ఎల్‌పీయూ: ఓ అత్యాచార ఆరోపణ ఈ విశ్వవిద్యాలయాన్ని ఎలా అతలాకుతలం చేసింది? హాస్టళ్లు ఎందుకు ఖాళీ అయ్యాయి?

ఫొటో సోర్స్, Pardeep Sharma/BBC
- రచయిత, జోయా మతీన్, ఆజాదే మోషిరీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఒక విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలతో నిరసనలు వెల్లువెత్తాయి. ఇవి హింసాత్మకంగా మారడంతో వర్సిటీ తరగతులను నిలిపివేసింది.
యూనివర్శిటీలో గత వారం జరిగినట్లు చెబుతున్న ఈ అత్యాచార ఘటన వాస్తవమేనా కాదా అని నిర్ధరించుకునేందుకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ యాజమాన్యం తిరస్కరించింది.
తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు ఏ విద్యార్థినీ ముందుకు రాలేదని పోలీసులు చెబుతున్నారు.
దర్యాప్తు అధికారులు బాధితురాలిని గానీ, నిందితుడిని గానీ ఇంకా గుర్తించలేదు. ఇప్పటివరకు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజీలో కూడా దాడికి సంబంధించిన ఆధారాలేమీ లభించలేదు.
కానీ, దేశవిదేశాలకు చెందిన విద్యార్థులు చదువుకునే పంజాబ్‌లోని 600 ఎకరాల ఈ సువిశాల క్యాంపస్‌లో, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన పుకార్ల కారణంగా వారాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక చిన్న మిఠాయి దుకాణంతో వ్యాపారం ప్రారంభించిన ఒక కుటుంబం 2005లో ఈ ఎల్‌పీయూను స్థాపించింది. వేలాది మంది విద్యార్థులతో, హాస్టళ్లు, లెక్చర్ హాళ్లతో ఈ క్యాంపస్ ఒక ప్రత్యేక ప్రపంచంగా ఎదిగింది.
ఆందోళనలు విశ్వవిద్యాలయం గేట్లు దాటి బయటకు చేరడంతో, నిరసనకారులు వాహనాలకు నిప్పంటించడం, ప్రధాన రహదారిని దిగ్బంధించడం, పోలీసులు లాఠీలు ఝుళిపించడం లాంటి దృశ్యాలు ఫోటోలు, వీడియోలలో కనిపించాయి. పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి, పలువురు అధికారులకు గాయాలయ్యాయి. క్యాంపస్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
సోమవారం నాటికి రహదారి తిరిగి తెరుచుకుంది. క్యాంపస్ ప్రశాంతంగా మారినప్పటికీ, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని, నిరాధారమైనవని విశ్వవిద్యాలయ యాజమాన్యం అంటోంది. అయినప్పటికీ విద్యార్థుల్లో భయం పోలేదు. కొద్ది గంటల్లోనే హాస్టళ్లు ఖాళీ అయ్యాయి. ముఖ్యమైన పరీక్షలు వాయిదా వేశారు. విద్యార్థులను ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించారు.
నిరసన తెలుపుతున్న విద్యార్థుల డిమాండ్ల మేరకు, పోలీసులు "గుర్తుతెలియని వ్యక్తి"పై అత్యాచారం కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Pardeep Sharma/BBC
ఏం జరిగింది?
కొద్ది రోజుల క్రితం విశ్వవిద్యాలయ హాస్టళ్లలో ఒకదాని వద్ద లేదా హాస్టల్ సమీపంలో ఒక విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న వార్త వ్యాపించడంతో, సెప్టెంబర్ 27 తెల్లవారుజామున ఈ ఆందోళనలు మొదలయ్యాయి.
అనుమానితుడు ప్లంబర్, పెయింటర్ లేదా నిర్మాణ కార్మికుడు కావొచ్చని విద్యార్థులు, మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడి సెప్టెంబర్ 23న జరిగిందని, సమాచారం అందించినప్పటికీ వర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదని కొందరు విద్యార్థులు ఆరోపించారు.
ఈ ఆరోపణలకు సంబంధించిన మెసేజ్‌లు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయినట్లు బీబీసీ పంజాబీ గుర్తించింది. ఆ సందేశాలు వ్యాపించే కొద్దీ విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడారు.
చివరకు వందలాది మంది దిల్లీ, పంజాబ్ మధ్య కీలక మార్గమైన జాతీయ రహదారి 44 పైకి చేరుకుని, 15 గంటలకు పైగా ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఆదివారం సాయంత్రానికి వర్సిటీ ఆస్తులు ధ్వంసమయ్యాయి, పలు వస్తువులకు నిప్పంటించారు, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులపై లాఠీలు ఝుళిపిస్తున్న దృశ్యాలు వీడియోలలో కనిపించినప్పటికీ, తాము లాఠీఛార్జ్ చేయలేదని పోలీసులు చెప్పారు.
క్యాంపస్ గేట్ల లోపల ఉన్న విద్యార్థులు తాము ఆ రాత్రంతా భయంతో గడిపామని చెప్పారు.
"మేం కత్తులు, కత్తెరలు చేతబట్టుకుని కూర్చున్నాం" అని ఆర్య అనే విద్యార్థిని బీబీసీ పంజాబీతో చెప్పారు.
కొందరు తలుపులు బాదుతుండటంతో, విద్యార్థులంతా గదుల్లోకి వెళ్లి గడియలు పెట్టుకోవాలని తమకు సూచించినట్లు ఆమె తెలిపారు.
"ఎలాగోలా ఈ రాత్రి గడిచిపోతే ఇక్కడి నుంచి బయటపడదామని మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాం" అన్నారు.
ఆ తర్వాత పోలీసులు రావడంతో తాము కాస్త సురక్షితంగా భావించామని ఆర్య చెప్పారు.
"మా తల్లిదండ్రులు కూడా మేం వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు" అని ఆర్య తెలిపారు.

ఫొటో సోర్స్, BBC Punjabi
పోలీసులు కేసు ఎందుకు నమోదు చేశారు?
పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలన్నది నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటి.
"ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. కానీ, బాధితురాలి పేరును మాత్రం వారు మాకు చెప్పలేకపోయారు" అని పోలీసు ఉన్నతాధికారి నవీన్ సింగ్లా బీబీసీతో చెప్పారు.
అయినప్పటికీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై భారత అత్యాచార నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టేందుకు ఎఫ్‌ఐఆర్‌ను అధికారికంగా నమోదు చేస్తారు తప్ప, నేరం జరిగిపోయిందని ఇది నిర్ధరించదు.
దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారని సింగ్లా తెలిపారు. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక పరిశీలనలో బయటి వ్యక్తులెవరూ గదిలోకి వచ్చినట్లు కనిపించలేదని ఆయన బీబీసీకి వివరించారు.
"ప్రస్తుతానికి అత్యాచారం జరిగిందా లేదా అనేది నిర్ధరించలేం" అని ఆయన అన్నారు.
అయితే వారు ఫుటేజీని పరిశీలిస్తూనే ఉన్నారు.
"క్యాంపస్ చాలా పెద్దది కావడంతో అన్ని కెమెరాలను మేం ఇంకా చూడలేకపోయాం" అని సిన్హా సోమవారం విలేకరులతో చెప్పారు.
"విద్యార్థులు పేర్కొన్న ప్రాంతాలను ముందుగా పరిశీలించాం. అయితే ఈ వ్యవహారం మూలాల్లోకి వెళ్లి అసలు వాస్తవాన్ని వెలికితీస్తాం" అన్నారాయన.

ఫొటో సోర్స్, Pardeep Sharma/BBC
నిరసనలు అంత తీవ్రంగా ఎందుకు మారాయి?
దీనికి కచ్చితమైన కారణం చెప్పడం కష్టం. అత్యాచారం జరిగిందన్న ఆరోపణతో మొదలైన వ్యవహారం.. భద్రత, వర్సిటీ స్పందన, చివరకు చోటుచేసుకున్న హింసపై విస్తృత నిరసనగా వేగంగా మారిపోయింది.
క్యాంపస్‌లో ఉన్నది ఎవరనే విషయంపైనా గందరగోళం నెలకొంది. నిరసనలు శాంతియుతంగానే ప్రారంభమయ్యాయని, జరిగిన హింసలో కొంత భాగమైనా బయటి వ్యక్తుల పనేనని కొందరు విద్యార్థులు స్పష్టం చేశారు. ముసుగులు ధరించినవారు, అపరిచిత వ్యక్తులు వర్సిటీ లోపల కనిపించారని మరికొందరు బీబీసీ పంజాబీతో చెప్పారు.
"మేం నిజంగా భయపడ్డాం" అని పవన్ అనే విద్యార్థి చెప్పారు.
"అది పూర్తిగా ఒక యుద్ధరంగంలా మారిపోయింది" అన్నారు.
బయటి వ్యక్తులు మహిళా హాస్టల్‌లోకి చొరబడి, తాము పోలీసులమంటూ తలుపులు తట్టారని అనికేత్ సింగ్ అనే మరో విద్యార్థి తెలిపారు. గుంపుల్లో బయటి వ్యక్తులు ఉన్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. అయితే వారు ఎవరు, వారి పాత్ర ఏమిటన్నది ఇంకా నిర్ధరించాల్సి ఉందని చెప్పారు.
ఆ అయోమయ పరిస్థితుల నడుమ, అత్యాచార ఆరోపణలను కొట్టిపారేయడానికి వర్సిటీ చేసిన ప్రయత్నం మరో వివాదానికి దారితీసింది. ఆరోపణలు వచ్చిన హాస్టల్ గదిలో ఉండే ముగ్గురు విద్యార్థినుల వీడియోను సోమవారం ఎల్‌పీయూ విడుదల చేసింది. అక్కడ ఏమీ జరగలేదని, తమను ఇబ్బంది పెట్టడం ఆపాలని వారు ఆ వీడియోలో కోరారు.
అయితే ఏమి మాట్లాడాలో వర్సిటీ అధికారులే తమకు చెప్పారని, రికార్డింగ్‌ను ఎడిట్ చేసి తమ అనుమతి లేకుండానే పోస్ట్ చేశారని ఆ విద్యార్థినులే ఆ తర్వాత మరో వీడియోలో ఆరోపించారు. ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధరణ కాలేదు. విద్యార్థినుల ఆరోపణలపై ఎల్‌పీయూ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
నిరసనల సమయంలో ప్రచారంలోకి వచ్చిన మరో వాదన.. ఈ అత్యాచార ఆరోపణను తెలంగాణకు చెందిన ఎల్‌పీయూ విద్యార్థిని ఇటీవల చేసుకున్న ఆత్మహత్యతో ముడిపెట్టే ప్రయత్నం. ఆమె మృతిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని, ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉన్నట్లు ఎలాంటి నిర్ధరిత ఆధారాలూ లేవని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ప్రస్తుతానికి క్యాంపస్‌లో సాధారణ జీవనం స్తంభించింది. రెగ్యులర్ తరగతులను 10 రోజుల పాటు నిలిపివేశారు, పరీక్షలను వాయిదా వేశారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో మాట్లాడిన తర్వాత ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులకు సూచించారు.
అక్కడే ఉంటున్నవారు తమ నివాస గదుల్లోనే ఉండాలని, ఎలాంటి ఆందోళనలకు తావివ్వవద్దని స్పష్టం చేశారు.
పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఎఫ్‌ఐఆర్ కాపీ, దర్యాప్తు వివరాలతో పాటు విద్యార్థుల భద్రతకు చేపట్టిన ఏర్పాట్ల సమాచారాన్ని కోరింది.
ప్రస్తుతం ఈ దర్యాప్తు రెండు వేర్వేరు ప్రశ్నలకు సమాధానం కనుగొనాల్సి ఉంది:
నిరసనలకు కారణమైన ఆ దాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
ఆ తర్వాత చెలరేగిన హింసకు ఎవరు బాధ్యులు?
సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఎల్‌పీయూ ప్రో-ఛాన్సలర్ రష్మీ మిట్టల్.. సమస్యలను వర్సిటీ దృష్టికి తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, వాటిని కాదని విద్యార్థులు "వ్యాపిస్తున్న పుకార్లను నమ్మడం" తనను బాధించిందని చెప్పారు. ఆందోళనల్లో బయటి వ్యక్తులు కూడా చేరారని ఆమె ఆరోపించారు.
"మా విద్యార్థులు ఇలా చేయలేరని నేను భావిస్తున్నాను" అని రష్మీ మిట్టల్ పేర్కొన్నారు.
(అదనపు రిపోర్టింగ్: హర్‌మన్‌దీప్ సింగ్, బీబీసీ పంజాబీ)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























