అగ్నిపర్వతాలను కెమెరాలో బంధించాలనే తపన ప్రాణాల మీదకు తెస్తోందా?

 జొనాథన్ లే బ్లాంక్, డుకోనో, అగ్నిపర్వతాల వద్ద విషవాయువులు, ఇండోనేషియా
ఫొటో క్యాప్షన్, గతేడాది డుకోనో అగ్నిపర్వత బిలం అంచున జొనాథన్ లే బ్లాంక్.
    • రచయిత, కెవిన్ కిమ్, ఎలియనోర్ స్మాల్‌వుడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

కంటెంట్ క్రియేటర్ జొనాథన్ లే బ్లాంక్ ఇండోనేషియాలోని 1,273 మీటర్ల ఎత్తైన డుకోనో అగ్నిపర్వతం ఎక్కుతుండగా, తన పాదాల కింద భూమి కంపిస్తోందని గ్రహించారు.

శిఖరం వద్ద అగ్నిపర్వత బిలం అంచు నుంచి చూస్తున్నప్పుడు, అత్యంత వేడి వాయువులు, బూడిద ఆకాశంలోకి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న దృశ్యాలను ఆయన కెమెరా బంధించింది.

హఠాత్తుగా జోనాథన్ నోటికి మాస్క్ పెట్టుకుని, వేగంగా కొండ దిగువకు మళ్లారు.

"ఇక్కడ విష వాయువులున్నాయి. మనం వెంటనే పారిపోవాలి" అని కెమెరావైపు తిరిగి చెబుతూ, కాళ్లు జారుతున్నా లెక్కచేయకుండా వేగంగా కిందికి పరుగులు తీశారు.

కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా యూజర్లకు అగ్నిపర్వతాలు అద్భుతమైన లొకేషన్లుగా కనిపించవచ్చు. కానీ, కొందరు సాహస ప్రియులు హెచ్చరికలను పట్టించుకోకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"అగ్నిపర్వతాలను చాలామంది ప్రత్యక్షంగా చూడలేరు. అందుకే వాటిని వీడియో తీయడం ఆసక్తికరంగానే ఉంటుంది’’ అని లే బ్లాంక్ ఒక వీడియో కాల్‌లో అన్నారు.

"ఏదైనా ప్రమాదకరమైన ప్రదేశంలో తీస్తున్న సినిమాలో మనం కూడా ఉన్నట్లే అనిపిస్తుంది. సాహసాలను ఇష్టపడేవారు అక్కడికి వెళ్లడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తారో అర్థం చేసుకోగలను" అని ఆయన అన్నారు.

లే బ్లాంక్ ప్రపంచవ్యాప్తంగా చేరుకోవడానికి కష్టమైన మారుమూల ప్రదేశాలకు వెళ్లి వీడియోలు చేసే ట్రావెల్ బ్లాగర్. ఆన్‌లైన్‌లో ఆయన వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి.

 జొనాథన్ లే బ్లాంక్, డుకోనో, అగ్నిపర్వతాల వద్ద విషవాయువులు, ఇండోనేషియా
ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలోని నార్త్ మలుకులోని డుకోనో అగ్నిపర్వతం మే నెలలో విస్ఫోటనం చెంది, 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆకాశంలోకి బూడిద వెదజల్లింది.

డుకోనో విషాదం

లే బ్లాంక్ గతేడాది ఏప్రిల్‌లో డుకోనో అగ్నిపర్వతాన్ని అధిరోహించారు. కొన్ని నెలల క్రితం ఇదే ప్రదేశంలో ఓ విషాదం చోటుచేసుకుంది.

పర్వతారోహణపై కొద్దివారాల ముందే నిషేధం విధించినప్పటికీ, దాన్ని లెక్కచేయకుండా మే నెలలో అగ్నిపర్వత బిలం వద్దకు వెళ్లిన ముగ్గురు పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు.

ఆ బృందం హెచ్చరికలను బేఖాతరు చేసిందని స్థానిక పోలీసులు తెలిపారు.

"(పర్వతారోహకుల్లో) ఎక్కువ మంది సోషల్ మీడియా కోసం కంటెంట్ క్రియేట్ చేయాలనుకునే విదేశీ పర్యటకులే" అని పోలీసులు తెలిపారు.

అయితే, తన సోదరుడు కేవలం సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం కోసమే ఆ యాత్రకు వెళ్లలేదని, ప్రకృతి అంటే ఆయనకు ఎంతో ఇష్టమని మరణించిన పర్యటకుల్లో ఒకరి సోదరి స్థానిక మీడియాతో చెప్పారు.

స్థానిక నిబంధనలను పాటిస్తానని, స్థానిక గైడ్‌లు వెళ్లడానికి నిరాకరించిన ప్రాంతాలకు తీసుకెళ్లాలని వారిని ఎప్పుడూ అడగనని లే బ్లాంక్ అన్నారు.

"మేం భద్రతాపరమైన అంశాలపై చాలా దృష్టి పెడతాం. అలాగే, ఆసక్తికరమైన వీడియోలు తీయడం మధ్య సమతుల్యత పాటించడానికి ప్రయత్నిస్తాం" అన్నారాయన.

కానీ, మరికొందరు ఇంతకంటే పెద్ద రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.

ఇండోనేషియా మౌంటెన్ గైడ్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం.. 2022 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు పర్వతారోహణ ప్రాంతాల్లో 116 మంది మరణించారు. అందులో 27 మంది అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండటంతో, ఇలాంటి అత్యవసర సమయాల్లో స్పందించే స్థానిక సహాయక సిబ్బంది తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.

 జొనాథన్ లే బ్లాంక్, డుకోనో, అగ్నిపర్వతాల వద్ద విషవాయువులు, ఇండోనేషియా
ఫొటో క్యాప్షన్, ఆగమ్ రింజానీ అనేక క్లిష్టమైన సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

రక్షిస్తున్న సమయంలోనూ వీడియోలే

అగ్నిపర్వత యాత్రలు విఫలమైతే ఏం జరుగుతుందో ఆగమ్ రింజానీకి చాలా బాగా తెలుసు.

2025లో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌లో ప్రాణాలను పణంగా పెట్టిన ఇండోనేషియా సహాయక సిబ్బందిలో ఆయనొకరు. ఆ ఘటన ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. 3,726 మీటర్ల ఎత్తైన రింజానీ అగ్నిపర్వత బిలంలో పడిపోయిన 26 ఏళ్ల బ్రెజిలియన్ టూరిస్ట్ జూలియానా మారిన్స్ మృతదేహాన్ని ఇండోనేషియా బృందం వెలికితీసింది. ఆ సమయంలో ఆగమ్ ధైర్యసాహసాలకు ఆన్‌లైన్‌లో ప్రశంసలు లభించాయి. కానీ, ఆ మిషన్‌లో ఎదురైన ప్రమాదాలు ఆయన మదిలో అలాగే నిలిచిపోయాయి.

"ఆ తరలింపు తర్వాత, నేను ఇంకా బతికే ఉన్నాను.. దేవునికి కృతజ్ఞతలు. అది చాలా భయానకంగా ఉంది, ఇకపై ఈ పనులు చేయకూడదని నాకు నేను చెప్పుకున్నా" అని ఆగమ్ అన్నారు.

"కానీ ఆ తర్వాత, ఇటీవల మకాస్సర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బాధితుడిని రక్షించడానికి నాకు ఫోన్ రాగానే అక్కడికి వెళ్లాను. వెళ్లకుండా ఉండలేను" అన్నారు.

తమను రక్షిస్తున్న సమయంలో కూడా కొందరు పర్వతారోహకులు ఫోన్లలో వీడియోలు తీస్తూనే ఉంటారని, అందులో కొండపై నుంచి 200 మీటర్ల కింద పడిపోయిన ఒక వ్యక్తి కూడా ఉన్నారని ఆగమ్ చెప్పారు.

"ఆయన చేసిన మొదటి పని రికార్డింగ్ ప్రారంభించడానికి తన ఫోన్ కోసం వెతకడం. నేను 'వద్దు' అని చెప్పి, ఆయన శరీరానికి రెస్క్యూ హార్నెస్‌ను అమర్చాను" అన్నారు.

సరైన ఏర్పాట్లు లేకుండా వచ్చే ట్రావెలర్స్ తమకే కాకుండా అత్యవసర సహాయక సిబ్బందికి కూడా ప్రమాదాలు కొనితెస్తారని ఆగమ్ ఆందోళన చెందుతున్నారు.

"మీరు భద్రతపై శ్రద్ధ వహించనప్పుడు, అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ చుట్టుపక్కల వారిని, రెస్క్యూ టీమ్‌ను, వారి కుటుంబాలను, అధికారులను కూడా ఇబ్బంది పెడుతుంది. ప్రమాదం జరిగినప్పుడు, అది చాలామందిపై తీవ్రమైన భారాన్ని మోపుతుంది" అన్నారు.

 జొనాథన్ లే బ్లాంక్, డుకోనో, అగ్నిపర్వతాల వద్ద విషవాయువులు, ఇండోనేషియా
ఫొటో క్యాప్షన్, డుకోనో అగ్నిపర్వతం ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి.

ఇండోనేషియాలోని 'సెంటర్ ఫర్ వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్' అధిపతి సితి సుమిలా రీటా సుసిలావతి కూడా రింజానీ ఆందోళనలతో ఏకీభవిస్తున్నారు.

కొందరు కోరుకుంటున్నట్లు ప్రమాదకరమైన ప్రదేశాల సందర్శనపై నిషేధం విధించడం కంటే, బాధ్యతాయుతమైన అగ్నిపర్వత పర్యటకం గురించి, సురక్షితమైన సందర్శన విధానాల గురించి ప్రచారం చేయడంలో కంటెంట్ క్రియేటర్లు మరింత చొరవ చూపాలని ఆమె కోరుకుంటున్నారు.

"బాధ్యతాయుతమైన రీతిలో పర్వతాల అందాలను ఎలా ఆస్వాదించాలో ప్రచారం చేయడంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు సహాయపడాలని మేం కోరుకుంటున్నాం" అని సితి అన్నారు.

"మన భద్రత పట్ల మాత్రమే కాకుండా, మన చర్యల వల్ల ప్రభావితమయ్యే ఇతరుల పట్ల కూడా మనం బాధ్యతగా వ్యవహరించాలి. మీరు నిజంగానే అగ్నిపర్వతాలను అన్వేషించే వారైతే (వోల్కనో హంటర్స్), కచ్చితంగా మీ బాధ్యతలు మీకు తెలిసి ఉండాలి" అన్నారామె.

ఇండోనేషియా దీవుల్లో విస్తరించి ఉన్న డజన్ల కొద్దీ అద్భుతమైన క్రియాశీల అగ్నిపర్వతాలు ఎప్పటిలాగే సాహసాలు చేయాలనుకునే ఆసక్తిపరులను ఆకర్షిస్తూనే ఉంటాయి. అద్భుతమైన షాట్ కోసం అన్వేషించే కంటెంట్ క్రియేటర్ల భద్రతను కాపాడుతూనే, వారికి ఈ ప్రాంతాల సందర్శన అవకాశం కల్పించడం అధికారులకు సవాలుగా మారింది.

(అదనపు రిపోర్టింగ్: సిల్వానో హాజిద్ మౌలానా)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)