నోటి పుండ్లు తగ్గకపోవడం క్యాన్సర్‌కు సంకేతమా?

క్యాన్సర్, ధూమపానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఓంకార్ కరంబేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

తల, మెడ క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడంతోపాటు యువతలోనూ ఈ క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

గతంలో ఈ వ్యాధి కేవలం మధ్యవయస్కులు లేదా పెద్దవారిలోనే కనిపించేది. కానీ, ఇప్పుడు, యువతలోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి.

దీనికి ప్రధాన కారణం పొగాకు, గుట్కా, మద్యం అని నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో 80 నుంచి 90 శాతం నోటి క్యాన్సర్ కేసులు పొగాకు తాగడం వల్లే వస్తున్నట్లు కనిపిస్తోంది.

పొగాకు, మద్యం రెండింటినీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది.

మరోపక్క, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ) కూడా ఒక కొత్త కారణంగా మారుతోంది. ఇది ముఖ్యంగా గొంతు క్యాన్సర్‌కు కారణమవుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క్యాన్సర్ ముప్పును పెంచుతున్న హెచ్‌పీవీ

ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యువతలో హెచ్‌పీవీ సంబంధిత గొంతు క్యాన్సర్ కేసులు బాగా పెరుగుతున్నాయి.

కొన్ని రకాల హ్యూమన్ పాపిలోమా వైరస్‌లు.. గొంతు, టాన్సిల్స్‌కు సోకి, కాలక్రమేణా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి అందుకే హెచ్‌పీవీ టీకా, సురక్షితమైన ఆరోగ్య అలవాట్లపై అవగాహన పెంచడం చాలా ముఖ్యం.

మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, ఒత్తిడి, ధూమపానం లేదా వాపింగ్ వంటి అంశాలన్నీ కూడా యువతలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

క్యాన్సర్ సోకే క్రమంలో గొంతులో పుండ్లు తగ్గకపోవడం, గొంతు నొప్పి, స్వరంలో మార్పుల్లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు. సరైన సమయంలో దీన్ని గుర్తిస్తే... ఈ క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుంది. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైనా.. చికిత్స చాలా కష్టమవుతుంది.

అందుకే, అవగాహన, ప్రాథమిక నిర్ధరణ చాలా ముఖ్యం.

తల, మెడ క్యాన్సర్ చాలా విస్తృతమైనది. దీనిలో నోటి క్యాన్సర్ కూడా కలిసి ఉంటుంది.

ధూమపానం

ఫొటో సోర్స్, Getty Images

పొగాకు, మద్యం ఎంతో ప్రమాదకరం

తల, మెడ క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడానికి ఒకటికి మించి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సిగరెట్లు, బీడీ, గుట్కా, పాన్ లాంటి వివిధ రకాల పొగాకు పదార్థాలే దీనికి ప్రధాన కారణం. ఈ పదార్థాలన్నీ నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.

వీటికితోడు మద్యం కూడా సేవిస్తే.. ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ కారకాలన్నీ కలిస్తే.. అత్యంత ప్రమాదకరంగా పరిగణించవచ్చు.

హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి పెరిగే కొద్దీ గొంతు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.

భారత్‌లో తల, మెడ క్యాన్సర్ రోగుల్లో సుమారు 33 శాతం మందిలో హెచ్‌పీవీ ఉన్నట్లు ఒక అధ్యయనం తెలిపింది.

యువతలో వాపింగ్, ఇ-సిగరెట్ల వాడకం పెరగడం, నిద్రలేమి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటివి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

20 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న యువతలో, ముఖ్యంగా పురుషులలో ఎక్కువగా వీటిని వాడుతున్న ధోరణి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

పూర్తిగా పొగాకు మానేయడం, మద్యం తాగడాన్ని తగ్గించడం, హెచ్‌పీవీ టీకా, తరచూ చెక్‌ అప్‌లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడంలాంటి చర్యలు ఈ క్యాన్సర్ నుంచి చాలా వరకు రక్షణ కల్పిస్తాయి.

క్యాన్సర్ రోగులు

ఫొటో సోర్స్, Prashanth Vishwanathan/Bloomberg via Getty Images

తల, మెడ క్యాన్సర్ లక్షణాలు

  • నోట్లో పుండు లేదా అల్సర్, రెండు మూడు వారాల పాటు తగ్గకపోవడం
  • ఎక్కువకాలం గొంతు నొప్పి ఉండటం
  • స్వరంలో మార్పు లేదా గొంతు బొంగురుపోవడం
  • ఏదైనా మింగేటప్పుడు విపరీతమైన ఇబ్బంది లేదా నొప్పి
  • నోటిలో ఎరుపు లేదా తెల్లటి మచ్చలు
  • మెడ లేదా దవడ దగ్గర గడ్డలా అనిపించడం
  • చెవి నొప్పి
  • నోరు లేదా గొంతు నుంచి రక్తస్రావం
  • ఆకస్మికంగా బరువు తగ్గడం
గొంతు క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో పరిస్థితి ఏంటి?

భారత్‌లో ముఖ్యంగా యువతలో తల, మెడ క్యాన్సర్ కేసులు పెరిగేందుకు ప్రధాన కారణం.. చిన్న వయసులోనే సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా, పొగరాని పొగాకు ఉత్పత్తులు సహా వివిధ రకాల పొగాకును ఎక్కువగా వాడటమే.

సరైన ఆహారం తీసుకోకపోవడం, నిరంతరం ఒత్తిడి, నిద్రలేమి, మద్యపానం సరైన సమయానికి వైద్యుని సలహా తీసుకోకపోవడంలాంటి జీవనశైలి కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అయితే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగడం, వ్యాధి నిర్థరణా పద్ధతులు మెరుగుపడటం వల్ల ప్రారంభ దశలోనే ఈ క్యాన్సర్లను గుర్తిస్తున్నారు.

హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో (హెచ్‌ఎన్‌సీఐఐ) కన్సల్టెంట్ క్యాన్సర్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ మోసిన్ షేక్ ఈ క్యాన్సర్ల గురించి బీబీసీకి మరింత సమాచారం ఇచ్చారు.

పొగాకు, గుట్కా వినియోగమే భారత్‌లో తల,మెడ క్యాన్సర్‌కు కారణంగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు.

'' పొగలేని పొగాకును, వక్కపొడి ఉత్పత్తులను తరచూ నమలడం వల్ల, ముఖ్యంగా యువతలో నోటి క్యాన్సర్ ప్రమాదం బాగా పెరుగుతోంది. పొగాకుతో పాటు మద్యం సేవించడం వల్ల మరింత ప్రమాదకారిగా మారుతోంది. పొగలేని ధూమపాన పరికరాల వాడకం కూడా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే నికోటిన్‌, రసాయన ఉత్ప్రేరకాలకు దీర్ఘకాలం పాటు గురవ్వడం వల్ల నోరు, గొంతు లోపలి పొరలు దెబ్బతినవచ్చు. అయితే, భారత జనాభాపై దీర్ఘకాలిక అధ్యయనాలు కొనసాగుతున్నాయి" అని డాక్టర్ షేక్ చెప్పారు.

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందా? అంటే...

'' జీవనశైలి విధానాలన్నీ నేరుగా క్యాన్సర్‌కు కారకం కానప్పటికీ, రోగనిరోధక శక్తిని అవి తగ్గించే ప్రమాదం పెరుగుతుంది. పోషకాహార లోపం, ప్రాసెస్డ్ ఫుడ్స్‌, శారీరక వ్యాయామం లేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం, నిత్యం మానసిక ఒత్తిడి, మద్యం, క్రమరహిత నిద్ర వంటివన్నీ శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కణాలు త్వరగా పాడవ్వకుండా కాపాడుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఈ కారణాలన్నింటికీ పొగాకు తోడైతే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది'' అని డాక్టర్ షేక్ వివరించారు.

'' యువత తరచూ నిర్లక్ష్యం చేసే ప్రారంభ లక్షణాలలో నోటి పుండ్లు తగ్గకపోవడం, ఆహార పదార్థాలు మింగడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం, మెడలో కారణం లేకుండా వాపు, నోటిలో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, తరచూ గొంతునొప్పి, నోటి నుంచి రక్తస్రావం, దవడ నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం వంటివి ఉంటాయి.’’ అంటారు డాక్టర్ షేక్.

‘‘ ఈ లక్షణాలు సాధారణంగా ప్రారంభ దశలలో నొప్పిలేకుండా ఉంటాయి. దీంతో, చాలా మంది వైద్య సహాయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యం తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు" అని తెలిపారు.

క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయచ్చా?

ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే... తల, మెడ క్యాన్సర్‌కు చికిత్స చేసి, అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ముందస్తు రోగ నిర్ధరణ వల్ల రోగి బతికే అవకాశాలు పెరగడమే కాకుండా.. వారు మాట్లాడటం, మింగడం వంటి ముఖ్యమైన పనులను చేసుకునేందుకు, రోగి మొత్తం జీవన ప్రమాణాన్ని కాపాడుకునేందుకు సహాయపడుతుంది. అందువల్ల, ప్రజలలో అవగాహన, సకాలంలో వైద్య సలహా అత్యంత అవసరం.

''తల, మెడ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించినప్పుడు, దానికి సులభంగా చికిత్స చేయవచ్చు. పూర్తిగా నయం చేయచ్చు. అందుకే, ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం అత్యంత ముఖ్యం’’ అన్నారు కిమ్స్ హాస్పిటల్‌లో హెడ్, నెక్ ఆంకోసర్జరీ డిపార్ట్‌మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ హితేష్ సింఘ్వీ.

‘‘ముందుగానే వ్యాధిని నిర్ధరించడం వల్ల తక్కువ శ్రమతో కూడిన చికిత్స, వేగంగా కోలుకోవడం, మాట్లాడటం, మింగడం వంటి ముఖ్యమైన పనులను చేసుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. " అని తెలిపారు.

భారత్‌లో దీనికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అడగగా.. '' ఇప్పుడు దీని చికిత్సలు అత్యంత ఆధునికమైనవిగా, వ్యక్తుల అవసరాలకు తగ్గట్లు మారాయి. క్యాన్సర్ దశ, అది వ్యాపించిన ప్రాంతాన్ని బట్టి.. మినిమల్లీ ఇన్‌వాసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి'' అని డాక్టర్ సింఘ్వీ చెప్పారు.

''క్యాన్సర్ వచ్చిన ప్రాంతాన్ని బట్టి, మాట్లాడటం, నమలడం, మింగడం, శ్వాస తీసుకోవడం వంటి ప్రాథమిక పనులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. రోగులు విపరీతమైన నొప్పిని ఎదుర్కోవచ్చు. తినడంలో ఇబ్బంది పడొచ్చు, బరువు తగ్గొచ్చు, మానసిక ఒత్తిడి కలగవచ్చు. అధునాత రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్, సపోర్టివ్ ట్రీట్‌మెంట్ల సాయంతో.. చాలామంది రోగులు ఎంతో విశ్వాసంతో తిరిగి సాధారణ జీవితాన్ని గడపగలరు'' అని చెప్పారు.

క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి?

  • పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయాలి.
  • మద్యపానం తగ్గించాలి లేదా మానాలి.
  • నోటి శుభ్రతను పాటించాలి.
  • పండ్లు, కూరగాయలతో సమతుల్యమైన ఆహారాన్ని తినాలి.
  • క్రమంగా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
  • సొంతంగా మెడికేషన్లు తీసుకోవడం ఆపేయాలి.
  • ఏదైనా లక్షణాలు దీర్ఘకాలం ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.
  • తరచూ చెకప్‌ చేయించుకోవాలి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)