మహిళలను తమ ప్రైవేట్ పార్ట్‌ల విషయంలో ‘సిగ్గుపడేలా’ చేసింది ఎవరు? ప్రాచీన కాలంలో దాని గురించి ఆలోచనలు ఎలా ఉండేవి?

ఫొటో సోర్స్, stefano Guidi/Getty Images)
వేల సంవత్సరాలుగా మనుషులు స్త్రీల బాహ్య జననేంద్రియాలు లేదా యోని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ప్రారంభంలో ఈ భాగం సంతానోత్పత్తికి చిహ్నంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఇది ప్రమాదకరమైనదిగా, సిగ్గుపడాల్సినదిగా, దాచుకోవలసినదిగా భావించడం మొదలైంది.
ప్రస్తుతం స్త్రీ జననావయవాలను లక్ష్యంగా చేసుకుని ఒక పెద్ద పరిశ్రమే నడుస్తోంది.
యోనిని బిగుతుగా మార్చే పేరుతో ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మెటిక్ చికిత్సలు వంటి సేవలను అందిస్తున్నారు.
కళాకారులు తమ కళాఖండాలలో ఈ భాగాన్ని ప్రదర్శిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు దీనిని నిరసనలకు చిహ్నంగా వాడుతున్నారు.

మరోవైపు స్త్రీల జననేంద్రియాల సహజ నిర్మాణం వ్యక్తిని బట్టి మారుతుందని వైద్యులు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
మరి మానవ శరీరంలోని ఈ భాగం సంతానోత్పత్తి చిహ్నం నుంచి అవమానకరమైన వస్తువుగా అందానికి నిదర్శనం నుంచి రాజకీయ చిహ్నంగా ఎలా మారింది?
ఈ చరిత్రను గుర్తించడానికి ఫ్రెంచ్ వార్తాపత్రిక 'లె మోండే' ప్రయత్నించింది.
పోర్నోగ్రఫీ, సోషల్ మీడియా దీనిపై చూపుతున్న ప్రభావానికి సంబంధించిన గణాంకాలను బ్రిటిష్ పత్రిక 'ది గార్డియన్' అందించింది.
మహిళల రహస్యాంగాలపై జరుగుతున్న చర్చ కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాలేదని, అది అధికారం, అవమానం, అందం, తమ సొంత శరీరంపై తమకున్న హక్కులకు సంబంధించినదని ఈ రెండు పత్రికల కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సంతానోత్పత్తి చిహ్నం
స్త్రీ బాహ్య జననేంద్రియాన్ని ఎటువంటి సిగ్గు, దాపరికం లేకుండా కళారూపాలలో బహిరంగంగా చూపించడాన్ని నేటి కాలంలో ఊహించడం కష్టం.
కానీ వేల సంవత్సరాల కిందట మనుషులు స్త్రీ శరీరాన్ని గీసినప్పుడు లేదా శిల్పాలుగా మలిచినప్పుడు జననేంద్రియ భాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు.
ఫ్రాన్స్‌లోని ప్రాచీన 'లా ఫెరాసి' ప్రపంచంలోనే అత్యంత పురాతన గుహా చిత్రాలు ఉన్న 'చౌవెట్ గుహ'లలో దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయి.
మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ కూడా ఉంది. ఉదాహరణకు 'వీనస్ ఆఫ్ మోంపాజియర్' అనే చిన్న శిల్పంలో స్త్రీ రహస్యాంగాలను కావాలనే పెద్దవిగా చూపించారు.
మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని నొక్కి చెప్పడానికే పూర్వీకులు అలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రాచీన మెసపొటేమియాలో కూడా స్త్రీ లైంగికతను సిగ్గుచేటుగా భావించలేదు.
ఒక పురాతన గ్రంథంలో ఇష్తార్ దేవత తన ప్రియుడితో "లవ్... నా యోనిలో విత్తనాన్ని నాటండి మై లవ్" అని అంటుంది.
కానీ కాలక్రమేణా అంతా మారిపోయింది.
ప్రాచీన గ్రీస్ ఆ తర్వాత రోమ్‌లలో స్త్రీ లైంగికతను ఒక ప్రమాదకరమైన విషయంగా చూడటం ప్రారంభమైనప్పుడు ఈ పెద్ద మార్పు వచ్చిందని ప్రాచీన చరిత్రకారుడు క్రిస్టియన్-జార్జెస్ ష్వెంట్జెల్ 'లె మోండే' పత్రికతో చెప్పారు.
"గ్రీస్, రోమ్‌లలో బాహ్య యోని భాగాన్ని తిరస్కార వస్తువుగా చూడటం మొదలుపెట్టారు" అని ఆయన వివరించారు.
దీంతో కోరికలు ఉన్న స్త్రీని అణచివేయాల్సిన నియంత్రించాల్సిన వ్యక్తిగా చూడటం అలవాటు చేశారు. ఈ ఆలోచన చాలా కాలం పాటు కొనసాగింది.
పురాతన కాలం నుంచి నేటి వరకు మహిళలను ప్రదర్శించే విధానంలో "స్త్రీ రహస్యాంగాల పట్ల భయం" దాగి ఉందని సైకోఅనలిస్ట్ సారా పియాజ్జా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అందం వెనుక దాగి ఉన్న నియంత్రణ
స్త్రీ జననేంద్రియాల రూపాన్ని మార్చాలనే కోరిక ఆధునిక కాలంలోనే పుట్టలేదు.
వివిధ సంస్కృతులలో జననేంద్రియాల భాగాలను తొలగించడం లేదా వాటి రూపాన్ని మార్చడం వంటి ఆచారాలు ఉన్నాయి.
ఆధునిక కాస్మెటిక్ సర్జరీలు రాకముందే రహస్యాంగాల లోపలి పెదవుల పరిమాణాన్ని తగ్గించే శస్త్రచికిత్సల గురించి యూరోపియన్ వైద్య శాస్త్రంలో రాశారు.
నేడు మహిళలకు తమ శరీరం విషయంలో పూర్తి స్వేచ్ఛను ఉంది.
అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది 'ఆదర్శవంతమైన' స్త్రీ శరీరం ఎలా ఉండాలో సమాజం శాసిస్తూనే ఉంటే ఈ స్వేచ్ఛ నిజమైనదేనా?
వైద్యపరంగా చూస్తే, బాహ్య జననేంద్రియాలకు ఒకే ఒక 'సరైన' రూపం అంటూ ఏదీ లేదు.
రహస్యాంగాల రూపానికి ఎలాంటి వైద్య ప్రమాణాలు లేవని సెక్సాలజిస్ట్ జోయెల్ మిగ్నోట్ నొక్కి చెప్పారు.
మగవారిలో ఉన్నట్లే, ఆడవారిలో కూడా ఈ భాగాల పరిమాణం, రూపంలో చాలా తేడాలు ఉంటాయన్నారు.
అయినప్పటికీ మహిళలు తమ సాధారణ శరీరాన్ని చూసుకుని కూడా ఏదో లోపం ఉందని ఆందోళన చెందుతున్నారు.
'ఆదర్శవంతమైన బాహ్య రూపం' అనే భావనను ఎవరు సృష్టించారు?
గడిచిన కొన్ని దశాబ్దాలుగా పోర్నోగ్రఫీ పరిశ్రమ, సోషల్ మీడియా, కాస్మెటిక్ సర్జరీల ప్రకటనలు ప్యూబిక్ హెయిర్ పూర్తిగా తొలగించే ట్రెండ్ ఈ ఒత్తిడిని మరింత పెంచాయి.
దీనివల్ల 'ఆదర్శ మహిళ' రహస్యాంగం అంటే మృదువుగా జుట్టు లేకుండా ముడతలు లేకుండా గులాబీ రంగులో ఎలాంటి వాసన లేకుండా ఉండాలనే ఒక కృత్రిమ భావనను నిర్మించారు.
దీనిని 2000ల కాలంలో పుట్టుకొచ్చిన ఒక 'గోల్డ్ స్టాండర్డ్' (నకిలీ ప్రమాణం) అని గైనకాలజిస్ట్ సోఫీ బెర్విల్లే పిలుస్తున్నారు.
మహిళల రహస్యాంగాలు సహజంగానే విభిన్న రూపాల్లో ఉంటాయనే విషయాన్ని యువత సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే ఇక్కడ సమస్య అని 'ది గార్డియన్' పత్రిక పేర్కొంది.
18-24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో 23 శాతం మంది తమ రహస్యాంగాల బాహ్య రూపం పట్ల ఆందోళన లేదా సిగ్గు పడుతున్నారని వారిలో సగం మంది శస్త్రచికిత్స చేయించుకోవాలని ఆలోచిస్తున్నారని 2024లో ఆస్ట్రేలియాలో జరిగిన ఒక అధ్యయనాన్ని ‘ది గార్డియన్’ ప్రస్తావించింది.
అయితే శరీర మార్పులు కోరుకునే మహిళలందరూ కేవలం ప్రకటనలు లేదా పోర్న్ చూసి ప్రభావితమైన వారు మాత్రమే కాదు.
కొంతమంది రోగులు సంవత్సరాలుగా తమ రహస్యాంగాల రూపం గురించి తీవ్రమైన ఆత్మన్యూనతతో బాధపడుతున్నారని గైనకాలజిస్ట్ సోఫీ బెర్విల్లే చెప్పారు.
కొందరు తమ పార్ట్‌నర్ ముందు దుస్తులు విప్పడానికి సిగ్గుపడతారని మరికొందరు శృంగారానికి పూర్తిగా దూరంగా ఉంటారని తెలిపారు.
శస్త్రచికిత్స తర్వాత అలాంటి వారిలో మానసిక స్థితి లైంగిక జీవితం మెరుగయ్యాయని ఆమె వివరించారు.
కాబట్టి ఇక్కడ ప్రశ్న 'యోనిని బిగుతుగా మార్చే సర్జరీ చేయించుకోవాలా వద్దా' అనేది కాదు.
ఆ వ్యక్తి శస్త్రచికిత్సలోని ప్రమాదాలను, దుష్ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకున్నారా లేదా, అది వారి సొంత నిర్ణయమేనా అనేది ముఖ్యం.
ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ ప్రభావం వల్ల ప్రజలు తమ సహజ శరీరాన్ని అంగీకరించలేక పోతున్నారని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్‌టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ హెచ్చరించింది.
అంతేకాకుండా ఈ భాగంలో చేసే అనేక కాస్మెటిక్ సర్జరీల భద్రత వాటి సామర్థ్యానికి సంబంధించి తగినంత వైద్య ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
సిగ్గు నుంచి అవగాహన వైపు..
ఈ కథ ఇక్కడే ఊహించని మలుపు తిరుగుతుంది.
చాలా కాలం పాటు దాచవలసి వచ్చిన శరీరం, ఇప్పుడు బహిరంగ నిరసనలకు వేదికగా మారింది.
1969లో మ్యూనిచ్‌లోని ఒక సినిమా థియేటర్‌లోకి ఆస్ట్రియన్ కళాకారిణి వాలి ఎక్స్‌పోర్ట్ ఒక విభిన్నమైన దుస్తులు ధరించి ప్రవేశించారు.
స్త్రీ శరీరాన్ని పురుషుల దృష్టితో మాత్రమే చూసే విధానాన్ని ప్రశ్నించడానికి, చర్చను లేవనెత్తడానికి ఆమె ఈ పని చేశారు.
స్క్రీన్‌పై కేవలం ఒక శృంగార వస్తువుగా కాకుండా ఒక నిజమైన స్త్రీ రూపాన్ని ప్రజల ముందుకు తెచ్చారామె.
1970లలో, ఫెమినిస్ట్ కళాకారులు మహిళల హక్కులు, శరీరం వారి స్వయం నిర్ణయాధికారాన్ని ప్రశ్నించడానికి తమ కళాఖండాలలో స్త్రీ జననేంద్రియాల చిత్రాలను స్పష్టంగా ఉపయోగించడం ప్రారంభించారు.
ఈ ఉద్యమంలో జూడీ చికాగో వంటి కళాకారులు ప్రముఖ పాత్ర పోషించారు.
కళా విమర్శకురాలు సిండి నెమ్సర్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు.
కాలక్రమేణా ఈ అంశం కేవలం కళకే పరిమితం కాలేదు.
2019లో ఆర్టిస్ట్ డెబోరా డి రాబర్టిస్ యూరోపియన్ పార్లమెంట్ ముందు నగ్నంగా నిలబడి అధికార పదవుల్లో మహిళలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని నిరసన తెలిపారు.
అదే సమయంలో శరీర భాగాల పట్ల ఉన్న సిగ్గును జ్ఞానంగా మార్చే ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
2011లో జేమీ మెక్‌కార్ట్నీ అనే కళాకారుడు స్త్రీ శరీరాల వైవిధ్యాన్ని చూపించడానికి 400 మంది మహిళల రహస్యాంగాల ఆకృతులతో 'ది గ్రేట్ వజైనా వాల్' అనే కళాఖండాన్ని సృష్టించారు.
2016లో, స్త్రీ జననేంద్రియాల వివిధ రూపాలను చిత్రాలతో వివరించే ‘ది వల్వ గ్యాలరీ’ (యోని ప్రదర్శనశాల) అనే ఆన్‌లైన్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
అలాగే 2019లో లండన్‌లో "వజైనా మ్యూజియం" ప్రారంభించారు.
ఈ మ్యూజియం స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రం, ఆరోగ్యం, మహిళల శరీరం పట్ల సమాజ అభిప్రాయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.
ఇప్పుడు స్త్రీ రహస్యాంగం మళ్లీ బహిరంగంగా చర్చకు వస్తోంది. అయితే ఈసారి కారణం వేరు. స్వేచ్ఛను డిమాండ్ చేసేందుకు అదొక ప్రదర్శనాంశంగా మారింది.
సమాజంలో ఉన్న సిగ్గును తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రతి వ్యక్తికి తమ శరీరంపై పూర్తి హక్కు ఉందని, అది ఒక శక్తి అని చాటిచెప్పడానికి కళారూపాల్లో దీనిని వాడుతున్నారు.
ఇప్పుడు "బాహ్య యోని భాగం ఎలా ఉండాలి?" అనే ప్రశ్న లేదు.
అవి రకరకాల రూపాల్లో విభిన్న ఆకృతుల్లో ఉంటాయి. అలా ఉండటం సహజం కూడా.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























