హనుమాన్ అంశ్: ఈ సినిమా బడ్జెట్ 'రూ.2 కోట్లలోపే, వసూళ్లు మాత్రం రూ.300 కోట్లకు చేరువగా ఉన్నాయి... ఇంతకీ 'నీమ్ కరోలీ బాబా' కథలో ఏముంది?

నీమ్ కరోలీ బాబా
ఫొటో క్యాప్షన్, నీమ్ కరోలీ బాబా పాత్రను శోభనవ్ సత్య పోషించారు.
    • రచయిత, అభిషేక్ ప్రతాప్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

'హనుమాన్ అంశ్'

దాదాపు ఐదు దశాబ్దాల కిందట కన్నుమూసిన ఒక సాధువు, ఉత్తరాఖండ్ కొండల్లో వెలసిన ఆయన ఆశ్రమం, ఆ సాధువు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా.

పెద్ద హిందీ సినిమాల స్థాయిలో దీనికి శుభారంభం లభించలేదు. కానీ, ఈ సినిమా తర్వాత్తర్వాత సంచనాలను నమోదు చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద 'హనుమాన్ అంశ్' మంచి వసూళ్లు రాబడుతోంది.

సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ప్రకారం, ఈ సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్ల వైపు పరుగెడుతోంది. గురువారం నాటికి ఈ చిత్రం రూ. 272.23 కోట్లు వసూలు చేసిందని 'ఎక్స్'లో ఆయన పోస్ట్ చేశారు.

ఈ సినిమా ఈజీగా రూ. 350 కోట్ల మార్కును దాటుతుందని సినీ విమర్శకుడు కోమల్ నహతా చెబుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువేనని బీబీసీతో నిర్మాత అనుప్రియా నాగార్ చెప్పారు. అందుకే ఈ సినిమా స్థాయి, దానికి వస్తున్న వసూళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'నీమ్ కరోలీ బాబా' (అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ)గా చాలామందికి తెలిసిన నీమ్ కరౌరీ బాబా జీవితం, ఆయనకు సంబంధించిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిందే 'హనుమాన్ అంశ్'. బాబాతో తనకు జరిగిన పరిచయం గురించి భోస్లే అనే వ్యక్తి తన మనవడికి చెప్పడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథ బాబా బాల్యానికి చేరుకుంటుంది.

తల్లి మరణం తర్వాత లక్ష్మణ్ నారాయణ్ ఇల్లు వదిలిపెట్టినట్లు సినిమాలో చూపించారు. దేవుడిని చేరుకుంటే బహుశా మళ్లీ తన తల్లిని కలుసుకోవచ్చని ఆయన భావిస్తారు.

ఆ తర్వాతి క్రమంలో ఆయన అన్వేషణ ప్రజలకు సాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం లాంటి కార్యక్రమాలతో ముడిపడిపోతుంది. సినిమాలో 'నీమ్ కరోలీ బాబా' పాత్రను శోభినవ్ సత్య పోషించారు. నటన పరంగా శోభినవ్ సత్యకు ప్రశంసలు దక్కాయి.

నీమ్ కరోలీ ధామ్, హనుమాన్ అంశ్, నీమ్ కరోలీ బాబా, కైంచీ ధామ్‌
ఫొటో క్యాప్షన్, నీమ్ కరోలీ బాబా చిత్రపటాలు (ఫైల్ ఫోటో)

సినిమాలో ఏం చూపించారు?

నటుడిగా 'నీమ్ కరోలీ బాబా' పాత్రలో ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేది శోభినవ్ సత్యకు ఒక పెద్ద సవాలని, అయితే ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశాడని అర్థమవుతోందని నిర్మాత అనుప్రియా నాగార్ బీబీసీతో అన్నారు.

శోభినవ్ తన ముఖకవళికలు, హావభావాలు, మౌనంతో ఆ పాత్రను మరింత ప్రభావవంతంగా మార్చారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' లో సినీ విమర్శకురాలు శుభ్రా గుప్తా వివరించారు.

'స్క్రీన్‌ప్లేను చక్కగా తీర్చిదిద్దారు, కథ సాగిన కాలంలోనే ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది. సినిమాలో నటించిన వారు చాలా బాగా తమ పాత్రలు పోషించారు' అని ఆమె తెలిపారు.

నిర్మాతల విషయానికొస్తే, రాగిణి సోనా ముందు నుంచీ ఈ సినిమా కోసం పట్టుదలగా పని చేశారు. 2004లో వచ్చిన 'కౌన్ హై జో సప్నో మే ఆయా', 'షుక్రియా', 2005లో వచ్చిన 'చాక్లెట్' సినిమాలతో ఆమెకు గుర్తింపు ఉంది. ఆ సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.

'హనుమాన్ అంశ్' చిత్రాన్ని థియేటర్లలో నడిపించడంలో రాగిణి కీలక పాత్ర పోషించారు.

రెండోవారంలో సినిమా ఆడుతున్న థియేటర్ల సంఖ్య బాగా తగ్గిపోయిందని, దీంతో తనతో పాటు, విశాల్ చతుర్వేది కలిసి సినిమాకు ప్రమోషన్ పెంచాలని నిర్ణయించుకున్నట్లు స్క్రీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాగిణి తెలిపారు.

ఈ సినిమా మరో నిర్మాత నమ్రతా సింగ్. ఆమెకు డిజిటల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పనిచేసిన అనుభవం ఉంది. చిత్ర బృందం మొదటి నుంచి ఈ కథను మూడు భాగాలుగా (మూడు సినిమాల్లో) చూపించాలనుకుందని బాలీవుడ్ హంగామాతో నమ్రతా సింగ్ వెల్లడించారు.

నమ్రతా సింగ్ చెప్పినదాని ప్రకారం, మొదటి భాగం షూటింగ్ 22 రోజుల్లోనే పూర్తయింది. ఇందులో రెండు రోజులు ముంబయిలో జరగ్గా, మిగతా షూటింగ్ అంతా చిత్రకూట్‌లో చేశారు.

నీమ్ కరోలీ ధామ్, హనుమాన్ అంశ్, నీమ్ కరోలీ బాబా, కైంచీ ధామ్‌
ఫొటో క్యాప్షన్, 'హనుమాన్ అంశ్' చిత్ర దర్శకుడు విశాల్ చతుర్వేది, నిర్మాత అనుప్రియా నాగార్

సినిమా పాట వైరల్

ఈ సినిమాలో సునీల్ లోధీ పాడిన ఒక పాట ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. లోధీకి రెండు కళ్లు కనిపించవు. ఇంటర్నెట్‌లో ఆయన పాట వైరల్ అయిన తర్వాత, పలువురు రాజకీయ నాయకులు, నటీనటులు ఆయన్ను కలిసి అభినందించారు.

ఒక ఇంటర్వ్యూ ప్రకారం, సునీల్ కళ్ల చికిత్స కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

భక్తి, సాధువుల జీవితాలు, విశ్వాసాల నేపథ్యంతో తెరకెక్కిన అనేక భారత సినిమాలు బాక్సాఫీస్ వద్ద చక్కని పెర్ఫార్మెన్స్ కనబరిచాయి. ఉదాహరణకు, 2024లో విడుదలైన 'హను-మాన్' చిత్రం, 2025లో విడుదలైన 'మహావతార్ నరసింహ' సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. మతం, విశ్వాసాలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి.

నీమ్ కరోలీ ధామ్, హనుమాన్ అంశ్, నీమ్ కరోలీ బాబా, కైంచీ ధామ్‌
ఫొటో క్యాప్షన్, నీమ్ కరౌరీ బాబా, కైంచీ ధామ్ ఆశ్రమం (ఫైల్ ఫోటో)

'నీమ్ కరోలీ బాబా' జన్మస్థలం

సెప్టెంబర్ 2026లో, 'నీమ్ కరోలీ బాబా'కు సంబంధించిన ప్రదేశాలను ఒక ఆధ్యాత్మిక పర్యటక మార్గంగా (సర్క్యూట్) అనుసంధానించే ప్రణాళికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ప్రతిపాదిత సర్క్యూట్‌లో ఫిరోజాబాద్‌లోని అక్బర్‌పూర్, ఫరూఖాబాద్‌లోని నీమ్ కరోలీ ధామ్, లఖ్‌నవూలోని హనుమాన్ సేతు ఆలయం, బృందావనంలో బాబాతో ముడిపడి ఉన్న ప్రదేశాలు ఉన్నాయి.

'హనుమాన్ అంశ్' సినిమా సాధించిన విజయం.. ఆయనతో ముడిపడిన ప్రదేశాలు, చరిత్ర పట్ల ప్రజల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తించిన తరుణంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

ఇదే అక్బర్‌పూర్‌లో బాబా పూర్వీకుల ఇంటికి సంబంధించి ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఆస్తిని తమ నియంత్రణలోకి తీసుకున్నారంటూ ఒక ట్రస్ట్‌పై ఆరోపణలు చేస్తూ ఆయన ఆరుగురు మనవరాళ్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. అయితే, ట్రస్ట్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ వాదనలపై దర్యాప్తు చేసేందుకు ఫిరోజాబాద్ యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ దర్యాప్తు కొనసాగుతోంది.

నీమ్ కరోలీ ధామ్, హనుమాన్ అంశ్, నీమ్ కరోలీ బాబా, కైంచీ ధామ్‌
ఫొటో క్యాప్షన్, ‘నీమ్ కరోలీ ధామ్’ ఆశ్రమం ప్రధాన ద్వారం ఫోటో

బాబాపై కొత్త తరానికి ఇంత ఆసక్తి ఎందుకు?

ఈ ప్రశ్నకు సూటిగా ఎలాంటి సమాధానం లేదు. కానీ, అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రామ్‌దాస్, కృష్ణ‌దాస్, లారీ బ్రిలియంట్ ద్వారా ఏర్పడిన దశాబ్దాల నాటి అంతర్జాతీయ వారసత్వం ఉంది. మరోవైపు స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్‌లతో ముడిపడిన కథలు ఆధారాలతో సహా ఉన్నాయి.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లాంటి ప్రముఖులు అక్కడికి వెళ్లడం, ఇదే తరుణంలో 'హనుమాన్ అంశ్' లాంటి సినిమాలు కూడా ఈ ప్రచారంలో భాగమైపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)