ముత్తయ్య, సుందరిని వెతుక్కుంటూ వచ్చారు.

సుందరి, ప్రకాశం
ఫొటో క్యాప్షన్, తల్లి సుందరితో ప్రకాశం (ఫైల్ ఫోటో)

సుందరి పెద్ద కొడుకు ప్రకాశం ఫోటోను చూపించి, పంజాబ్‌లోని పటియాలాలో ఒక సంరక్షణ కేంద్రంలో ఉన్నట్లు చెప్పారు.

ఫోటోను చూసిన సుందరి, ఆయన తన పెద్ద కొడుకేనని గుర్తించారు. ఫోన్‌లో ఆయనతో మాట్లాడిన తర్వాత ప్రకాశం బతికే ఉన్నాడని ధ్రువీకరించుకున్నారు.

పాకిస్తాన్ సరిహద్దుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా అజ్నాలా గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ప్రకాశం 15 ఏళ్లకు పైగా వెట్టిచాకిరీలో ఉన్నారని తెలిసింది.

పటియాలాలోని అప్నా ఫర్స్ సేవా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ 2022లో ప్రకాశంను అక్కడి నుంచి రక్షించింది.

''పశువుల కాపరిగా ఉన్నప్పుడు ఆయనకు తగినంత ఆహారం, దుస్తులు, ఉండడానికి స్థలం లేదా జీతం ఏదీ ఇవ్వలేదు. ఆయన పారిపోకుండా రాత్రిపూట ఒక ఇనుప మంచానికి గొలుసులతో కట్టేసేవారు'' అని అప్నా ఫర్స్ సేవా సొసైటీ పేర్కొంది.

ఆయన్ను ఎలా కొట్టారో, వేధింపులకు గురి చేశారో బీబీసీకి ఆ సంస్థ వివరించింది. ఆ సమయంలో ప్రకాశం పరిస్థితి తెలియజేసే ఫోటోలు, వీడియోలు చూపించింది.

ప్రకాశం
ఫొటో క్యాప్షన్, పంజాబ్‌లో ఇనుప కంచెలతో ప్రకాశాన్ని కట్టేశారు. (ఫైల్ ఫోటో)

పంజాబీ అయిన సుభాశ్ చందర్ ఆ ఫోటోలను ముత్తయ్య ద్వారా బీబీసీకి ఇచ్చారు.

వెట్టి చాకిరీ నుంచి రక్షించిన ప్రకాశంను ఈ సంస్థ ఆశ్రయం ఇచ్చి చూసుకుంది.

2023లో అక్కడ ఆయన్ని కలిసిన హరియాణా శాసన సభ మాజీ కార్యదర్శి సుభాష్ చందర్, ప్రకాశం తనతో చెప్పిన కొన్ని మాటల ద్వారా ఆయన స్వస్థలం కోయంబత్తూరు అని తెలుసుకున్నారు.

ప్రకాశం శారీరకంగా, మానసికంగా గందరగోళ స్థితిలో ఉన్నారని, మరిన్ని వివరాలు అందించలేకపోయారని సుభాష్ చందర్ బీబీసీకి తెలిపారు.

ఆ తర్వాత, చెన్నై సెక్రటేరియట్‌లో పనిచేసే తన స్నేహితుడు బాలకిషన్‌కు సుభాష్ చందర్ ఈ విషయం తెలియజేశారు.

ఆయన ద్వారా తిరుప్పూర్‌కు చెందిన జర్నలిస్టు ముత్తయ్య సహాయం కోరి, ప్రకాశం కుటుంబాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించామని సుభాష్ చందర్ చెప్పారు.

సుందరి కుటుంబం తొలుత ఎక్కడ నివసించారో ఆ ప్రాంతానికి ముత్తయ్య వెళ్లి, విచారించారు. కానీ, అక్కడెలాంటి సమాచారం లభించలేదు.

వైద్య చికిత్స అందించిన కొన్ని నెలల తర్వాత.. ప్రకాశం మరింత స్పష్టంగా మాట్లాడారు.

తన స్వస్థలం విరుదునగర్ జిల్లాలోని పూమాలైపట్టి, ఆనైకుళం గ్రామానికి చెందిన వ్యక్తినని తెలిపారు. ఆ విషయాన్ని సుభాష్ చంద్ర, ముత్తయ్యకు తెలియజేశారు.

ఆ సమాచారం బట్టి, విరుదునగర్ జిల్లాలోని చాలామంది వ్యక్తుల దగ్గర విచారించారు. సుందరి సోదరి కూతురైన వాసుకితో మాట్లాడారు.

తన పిన్న తల్లి, మరో సోదరుడు ప్రభు కోయంబత్తూరులోని నీలాంబూర్, ఆచ్చాంకుళంలో స్థిరపడ్డారని వాసుకి చెప్పారు.

ఆ తర్వాత, సుందరిని కలిసిన ముత్తయ్య ఆమెకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీని తర్వాత, సుందరి చిన్న కొడుకు ప్రభును తీసుకుని ముత్తయ్య పంజాబ్‌కు వెళ్లారు.

ప్రభు, ముత్తయ్య, ప్రకాశం
ఫొటో క్యాప్షన్, పంజాబ్‌ నుంచి రక్షించిన తర్వాత ప్రభు (కుడివైపు), జర్నలిస్టు ముత్తయ్యతో (ఎడమవైపు) ప్రకాశం

తల్లి, కొడుకు కలిసేందుకు రెండు రాష్ట్రాల అధికారుల సాయం

సుభాష్ చందర్, చండీగఢ్ తమిళ సంఘం సహాయంతో సుందరి ప్రకాశంను కలిసినప్పుడు, సరైన పత్రాలను తీసుకువస్తే ప్రకాశంను లాంఛనంగా అప్పగిస్తామని అప్నా ఫర్స్ సేవా సొసైటీ కార్యనిర్వాహకులు చెప్పారు.

ఆ తర్వాత, ప్రకాశం తన కొడుకేనని నిరూపించే పత్రాలను పొందడానికి సుందరి కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌ వద్ద ఒక వినతిపత్రాన్ని దాఖలు చేశారు.

కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్‌కుమార్ గిరియప్పనవర్ ఆదేశాలతో.. పాఠశాల విద్యాశాఖ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు కలిసి సుందరి కుటుంబానికి సహాయం చేయడానికి ప్రకాశం చదివిన పాఠశాలలు, కార్పొరేషన్ కార్యాలయాల్లో అవసరమైన పత్రాల కోసం వెతికాయి.

ప్రకాశం చదివిన స్కూల్ నుంచి కొన్ని పత్రాలను వారు పొందారు.

విరుదునగర్ నుంచి కొంత సమాచారం పొందిన తర్వాత.. ప్రకాశం పేరుతో ఉన్న కుటుంబ కార్డు కాపీతో పాటు మిగిలిన పత్రాలను ఆధారం చేసుకుని కోయంబత్తూర్ జిల్లా కలెక్టర్ తరఫున పంజాబ్‌లోని పటియాలా జిల్లా డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్‌కు ఒక సిఫార్సు లేఖ రాశారు.

ఆ లేఖ, సహాయక పత్రాలతో.. సుందరిని తీసుకుని ముత్తయ్య జులై 25న రైలులో పంజాబ్ వెళ్లారు. ఆ వయసులో రైలు ప్రయాణం చాలా కష్టమైనప్పటికీ.. సుందరి మూడు రోజుల తర్వాత పటియాలా చేరుకున్నారు.

అక్కడ కొన్ని అధికారిక ప్రక్రియల తర్వాత.. ప్రకాశంను అధికారికంగా జులై 28న తల్లి సుందరికి అప్పజెప్పారు.

కొంతమంది వ్యక్తుల సాయంతో వారు తిరిగి విమానంలో కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు జిల్లా యంత్రాగానికి చెందిన అధికారులు వారికి స్వాగతం పలికారు.

సుందరి తన కొడుకుని తీసుకుని ఇంటికెళ్లారు. మీడియాలో ప్రకాశంకు సంబంధించిన వార్తలు వ్యాప్తి చెందిన తర్వాత.. ఆయన్ను చూడ్డానికి చాలామంది వచ్చారు. కానీ, ఎవరితోనూ ప్రకాశం సరిగ్గా మాట్లాడలేకపోయారు.

బీబీసీ ప్రకాశంతో మాట్లాడినప్పుడు, ఆయన మామూలుగా మాట్లాడలేకపోతున్నట్లు అర్ధమైంది. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిస్తూ మాట్లాడిన ప్రకాశం, "నేను మా అమ్మను చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబాన్ని మళ్లీ చూస్తానని నేను అనుకోలేదు" అని అన్నారు.

కొన్ని రోజుల్లో కోలుకుంటాడని ఆయనకు నమ్మకం ఉందని తల్లి సుందరి బీబీసీకి చెప్పారు.

ఆ సమయంలో బీబీసీతో మాట్లాడిన సుందరి.. ''నా కొడుకును జాగ్రత్తగా చూసుకోవడమే నా తొలి ప్రాధాన్యం. ఎలాంటి పనులకు పంపకుండా అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోబోతున్నా'' అని తెలిపారు.

తల్లి సుందరితో ప్రకాశం
ఫొటో క్యాప్షన్, తల్లి సుందరితో ప్రకాశం

గత వారం మళ్లీ మాట్లాడిన సుందరి, ''నా కొడుకును ఇప్పుడు చూస్తే మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అతను చాలా మెరుగయ్యాడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు'' అని చెప్పారు.

ఇలాంటి పరిస్థితిలో ప్రకాశం సెప్టెంబర్ 26 నుంచి మళ్లీ కనిపించకుండా పోయారు. సుందరి, ఆయన చిన్న కొడుకు ప్రభు చాలా ప్రాంతాల్లో ప్రకాశం కోసం వెతికారు. కానీ, కనుగొనలేకపోయారు. అందుకే, వారు నీలాంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదులో సెప్టెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి తన కుమారుడు కనిపించకుండా పోయారని సుందరి పేర్కొన్నారు.

"మా అబ్బాయి బాగానే ఉండేవాడు. ఇంట్లో తినడం, పడుకోవడం తప్ప అతనికి వేరే పనేమీ అప్పగించలేదు. అతను బాగానే ఉండేవాడు. కానీ చాలా సమయం తనలో తానే మాట్లాడుకునేవాడు. చాలా వరకు హిందీలోనే మాట్లాడేవాడు. అందుకే అతను ఏం మాట్లాడేవాడో నాకు తెలిసేది కాదు" అని సుందరి బీబీసీకి చెప్పారు.

''కనిపించకుండా పోయిన రోజు కూడా చాలా బాగా మాట్లాడాడు. మా ఇద్దరి వైపు పదేపదే చూశాడు. తను మనసులో ఏదో ఆలోచిస్తూ.. అలా చూస్తున్నాడని నాకు తెలియదు. ఆ రోజు అతన్ని అక్కడో, ఇక్కడో చూశామని చాలా మంది చెప్పారు. కానీ అతను ఎక్కడికి వెళ్లాడో వాళ్లు కనుక్కోలేకపోయారు. అతని మానసిక స్థితి కొంచెం అస్థిరంగా ఉంది. అతను మళ్లీ దొరుకుతాడని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ అతను దొరికితే, అతన్ని మానసిక ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయించాలి. నేను అతన్ని ఇక్కడ ఉంచను" అని సుందరి చెప్పారు.

ప్రకాశం కనిపించకుండా పోవడంపై సుందరి చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు నీలాంబూర్ పోలీసులు బీబీసీకి చెప్పారు. ఆయనకు సంబంధించిన సమాచారాన్ని, ఫోటోలను వివిధ పోలీస్ స్టేషన్లకు షేర్ చేసినట్లు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)