ఆడ తోడు కోసం 4 వేల కి.మీ.లు సాగిన మూడు ఆఫ్రికన్ మగ అడవి కుక్కల అసాధారణ యాత్ర..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
జాంబియాలో ఆఫ్రికన్ అడవి కుక్కల గుంపు ఒకటి రికార్డు స్థాయిలో 2,485 మైళ్ల (సుమారు 4వేల కిలోమీటర్లు) ప్రయాణాన్ని పూర్తి చేసింది.
ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకు రికార్డైన వాటిలో నేలపై నడిచే జంతువు తోడు కోసం ఇంత దూరం ప్రయాణించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అటవీ ప్రాంతాల్లోకి మనుషుల విస్తరణ పెరుగుతున్నప్పటికీ వన్యప్రాణులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవని ఈ సంఘటన నిరూపిస్తోంది.
మూడు మగ అడవి కుక్కలు (అన్నాతమ్ముళ్లు) జాంబియా అంతటా వంకరటింకరగా ప్రయాణిస్తూ మానవ నివాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దాటుకుంటూ ప్రధాన నగరాల వంటి అడ్డంకులను అధిగమించి తమ ప్రయాణాన్ని సాగించాయి.
మరికొన్ని అడవి కుక్కలు వేటగాళ్లు అక్రమంగా వేసిన ఉచ్చులలో చిక్కుకుని మరణించినట్లు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించిన ఈ అధ్యయనంలో తేలింది. ఇది అవి ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఎత్తిచూపుతోంది.

మరో మూడు ఆడ అడవి కుక్కలు (అక్కాచెల్లెళ్లు) కూడా ఇలాంటి అసాధారణ ప్రయాణాన్ని దాదాపు పూర్తి చేసే దశకు చేరుకున్నాయి.
కానీ వాటిలో ఒకటి ఉచ్చులో చిక్కుకోవడంతో వాటి ప్రయాణం ఆగిపోయింది.
ఆఫ్రికన్ అడవి కుక్కలు భూమిపై ఉన్న అత్యంత అరుదైన వన్యప్రాణులుగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం అడవులలో కేవలం 6వేల అడవి కుక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Education Images/Universal Images Group/Getty Images
ఇవి గుంపులుగా జీవిస్తాయి. కలిసి వేటాడతాయి. కొత్త భూభాగాలు, ఇతర గుంపులతో జతకట్టే అవకాశాల కోసం ఇవి విస్తృతంగా తిరుగుతుంటాయి.
అవి పుట్టిన గుంపులోనే జతకట్టడం (వంశవృద్ధి) సాధ్యం కాదు. కాబట్టి, అవి తమ గుంపులోనే ఉండి పెద్దవయ్యాక ఆ గుంపుపై పట్టు సాధించాలి లేదా రెండు మూడు సంవత్సరాల వయసు రాగానే జోడు కోసం కొత్త ప్రాంతాలకు బయలుదేరాలి.
ఆ మూడు మగ కుక్కలు వాస్తవంగా అవి బయల్దేరిన ప్రాంతం నుంచి చేరుకున్న ప్రాంతం వరకు చూస్తే అవి 8 నెలల్లో 260 మైళ్లు (418 కిలోమీటర్లు) మాత్రమే ప్రయాణించాయి. అయితే అవి వంకర టింకరగా, వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించడం వల్ల మొత్తం మీద దాదాపు 10 రెట్లు ఎక్కువ దూరం తిరగాల్సి వచ్చింది.
ఇలాంటి ప్రయాణాలను "డిస్పర్సల్స్" అంటారు. అంటే జోడు కోసం ఒక వైపు మాత్రమే ప్రయాణించడం. ఇది 'వలసల' కంటే భిన్నమైనది. వలసలలో జంతువులు ఆహారం లేదా వాతావరణం కోసం కాలాలకు అనుగుణంగా ఏదో ఒక దిక్కుకు ప్రయాణిస్తాయి.
ఆఫ్రికాలో అత్యంత సుదీర్ఘమైన వలసలుగా వైల్డ్‌బీస్ట్‌ల' ప్రయాణాన్ని పేర్కొంటారు. ఇవి సీజన్లలో నీరు మేత కోసం టాంజానియా- కెన్యా మధ్య 400 మైళ్లకు పైగా ప్రయాణిస్తాయని యూఎన్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'కారిబో' (ఒక రకమైన జింకలు) జంతువులు భూమిపై అత్యంత సుదీర్ఘమైన వలస ప్రయాణం చేస్తాయి.
రావడం, పోవడం కలిపి ఇవి 839 మైళ్లు( 1350 కిలోమీటర్లు) ప్రయాణిస్తాయి. అలాగే బూడిద రంగు తోడేళ్లు ఏడాదిలో 4,350 మైళ్లకు పైగా ప్రయాణించినట్లు రికార్డులు ఉన్నాయి.
అయితే, ఇక్కడ దూరం కంటే కూడా ఆ అడవి కుక్కలు జాంబియా గుండా ప్రయాణించడానికి ఎంచుకున్న మార్గం ముఖ్యమైనది.
అవి వన్యప్రాణుల ప్రధాన కేంద్రాల గుండా ప్రయాణించాయి. రాజధాని లుసాకాతో పాటు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మనుషుల రద్దీని చాలా చాకచక్యంగా తప్పించుకుంటూ సాగాయి.

ఫొటో సోర్స్, Jacopo Raule/Getty Images
తూర్పు, దక్షిణ ఆఫ్రికాలోని అడవి కుక్కలు గతంలో భావించిన దాని కంటే ఎక్కువగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండే అవకాశం ఉందని తాజా అధ్యయనం సూచిస్తోంది.
మొంటానా స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఈ పరిశోధనా పత్రం ప్రధాన రచయిత స్కాట్ క్రీల్ 1991 నుంచి ఆఫ్రికన్ అడవి కుక్కలపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ అధ్యయనం ఒక కొత్త ఆశను కలిగిస్తోందని ఆయన అన్నారు.
"కంచెలు వేసిన ప్రాంతాలు మినహా తూర్పు దక్షిణ ఆఫ్రికాలో అడవి కుక్కల గుంపు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండే అవకాశం ఉందని నమ్మడానికి బలమైన కారణాలు ఉన్నాయి" అని ఆయన పేర్కొన్నారు.
వేటగాళ్ల వల్ల వాటికి పొంచి ఉన్న ముప్పు గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ అసాధారణ ప్రయాణాన్ని మూడు మగ అడవి కుక్కలు విజయవంతంగా పూర్తి చేయగా మూడు ఆడ కుక్కలలో రెండు మరణించాయి.
గుంపులో మిగిలి ఉన్న కుక్కలు పదే పదే ఒకే ప్రదేశానికి తిరిగి వస్తున్న తీరును పరిశోధకులు గుర్తించారు.
తోటి జంతువు మరణించినప్పుడు అవి సాధారణంగా ఇలాంటి ప్రవర్తనను ప్రదర్శిస్తున్నాయి.
రోడ్లు, పట్టణాలు లేదా పొలాల వల్ల ముక్కలైపోయిన వన్యప్రాణి ప్రాంతాలను కలుపుతూ సంరక్షిత ప్రాంతాల వెలుపల సహజ భూభాగాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు 'ఎకాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఈ పరిశోధనా పత్రం సహ-రచయిత ది నేచర్ కన్సర్వెన్సీ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ కాఫ్యూ కన్సర్వేషన్ డైరెక్టర్ బ్రూస్ ఎలెండర్.
‘‘అడవి కుక్కలు, ఏనుగుల వంటి పెద్ద ప్రాంతాలలో సంచరించే జంతువులు భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే పరస్పరం అనుసంధానమైన భూభాగాలు ఎంతో అవసరం’’ అని బ్రూస్ ఎలెండర్ చెప్పారు.
"మనం ఈ సంరక్షిత ప్రాంతాలను ముక్కలైన ద్వీపాలుగా చూడలేము. అలా చూస్తే అవి దీర్ఘకాలంలో మనుగడ సాగించలేవు. మనం దీనికంటే చాలా విస్తృతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























