‘నిద్రపోయేటప్పుడు నా పార్ట్‌నర్ నన్ను రేప్ చేసినట్లు నాకు తెలియలేదు’

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, 46 ఏళ్ల అడెల్ ఓవర్టన్, 44 ఏళ్ల స్టీవెన్ ఉడెన్ 13 ఏళ్లకు పైగా కలిసి ఉన్నారు.
    • రచయిత, కరోలిన్ లోబ్రిడ్జ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

"బహుశా అతను తాను చేసిన తప్పును ఒప్పుకునే ముందు రోజు వరకు నా రిలేషన్‌షిప్స్‌లో అదే ఉత్తమమైనది" అని అడెల్ ఓవర్టన్ చెప్పారు.

అడెల్ ఓవర్టన్‌, స్టీవెన్ ఉడెన్ 13 ఏళ్లుగా స్నేహితులు. ఆమెకు అతను ఆదర్శవంతమైన భాగస్వామిలా కనిపించారు.

ఒక జాంబీ సినిమా షూటింగ్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి ఇష్టాఇష్టాలు ఒకేలా ఉండేవి. ఉడెన్‌కు దయాగుణం ఉందని తనను శ్రద్ధగా చూసుకునేవాడని ఓవర్టన్ చెప్పారు.

తనకు వైకల్యం ఏర్పడినప్పుడు తనను చూసుకోవడం కోసం అతను తన ఉద్యోగాన్ని కూడా వదిలేశాడని అడెల్ ఓవర్టన్ చెప్పారు.

"అతను చాలా అద్భుతమైన వ్యక్తి. నేను అతన్ని అమితంగా ప్రేమించాను, ఇప్పటికీ నా మనసులో అతనిపై కొంచెం ప్రేమ ఉందని నేను నమ్ముతున్నాను" అని ఆమె డెర్బీలోని తన ఇంట్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆమె ఉడెన్‌ను పూర్తిగా నమ్మారు. అయితే తను నిద్రపోతున్నప్పుడు అతను తనపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకోవడంతో ఆ నమ్మకం ముక్కలైపోయింది.

"నాకు ద్రోహం జరిగినట్లు అనిపించింది. అంతకు ముందు ఏ రిలేషన్‌షిప్‌లోనూ నేను ఇంత సేఫ్‌గా ఉన్నట్లు అనిపించలేదు" అని ఓవర్టన్ అన్నారు.

ఆమెకు రొమ్ము క్యాన్సర్ చికిత్స సమయంలో ఉడెన్ దగ్గరుండి ఆమెను చూసుకున్నారు. అయితే మందుల ప్రభావంతో ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెపై అత్యాచారం చేసినట్లు అతను పోలీసుల ఎదుట అంగీకరించారు.

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఉడెన్, ఓవర్టన్

"నేను మోసపోయాననే భావన కలిగింది. నేను అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని అనుకున్నాను. కానీ అతని నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేకపోయాను" అని ఆమె చెప్పారు.

"13 ఏళ్లు అతనితో నేను కలిసి ఉన్నాను. నా పిల్లలను పెంచడంలో అతను సాయపడతాడని అనుకున్నాను. కానీ అలా జరగలేదు" అని ఆమె వాపోయారు.

ఉడెన్ ఓవర్టన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

ఇలాంటి వాళ్ల వల్ల ఇతరులు మోసపోకూడదని ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని ఓవర్టన్ నిర్ణయించుకున్నారు.

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఆ ఇద్దరూ ఒక ఈవెంట్ కంపెనీ కోసం జాంబీలుగా నటించారు.

జాంబీలుగా మొదలైన పరిచయం

వాళ్లిద్దరూ 2009లో నాటింగ్‌హామ్‌లో జాంబీ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు.

అప్పుడు ఆమెకు 29 ఏళ్లు, అతని వయసు 27 ఏళ్లు.

ఉడెన్ మేకప్, నటన విభాగాల్లో పనిచేసేవారు. ఓవర్టన్ నటి.

అప్పట్లో ఇద్దరూ వేరే వాళ్లతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ స్నేహితులుగా ఉన్నారు.

చివరికి వారు 2012 జనవరి13న జంటగా మారారు.

ఆ రోజు వారు 'ఫ్రైడే ది థర్టీంత్' సినిమాల సిరీస్‌ను చూడటంతో ఓవర్టన్‌కు ఆ తేదీ బాగా గుర్తుంది.

గతంలో తనకు ఉన్న బంధాల కంటే ఉడెన్‌తో ఉన్న బంధం చాలా భిన్నంగా ఉందని ఓవర్టన్ చెప్పారు. "అతను చాలా ఫన్నీగా శ్రద్ధగా ఉండేవాడు. నన్ను ప్రేమిస్తున్నారని భావించాను" ఆమె చెప్పారు.

వారి పరిచయం ఎంత వింతగా జరిగిందో వారి జీవితం కూడా అంతే భిన్నంగా సాగింది.

హారర్, జాంబీ సర్వైవల్ ఈవెంట్స్ నిర్వహించే కంపెనీలో వాళ్లిద్దరూ ప్రొఫెషనల్ జాంబీలుగా పనిచేసేవారు.

జాంబీలా నటించడానికి ఓవర్టన్‌కు చాలా శారీరక శ్రమ అవసరమయ్యేది.

కానీ 2017లో 'ఎహ్లర్స్-డాన్లోస్ సిండ్రోమ్' అనే వ్యాధి కారణంగా ఆమె ఆ పని వదిలేయాల్సి వచ్చింది. 2018 ప్రారంభంలో ఉడెన్ ఆమెకు కేర్‌టేకర్‌గా మారారు.

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉడెన్ సరైన భాగస్వామిగా అనిపించాడని ఓవర్టన్ చెప్పారు.

'సాయం చేస్తూనే ద్రోహం'

"అతను నా కోసం దాదాపు అన్ని పనులూ చేశాడు" అని ఆమె చెప్పారు.

అయితే ఇప్పుడు ఒకసారి వెనుదిరిగి చూస్తే ఉడెన్ మెల్లగా తనను నియంత్రించడం మొదలు పెట్టారని ఆమె భావిస్తున్నారు.

"నేనేం చేయగలను? ఏమీ చేయలేనని అందరికీ చెప్పడంలో అతను ఆనందించేవాడు. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే అతను వెంటేనే 'డెల్ తట్టుకోలేదు' మరేదైనా చూద్దాం అని చెప్పి ఆనందించేవాడు" అని ఆమె చెప్పారు.

ఉడెన్ ప్రవర్తన తను ఊహించిన దానికంటే చాలా ఘోరమైనదని ఓవర్టన్‌కు ఇప్పుడు తెలిసింది. 2020లో రొమ్ము క్యాన్సర్‌కు కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో ఆమెకు కొన్ని అనుమానాలు వచ్చాయి.

"ఆ సమయంలో నాకు కలిగిన అసౌకర్యం స్పష్టంగా తెలిసిందో లేదో నాకు తెలియదు. కానీ అతను నాపై అత్యాచారం చేస్తున్నప్పుడు నాకు మెలకువ వచ్చింది" అని ఆమె చెప్పారు.

"అందుకు అతను 'నువ్వు మేల్కొనే ఉన్నావని, దానికి తగ్గట్టే శబ్దాలు చేస్తున్నావని అనుకున్నాను' అంటూ రకరకాల సాకులు చెప్పాడు" అని ఆమె అన్నారు.

"నేనెంత మానసిక ఒత్తిడిలో ఉన్నానో ఆలోచించాను. అతను పొరపాటున అలా జరిగిందని చెప్పాడు. నిజం తెలుసుకోవడం కంటే ఆ అబద్ధాన్ని నమ్మడమే సులువని నేను అనుకున్నాను" అని ఆమె చెప్పారు.

ఈ సంఘటన గురించి తెలిసాక ఆమెకు నిద్ర సరిగ్గా పట్టేది కాదు.

"నేను పడుకున్న తర్వాత నా మెదడులోని ఏదో ఒక మూల సురక్షితంగా లేననే భావన కలిగి ఉండవచ్చు" అని ఆమె చెప్పారు.

ఉడెన్‌తో శారీరకంగా దగ్గరవ్వడం కూడా తనకు కష్టంగా మారిందని గతంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల తాలూకు పీడకలలు ఎక్కువగా రావడం ప్రారంభమయ్యాయని ఓవర్టన్ అన్నారు.

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఉడెన్ చివరకు తాను తప్పు చేసినట్లు ఓవర్టన్ ఎదుట అంగీకరించారు.

స్టీవెన్ ఉడెన్ నేరాంగీకారం

ఐదేళ్ల తర్వాత 2025లో పేగు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలో ఉడెన్ నిజాన్ని ఒప్పుకున్నారు.

"ఏదో ఒక విషయం అతన్ని తీవ్రంగా వేధిస్తోందని అనిపించింది. ఎందుకంటే నేను అనుభవించిన బాధను ఇప్పుడు అతనికి అనుభవంలోకి వచ్చింది" అని ఆమె వివరించారు.

ఇది ఐదేళ్ల క్రితం తను నిద్రలేచినప్పుడు ఉడెన్ తనతో శృంగారంలో పాల్గొనడం చూసిన ఓవర్టన్ జ్ఞాపకాలను మళ్లీ రేకెత్తించింది.

దీని మీద వాళ్ల మధ్య రెండు రోజులు వాదనలు జరిగాయి. ఆయన ఆమె దగ్గర తాను తప్పు చేసినట్లు అంగీకరించారు.

దీంతో ఆమెకు అతని పట్ల అసహ్య భావన ఏర్పడింది. అయితే ఆమె అతనితో తన బంధాన్ని తెంచుకోలేదు. ఎందుకంటే ఆమె అప్పటికే అతనిపై ఆధారపడి ఉన్నారు. పైగా అతనిని ప్రేమించారు.

ఓవర్టన్ అప్పటికే లైంగిక వేధింపుల గురించి గ్రూప్ థెరపీ తీసుకుంటున్నారు. తన తదుపరి సెషన్‌లో ఆమె ఈ విషయాన్ని అక్కడ ప్రస్తావించారు.

"నేను పూర్తిగా కుంగిపోయాను. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు అక్కడి కౌన్సిలర్లలో ఒకరు నన్ను ఆ పరిస్థితి నుంచి బయటపడేశారు. అతను మళ్లీ ఇలా చేయకుండా ఎలా ఆపాలి అని ఆ కౌన్సిలర్‌ను అడిగాను. పోలీసులకు ఫోన్ చేయమని ఆమె చెప్పారు" అని ఓవర్టన్ వివరించారు.

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఓవర్టన్ ధైర్యంగా ముందుకు రావడం వల్ల ఇతర మహిళలను రక్షించగలిగినట్లు డిటెక్టివ్ సార్జెంట్ ఎలియనోర్ కిర్టన్ అన్నారు.

'ఆమె ధైర్యం అభినందనీయం'

ఈ కేసును డెర్బీషైర్ పోలీసులకు చెందిన డిటెక్టివ్ సార్జెంట్ ఎలియనోర్ కిర్టన్‌కు అప్పగించారు.

ఓవర్టన్‌ను ప్రశ్నించిన తర్వాత పోలీసులు ఉడెన్‌ను అరెస్టు చేశారు.

"అతన్ని ప్రశ్నించినప్పుడు వెంటనే తప్పు ఒప్పుకున్నాడు" అని ఎలియనోర్ చెప్పారు.

"ఆమెపై అత్యాచారం చేసినట్లు అతను వెంటనే అంగీకరించాడు. మా విచారణల్లో ఇంత త్వరగా కేసు ఒక కొలిక్కి రావడం చాలా అరుదు" అని ఎలియనోర్ అన్నారు.

ఉడెన్‌పై రెండు అత్యాచారం కేసులు నమోదయ్యాయి. కోర్టులో ఆయన నేరాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు ఆయనకు 80 నెలల జైలు శిక్ష విధించింది.

ఓవర్టన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇతర మహిళలకు రక్షణ లభించిందని కిర్టన్ అభిప్రాయపడ్డారు.

"ఆమె చూపిన ధైర్యం, పట్టుదల వల్ల మేము మరెంతో మందిని రక్షించగలిగాము. లేదంటే ఆ వ్యక్తి ఇతరులపై కూడా ఇలాంటి నేరాలకు పాల్పడేవాడు" అని ఆమె జోడించారు.

13 ఏళ్లు కలిసి ఉన్న తన భాగస్వామి నిద్రిస్తున్నప్పుడు ఎందుకు అత్యాచారం చేశాడనే విషయాన్ని ఓవర్టన్ ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు.

"ఎదుటి వ్యక్తి నుండి స్పందన లేనప్పుడు ఆనందం ఎలా కలుగుతుందో అర్థం కావడం లేదు. అది అంతుచిక్కని విషయంగా మిగిలిపోయింది" అని ఆమె చెప్పారు.

"అతనికి నిద్రిస్తున్న మహిళల పట్ల ఒక రకమైన ఆకర్షణ ఉండేది. అది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నన్ను నిద్రపుచ్చేందుకు అతను చేసిన పనులు నాకు తెలియకుండా ఉండాలనునేవాడు" అని ఆమె చెప్పారు.

ఉడెన్ తనకు నిద్రమాత్రలు ఇచ్చి ఉంటాడని ఓవర్టన్ అనుమానిస్తున్నారు.

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఉడెన్‌కు నిద్రపోతున్న స్త్రీలంటే 'ప్రత్యేక అభిరుచిట ఉండేదని ఓవర్‌టన్ వాదిస్తున్నారు.

కోర్టులో ఏం జరిగింది?

"నా దగ్గర చిన్న చిన్న మందుల డబ్బాలు ఉండేవి, అతను నా కోసం ఆ మందులన్నీ బయటకు తీసి ఇచ్చేవాడు" అని ఆమె చెప్పారు .

"అప్పుపడు నాకు ఇతర మందుల కంటే నిద్రమందులు చాలా తక్కువగా ఇస్తున్నారు. కాబట్టి నేను నిద్రపోతూనే ఉండేలా చేయడం కోసం అతను నాకు ఎక్కువ మోతాదులో నిద్రమందులు ఇచ్చి' ఉంటాడని అనుమానం కలిగింది" అని ఆమె అన్నారు.

పోలీసులు దీనిని చాలా కాలం క్రితం జరిగిన కేసు' గా నమోదు చేసినట్లు డిటెక్టివ్ కిర్టన్ చెప్పారు.

కాబట్టి ఇప్పుడు ఫోరెన్సిక్ లేదా టాక్సికాలజీ పరీక్షలు చేసినా ఆ నిజాలను ధృవీకరించడం లేదా తిరస్కరించడం సాధ్యం కాదని వివరించారు.

ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు.

ఓవర్టన్ కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో (ఆ సమయంలో రోగులు చాలా అలసిపోతారు) ఒకసారి ఆమెపై అత్యాచారం చేసినట్లు ఉడెన్ పోలీసుల ముందు అంగీకరించారు.

"ఆమె కీమోథెరపీ తీసుకుంటున్న విషయాన్ని అతను ఆ సమయంలో ప్రస్తావించాడని నేను భావిస్తున్నాను. అది జరిగినప్పుడు ఆమె మందుల ప్రభావంలో ఉందని అతను అంగీకరించాడు" అని కిర్టన్ తెలిపారు.

రిలేషన్ షిప్, జాంబీ సినిమా, అత్యాచారం, లైంగిక హింస, పోలీసులు
ఫొటో క్యాప్షన్, "తన కోసం తాను ఎలా నిలబడాలో తెలిసినందుకు" తన తల్లి పట్ల గర్వంగా ఉందని షారీ ఓవర్టన్ చెప్పారు.

ఉడెన్‌పై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ అతను తనపై అంతకంటే ఎక్కువసార్లు ఈ దారుణానికి ఒడిగట్టాడని ఓవర్టన్ నమ్ముతున్నారు.

"అతను నాపై ఏడు లేదా ఎనిమిది సార్లు అలా చేసినట్లు నాతో చెప్పాడు" అని ఓవర్టన్ వివరించారు.

ఉడెన్ వల్ల తన తల్లి ఎదుర్కొన్న కష్టాల్ని చూడటం తనను కలచి వేసిందని ఆమె కుమార్తె షారీ ఓవర్టన్ చెప్పారు.

"ఆమె ఇప్పుడు చాలా మారిపోయింది. ఆమె ఆత్మవిశ్వాసం చాలా తగ్గిపోయిందని నేను స్పష్టంగా చూడగలను" అని షారీ అన్నారు.

"ఆమె వెనక్కి తగ్గకుండా కోర్టులో తన హక్కుల కోసం పోరాడినందుకు నేను ఆమెను చూసి ఎంతో గర్విస్తున్నాను" అని షారీ చెప్పారు.

కేర్‌టేకర్‌ల వేధింపులను భరించాల్సిన అవసరం లేదని తన కథ ద్వారా ఇతరులకు చెప్పాలని ఓవర్టన్ భావిస్తున్నారు.

"నేను కచ్చితంగా మాట్లాడాలని భావించాను. ఎందుకంటే వేరొకరి నియంత్రణలో ఉన్న వికలాంగులు ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని ఆలోచన వచ్చింది" అని ఓవర్టన్ అన్నారు.

"ఈ విషయం తెలిసిన కొన్ని నెలల వరకు బహుశా అతను నన్ను చూసుకుంటున్నందుకు ప్రతిఫలంగా నేను అతనికి ఈ శారీరక సాన్నిహిత్యాన్ని ఇవ్వాలేమో.. నేను అతనికి రుణపడి ఉన్నానేమో అని అనుకున్నాను. కానీ అది నిజం కాదు, ఎవరూ ఎవరికీ అలా రుణపడి ఉండాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)