‘మా నాన్న సమాధిని తవ్వి బంగారపు గొలుసు ఎత్తుకెళ్లి పంచుకున్నది మాకు బాగా తెలిసినవాళ్లే’-కోయంబత్తూరులో ఓ కుటుంబం ఆవేదన ఇది...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మృతదేహంపై ఉన్న బంగారాన్ని దొంగలించిన ఘటన కోయంబత్తూరులో జరిగింది.
స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ శ్మశానవాటికలో ఒక మృతదేహాన్ని ఖననం చేశారు. తొమ్మిది రోజుల తర్వాత మృతదేహాన్ని వెలికితీసి 28 గ్రాముల విలువైన బంగారు ఆభరణాన్ని ముగ్గురు వ్యక్తులు దొంగలించారని పోలీసులు తెలిపారు.
దొంగలించిన ఆభరణాన్ని కరిగించి, అమ్ముకుని, ఆ ముగ్గురూ వాటాలు పంచుకున్నారని పోలీసులు తెలిపారు.
వారిలో ఒకరు మృతుడి బంధువుల దాడిలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.
ఆ గొలుసును తన తండ్రి ఎంతో ఇష్టంగా వేసుకునేవారని అందుకే దాన్ని తియ్యకుండా అలాగే ఉంచి అంత్యక్రియలు నిర్వహించామని మృతుని కుమారుడు వెంకటేశ్ బీబీసీతో చెప్పారు.

బంగారు గొలుసు దొంగలించారని ఎలా తెలిసిందంటే...
సమాధికి పాలాభిషేకం చేయడానికి వచ్చినప్పుడు మృతదేహం తలవైపు తవ్వినట్టు కనిపించడంతో అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం తెలిసిందని అన్నారు.
శ్మశానవాటికలో పనిచేసే ఒక వ్యక్తిని విచారించగా, మృతదేహం తలను అర్ధరాత్రి చేతులతోనే తవ్వి తీసి, నగలను తీసుకున్నారని చెప్పినట్టు వెంకటేశ్ తెలిపారు.
కోయంబత్తూరులోని సౌరిపాళయంకు చెందిన నాగరాజ్ అనారోగ్యంతో జూన్ 6వ తేదీన మరణించారు. ఆయన చాలాకాలంగా అదే ప్రాంతంలో చేపల వ్యాపారం చేస్తున్నారు. నాగరాజ్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు జూన్ 7వ తేదీన సౌరిపాళయం కార్పొరేషన్ శ్మశానవాటికలో ఖననం చేశారు.
చాలా సంవత్సరాలుగా చేపల వ్యాపారిగా ఉన్న నాగరాజ్ చేప ఆకారపు పెండెంట్ ఉన్న బంగారు గొలుసును ఎప్పుడూ మెడలో వేసుకునేవారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంత్యక్రియల సమయంలో ఆ గొలుసును తీసివేయమని బంధువులు చెప్పారు. కానీ తండ్రిపై ఉన్న ప్రేమతో ఆయన కొడుకు వెంకటేశ్‌కుమార్ దానిని తీయకుండానే ఖననం చేయమన్నారు.
"నాగరాజ్ మా మేనమామ. ఆయనను ఖననం చేసిన చోటే ఆయన భార్యను కూడా ఖననం చేశారు. ఆమె చనిపోయినప్పుడు కూడా వెంకటేశ్ ఆమె మెడలోని తాళిని తీయొద్దని చెప్పారు" అని మృతుడు నాగరాజ్ బంధువైన మణికందన్ బీబీసీతో చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వెంకటేశ్ కుమార్ తన తండ్రి మెడలో ఉన్న బంగారు గొలుసును తీయడానికి ఒప్పుకోలేదని మణికందన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గొలుసును కరిగించి, అమ్ముకుని, వాటాలు పంచుకుని..
జూన్ 19వ తేదీన 16వ రోజు కార్యక్రమం సందర్భంగా నాగరాజ్ కుమారులు రాజేశ్, వెంకటేశ్ కుమార్ తమ బంధువులతో కలిసి ఖననం చేసిన చోట పాలు పోయడానికి శ్మశానానికి వెళ్లారు. ఆ సమయంలో శవం తలవైపు భాగంలో ఒకటిన్నర అడుగుల లోతు గొయ్యిని కుటుంబ సభ్యులు గమనించారు.
ఆ తర్వాత ఏం జరిగిందో వెంకటేశ్ కుమార్ బీబీసీకి వివరించారు.
"మా నాన్నను ఖననం చేసిన చోట తల భాగంలో ఒక పెద్ద గుంత కనిపించింది. మా బంధువులు దాన్ని చూసి, ఆ శ్మశానంలోనే పని చేసే కార్తికేయన్‌ను ప్రశ్నించారు. అప్పుడే బంగారు గొలుసును తవ్వి తీసి, అమ్మేసి, వాటాలు పంచుకున్నారని తెలిసి మేం దిగ్భ్రాంతికి గురయ్యాం" అని వెంకటేశ్ చెప్పారు.
దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు వెంకటేశ్ కుమార్.
జూన్ 16వ తేదీ రాత్రి మణికందన్, శక్తివేల్, కార్తికేయన్ కలిసి నాగరాజ్ తల ఉన్న ప్రాంతంలోని మట్టిని మాత్రమే తవ్వి మెడలోని బంగారు గొలుసును తీసుకున్నారు.
మణికందన్ బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తుండడంతో ఆయన బంగారాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే యాసిడ్‌ను శ్మశానవాటికకు తీసుకువచ్చి అక్కడే గొలుసును శుభ్రపరిచారని విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత వారు గొలుసును, పెండెంట్‌ను కరిగించి, అమ్మి, ఆ డబ్బును పంచుకున్నారు. కార్తికేయన్‌కు 30,000 రూపాయలు ఇచ్చినట్టు విచారణలో వెల్లడయింది.
"శ్మశానవాటికలోకి అక్రమంగా ప్రవేశించడం, మృతదేహాలకు నష్టం కలిగించడం, అగౌరవపరచడం, మృతుని ఆస్తిని దొంగలించడం వంటి నేరాలకు గాను కార్తికేయన్, మణికందన్, శక్తివేల్‌లపై బీఎన్ఎస్ 301, 315 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం'' అని పీలమేడు ఎస్.ఐ. తిరువాసగం చెప్పారు.

బంధువుల దాడి
మృతదేహం నుంచి బంగారు గొలుసు దొంగిలించారని తెలుసుకున్న నాగరాజ్ బంధువులలో కొందరు కోపంతో మణికందన్‌పై దాడి చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా నాగరాజ్ బంధువులైన మణి, రంజిత్, కార్తిలపై కూడా బీఎన్ఎస్ సెక్షన్లు 296(బి), 115(2) కింద అసభ్యకరంగా దాడిచేయడం, కొట్టడం వంటి ఆరోపణలపై కేసు నమోదయింది. కానీ వారినింకా అరెస్టు చేయలేదు.
"మణికందన్ ఆరోగ్యం మెరుగుపడగానే ఆయన్ను అరెస్టు చేస్తాం. మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నాం. మణికందన్‌పై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినప్పటికీ, నాన్ బెయిలబుల్ సెక్షన్లున కాకపోవడంతో వారినింకా అరెస్టు చేయలేదు" అని తిరువాసగం తెలిపారు.
మద్యం మత్తులో ఉన్నప్పుడు తాను ఇలా చేశానని కార్తికేయన్ తమ దగ్గర ఒప్పుకున్నారని నాగరాజ్ బంధువులు తెలిపారు. పోలీసులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
శ్మశానంలో నాగరాజ్ మృతదేహాన్ని ఖననం చేయడంలో సేవలందించిన శరవణన్, అర్ధరాత్రి పూట మృతదేహాన్ని తవ్వితీశారంటే తాను నమ్మలేకపోతున్నామని అన్నారు.
"నేను కార్పొరేషన్ ఉద్యోగిని కాదు. ఎవరైనా మృతదేహాన్ని పూడ్చిపెట్టమని పిలిస్తే మేం ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని సిద్ధం చేసి వారికోసం గొయ్యి తవ్వుతాం. మేం నాగరాజ్ మృతదేహాన్ని ఆరు అడుగుల పొడవు, నడుము లోతు గుంతలో ఖననం చేశాం. కానీ వారు అర్ధరాత్రి కేవలం చేతులతో తల భాగాన్ని తవ్వి ఆయన మెడలోని బంగారు గొలుసును తీసుకువెళ్లారు''
"నాకు తెలిసినంత వరకు, ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఈ శ్మశానవాటిక ఇప్పుడు వాడుకలో లేదు. అందుకే దీనికి ప్రహరీ గోడ, లైటింగ్, మోటార్ సౌకర్యం ఏమీ లేవు. సీసీటీవీ కూడా లేదు. రాత్రిపూట, వారు శ్మశానవాటిక వెనుక నుంచి వచ్చి మృత దేహంపై ఉన్న గొలుసు తీసుకున్నారు. మేం నలుగురం కలిపి గునపం, పారతో గొయ్యి తవ్వాం. మాకు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఖననం తర్వాత మేం మళ్లీ అటువైపు వెళ్లలేదు" అని శరవణన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాత శ్మశానవాటికలు 'మద్యం కేంద్రాలుగా మాారుతున్నాయా?
కోయంబత్తూరు కార్పొరేషన్‌లోని సౌరిపాళయం శ్మశానవాటికతో సహా చాలా పాత శ్మశానవాటికలు నిర్వహణ లేకపోవడంతో మద్యం సేవించే ప్రదేశాలగా, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రదేశాలను పరిరక్షించి, సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సౌరిపాళయానికి చెందిన సామాజిక కార్యకర్త త్యాగరాజన్ కోరారు.
శ్మశానవాటిక కోయంబత్తూరు కార్పొరేషన్ తూర్పు జోన్‌లో ఉంది. "కార్పొరేషన్‌లో అనేక విద్యుత్ శ్మశానవాటికలు ఉన్నందున, పాత శ్మశానవాటికలేవీ ఇప్పుడు వాడుకలో లేవు. చాలా అరుదుగా కొద్దిమంది మాత్రమే అక్కడ మృతదేహాలను ఖననం చేస్తారు. అందువల్ల, ఆ శ్మశానవాటికల నిర్వహణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. కానీ ఆక్రమణలు ఉంటే వాటిని వెంటనే తొలగిస్తాం" అని కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ దక్షిణామూర్తి బీబీసీతో చెప్పారు.
"ఆ స్మశానవాటికల్లో ఖననం చేయడానికి ఎవరూ రానందున, ఏ శ్మశానవాటికలోనూ కార్పొరేషన్ తరఫున సమాధులు తవ్వేవారిని గానీ, సంరక్షకుడిని గానీ నియమించలేదు. అందుకే అక్కడ సీసీటీవీలను ఏర్పాటు చేయలేదు. కార్పొరేషన్ పరిధిలోని మిగతా అన్ని విద్యుత్ శ్మశాన వాటికల్లో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అయినప్పటికీ, ఆ శ్మశానవాటిక పరిరక్షణకు సంబంధించి ప్రజలు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటాం" అని అసిస్టెంట్ కమిషనర్ అన్నారు.
మృతదేహాన్ని తవ్వి, నగలను దొంగిలించిన వారిలో ఒకరు మృతుడు నాగరాజ్ బంధువైన శక్తివేల్ అని పోలీసు కేసు ఫైల్‌లో ఉంది. నాగరాజ్ కుమారుడు వెంకటేశ్ కుమార్ దీనిని ఖండించారు.
"అది తప్పుడు సమాచారం. ఆయన మా బంధువు అస్సలు కాదు. మా చేపల దుకాణం పక్కనే ఉన్న భవనానికి ఆయన యజమాని. ఈ దొంగతనంలో పాల్గొన్న ముగ్గురూ మాకు బాగా తెలిసినవాళ్లే. వారు అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. మాకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు ఇలా చేయడం చాలా బాధాకరం" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































