బొల్లి - విటిలిగో: చేపలు తిన్న తర్వాత పాలు తాగితే ఈ వ్యాధి వస్తుందా? అపోహలు - సమాధానాలు

బొల్లి, చర్యవ్యాధులు, చికిత్స, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ప్రతి సంవత్సరం జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ విటిలిగో డే / ప్రపంచ బొల్లి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రముఖ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ విటిలిగో బాధితుడు అని చాలా మందికి తెలిసిందే. ఆయన గుర్తుగా, ఆయన చనిపోయిన రోజు అయిన జూన్ 25‌ను వరల్డ్ విటిలిగో డేగా ప్రకటించారు.

ప్రపంచ బొల్లి అవగాహన దినోత్సవ ఆలోచనకు 2011లో నైజీరియాలో ఆచరణాత్మక రూపం లభించింది.

బొల్లి వ్యాధితో బాధపడుతున్న ఓగో మాడువేసి, విటిలిగో సపోర్ట్ అండ్ అవేర్‌నెస్ ఫౌండేషన్ (VITSAF) వ్యవస్థాపకురాలిగా, "పర్పుల్ ఫన్ డే" పేరుతో స్వతంత్రంగా ఒక అవగాహన ఉద్యమాన్ని జూన్ 25 న ప్రారంభించారు.

ఈ కార్యక్రమం తర్వాత, ప్రపంచ బొల్లి దినోత్సవ ఉద్యమానికి బలమైన పునాదిగా నిలిచింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విటిలిగో/ బొల్లి వ్యాధి అంటే ఏంటి?

ఈ ఏడాది ప్రపంచ బొల్లి దినోత్సవం 2026 (world vitiligo day 2026) థీమ్: "అపోహల నుంచి ఆత్మ విశ్వాసం వైపు"

విటిలిగో వ్యాధి ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సామాజిక వివక్ష, అపోహలు, మానసిక ఒత్తిడిని అధిగమించి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి అనే సందేశాన్ని ఈ ఏడాది థీమ్ ఇస్తుంది.

మన చర్మం రంగు మెలనిన్ అనే పిగ్మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ మెలనిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను మెలనోసైట్స్ (Melanocytes) అంటారు. కొన్ని కారణాల వల్ల ఈ కణాలు చనిపోయినపుడు లేదా పనిచేయడం ఆపినప్పుడు చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ పరిస్థితినే బొల్లి వ్యాధి లేదా విటిలిగో అంటారు.

ఇది ఏ వయస్సులోనైనా రావచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. ప్రపంచ జనాభాలో సుమారు 0.5 నుంచి 2 శాతం మందిలో ఈ వ్యాధి కనిపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

భారత్‌లో బొల్లి వ్యాధి ప్రాబల్యం సుమారు 0.25% నుంచి 2.5% మధ్య ఉండవచ్చని అంచనా. భారత్‌లోని 21 రాష్ట్రాల్లో 30 వైద్య కళాశాలల్లో నిర్వహించిన అధ్యయనంలో ఆసుపత్రులకు వచ్చిన రోగుల్లో మహిళల్లో (0.93%) పురుషుల కంటే (0.86%) కొద్దిగా ఎక్కువగా కనిపించింది.

బొల్లి, చర్యవ్యాధులు, చికిత్స, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మగవారితో పోలిస్తే మహిళల్లో బొల్లి వ్యాధి కొంచెం ఎక్కువ ఉంది.

విటిలిగో రావడానికి కారణాలు

బొల్లి వ్యాధికి కచ్చితమైన ఒక్క కారణం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే, కొన్ని అంశాలు దీనికి కారణమవుతాయని భావిస్తున్నారు.

1. ఆటోఇమ్యూన్ కారణాలు

మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మెలనోసైట్స్‌ను శత్రువులుగా గుర్తించి వాటిని నాశనం చేయడం వలన విటిలిగో రావొచ్చు అని భావిస్తున్నారు.

2. జన్యుపరమైన ప్రభావం

కుటుంబంలో ఎవరికైనా బొల్లి వ్యాధి ఉంటే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది.

3. మానసిక ఒత్తిడి

అధిక మానసిక ఒత్తిడి, భావోద్వేగ సంఘటనలు, ఆందోళన వంటి పరిస్థితులు కొందరిలో వ్యాధి ప్రారంభం కావడానికి లేదా వేగంగా వ్యాపించడానికి కారణమవుతాయి.

4. నాడీ సంబంధిత కారణాలు

కొన్ని నాడీ రసాయనాలు (Neurochemicals) మెలనోసైట్స్‌పై ప్రతికూల ప్రభావం చూపి బొల్లి వ్యాధిని ప్రేరేపించవచ్చని భావిస్తున్నారు.

5. ఆక్సిడేటివ్ ఒత్తిడి

శరీరంలో ఫ్రీ రాడికల్స్ అధికంగా ఉత్పత్తి అయితే మెలనోసైట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

6. కొన్ని రకాల పర్యావరణ కారణాలు

ఉదాహరణకు చర్మ గాయాలు, కాలిన గాయాలు, కొన్ని రకాల రసాయనాలు, అధిక సూర్యరశ్మి , చర్మంపై పదేపదే రాపిడి వంటి అంశాలు బొల్లి వ్యాధిని ప్రేరేపించవచ్చు.

ఇతర ఆటోఇమ్యూన్ వ్యాధులు అయిన థైరాయిడ్ వ్యాధులు, టైప్-1 మధుమేహం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి బొల్లి వ్యాధికి సంబంధం ఉండవచ్చు.

బొల్లి, చర్యవ్యాధులు, చికిత్స, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బొల్లి అంటు వ్యాధి కాదని వైద్యులు చెప్పారు.

బొల్లి లక్షణాలు ఎలా ఉంటాయంటే...

  • చర్మంపై ముఖ్యంగా ముఖం, కళ్ల చుట్టూ, పెదవుల చుట్టూ, వేళ్లు, చేతులు, మోచేతులు, మోకాళ్లు, పాదాలు, జననేంద్రియాల ప్రాంతంలో తెల్లటి మచ్చలు.
  • తల వెంట్రుకలు తెల్లబడటం
  • కనుబొమ్మలు, గడ్డం వెంట్రుకలు తెల్లబడటం
  • నోటి లోపలి భాగం తెలుపు రంగులోకి మారడం

విటిలిగో వచ్చిన ప్రాంతంలో సాధారణంగా నొప్పి, దురద ఉండదు. అయితే కొందరిలో ప్రారంభ దశలో స్వల్ప దురద ఉండవచ్చు.

మన సమాజంలో ఇప్పటికీ ఈ బొల్లి వ్యాధిపై అనేక అపోహలు, అపార్థాలు ఉన్నాయి. శరీరంపై తెల్లటి మచ్చలు కనిపించగానే చాలా మంది భయపడిపోతారు. కొందరు దీనిని అంటువ్యాధిగా భావిస్తారు. మరికొందరు ఇది పూర్వజన్మ కర్మ ఫలమని, మరికొందరు ఆహారపు అలవాట్ల వల్ల వస్తుందని అనుకుంటారు.

బొల్లి, చర్యవ్యాధులు, చికిత్స, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బొల్లి వ్యాధి బాధితులపై సమాజం వివక్షచూపకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

బొల్లి అంటువ్యాధి కాదు

బొల్లి వ్యాధి అసలు అంటువ్యాధి కాదు.

స్పర్శ ద్వారా, కలిసి భోజనం చేయడం ద్వారా, బట్టలు పంచుకోవడం ద్వారా, రక్తం ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.

చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల బొల్లి వస్తుందనే అపోహ చాలా ప్రాచుర్యంలో ఉంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

బొల్లి వ్యాధి ప్రాణాంతకం కాదు. ఇది క్యాన్సర్ కాదు. దీని వలన ఇతర అవయవాలకు ఎటువంటి నష్టం జరగదు.

కానీ, బాధితులపై మానసిక, సామాజిక ప్రభావం మాత్రం గణనీయంగా ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై మచ్చలు ఉన్నవారు ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిరాశకు గురికావడం, సమాజంలో వివక్షను ఎదుర్కోవడం జరుగుతుంది.

పాఠశాలల్లో కొంతమంది పిల్లలు బొల్లి ఉన్న పిల్లలను దూరంగా ఉంచడం లేదా ఎగతాళి చేయడం జరుగుతుంది. దీనివల్ల వారి వ్యక్తిత్వ వికాసంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో సరైన అవగాహన కల్పించడం అవసరం.

బొల్లి, చర్యవ్యాధులు, చికిత్స, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బొల్లి వ్యాధికి సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని వైద్యులు చెబుతున్నారు.

వ్యాధి నిర్ధరణ ఎలా చేస్తారు? చికిత్స ఏంటి?

చర్మవ్యాధి నిపుణులు సాధారణంగా శారీరక పరీక్ష ద్వారానే వ్యాధిని గుర్తిస్తారు. అవసరమైతే వుడ్ ల్యాంప్ పరీక్ష, చర్మ బయాప్సీ చేసి నిర్ధారణ చేస్తారు.

విటిలిగో చికిత్స:

విటిలిగో వ్యాధికి ప్రస్తుతం అనేక సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ప్రారంభ దశలో స్టెరాయిడ్ క్రీములు, కాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్లు వంటి మందులు ఉపయోగిస్తారు.

న్యారో బ్యాండ్ అల్ట్రావయొలెట్-బి (NB-UVB) అనే ఫోటోథెరపి చికిత్స ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన చికిత్సలలో ఒకటి.

ఈ చికిత్స ద్వారా మెలనోసైట్స్ తిరిగి పనిచేసేలా ప్రేరేపించవచ్చు.

ఎక్సైమర్ లేజర్ అనే లేజర్ చికిత్స చిన్న ప్రాంతాల్లో ఉన్న మచ్చలకు ఉపయోగపడుతుంది.

స్థిరంగా ఉన్న కొన్ని కేసుల్లో మెలనోసైట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లేదా స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి విధానాలు ఉపయోగించవచ్చు.

బొల్లి వ్యాధి చికిత్స తీసుకునేటప్పుడు చాలా ఓపిక అవసరం. ఈ చికిత్స వ్యవధి కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు పట్టవచ్చు. ప్రతి రోగిలో ఫలితాలు ఒకేలా ఉండవు.

ముఖంపై ఉన్న మచ్చలు సాధారణంగా బాగా స్పందిస్తాయి. చేతివేళ్లు, పాదాల ప్రాంతాల్లో ఫలితాలు కొంత నెమ్మదిగా రావచ్చు.

బొల్లి, చర్యవ్యాధులు, చికిత్స, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

బొల్లి బారిన పడ్డవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సూర్యరశ్మి నుంచి రక్షణ - తెల్లటి మచ్చల ప్రాంతాల్లో మెలనిన్ లేకపోవడం వల్ల సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల సన్‌స్క్రీన్ వాడాలి, టోపీ ధరించాలి, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు.

మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. బొల్లి వ్యాధి కంటే దానిపై సమాజం చూపే వైఖరే చాలా మందిని ఎక్కువగా బాధిస్తుంది. బాధితులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి

కుటుంబ సభ్యుల మద్దతు పొందాలి. సహాయ బృందాల్లో చేరాలి.

బొల్లి, చర్యవ్యాధులు, చికిత్స, వివక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రముఖ పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ బొల్లి వ్యాధి బాధితులు.

సమాజం చేయాల్సిందేమిటి?

బొల్లి ఉన్న వారిని వివక్షకు గురి చేయకూడదు. వివాహాలు, ఉద్యోగాల్లో వివక్ష చూపకూడదు

పిల్లలను ఎగతాళి చేయకూడదు. సరైన వైద్య సమాచారం అందించాలి

వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా బొల్లి వ్యాధిపై అపోహలు కొనసాగుతుండటం విచారకరం. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, సరైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, బాధితులను సమాజంలో సమానంగా గౌరవించాలని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

బొల్లి ఒక చర్మ పరిస్థితి మాత్రమే. అది వ్యక్తి ప్రతిభను, వ్యక్తిత్వాన్ని లేదా సామర్థ్యాన్ని నిర్ణయించదు.

చర్మం రంగు మారవచ్చు కానీ మనిషి విలువ మారదు.

ప్రపంచ బొల్లి వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన పెంచడం ద్వారా వివక్షలేని, సహానుభూతి కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం.

(గమనిక: రచయిత ఓ డాక్టర్. వైద్యపరమైన విధానాలు, చికిత్సలపై అవగాహన కల్పించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆరోగ్యపరమైన ఏ నిర్ణయమైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)