'క్షిపణులైతే సమయానికి చేరుకుంటున్నాయి..' ఐరాసలో నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రసంగానికి ప్రశంసలు

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సాధారణంగా అందరి దృష్టి అగ్రరాజ్యాలపైనే ఉంటుంది. కానీ, ఈసారి చర్చల కేంద్రబిందువుగా నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా నిలిచారు. సెప్టెంబర్ 24న ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో 36 ఏళ్ల ఈ యువ ప్రధాని చేసిన ప్రసంగం విశేష ప్రశంసలు అందుకుంటోంది.
ముఖ్యంగా బాలెన్ షా చేసిన ఈ రెండు వాక్యాలకు అత్యంత ఆదరణ లభిస్తోంది- "మనం కలిగించని వాతావరణ మార్పుల ప్రభావాన్ని మనం ఎదుర్కొంటున్నాం. అలాగే మనం మొదలుపెట్టని యుద్ధాల వినాశనాన్ని కూడా భరిస్తున్నాం"
"యుద్ధాలకు అత్యుత్తమ లాజిస్టిక్స్ ఉండి, ఆహార సరఫరాకు అత్యంత అధ్వాన్నమైన లాజిస్టిక్స్ ఉన్న ప్రపంచాన్ని మనం సృష్టించుకున్నాం".
"ప్రపంచ ప్రస్తుత పరిస్థితిని ఇంతకంటే ప్రభావవంతంగా వర్ణించడం బహుశా కష్టం" అని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ (థింక్ ట్యాంక్) తుర్కిష్ ప్రోగ్రామ్ వ్యవస్థాపక డైరెక్టర్ గోనుల్ టోల్ అన్నారు
ఈ ఏడాది మార్చిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా న్యూయార్క్ చేరుకున్న బాలెన్ షా.. రెండు పెద్ద యుద్ధాల మధ్య చిక్కుకున్న ప్రపంచంలో, వాతావరణ మార్పుల దెబ్బకు నేపాల్ ఎదుర్కొంటున్న విషాదాన్ని తన ప్రసంగం ద్వారా గుర్తుచేశారు. ఇది యావత్ ప్రపంచానికే ఒక హెచ్చరిక అన్నారు.
ఆగస్టు నెలలో నేపాల్‌లోని భోటేకోషీ, త్రిశూలీ నదులకు వచ్చిన వరదల కారణంగా కనీసం 1400 మంది మరణించగా, మరో 6,000 మంది ఆచూకీ నేటికీ లభించలేదు.


ఫొటో సోర్స్, @UN_Spokesperson
బాలెన్ షా ఏమన్నారంటే..
నేపాల్‌లో భయంకరమైన వరదలు సృష్టించిన విధ్వంసాన్ని బాలెన్ షా గుర్తుచేస్తూ, ''ఖండాంతర క్షిపణులు సమయానికి చేరుకుంటాయి. రైఫిల్స్, మందుగుండు సామగ్రి అన్ని అడ్డంకులను దాటుకుని నిర్దేశిత సమయానికి చేరుకుంటాయి. కానీ, నేపాల్‌లోని ఒక రైతు అవసరమైన సమయంలో మార్కెట్ ధరకు ఎరువులు లేదా ఇంధనాన్ని కొనలేడు. యుద్ధానికి లాజిస్టిక్స్ అత్యుత్తమంగా ఉండి, ఆహార సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిన ప్రపంచాన్ని మనం సృష్టించుకున్నాం" అన్నారు.
"ఈ రోజు నేను ఇక్కడ కేవలం అభివృద్ధి, ప్రజాస్వామ్యం, శాంతి, ఒక యువ దేశం ఆశల గురించి మాట్లాడటానికి నిలబడి ఉంటే బాగుండేది. కానీ, దానికి బదులుగా భారీ స్థాయిలో జరిగిన మరణాలు, విధ్వంసం గురించి మాట్లాడాల్సి వస్తోంది" అని బాలెన్ షా అన్నారు.
"ఇంటికి ఎప్పటికీ తిరిగి రాని తమ ఆత్మీయుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల గురించి మాట్లాడాల్సి వస్తోంది. బహుశా ఎప్పటికీ దొరకని మృతదేహాల కోసం బురద, రాళ్లు, నీళ్ల మధ్య వెతుకుతున్న వర్గాల గురించి చెప్పాల్సి వస్తోంది. వరద నీటిలో కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, పాఠశాలలు, ఇళ్లు, ప్రాణాల గురించి మాట్లాడాల్సి వస్తోంది" అన్నారు.
బాలెన్ షా ఇంకా మాట్లాడుతూ, "భోటేకోషీ, త్రిశూలీ నదుల వరదలు కేవలం స్థానిక విషాదం కాదు, ఇవి యావత్ ప్రపంచానికి ఒక హెచ్చరిక. మనం ఆ హెచ్చరికను నిజంగానే విన్నామా అని ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మూడేళ్ల కిందట మౌంట్ ఎవరెస్ట్ నీడలో నిలబడి, వాతావరణ విపత్తు సంక్షోభానికి కారణమవుతున్న పిచ్చితనంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మానవాళిని హెచ్చరించారు"
"కానీ, ప్రపంచపు పైకప్పు మీద నుంచి వినిపించిన ఆ గళం ప్రపంచానికి సరిగ్గా వినిపించలేదు. నేపాల్‌లో మేం ఆ గళం విన్నాం. మా సమాజం విన్నది, శాస్త్రవేత్తలు విన్నారు. ఈ ముప్పును ఆధారాలతో సహా వారు ప్రపంచం ముందు చాలాసార్లు ఉంచారు"
"అభద్రతలో ఉన్న, ఆపదలో ఉన్న ప్రజలకు అవసరమైన వేగంతో, భారీ స్థాయిలో ఆ హెచ్చరికలను కచ్చితమైన చర్యలుగా మార్చడంలో ప్రపంచ దేశాల నాయకులమైన మనం నిర్లక్ష్యం వహించాం. గత నెలలో ఈ నిర్లక్ష్యానికి సంబంధించిన విషాదకరమైన ఫలితాలను మనం చూశాం. వాతావరణ మార్పులకు సరిహద్దులు తెలియవు. హిమానీనదాలు, వరదలు పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపులు వేయించుకుని సరిహద్దులు దాటవు"
"నేను ఇక్కడ ఫిర్యాదు చేయడానికి రాలేదు, కొన్ని సూచనలు పంచుకోవడానికి వచ్చాను. ముందుగా, ఈ విపత్తు తర్వాత నేపాల్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారందరికీ నేపాల్ తరఫున నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పొరుగు దేశాలైన భారత్, చైనా తక్షణమే, ఉదారంగా సహాయం చేశాయి"
"కానీ, ఈ విపత్తు నేపాల్ సరిహద్దులకు ఆవల కూడా ఎందుకు ముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో నేపాల్ వాటా 0.1 శాతం కంటే తక్కువే. ఈ సంక్షోభాన్ని మనం సృష్టించలేదు, అయినా దానికి మనం చాలా పెద్ద మూల్యం చెల్లించుకుంటున్నాం"
"మన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. మన కొండ చరియలు అస్థిరంగా మారుతున్నాయి. మన నదుల ప్రవాహాన్ని అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ప్రతి పెద్ద విపత్తు సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధిని తుడిచిపెట్టే ప్రమాదాన్ని సృష్టిస్తోంది. నేపాల్‌కు వాతావరణ విపత్తు కేవలం మానవీయ సంక్షోభం మాత్రమే కాదు, అభివృద్ధికి సంబంధించిన తీవ్రమైన అత్యవసర పరిస్థితి కూడా"
"వాతావరణ న్యాయం (క్లైమేట్ జస్టిస్) కేవలం ఐక్యరాజ్యసమితి పత్రాల్లో రాసి ఉన్న ఒక అందమైన మాటగా మిగిలిపోకూడదు. మన దేశ ప్రజలకు తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం దక్కాలి, అంతేగానీ పదేపదే తమ ఛిద్రమైన గతాన్ని పునర్నిర్మించుకోవడంలోనే వారు బిజీగా ఉండిపోకూడదు"
"ఈ వర్షాకాలంలో నేపాల్‌లోని ఒక పేద రైతు తన పొలంలో విత్తనాలు నాటడానికి వెళ్ళినప్పుడు అతనికి సమయానికి ఎరువులు దొరకలేదు. మనం కొత్త హైవే నిర్మించాలనుకున్నప్పుడు తారు లేదు. ఒక కుటుంబం రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు వంట ఇంధనం కొరత ఉంది"
"ఒకవైపు కరుగుతున్న హిమానీనదాలు, నాశనమవుతున్న పంటలు, ఎలాంటి హెచ్చరికలు లేకుండా ముంచెత్తుతున్న వరదలు ఉన్నాయి. మరోవైపు పేద ప్రజల నియంత్రణలో లేని కారణాలకు వారి నుంచే మూల్యం వసూలు చేస్తున్న గ్లోబల్ సప్లై చైన్ ఉంది. ఖండాంతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరిహద్దులు దాటి సమయానికి చేరుకుంటాయి. కానీ, నేపాల్ రైతు సమయానికి మార్కెట్ ధరకు ఎరువులు లేదా ఇంధనం కొనుక్కోవడానికి నోచుకోలేడు"
"ఇది కేవలం నేపాల్ బాధ మాత్రమే కాదు. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంకను అడగండి. మా ప్రాంతంలోని మరే ఇతర దేశాన్నైనా అడగండి, మీకు దాదాపు ఇదే కథ వినిపిస్తుంది. మనం కలిగించని వాతావరణ మార్పుల ప్రభావాన్ని మనం ఎదుర్కొంటున్నాం. మనం మొదలుపెట్టని యుద్ధాల వినాశనాన్ని కూడా భరిస్తున్నాం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలెన్ షా ప్రసంగంపై ప్రశంసలు
బాలెన్ షా చేసిన ఈ ప్రసంగంపై విస్తృత చర్చ జరుగుతోంది. దేశవిదేశాల్లో ఈ ప్రసంగం పలువురి దృష్టిని ఆకర్షించింది.
'కఠ్మాండూ పోస్ట్' ఆయన ప్రసంగాన్ని ప్రశంసిస్తూ, "షా ప్రసంగంలో దౌత్యపరమైన వ్యూహం కూడా గమనించదగినది. గత నెలలో వచ్చిన వరదల తర్వాత ఆయన వాతావరణ న్యాయం (క్లైమేట్ జస్టిస్) కోసం డిమాండ్ చేస్తూ, ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్‌హౌస్ వాయువులను వెలువరిస్తున్న దేశాల నుంచి పరిహారం కోరారు. కానీ, న్యూయార్క్‌లో షా ముందుగా భారత్, చైనాల పేర్లను ప్రస్తావించి, వరదల తర్వాత ఆ దేశాలు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు"
"సోషల్ మీడియాలో ఎంతో ఆలోచించి నిర్మించుకున్న ఇమేజ్‌తో పేరుగాంచిన షా, ప్రపంచపు అతిపెద్ద వేదికపై తన మాటలకు పూర్తి భిన్నమైన వైఖరిని అవలంబించారు" అని రాసింది.
బాలెన్ షా తన గురించి జరుగుతున్న చర్చను పక్కనపెడుతూ "ఈ ఏడాది సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న అతి పిన్న వయస్కుడైన దేశాధినేతను నేనే అని నాకు చెప్పారు. కానీ, నేను హెడ్‌లైన్స్‌లో నిలవడానికి రాలేదు" అన్నారు.
"తన ప్రసంగంతో సోషల్ మీడియాలో పతాక శీర్షికలకెక్కిన షా గురించి జరుగుతున్న చర్చకు మరో కారణమూ ఉంది. నేపాల్ ప్రధాని పదవి చేపట్టిన షా మౌనం దేశంలో చర్చనీయాంశంగా మారింది. నిశ్శబ్దంగా ఉంటూ పనిచేయడానికి ఇష్టపడే ప్రధాని ఆయన అని ప్రజలు అనుకుంటున్నారు" అని కఠ్మాండూ పోస్టు రాసింది.
"ప్రధానమంత్రి బాలెన్ షా ప్రసంగాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. ఆయన రసువా విపత్తు, దానికి వాతావరణ మార్పులతో ఉన్న సంబంధం, దాని విస్తృత ప్రభావాలను కేంద్రబిందువుగా చేసుకున్నారు. కలిసి పనిచేయాలని భారత్, చైనాలకు చేసిన విజ్ఞప్తి ప్రపంచ వేదికపై చెప్పాల్సిన అవసరం ఉన్న విషయం" అని నేపాల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కనక్ మణి దీక్షిత్ 'ఎక్స్' పోస్టులో తెలిపారు.
"ఎప్పటిలాగే అంతర్జాతీయ సమస్యల సుదీర్ఘ జాబితాను ఏకరువు పెట్టకుండా, ఆయన తన ప్రసంగాన్ని ఒక స్పష్టమైన అంశంపైనే కేంద్రీకరించారు. పరిశోధన, దౌత్యం, తన విజయాల ఆధారంగా నేపాల్ నాయకత్వం వహించే స్థితికి చేరుకున్నప్పుడు, సర్వసభ్య సమావేశపు హాల్‌లో ఆయన మాటలు వినడానికి ఇంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉంటారు" అని రాశారు.
"మనం ఇంకా ఎంత పని చేయాల్సి ఉందో ఇది చూపిస్తోంది" అని కనక్ మణి దీక్షిత్ తెలిపారు.
నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి రమేష్ నాథ్ పాండే ఎక్స్ పోస్టులో "ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి పర్యావరణ సంక్షోభం వైపు ప్రపంచ సమాజం దృష్టిని విజయవంతంగా ఆకర్షించారు. ప్రభావవంతంగా, సంయమనంతో వాస్తవాలను ముందుంచుతూ ప్రధానమంత్రి వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న విధ్వంసాన్ని అరికట్టే ఎజెండాను ప్రపంచ వేదికపై ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా తన గొంతు వినిపించే ఒక గౌరవప్రదమైన దేశంగా నేపాల్‌ను మార్చే దిశగా కొత్త తరం నాయకత్వం మరోసారి విజయవంతంగా అడుగులు వేయించింది" అని రాశారు.
"ఈరోజు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బాలెన్ ప్రసంగం అద్భుతంగా సాగింది. అంతర్జాతీయ మీడియా ఆయన ప్రసంగంలో లేవనెత్తిన కొన్ని కీలక అంశాలకు చోటు కల్పించింది. ఇకపై ఈ అంశాలపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతుంది" అని డబ్లిన్ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న మహేష్ కుష్వాహా ఎక్స్‌లో పోస్టు చేశారు.
"ఈ ప్రసంగం గానీ, దీనికి లభించిన ఆదరణ గానీ ప్రత్యక్షంగా ఎలాంటి చర్యగా మారకపోయినప్పటికీ, ఒక దేశం వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలియజేయడం ముఖ్యం. బాలెన్ ఈ పనిని చాలా బాగా చేశారు, బహుశా ఆశించిన దానికంటే కూడా మెరుగ్గా చేశారు" అని తెలిపారు.
"ఆయన ప్రసంగంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నేపాల్‌కు అందిన అంతర్జాతీయ సహాయానికి కృతజ్ఞతలు తెలపడం, ఘర్షణాత్మక భాషకు దూరంగా ఉండటం, నేపాల్ ఎదుర్కొంటున్న పెద్ద వాతావరణ సంక్షోభాల తీవ్రతను, ప్రపంచానికి వాటికున్న ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్పడం ఇందులో ఉన్నాయి. భారత్, చైనాలతో కలిసి వాతావరణ నాయకత్వానికి సంబంధించిన ఆచరణాత్మక చొరవను సూచించడం, చివరగా దక్షిణాసియా దేశాల నేపథ్యంలో ప్రపంచంలో పెరుగుతున్న అస్థిరతను కళ్ళకు కట్టడం విశేషం" అని మహేష్ కుష్వాహా తెలిపారు.
"ముఖ్యంగా ఇటీవలి విషాదాలకు నేరుగా 'పరిహారం అడగడం' లేదా వాటికి విలువ కట్టడం చేయకుండా, వాటిని ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయం సమీకరించాలని విజ్ఞప్తి చేయడం ఎంతో తెలివైన నిర్ణయం" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ ప్రధాని నల్ల కళ్లద్దాలపై చర్చ
బాలెన్ షా ప్రసంగంతో పాటే ఆయన పెట్టుకున్న నల్ల కళ్లద్దాలు కూడా చర్చల కేంద్రబిందువుగా నిలిచాయి.
ది న్యూయార్క్ టైమ్స్ ఆయన నల్ల కళ్లద్దాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
"గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ప్రసంగించినప్పుడు, ఆయన ముక్కుపై ఉన్న డార్క్ కలర్ కళ్లద్దాలు నేపాలీ ప్రజలకు అప్పటికే సుపరిచితమైనవే" అని ఆ పత్రిక రాసింది.
ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో, "దేశమంతటా కేవలం 'బాలెన్' అని పిలుచుకునే 36 ఏళ్ల షా, కళ్లద్దాలు లేకుండా బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సమయంలో షా తన కళ్లద్దాలతో పాటు నల్లటి సూట్, నేపాల్ సంప్రదాయ టోపీని ధరించారు. ఈ రెండూ నలుపు రంగులోనే ఉన్నాయి"
"జూలైలో 'ది కఠ్మాండూ పోస్ట్' వెల్లడించిన కథనం ప్రకారం, కెమెరాల ముందు, విదేశీ రాయబారులతో భేటీల సమయంలో షా కళ్లద్దాలు పెట్టుకుని ఉంటారు. కానీ, కేబినెట్ సమావేశాలు, వ్యక్తిగత సంభాషణల వేళ వాటిని తీసేస్తారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన కార్యాలయం సమాధానం ఇవ్వలేదు"
"ఈ కళ్లద్దాలు ఆయనకున్న రహస్యమైన (మిస్టీరియస్) ఇమేజ్‌ను మరింత బలపరుస్తున్నాయి. షా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం గానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చాలా అరుదు. దీనికి బదులుగా, ఆయన సోషల్ మీడియా ద్వారానే తన విషయాలను వెల్లడిస్తుంటారు"
"ఇప్పుడు నల్ల కళ్లద్దాలు ఆయన గుర్తింపులో ఒక భాగమైపోయాయి. నేపాల్ అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో ఒకటైన 'దరాజ్'లో 'బాలెన్ షా గ్లాసెస్' అని వెతికితే ఆయన కళ్లద్దాలను పోలిన ఎన్నో డిజైన్లు కనిపిస్తాయి"
"నేపాల్ అండర్‌గ్రౌండ్ హిప్-హాప్ ప్రపంచంలో ముఖాముఖి తలపడే ర్యాప్ పోటీల్లో పాల్గొనే ర్యాపర్‌గా ఉన్న రోజుల్లోనే ఆయన ఈ కళ్లద్దాలు ధరించడం మొదలుపెట్టారు. ఆ కాలంలో 'నేపాల్ స్మైలింగ్' లాంటి ఆయన పాటలు నేపాల్ యువతలో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించిపెట్టాయి"
"2022లో స్వతంత్ర అభ్యర్థిగా కఠ్మాండూ మేయర్ ఎన్నికల్లో గెలిచి షా దేశ రాజకీయ వ్యవస్థను ఆశ్చర్యపరిచారు. అప్పటికే నల్లటి సూట్, సన్‌గ్లాసెస్ ఆయనకు సంప్రదాయ పార్టీ రాజకీయాలకు భిన్నమైన ఒక బాహ్య వ్యక్తి (అవుట్‌సైడర్) తరహా ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి" అని రాసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























