'యుద్ధం లేకపోతే ఎప్పటికీ సరోగేట్ తల్లిని అయ్యేదాన్ని కాదు', చైనా జంట బిడ్డను మోస్తున్న యుక్రెయిన్ మహిళ ఏమన్నారంటే..

- రచయిత, సోఫ్లా బెట్టిజా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
కరీనా ఆరు నెలల గర్భిణి. కానీ, ఆమె కడుపులో పెరుగుతున్న పిండం ఆమె సంతానం కాదు.
తూర్పు యుక్రెయిన్‌కు చెందిన 22 ఏళ్ల కరీనా సరోగేట్ తల్లి. చైనా జంటకు చెందిన అండం, వీర్య కణాలతో ఫలదీకరించిన పిండాన్ని కరీనా గర్భంలో ప్రవేశపెట్టారు.
రష్యా పూర్తిస్థాయి ఆక్రమణ ప్రారంభమైన తొలినాళ్లలో యుద్ధం భీకరంగా జరిగిన ప్రాంతాల్లో బఖ్‌మట్ ఒకటి. ఆ నగరంలోని కరీనా ఇల్లు దాడుల్లో ధ్వంసమైంది. అప్పుడామె వయసు 17 ఏళ్లు.
నగరంలో చాలా భాగం శిథిలాలు, బూడిదతో నిండిపోవడంతో కరీనా, ఆమె భాగస్వామి కీవ్‌కు వెళ్లిపోయారు. స్థిరమైన ఉద్యోగాలు దొరక్క వాళ్లు ఇబ్బందిపడ్డారు.

యుద్ధం కారణంగా సరోగేట్ తల్లులుగా మారుతున్న యుక్రెయిన్ మహిళలు
తమ ఏడాదిన్నర పాపకు బ్రెడ్, డైపర్లు కొనేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సరోగేట్ తల్లిగా మారాలని కరీనా నిర్ణయించుకున్నారు.
యుద్ధం లేకపోతే తానెప్పటికీ సరోగేట్ తల్లిని అయ్యేదాన్ని కాదని ఆమె చెప్పారు. యుద్ధం వల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు ఆగిపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. యుక్రెయిన్ జీడీపీ పడిపోయింది.
''మొదటిసారి సరోగేట్ తల్లిగా మారినప్పుడు నాకు కోపం వచ్చింది. నిరుత్సాహం కలిగింది. కానీ, ఇప్పుడు నేను దీన్ని అంగీకరిస్తున్నా'' అని కరీనా తరాసెన్కో చెప్పారు. ప్రస్తుతం ఆమె కీవ్ సరిహద్దులో, సరోగసీ ఆస్పత్రి కేటాయించిన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఆమె కడుపులో బిడ్డ పెరుగుతోంది.
యుక్రెయిన్‌లో సగటు జీతం కన్నా రెట్టింపు డబ్బు కరీనా సంపాదిస్తున్నారు. గర్భాన్ని మోసినందుకు ఆమె 17,000 డాలర్లు సంపాదిస్తారు. అందులో ఎక్కువ డబ్బు ప్రసవం తర్వాత అందుతుంది.
ఆమెకు 21వేల డాలర్లు చెల్లించాలనేది ఒప్పందం. కానీ, ఆమె గర్భంలో ఉన్న కవలల్లో ఒక పిండం చనిపోవడంతో ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తాన్ని తగ్గించారు.
మొదట్లో ఇబ్బంది అనిపించిప్పటికీ శరీరం సహకరించినంత మేర వీలైనంతమంది పిల్లలకు సరోగేట్ తల్లిగా మారాలని ఇప్పుడు కరీనా భావిస్తున్నారు. ఓ ఇల్లు కొనుక్కోడానికి డబ్బు ఆదా చేసుకోవాలనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, BioTexCom
సరోగసీపై కఠిన నిబంధనలు
సరోగసీ ప్రకటనలు, ప్రచారాలపై హక్కుల కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. పునరుత్పత్తిని ఈ క్లినిక్స్ వినియోగ వస్తువుగా మార్చేశాయని వారు ఆరోపిస్తున్నారు.
యుద్ధానికి ముందు యుక్రెయిన్‌ను ప్రపంచంలో రెండో వాణిజ్య సరోగసీ హబ్‌గా చెప్పేవారు. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
సరోగసీ రంగంపై యుద్ధం ప్రభావం పడినప్పటికీ, ఇప్పుడు దాదాపు యుద్ధం ముందుస్థాయి వచ్చిందని నిపుణులు బీబీసీతో చెప్పారు.
అయితే, ఇప్పుడు యుక్రెయిన్ పార్లమెంట్ సరోగసీపై ఓ బిల్లు తీసుకురావాలని భావిస్తోంది. సరోగసీ పరిశ్రమపై కఠిన నిబంధనలు విధించడం, విదేశీయులకు సరోగసీ సేవలను నిషేధించడం వంటివి ఈ బిల్లులో భాగం కానున్నాయి. సరోగసీ తల్లిదండ్రులు 95 శాతం విదేశీయులే అయ్యుంటారు. యుక్రెయిన్ పార్లమెంట్‌లో ఈ ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది.
సంతానోత్పత్తిని ఓ వినియోగ వస్తువుగా మారుస్తున్నారని, పేదవాళ్లను మోసం చేస్తున్నారని, మహిళలను దోపిడీకి గురిచేస్తున్నారని ఈ రంగంపై ఆరోపణలున్నాయి. దీన్ని కఠిన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలన్నది ఈ చట్టం ఉద్దేశం.
యుక్రెయిన్ మహిళలు విదేశీయులకు సరోగసీ తల్లులుగా ఉండకూడదని బిల్లుకు మద్దతిస్తున్నవారు వాదిస్తున్నారు. యుద్ధం వల్ల యుక్రెయిన్‌లో జననాల రేట్లు తగ్గాయి. అయితే, సరోగసీ ద్వారా పుట్టే పిల్లల సంఖ్య మామూలు జననాలతో పోలిస్తే తక్కువే.
''యుద్ధం వల్ల నిరాశా నిస్పృహలకు లోనవుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల జంటలు తక్కువ ఖర్చులో పిల్లలను పొందాలని భావిస్తున్నారు. దీంతో యుక్రెయిన్‌లోని ఈ క్లినిక్స్ అవకాశం కల్పిస్తున్నాయి'' అని మహిళా హక్కుల కార్యకర్త మరియా దిమిత్రేవా చెబుతున్నారు.
నైతిక విలువల ప్రాతిపదికపై సరోగసీని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రతిపాదిత చట్టం కూడా వాస్తవ పరిస్థితికి దూరంగా ఉందని, ఈ మొత్తం ప్రక్రియపై యుక్రెయిన్‌లో నిషేధం విధించాలని ఆమె భావిస్తారు.

పేద మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు
పేద మహిళలను సరోగసీ క్లినిక్స్ లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనలను ఆమె ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఏఐతో రూపొందించిన ఓ ప్రకటనను ఈ జనవరిలో ఒక క్లినిక్ పోస్టు చేసింది. సరోగసీ గర్భం అందించే మహిళల రిక్రూట్‌మెంట్ కోసం ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో ఓ మహిళ స్టవ్ వెలిగించడానికి కట్టెలు కొనాలా లేక తన పిల్లలకు దుస్తులు కొనాలా అన్నది నిర్ణయించుకోలేని కఠిన పరిస్థితుల్లో ఉన్నట్టు చూపించారు. యుద్ధం వల్ల అనేక మంది యుక్రేనియన్లు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను ప్రతిబింబించాలన్నది ఆ ప్రకటన ఉద్దేశం కావొచ్చు.
యుక్రెయిన్‌లో అతిపెద్ద సరోగసీ క్లినిక్ అయిన సంతానోత్పత్తి కేంద్రం బయోటెక్స్‌కామ్ సరోగసీ బేబీల కోసం బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రవేశపెట్టింది.
ఈ ప్రకటనలు అభ్యంతరకరం అని బీబీసీ అన్నప్పుడు, బయోటెక్స్‌కామ్ వాటిని సమర్థించుకుంది. సరోగసీ వైపు ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఈ ప్రకటనలు ప్రభావంతంగా పనిచేశాయని ఆ సంస్థ వాదించింది.

సమర్థించుకుంటున్న కంపెనీలు
నిర్వహణ తీరుపై ఈ క్లినిక్ కూడా అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. క్లినిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అల్బర్ట్ టోచిలోవ్‌స్కీ, ఇద్దరు మాజీ సిబ్బందిపై ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ దర్యాప్తు మొదలుపెట్టింది. వారిపై మానవ వనరుల అక్రమ రవాణా సహా పలు ఆరోపణలొచ్చాయి.
ఈ ఆరోపణలను బయోటెక్స్‌కామ్, టోచిలోవ్‌స్కీ తోసిపుచ్చారు. తాము చట్టప్రకారమే వ్యవహరిస్తామన్నారు.
మానవ వనరుల అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలపై ప్రాసిక్యూటర్ వివరాలు వెల్లడించలేదు. అది తల్లిదండ్రులు, శిశువు డీఎన్ఏ సరిపోలని ఓ ఘటనకు సంబంధించిన వ్యవహారమని బయోటెక్స్‌కామ్ తెలిపింది. దీనికి, తమ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని, వీర్యం సేకరణ సమయంలో ఇది జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని, ఇది మరో దేశంలో జరుగుతుందని కంపెనీ చెప్పింది.
తల్లిదండ్రులు కావాలన్నవారి కల నెరవేరేందుకు తమ కంపెనీ సాయపడుతుందని, చట్టబద్ధంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం మహిళలకు కల్పిస్తోందని, వారికి ఆరోగ్య సదుపాయాలు, వసతి, భోజనం ఏర్పాట్లన్నీ తామే చూసుకుంటామని బయెటెక్స్‌కామ్ తెలిపింది.
సరోగేట్ తల్లిగా మారేందుకు కరీనా మొదటగా బయోటెక్స్‌కామ్‌కు వెళ్లారు. కానీ, ఆ క్లినిక్‌లో కొనసాగకూడదని ఆమె అనుకున్నారు. తొలి రోజుల్లో వారితో జరిగిన సమావేశాల్లో వాళ్ల వ్యవహారశైలిపై ఆమె అసంతృప్తి చెందారు.

‘పుట్టిన పిల్లలను తీసుకోవడానికి అసలు తల్లిదండ్రులు నిరాకరిస్తున్న ఘటనలు’
బయోలాజికల్ తల్లిదండ్రులు ప్రసవం తర్వాత తమ మనసు మార్చుకుని పుట్టిన పిల్లలను వదిలేసిన కేసులు కూడా ఉన్నాయి.
యుక్రెయిన్‌లో శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువు బాధ్యత అసలు తల్లిదండ్రులదే. ఏ కారణం చేతైనా శిశువును వదిలిపెట్టడం చట్ట వ్యతిరేకం.
అయితే, విదేశీయుల విషయంలో ఈ చట్టాన్ని అమలు చేయడం చాలా కష్టం.
2021లో నెలలు నిండకముందే పుట్టిన 'వెయ్' బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఆ బాబు బయోటెక్స్‌కామ్ ద్వారా సరోగసీ విధానంలో పుట్టాడు.
ఆ చిన్నారి ఇప్పుడు 'కీవ్'లో మానసిక వికలాంగుల హోమ్‌లో ఉంటున్నాడు.
బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు తన స్నేహితులతో కలిసి అరటిపండు తింటూ కనిపించాడు. వాళ్లంతా కలిసే భోజనం చేస్తారు.
వెయ్ sనంతట తాను కూర్చోలేడు. తల నిలపలేడు. సరిగ్గా చూడలేడు. బాలుcrకి జీవితాంతం ఒకరి పర్యవేక్షణ తప్పనిసరి.
బాబు ఆరోగ్య పరిస్థితి తెలిసిన తర్వాత దక్షిణాసియాలోని ఓ దేశానికి చెందిన అసలు తల్లిదండ్రులు తనను తీసుకెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. వాళ్ల గురించి ఎలాంటి సమాచారమూ తెలియలేదు. అధికారులు, బయోటెక్స్‌కామ్ వారిని కాంటాక్ట్ అయ్యేందుకు అనేక సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
వెయ్‌ని కడుపులో మోసిన తల్లి బాబు బాధ్యత తీసుకోవాలని అనుకోలేదు. యుక్రెయిన్ చట్టం ప్రకారం బాబు విషయంలో ఆమెకు ఎలాంటి బాధ్యతలూ ఉండవు.
సరోగసీ విధానంలో పుడుతున్న పిల్లల్లో చాలా మందిని ఇలా వదిలేస్తున్నారని యుక్రెయిన్ ఆరోగ్య శాఖకు చెందిన వలేరియా సొరుచాన్ చెప్పారు. సరోగసీ చట్టంలో మార్పులను సమర్థిస్తున్న వారిలో ఆమె ఒకరు. అయితే, ఇలా వదిలేసిన పిల్లలు కచ్చితంగా ఎంతమంది ఉన్నారనే దానిపై తమ దగ్గర లెక్కలు లేవని తెలిపారు.
సరోగసీని ఆమె వ్యతిరేకించడం లేదు. కానీ నియంత్రణ లేకపోవడంతో యుక్రెయిన్‌లో అది సంక్లిష్టంగా మారిందని, విదేశీయులకు అవకాశం కల్పించడంపై నిషేధం ఉండాలని ఆమె అన్నారు.
ఇదో విషాదకర ఘటన అని బయోటెక్స్‌కామ్ సీఈవో టొచిలోవ్‌స్కీ అన్నారు. ఎవరైనా తల్లిదండ్రులు శిశువును వదిలేస్తే కొంతమేర తాము బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘యుక్రెయిన్‌లో అనుకూలంగా ఉన్న చట్టాలు’
పిల్లలను అలా వదిలేస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోమ్‌లలో వాళ్లను ఉంచడానికి అవసరమయ్యే ఖర్చులు క్లినిక్కులు భరించాలనే నిబంధనలు లేవు. ఈ హోమ్‌లకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల నుంచీ నిధులు వస్తుంటాయి. వెయ్ పెంపకానికి సంబంధించి బయోటెక్స్‌కామ్ ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదు.
వెయ్ తరహాలో తీవ్రమైన వైకల్యాలున్న పిల్లలను దత్తత చేసుకునే కుటుంబాలు అరుదుగా ఉంటాయి. వెయ్ ఫైల్‌ను 15 కుటుంబాలు పరిశీలించాయి. కానీ, ఎవరూ దత్తతకు మొగ్గుచూపలేదు.
సరోగసీ వ్యాపారాత్మకంగా మారడం వల్ల అన్నివిధాలా ఉపయోగముందని వాదించే వారూ ఉన్నారు
లండన్‌కు చెందిన హిమత్‌రాజ్, రాజ్‌వీర్ బాజ్వా దంపతులు పిల్లల కోసం ఐదేళ్లు ఎదురుచూశారు. రెండుసార్లు ఐవీఎఫ్ కూడా ప్రయత్నించారు. తర్వాత సరోగసీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
38 ఏళ్ల రాజ్‌వీర్‌కు ఎండోమెట్రియోసిస్ తీవ్రస్థాయిలో ఉంది. గర్భం దాల్చడం కష్టం. ఆమెకు మల్లిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి కూడా ఉంది.
అల్ట్రూయిస్టిక్ సరోగసీకి మాత్రమే అనుమతి ఉండే యూకేలో ఈ విధానం ఉపయోగించుకోవాలని ఆమె అనుకోలేదు. అల్ట్రూయిస్టిక్ సరోగసీలో గర్భాన్ని అద్దెకిచ్చే తల్లికి ఎలాంటి ఆర్థిక సాయం ఉండదు. ఖర్చులు మాత్రమే పెట్టుకోవాలి. యూకేలో సరోగసీ ఏర్పాట్లు అనధికారికంగా జరుగుతుంటాయి. స్నేహితులు, కుటుంబం, లాభాపేక్ష లేని సంస్థల ద్వారా ఇవి జరుగుతుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘నా బిడ్డ కాకపోయినా నాకు ప్రేమగానే అనిపిస్తుంది’
యూకే చట్టం ప్రకారం కోర్టు పేరెంటల్ ఆర్డర్ జారీ చేసే వరకు గర్భం అద్దెకిచ్చిన తల్లిదే చట్టపరమైన బాధ్యత. ఆమె నుంచి అసలు తల్లిదండ్రలకు బాధ్యతను పేరెంటల్ ఆర్డర్ ద్వారా బదలాయిస్తారు.
శిశువుపై చట్టబద్ధమైన హక్కులు వెంటనే లభించకపోవడంపై హిమత్‌రాజ్, రాజ్‌వీర్ ఆందోళన చెందారు. పిల్లలను అసలు తల్లిదండ్రులకు ఇచ్చే విషయంలో సరోగసీ తల్లులు మనసు మార్చుకున్న కేసులు కూడా ఉన్నాయి. అయితే, ఇవి అత్యంత అరుదు.
యుక్రెయిన్‌లో సరోగసీ నిర్వహణ వారికి నచ్చింది. అక్కడ ఖర్చు తక్కువ ఉండడం కూడా మరో కారణం.
ఆ జంట గత ఏడాది బయోటెక్స్‌కామ్ సేవలు తీసుకుని, 87 వేల 770 డాలర్లు చెల్లించారు. అమెరికాతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అమెరికాలో ఈ ఖర్చు లక్షా 50 వేల డాలర్ల కన్నా ఎక్కువ ఉంటుంది. బయోటెక్స్‌కామ్ తమకు అన్నివిధాలా సౌకర్యవంతంగా ఉందని వాళ్లు చెప్పారు.
ఐవీఎఫ్ విధానంలో వాళ్లు లండన్‌లో పిండం రూపొందించుకున్నారు. దాన్ని కీవ్‌కు తరలించి క్లినిక్‌లోని క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంక్స్‌లో నిల్వచేశారు.
శిశువు పుట్టుకను చూసేందుకు ఆ జంట గత ఏడాది కీవ్‌కు వెళ్లింది.
తర్వాత బాబుకు పాస్‌పోర్ట్, అవసరమైన డాక్యుమెంట్లకు సంబంధించిన వర్క్ పూర్తి చేయడానికి యూకే అధికారులకు సమయం పట్టడంతో, బాబు పుట్టిన తర్వాత తొలి మూడు నెలలు కీవ్‌లోనే ఉన్నారు. రష్యా బాంబు దాడుల నుంచి తప్పించుకునేదుకు వాళ్లు బాంబ్ షెల్టర్లలోకి వెళ్లాల్సి వచ్చేది.
''అది చాలా భయానకంగా ఉండేది. నమ్మలేకపోయేవాళ్లం'' అని రాజ్‌వీర్ చెప్పారు.
ఆగస్టు చివరిలో వాళ్లు తమ కొడుకును తీసుకుని ఇంగ్లండ్‌కు తిరిగివచ్చారు.
ఈ నెలలో బాబు మొదటి పుట్టినరోజు జరపపనున్నారు.
తమకు సేవలందించిన సరోగసీ ఏజెన్సీ తమకు సంతోషాన్నిచ్చిందని ఈ దంపతులంటున్నారు. యుక్రెయిన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.
''సాధ్యం కాదని భావించినదాన్ని వాళ్లు మాకందించారు. మమ్మల్ని ఓ కుటుంబంగా మార్చారు'' అని 37 ఏళ్ల హిమత్‌రాజ్ చెప్పారు.
హిమత్ రాజ్, ఆయన భార్య తమకు గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళను కలవాలనుకున్నారు. కలిసిన తర్వాత ఆమెకు చాక్లెట్లు, పూలు అందించారు.
ఆమె దోపిడీకి గురైందని తాము భావించడం లేదని వాళ్లు చెప్పారు.
''అది పూర్తిగా సొంత నిర్ణయం. అది వారికి అవసరం. అది వాళ్లకు సాయపడుతుంది. చివరికి ఒకరోజు అందరికీ సంతోషం కలుగుతుందని భావిస్తున్నా'' అని ఆమె తెలిపారు.
''మమ్మల్నెవరూ బలవంతం చేయడం లేదు.''
వాణిజ్య సరోగసీ మహిళలను దోచుకునే విధానమన్న ఆరోపణలను కరీనా కూడా ఖండిస్తున్నారు.
''మమ్మల్నెవరూ బలవంతం చేయడం లేదు. ఇది నా శరీరం, నా నిర్ణయం. వాళ్లకు సంతోషం ఇచ్చినందుకు నాకు డబ్బులు వస్తాయి'' అని ఆమె తెలిపారు.
చట్టం తీసుకురావడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఇల్లు కొనుక్కోవాలన్న తన ప్రణాళికలను ఇది పూర్తిగా ధ్వంసం చేసిందని ఆమె అన్నారు.
''ఈ బిడ్డ నాది కాదని నాకు తెలుసు. కానీ, నేను ఆ బిడ్డను ప్రేమిస్తాను. తనతో మాట్లాడతాను. బిడ్డ తన్నినప్పుడు మీ తల్లిదండ్రులు నీ కోసం ఎదురుచూస్తున్నారని చెబుతాను'' అని తన పొట్ట వైపు చూస్తూ కరీనా తెలిపారు.
ఆమెకు మంచి జీవితం లభించాలని కోరుకుంటున్నా'' అని కరీనా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.































