చూడటానికి పెంపుడు పిల్లిలానే ఉంది కదా అనుకున్నారు... కానీ పెరిగి పెద్దదైన కొద్దీ మామూలు పిల్లి కాదని అర్థమైంది...

ఫొటో సోర్స్, Paola Nogales-Ascarrunz / Julie Van Collie
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, పర్యావరణ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
బొలీవియా అడవుల్లో గుర్తించిన ఓ మచ్చల పిల్లిని సరికొత్త జాతిగా శాస్త్రవేత్తలు నిర్ధరించారు.
పెంపుడు పిల్లి సైజులో ఉండి, ఇతర అడవి పిల్లుల తరహాలోనే దీని శరీరంపై కూడా చారలు, మచ్చలు ఉండటంతో దీన్నొక ప్రత్యేక జాతిగా ఎవరూ గుర్తించలేదు.
అయితే, డీఎన్ఏ పరిశోధనల్లో ఇది ఇతర పిల్లిజాతులకు భిన్నమైనదని తేలింది. ఈ కొత్త జాతిని గుర్తించడం ద్వారా ప్రపంచంలోని అరుదైన క్షీరదాల గురించి మనకు ఎంత తక్కువ తెలుసో తెలుపుతోంది.
ఈ కొత్త జాతి గుర్తింపుతో టైగర్ క్యాట్స్ పరిరక్షణపై దృష్టి పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

దక్షిణ, మధ్య అమెరికాల్లో సంచరించే చిన్న అడవి పిల్లుల సమూహాన్ని టైగర్ క్యాట్స్ అంటారు. దగ్గరి జాతులైన సింహాలు, చిరుతపులులు, పులులతో పోలిస్తే వీటిపై ప్రజల దృష్టి తక్కువగా ఉంది.
టైగర్ క్యాట్స్ మధ్య, దక్షిణ అమెరికా అంతటా కనిపించే చిన్న మచ్చలున్న అడవి పిల్లులు. వీటి విస్తృతి కోస్టారికా నుంచి బొలీవియా, అర్జెంటీనా వరకు ఉంది.
అవన్నీ దాదాపు ఒకేలా ఉండటంతో వాటిని వేరువేరు జాతులుగా గుర్తించడం నిపుణులకు కూడా కొన్నిసార్లు కష్టమే.

ఫొటో సోర్స్, Paola Nogales-Ascarrunz / Julie Van Collie
‘మన ప్రపంచానికి ఒక కొత్త జాతి లభించింది’
""ప్రపంచానికి ఒక కొత్త జాతి లభించడం అద్భుతమైన విషయం. ఆ జాతి పేరు 'లియోపార్డస్ తీల్కాయో' అని బొలీవియాలోని యూనివర్సిడాడ్ మేయర్ డి సాన్ ఆండ్రీస్‌కి చెందిన పవోలా నొగాలిస్ ఆస్కరూన్జ్ తెలిపారు.
"ఇప్పటికీ కనుగొనాల్సిన జాతులు ఎన్నో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇలాంటి వాటిని కనుక్కోవడానికి ఇక అగ్నిపర్వతాలు, ద్వీపాలు, సముద్ర గర్భాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు" అని ఆమె అన్నారు.
ప్రస్తుతానికి ఈ జాతికి సంబంధించి జీవించి ఉన్న ఒక్క పిల్లిని మాత్రమే కనుగొన్నారు. అది బొలీవియాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉంది. ఇలాంటి పిల్లులు మరికొన్ని ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
‘టిగ్రినో’ అనే ముద్దుపేరుతో పిలిచే ఈ పదేళ్ల పిల్లి శాస్త్రవేత్తలను అలాంటి కొత్త పరిశోధనలవైపు నడిపిస్తోంది.
ఈ పిల్లి మిగిలినవాటికన్నా భిన్నంగా ఉందని మొదటగా డాక్టర్ నొగాలిస్ ఆస్కరూన్జ్ అనే బొలీవియా శాస్త్రవేత్త గుర్తించారు. ఆ సమయంలో ఆమె సంరక్షణ కేంద్రంలో స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేస్తున్నారు.
ఓ స్థానిక వ్యక్తి ఈ పిల్లిని అడవిలో గుర్తించాడు. ముందు పెంపుడు పిల్లిపిల్లలా ఉందనుకున్నాడు. కానీ, అది పెరిగే కొద్దీ దాని ప్రవర్తన పెంపుడు పిల్లిలా లేదని స్పష్టమైంది.
బొలీవియాలోని యూంగాస్ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవిలో ఇలాంటి చిన్న అడవి పిల్లుల గురించి డాక్టర్ నొగాలిస్ గతంలోనే విన్నారు. కానీ, శాస్త్రవేత్తలు వాటిపై ఎలాంటి పరిశోధన జరపలేదు.
ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులతో కలిసి నొగాలిస్ పనిచేశారు. జీవించి ఉన్న జంతువులు సహా మ్యూజియంలో ఉండే నమూనాల సహాయంతో టైగర్ క్యాట్స్ కుటుంబ చరిత్రపై అధ్యయనం చేశారు.
"దీనికి సంబంధించిన సమాచారం లేదా చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి, మ్యూజియంలో కూడా ఎలాంటి నమూనా లేదు. కాబట్టి దీని కోసం ఎవరూ వెతకకపోవడం వల్లే ఇది ఇన్నాళ్లు మన దృష్టికి రాలేదు" అని బ్రెజిల్‌లోని పొంటిఫికల్ కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ రియో గ్రాండే డో సుల్‌కు చెందిన జన్యుశాస్త్ర నిపుణుడు ఎడ్వర్డో ఐజిరిక్ అన్నారు.
కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటివరకు భావించినట్లు టైగర్ క్యాట్స్‌లో మూడు జాతులు కాకుండా ఐదు జాతులు ఉండవచ్చని తేలింది. వీటిలో బొలీవియాకు చెందిన కొత్తగా గుర్తించిన లియోపార్డస్ తీల్కాయో కూడా ఒకటి.
అయితే ఒక కొత్త జాతిని గుర్తించడం కేవలం తొలి అడుగు మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ రీసెర్చ్ యూనిట్ సహ-పరిశోధకురాలు డాక్టర్ కరోలిన్ సార్టర్ మాట్లాడుతూ.. "ఒక జీవి ఏమిటో లేదా అది ఎక్కడ నివసిస్తుందో మనకు తెలియకపోతే, దానిని రక్షించడం అసాధ్యం. అందుకే సంరక్షణ పరంగా ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనది" అని చెప్పారు.
"ఇవి పెంపుడు పిల్లి పరిమాణంలో ఉండే జంతువులు, కాబట్టి ఇప్పటికే వీటి గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలని అనిపించవచ్చు. కానీ, ప్రపంచంలో చాలా తక్కువగా పరిశోధన జరిగిన కొన్ని ప్రాంతాలలో ఇంకా ఎంత జీవవైవిధ్యం దాగి ఉందో ఈ ఆవిష్కరణ మనకు తెలియజేస్తోంది" అని ఆమె అన్నారు.
అడవుల నరికివేత, నివాస స్థలాలు కోల్పోవడం, అక్రమ వేటల కారణంగా టైగర్ క్యాట్ జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. . అయితే కొత్తగా గుర్తించిన ఈ జాతి గతంలో జరిగిన పరిరక్షణ అంచనాల్లో లేదు.
ఈ ఆవిష్కరణ ప్రపంచంలోని పిల్లి జాతులపై మరింత విస్తృతమైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది.
అడవి పిల్లులు, పెంపుడు పిల్లులు రెండూ ఫెలిడే అనే జీవశాస్త్ర కుటుంబానికి చెందినవే. ఇందులో పెంపుడు పిల్లుల నుంచి భారీ పులుల వరకు ప్రస్తుతం జీవించి ఉన్న అన్ని పిల్లి జాతులన్నీ ఈ కుటుంబంలోనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం అధికారికంగా 41 పిల్లి జాతులు ఉన్నట్లు గుర్తించారు. అయితే కొత్త జాతి ఆవిష్కరణతో పాటు టైగర్ క్యాట్స్‌లో కూడా మరికొన్ని ప్రత్యేక జాతులు ఉండవచ్చన్న తాజా నిర్థరణల కారణంగా ఈ సంఖ్య 44 లేదా అంతకంటే ఎక్కువకు చేరవచ్చు.
ఈ పరిశోధనలో పాలుపంచుకోని నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్‌కు చెందిన క్షీరదాల నిపుణుడు ఆండ్రూ కిచెనర్ మాట్లాడుతూ, టైగర్ క్యాట్స్‌గా పిలిచే ఈ చిన్న మచ్చలున్న దక్షిణ అమెరికా పిల్లులు వర్గీకరణపరంగా చాలా కాలంగా పెద్ద గందరగోళానికి కారణమవుతున్నాయని అన్నారు.
"ఈ పిల్లులు చూడటానికి ఒకేలా ఉండటం, మ్యూజియంలలో వీటి నమూనాలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇవి గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. అందుకే జన్యు పరిశోధనల ద్వారా మరిన్ని జాతులు బయటపడుతున్న కొద్దీ, వాటిని ఒకదానికొకటి ఎలా వేరు చేయాలో ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాం" అని ఆండ్రూ కిచెనర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























