వెనెజ్వెలాలో భారీ భూకంపం, వేల మంది చనిపోయి ఉండొచ్చని యూఎస్జీఎస్ అంచనా

ఫొటో సోర్స్, Getty Images
వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో భారీ భూకంపం సంభవించింది. సెకన్ల వ్యవధిలోనే రెండుసార్లు భారీ భూప్రకంపనలు వచ్చాయి. మొదటిసారి ప్రకంపనలు 7.2 తీవ్రతతో రాగా, రెండోసారి 7.5గా నమోదైంది.
భూకంపం కారణంగా భవనాలు కూలిపోయాయి. ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ఇళ్లు ఖాళీ చేసి బయటకు వచ్చేయాలని ఆ దేశ హోం మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశముందన్న భయాందోళనలు నెలకొన్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, మృతుల సంఖ్య 10,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
వెనెజ్వెలాలో జాతీయ సెలవుదినం కావడంతో ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండే అవకాశముంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 గంటలకు ఈ భూకంపం సంభవించింది.

తొలుత 7.2 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రం రాజధాని కారకస్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని కరాబోబో రాష్ట్రంలో కేంద్రీకృతమైంది.
అనంతరం, కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరోసారి తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ భూకంపం కారణంగా ఏ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగాయనే వివరాలు తెలియాల్సి ఉంది.
భూకంపం ప్రభావం రాజధాని కారకస్పైనా కనిపించింది. భవనాలు ధ్వంసమయ్యాయి. పెట్రోల్ సరఫరా నిలిచిపోయింది. జనాలు శిథిలాల కింద చిక్కుకుపోయి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.





























