SIR: ఈసీ క్లారిటీ ఇచ్చినా ఆగని వివాదం, ఇకపై జరిగేదేంటి? 5 ప్రశ్నలు

ఫొటో సోర్స్, ANI
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు.
ఎస్ఐఆర్‌తో ముడిపడిన అన్ని కీలక నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈసీ పేర్కొంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని మార్పులను కూడా కమిషన్ ప్రకటించింది. ఈ ప్రకటనను ప్రతిపక్షాలు తోసిపుచ్చగా, బీజేపీ దాని మిత్రపక్షాలు స్వాగతించాయి.
దీంతో ఈ వివాదం ఇక ఏ మలుపు తిరగనుందనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎస్ఐఆర్, ఓటరు డేటా, ఫారం-6తో ముడిపడిన అంశాలపై ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని పేర్కొంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రచురించిన తర్వాత ఈ సమావేశం జరిగింది.

ఎస్ఐఆర్‌తో ముడిపడిన ఆదేశాలు, షెడ్యూల్‌ను ముగ్గురు ఎన్నికల కమిషనర్ల సమ్మతితోనే జారీ చేసినట్టు సమావేశం తర్వాత ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే క్యాబినెట్ సెక్రటరీకి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పంపిన లేఖలకు, ఎన్నికల కమిషన్ విధానాలకు లేదా ఎస్ఐఆర్ నిర్ణయాలకు గానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
ఎన్నికల కమిషన్ చేసిన ఈ ప్రకటన కేవలం దాటవేత ధోరణిలో ఉందని కాంగ్రెస్ విమర్శించింది. తాము అడిగిన అసలు ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని పేర్కొంది. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ఆ పార్టీ తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.
మరోవైపు, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
1.ఈసీ ప్రెస్‌నోట్ పై ప్రతిపక్షాల అభ్యంతరం ఏమిటి?
ఎస్ఐఆర్‌పై ముగ్గురు ఎన్నికల కమిషనర్ల మధ్య ఏకాభిప్రాయం ఉందన్నది ఎన్నికల కమిషన్ ఇచ్చిన అత్యంత కీలకమైన సమాధానం.
ఇద్దరు ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ సెక్రటరీకి పంపిన లేఖ ఏ ఎన్నికల విధానానికి లేదా ఎస్ఐఆర్ నిర్ణయానికి సంబంధించినది కాదని కూడా కమిషన్ తెలిపింది. ఇది ఒక అధికారి పనితీరుకు సంబంధించిన వ్యవహారం. అంతేకాకుండా ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని మార్పులను కూడా కమిషన్ ప్రకటించింది.
ఈమేరకు నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకుబూత్ లెవల్ ఆఫీసర్లే (బీఎల్‌ఓ) వెళ్లి పత్రాలు సేకరించే వెసులుబాటు లభించింది. దీనివల్ల ఆ ఓటర్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌ఓ) లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌ఓ) ముందు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో కూడా విచారణ జరపొచ్చు.
ఈసీఐనెట్ (ఎన్నికల కమిషన్ పోర్టల్) స్వతంత్ర సమీక్ష కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా కమిషన్ పేర్కొంది. సమావేశాల ఎజెండాను ముందుగానే పంచుకోవడంతో పాటు మినిట్స్ జారీ చేసే విధానంపై కూడా దృష్టి పెట్టారు.
అయితే, ఫారం 6లో చేసిన మార్పులను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు "అనధికారికం, చట్టవిరుద్ధం" అని పేర్కొంటే, దానిపై స్పష్టమైన సమాధానం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
"ఈరోజు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన అత్యంత పేలవమైన, బలహీనమైన, చాలా ఆలస్యంగా వచ్చిన స్పందన" అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఎక్స్‌లో తెలిపారు.
ఫారం-6లో మార్పులు, యువ ఓటర్ల అంశం, ఈసీఐనెట్ అనే మూడు పెద్ద ప్రశ్నలకు ప్రెస్ నోట్ సమాధానం ఇవ్వలేదని ఆయన చెప్పారు.
"నిర్దుష్ట న్యాయపరమైన అభ్యంతరాలకు ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వనంత వరకు, ఎంత పొడవైన ప్రెస్ నోట్లు జారీ చేసినా, ఏకాభిప్రాయం ఉందని ఎంతగా చెప్పుకున్నా లేదా ఇంకేదైనా నాటకం ఆడినా, జ్ఞానేష్ కుమార్ గుప్తా కష్టాలు తీరవు" అని పవన్ ఖేరా ఎక్స్‌లో రాశారు.
"ఆయనకు ఇంకా సమయం మించిపోలేదు. ఆయన రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలి, లేదంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
2. ఫారం-6, యువ ఓటర్ల సంగతేంటి?
ఓటర్ల జాబితాలో కొత్త పేరును చేర్చడానికి 'ఫారం-6' ఉపయోగిస్తారు.
ఎస్ఐఆర్‌తో ముడిపడిన మార్పుల సమయంలో ఈ ఫారంలో ఒక కొత్త ప్రశ్నను చేర్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీని ద్వారా కొత్త ఓటర్లు లేదా వారి తల్లిదండ్రులు/తాతనానమ్మల పాత ఎస్ఐఆర్ రికార్డులతో సంబంధాన్ని తెలపాల్సి వచ్చింది.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం.. ఈ మార్పును ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు "అనధికారికం, చట్టవిరుద్ధం" అని పేర్కొన్నారు. ఎస్ఐఆర్‌తో ముడిపడిన ఫారం-6 డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని ఎన్నికల కమిషన్ తమ కొత్త ప్రెస్ నోట్‌లో తెలిపింది.
ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని యువ ఓటర్ల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. బిహార్, పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ తర్వాత స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) లేకుండానే ఎన్నికలు జరిగాయని, అక్కడ ఎస్ఐఆర్ సమయంలో మిగిలిపోయిన యువ ఓటర్ల పరిస్థితి ఏమిటని పవన్ ఖేరా ప్రశ్నించారు. జనవరి 2024 తర్వాత ఎస్ఎస్ఆర్ జరగకపోతే ఇక పాత ఫారం-6కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ఆయన ప్రశ్నించారు.
సెప్టెంబర్ 29-30 తేదీల్లో దిల్లీలో యువ ఓటర్ల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఎక్స్ వేదికగా దీనిని "పానిక్ రియాక్షన్" అని విమర్శించారు.
ఒకవైపు యువ ఓటర్లను చేర్చేందుకు ఎన్నికల కమిషన్ శిబిరాలు ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు దరఖాస్తుదారు తల్లిదండ్రులు లేదా తాతనానమ్మలు గత ఎస్ఐఆర్‌లో ఓటర్లుగా ఉన్నారా లేదా అని అడిగే కొత్త తప్పనిసరి నిబంధనను ఫారం-6లో చేర్చారని ఆయన ఆరోపించారు. దీనివల్ల తొలిసారి ఓటు వేయాలనుకునే జెన్-జీ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం కష్టమైందని రమేష్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
3. బీజేపీ ఏం చెప్పింది?
ఎన్నికల కమిషన్‌లోని ముగ్గురు సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, ఆ వ్యవహారం క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్లిందన్న వాదన అబద్ధమని తేలిపోయిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు.
ఎన్నికల కమిషన్ ప్రకటన ఈ ఆరోపణలను స్పష్టంగా తోసిపుచ్చిందని తెలిపారు. అధికారుల సమావేశం, పరిపాలనాపరమైన వ్యవహారాలపై జరిగిన చర్చలను ఎన్నికల కమిషన్‌లో విభేదాలుగా చిత్రీకరించడం సరికాదని సంబిత్ పాత్ర అన్నారు.
రాజ్యాంగ సంస్థలకు చెడ్డపేరు తెచ్చేందుకు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, ANI
4. ఎన్డీయే మిత్రపక్షాల వైఖరేంటి?
ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా వివరణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది "ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ" అని అభిప్రాయపడ్డారు.
దీనివల్ల రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై తలెత్తిన అపోహలు తొలగిపోతాయని చంద్రబాబు చెప్పారు.
అయితే, కమిషనర్ల అభ్యంతరాలపై స్పష్టతనివ్వాలని అంతకుముందు కొన్ని ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేశాయి.
ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వాలని, తద్వారా రాజ్యాంగ సంస్థపై ప్రజల్లో నమ్మకం నిలిచి ఉంటుందని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
5. ప్రతిపక్షాల కార్యాచరణ ఏమిటి?
సెప్టెంబర్ 30న విపక్ష ఇండి కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి. ఇందులో ఎస్ఐఆర్, ఎన్నికల కమిషన్ అంశాలతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌పై భవిష్యత్తు వ్యూహాన్ని చర్చించే అవకాశం ఉంది. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే డిమాండ్ చేసింది.
ఎన్నికల కమిషన్, ఎస్ఐఆర్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోయిందని కాంగ్రెస్ అంటోంది.
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, ఎస్ఐఆర్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
"ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి, లేదంటే మా పోరాటం కొనసాగుతుంది" అని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్ 26న సెరాంపూర్‌లో జరిగిన ర్యాలీలో పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ద్వారా బెంగాల్‌లో చట్టబద్ధమైన ఓటర్ల పేర్లను తొలగించారని, తద్వారా బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందని ఆమె ఆరోపించారు.
వెలుగులోకి మరో వివాదం
ఇదే సమయంలో కేరళ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిజి థామ్సన్ ఇటీవలి వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఉటంకిస్తూ, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తారు.
"మోదీ, షాలు జ్ఞానేష్ కుమార్‌ను అంపైర్‌గా మార్చి, భారత ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ బాధ్యతను అప్పగించారు" అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో రాశారు.
జ్ఞానేష్ కుమార్ తనకు బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారని కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీజీ థామ్సన్ పేర్కొనడం గమనార్హం. ఇద్దరం ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు 2016లో ఈ సంభాషణ జరిగిందని ఆన్ మనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
దిల్లీ వెళ్లే విమాన ప్రయాణంలో ఈ భేటీ జరిగిందని చెప్పారు. ఆ సమయంలో థామ్సన్ కేరళ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. జ్ఞానేష్ కుమార్‌తో తనకు మంచి స్నేహం ఉండేదని ఆయన చెప్పారు.
సంభాషణ సందర్భంగా.. పదవీ విరమణ తర్వాత ప్రణాళికలు ఏమిటని జ్ఞానేష్ కుమార్ అడిగారని, అయితే తాను ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు చేసుకోలేదని బదులిచ్చినట్లు థామ్సన్ చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన సూచించినట్లు థామ్సన్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిచి ఎంపీ కావొచ్చని, భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం కూడా దక్కుతుందని జ్ఞానేష్ కుమార్ చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను తాను అంగీకరించలేదని, ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లేందుకు నిరాకరించానని థామ్సన్ స్పష్టం చేశారు.
థామ్సన్ ఆరోపణలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ, జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో "మ్యాచ్ ఫిక్సింగ్" జరుగుతోందని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై జ్ఞానేష్ కుమార్ వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























