పాలస్తీనా చిన్నారులు లక్ష్యంగా ఇజ్రాయెల్ జాతిహననానికి పాల్పడుతోంది: ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్

యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, యూఎన్ విచారణ కమిషన్ ప్రకారం, గాజా యుద్ధంలో మరణించిన వారిలో దాదాపు 30 శాతం మంది చిన్నారులే ఉన్నారు.
    • రచయిత, డేవిడ్ గ్రిటెన్, స్టెఫానీ హెగర్టీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే పాలస్తీనా పిల్లలను లక్ష్యంగా చేసుకుందని, ఫలితంగా జాతిహననం(జెనోసైడ్), మానవాళి వ్యతిరేక నేరాలు, గాజా స్ట్రిప్‌లో యుద్ధనేరాలు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోనూ యుద్ధనేరాలు జరిగాయని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ తెలిపింది.

ఇజ్రాయెల్ అధికారులు, భద్రతా బలగాలు పాలస్తీనాకు చెందిన వందలు, వేలాది మంది పిల్లలకు శారీరక, మానసిక హాని కలిగించే, వాళ్ల మరణానికి కారణమయ్యే చర్యలను ఉద్దేశపూర్వకంగా చేపట్టినట్లు కొత్త నివేదిక ఆరోపించింది. గత అక్టోబర్‌లో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఈ హత్యలు కొనసాగాయని వెల్లడించింది.

గాజాలో పాలస్తీనియన్ల భవిష్యత్తును ధ్వంసం చేసే ఉద్దేశపూర్వక వ్యూహంలో భాగంగానే పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలు చేపట్టారనడానికి తగిన ఆధారాలున్నాయని కమిషన్ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోపణల్లో నిజం లేదు - ఇజ్రాయెల్

కమిషన్ నివేదికను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిని ''పరువునష్టం కలిగించే తప్పుడు ఆరోపణ'', ''గతంలోలాగే అసంబద్ధమైన ప్రచార నివేదిక''గా పేర్కొంది.

దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలో 2023 అక్టోబర్ 7న జరిగిన దాడిలో 1,200 మంది చనిపోయారు. 251మందిని బందీలుగా పట్టుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు ప్రారంభించింది.

అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 73,035 మంది చనిపోగా, వారిలో 21,280 మంది చిన్నారులు. హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ ఈ లెక్కలు వెల్లడించింది. ఈ గణాంకాలను ఐక్యరాజ్యసమితి విశ్వసనీయమైనవిగా పరిగణిస్తోంది.

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు, ఇజ్రాయెల్‌లో అంతర్జాతీయ మానవతా చట్టాలు, మానవ హక్కుల చట్టాల ఉల్లంఘనలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌ను 2021లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ ఏర్పాటు చేసింది.

ఈ ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ ఐక్యరాజ్యసమితి తరఫున అధికారిక ప్రకటనలు చేయదు.

యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాలో ఇజ్రాయెల్ జాతిహననానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ ఆరోపించింది.

‘పాలస్తీనా భవిష్యత్తును దెబ్బతీస్తోంది’

గాజాలో పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జాతిహననానికి పాల్పడుతోందని గత సెప్టెంబర్‌లో కమిషన్ ఆరోపించింది. 1948 జెనోసైడ్ ఒప్పందం ప్రకారం, జాతిహననంగా నిర్వచించిన ఐదింటిలో నాలుగు చర్యలు ఇజ్రాయెల్ అధికారులు, భద్రతా బలగాలు చేపట్టినట్టు సరైన ఆధారాలున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఆ నివేదికను ఇజ్రాయెల్ బలంగా తిప్పికొట్టింది. అది వాస్తవాలను వక్రీకరించిన తప్పుడు నివేదికని పేర్కొంది.

2023 అక్టోబర్ 7న హమాస్, పాలస్తీనా సాయుధ సంస్థలు యుద్ధనేరాలకు పాల్పడ్డాయని, అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించాయని కమిషన్ గతంలో తెలిపింది. అలాగే, ఇజ్రాయెల్ భద్రతా బలగాలు గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని వెల్లడించింది.

యుద్ధాన్ని ముగించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలో భాగంగా గత అక్టోబరులో ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.

అప్పటి నుంచి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని రెండు పక్షాలూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అప్పటి నుంచి 1,020 మందికిపైగా పాలస్తీనియన్లను చంపేశారని, వారిలో 265 మంది చిన్నారులున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. నలుగురు సైనికులను చంపేశారని ఇజ్రాయెల్ సైన్యం కూడా చెబుతోంది.

గాజాలో తీవ్రమైన, వ్యవస్థీకృత పద్ధతిలో ఇజ్రాయెల్ మిలిటరీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, దీనివల్ల ఊహించని స్థాయిలో పాలస్తీనా చిన్నారులు మరణిస్తున్నారని, గాయపడుతున్నారని, మానసికవేదనకు గురవుతున్నారని నివేదికతో పాటు మంగళవారం(జూన్ 23) విడుదల చేసిన ప్రకటనలో విచారణ కమిషన్ వెల్లడించింది.

''కాల్పుల విరమణ ఒప్పందాన్ని, అంతర్జాతీయ చట్టం కింద పాలస్తీనా పిల్లలకు కల్పించాల్సిన రక్షణను ఇజ్రాయెల్ గౌరవించకపోవడంతో అక్టోబర్ 2025 కాల్పుల విరమణ తర్వాత కూడా పిల్లలు మరణించడం, గాయాలపాలవ్వడం కొనసాగుతోంది'' అని కమిషన్‌కు నేతృత్వం వహించిన భారతీయ న్యాయశాస్త్ర కోవిదులు శ్రీనివాసన్ మురళీధర్ చెప్పారు.

పాలస్తీనా పిల్లల రక్షణ, భద్రత, మనుగడ పాలస్తీనా స్వయం నిర్ణయాధికారంతో ముడిపడే ఉన్నాయని ఆయన చెప్పారు. పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పాలస్తీనా ప్రజల భవిష్యత్తును నిర్ణయించే సామర్థ్యంపై ఇజ్రాయెల్ దాడి చేస్తోందని అన్నారు.

యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆకలిని యుద్ధ ఆయుధంగా ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందని కమిషన్ తెలిపింది.

‘ఆకలి యుద్ధ ఆయుధం’

క్వాడ్‌కోప్టర్ డ్రోన్లు, స్నైపర్లు వంటి ఆయుధాలతో గాజాలో పిల్లల శరీరాల్లోని కీలక అవయవాలపై ఇజ్రాయెల్ కాల్పులు జరుపుతోందని, వారిని లక్ష్యంగా చేసుకుందని కమిషన్ కొత్త రిపోర్ట్ తెలిపింది. పిల్లలు ఎక్కువగా ఉండే నివాస భవనాలు, స్కూళ్లు, శరణార్థి శిబిరాల్లో తీవ్రప్రభావం చూపే ఆయుధాలతో దాడులు చేస్తోందని వెల్లడించింది.

వెస్ట్‌ బ్యాంక్‌లో సెటిలర్లు, ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా పిల్లలను లక్ష్యంగా చేసుకోకుండా నివారించడంలో విఫలమవుతున్నందుకు ఇజ్రాయెల్ కూడా చట్టపరంగా బాధ్యత వహించాలని తెలిపింది.

గాజా, వెస్ట్ బ్యాంక్‌ల్లో పిల్లలను.. ప్రత్యేకించి యుక్తవయసుకొచ్చిన అబ్బాయిలను అరెస్టు చేసి, ఇజ్రాయెల్ జైళ్లలో, నిర్బంధ కేంద్రాల్లో హింసిస్తున్నారని, వారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారని కూడా రిపోర్టు తెలియజేసింది. అరెస్టుల సమయంలోనూ, నిర్బంధంలోనూ పాలస్తీనా పిల్లలను లక్ష్యంగా చేసుకుని లైంగిక, లింగ ఆధారిత హింసకు పాల్పడిన ఘటనలను నమోదు చేసినట్టు నివేదిక తెలిపింది.

గాజాలోని నవజాతశిశువుల, చిన్నారుల ఆస్పత్రులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని రిపోర్టు వెల్లడించింది. ప్రాణాలు కాపాడే వైద్యసేవలు పిల్లలకు అందకుండా, ఆరోగ్య వ్యవస్థను క్రమబద్ధంగా నాశనం చేస్తోందని, తద్వారా వారి మనుగడనే దెబ్బతీస్తోందని తెలిపింది.

ఆకలిని ఓ యుద్ధ ఆయుధంగా ఇజ్రాయెల్ ఉపయోగిస్తోందని కూడా ఆరోపించింది. మానవతాసాయం గాజాలో ప్రవేశించకుండా విధిస్తున్న నిబంధనల వల్ల గాజాలోని పిల్లల్లో తీవ్రమైన, దీర్ఘకాలిక పోషకాహారలోపం ఏర్పడిందని హెచ్చరించింది. ఇది పిల్లలు జీవించడానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితులు లేకుండా చేసిందని ఆరోపించింది.

స్కూళ్లపై దాడులు, ప్రజలను భారీగా ఒక చోట నుంచి మరో చోటకు తరలించడం, విద్యాసంస్థలను బలవంతంగా మూసివేయడం ద్వారా పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని ఇజ్రాయెల్ అధికారులు క్రమబద్ధంగా దెబ్బతీస్తున్నారని, దీనివల్ల పాలస్తీనా సమాజం మేధో, సామాజిక పునాదులు దానంతటవే బలహీనపడుతున్నాయని ఆరోపించింది.

యుద్ధం, ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా, హమాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విచారణ కమిషన్ నివేదికలో చెప్పిన విషయాలను ఇజ్రాయెల్ ఖండించింది.

‘ఇజ్రాయెల్‌కు చెడ్డపేరు తేవడమే లక్ష్యం’

ఈ రిపోర్టును ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఖండించింది. నిజాన్ని తెలుసుకోవడం కాకుండా ఇజ్రాయెల్‌కు చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా చేసుకుని ఈ కమిషన్ పనిచేస్తోందని ఆరోపించింది.

''దారుణంగా హత్యకు గురైన, కిడ్నాప్ అయిన, హమాస్ లక్ష్యంగా చేసుకున్న పిల్లల వివరాలను కమిషన్ పూర్తిగా తొలగించింది. పాలస్తీనా పిల్లలను హమాస్ మావన రక్షణ కవచాలుగా, యుద్ధంలో పావులుగా ఉపయోగించిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు'' అని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది. తన ఆరోపణలను నిర్ధరించడానికి కమిషన్ దగ్గర విశ్వసనీయమైన ధ్రువీకరణ విధానం లేదని ఆరోపించింది.

జాతిహననం ఆరోపణలను ఇజ్రాయెల్ నాయకులు పదే పదే తిరస్కరిస్తున్నారు. ఆత్మరక్షణ కోసమే గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ కార్యకలాపాలు చేపట్టిందని, హమాస్‌ను, పాలస్తీనా ఇతర సాయుధ గ్రూపులను ఓడించేందుకు, ఇజ్రాయెల్ బందీల విడుదల కోసమే వాటిని కొనసాగించిందని అంటున్నారు.

అంతర్జాతీయ చట్టం ప్రకారమే తమ బలగాలు పనిచేస్తున్నాయని, సాధారణ ప్రజలకు హాని కలగకుండా సాధ్యమైనన్ని చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.

ఇజ్రాయెల్ బలగాలు మారణహోమానికి పాల్పడ్డాయని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికా వేసిన కేసును ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) విచారణ జరుపుతోంది. అయితే, తుదితీర్పు రావడానికి కొన్నేళ్లు పట్టే అవకాశముంది.

ఈ కేసు పూర్తిగా ఆధార రహితమైందని ఇజ్రాయెల్ అంటోంది. పక్షపాతపూరితమైన, తప్పుడు ఆరోపణలపై ఈ కేసు ఆధారపడి ఉందని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)