మెటా గ్లాసెస్: పబ్లిక్‌ ప్లేసుల్లో ఎదుటి వారిని రికార్డు చేయడం నైతికమేనా? ఈ కళ్లజోళ్లపై విమర్శలేంటి?

మెటా గ్లాసెస్, ప్రైవసీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఒలివియా కోప్‌ల్యాండ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

త్వరలో మీ దగ్గరిలోని వీధుల్లోనో , పార్కుల్లోనో, మీరు వీటిని చూసే అవకాశముంది. ఇవే మెటా స్మార్ట్ గ్లాసెస్. కొత్త సాంకేతిక పరిజ్ఞాన విప్లవం. మన కళ్లకు అమర్చుకోగల సాంకేతికత. అయితే వీటిపై ప్రజల్లో నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆసక్తిని వ్యక్తం చేస్తే, మరి కొందరు ఆందోళన చెందుతున్నారు.

ఈ టెక్నాలజీలో యూజర్లు కాల్స్ చేసుకోవచ్చు, చేతులను ఉపయోగించకుండానే ఏఐతో మాట్లాడచ్చు. అలాగే ఫ్రేమ్‌లను తాకి ఫోటోలు, వీడియోలు కూడా తీయచ్చు. సరిగ్గా ఇక్కడే గోప్యతకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యూకేలో దాదాపు 800 పబ్‌లను నిర్వహిస్తున్న వెథర్‌స్పూన్స్, తమ ప్రాంగణాల్లో చిత్రీకరణ కోసం ఈ గ్లాసులను ఉపయోగించడాన్ని నిషేధించింది.

వీటిని వేధింపులకు ఉపయోగించే అవకాశం ఉందని మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కంటెంట్ క్రియేటర్ల వీడియోలదే హవా కాబట్టి, బహిరంగ ప్రదేశాల్లో ఈ గ్లాసెస్‌ను ఎలా ఉపయోగించాలన్న చర్చ కూడా కొనసాగుతూనే ఉంటుంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పియర్స్ వాలెలీ ఓ కంటెంట్ క్రియేటర్. పశ్చిమ బెల్‌ఫాస్ట్‌లోని బాలీమర్ఫీకి చెందిన వాలెలీ.. సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు.

ఆయన మెటా రేబాన్ గ్లాసెస్‌ను ఉపయోగిస్తున్నారు. వీటితో వీధిలో నడుస్తూ ఎదురుపడే వారిని రైమింగ్ మాటలతో పలకరిస్తున్న వీడియోలు తీస్తారు. తాను ధరించిన మెటా గ్లాసెస్‌తో ఈ నీడియోలను చిత్రీకరిస్తారు.

బెల్‌ఫాస్ట్ నగర కేంద్రంలో చిత్రీకరించిన ఆయన వీడియోల్లో ఒకదానికి టిక్‌టాక్‌లో 6 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఆ వీడియోల విజయానికి కారణం వాటిలో కనిపించే స్నేహపూర్వకమైన వాతావరణమేనని ఆయన చెప్పారు. వీడియో తీయొద్దని ఎవరైనా కోరితే తాను ఎప్పుడూ వీడియోను పోస్ట్ చేయలేదని వాలెలీ అన్నారు. అలాగే వీడియోను తొలగించాలని కోరుతూ ఇప్పటివరకు ఎవరూ తనను సంప్రదించలేదని చెప్పారు.

"వారితో నేను మాట్లాడే విధానం వల్లే అనుకుంటాను. నేను వారిని ఎగతాళి చేయడం లేదని, మంచి ఉద్దేశంతోనే సరదాగా వీడియో తీస్తున్నాని తెలుసు" అని ఆయన అన్నారు.

వాలెలీ ఉపయోగిస్తున్న మెటా గ్లాసెస్ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పటివరకు 70 లక్షలకు పైగా ఈ జోళ్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది.

మెటా గ్లాసెస్, ప్రైవసీ

ఫొటో సోర్స్, Pearse Vallely

ఫొటో క్యాప్షన్, కంటెంట్ క్రియేటర్ పియర్స్ వాలెలీ

మెటా గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి?

ఈ గ్లాసెస్‌ను ప్రముఖ సన్‌గ్లాసెస్ బ్రాండ్ రేబాన్ సంస్థతో కలిసి రూపొందించారు. వీటి ఫ్రేమ్‌లో బయటకు పెద్దగా కనిపించని కెమెరా ఉంటుంది. యూజర్లు దాన్ని టచ్ ద్వారా యాక్టివేట్ చేయచ్చు.

కెమెరా ఆన్ చేసినప్పుడు తెల్లటి కాంతి పల్స్‌లా వెలుగుతుంది. వీడియో తీస్తున్నట్లు చుట్టుపక్కల వారికి తెలియజేయడం దీని ఉద్దేశం. ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ కూడా వస్తుంది. "స్మార్ట్‌ఫోన్లు, ఇతర కెమెరాల్లో లేని ఫీచర్ ఇది" అని మెటా ప్రతినిధి తెలిపారు.

కాంతిని ఎవరైనా అడ్డుకున్నా లేదా దానిలో జోక్యం చేసుకున్నా కెమెరా పనిచేయకుండా ఉండేలా ఇటీవల గ్లాసెస్‌లో మార్పులు చేసినట్లు మెటా తెలిపింది.

మెటా గ్లాసెస్ మాదిరిగా ఇతర కంపెనీలు రూపొందించే ఏఐ లేదా స్మార్ట్ గ్లాసెస్ ఉత్పత్తులు కూడా అదే స్థాయిలో అమ్ముడైతే, రానున్న కొన్ని సంవత్సరాల్లో 10 కోట్ల మంది వరకు ఈ కళ్లజోళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

వాలెలీ తన వీడియోలు సహజంగా, అప్పటికప్పుడు జరిగే పరస్పర సంభాషణలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. తన కళ్లజోడు‌లోని కాంతి కారణంగా తాను రికార్డు చేస్తున్న విషయం చాలామందికి తెలుస్తుందని చెప్పారు.

వీడియో తీసిన తర్వాత వీలైతే తాను వారిని రికార్డు చేసినట్లు వారికి తెలియజేయడానికి ప్రయత్నిస్తానని కూడా చెప్పారు.

ఉత్తర ఐర్లాండ్‌లో సాధారణంగా బహిరంగ ప్రదేశంలో ఎవరినైనా, వారు గమనించకుండానే చిత్రీకరించడం చట్టబద్ధమే. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులు సాధారణంగా తమకు గోప్యతా హక్కును ఆశించలేరు.

కాని ఆ చిత్రీకరణ వేధింపులు, వెంటాడటం వంటి చర్యలుగా పరిగణిస్తే, అది చట్టవిరుద్ధం కావచ్చు. అలాగే చిత్రీకరణలో వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే ఉద్దేశం ఉంటే లేదా గోప్యత ఉంటుందని భావించే పరిస్థితుల్లో చిత్రీకరిస్తే కూడా అది చట్టవిరుద్ధం కావచ్చు.

"ఎవరితోనైనా 30 సెకన్ల పాటు మాట్లాడటం మంచిదే. సాంకేతికత కారణంగా మనం కోల్పోతున్న విషయం ఇదేనని నేను భావిస్తున్నాను. సాంకేతికతనే ఉపయోగించి దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను" అని వాలెలీ చెప్పారు.

"ప్రజలు అసభ్యంగా, మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటే మెటా గ్లాసెస్ ధరించడాన్ని నిషేధించడానికి గల కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. అయితే చిత్రీకరణ వెనుక ఉన్న ఉద్దేశమే కీలకం" అని ఆయన అన్నారు.

"నా వీడియోలను రికార్డు చేసేది నేనేనని ప్రజలకు తెలుసు. కానీ మరికొందరు ట్రోల్ ఖాతాల కోసం ఇలా చేస్తారు. ఏ ఆవిష్కరణనైనా, తప్పుడు కారణాల కోసం ఉపయోగించే వారు ఉంటారు" అని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు తనకు ఎలాంటి వ్యతిరేకతా ఎదురుకాలేదని వాలెలీ చెబుతున్నప్పటికీ, ఈ గ్లాసెస్‌తో చిత్రీకరిస్తున్న వ్యక్తులకు, సాధారణ ప్రజలకు మధ్య వివాదాలు చెలరేగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మెటా గ్లాసెస్, ప్రైవసీ
ఫొటో క్యాప్షన్, ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ఉపయోగించి చేతులు వాడకుండానే కాల్స్ చేయచ్చు, సంగీతం వినవచ్చు, ఫోటోలు వీడియోలు తీయచ్చు

గత డిసెంబర్‌లో న్యూయార్క్ సబ్‌వేలో ఒక వ్యక్తి ధరించిన మెటా గ్లాసెస్‌ను ఒక మహిళ రెండు ముక్కలు చేశారు. ఈ వ్యవహారంలో ఆమెను అనేకమంది ప్రశంసించారు.

గ్లాసెస్ ఉపయోగించి సాధారణ ప్రజలను రహస్యంగా చిత్రీకరించిన ఓ టిక్‌టాకర్‌పై జూలైలో వచ్చిన ఫిర్యాదుల తర్వాత స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చిత్రీకరణపై తమ సంస్థ విధించిన నిషేధం గురించి వెథర్‌స్పూన్స్ ప్రతినిధి, స్మార్ట్ గ్లాసెస్ "రహస్య చిత్రీకరణకు వాడటం ద్వారా కామన్ సెన్స్‌ను ఉల్లంఘిస్తున్నారు’’ అని అన్నారు.

కామిక్ కాన్ నార్తర్న్ ఐర్లాండ్‌ను నిర్వహించే మోనోపొలీ ఈవెంట్స్ కూడా, తమ ప్రోగ్రామ్స్‌ను రహస్యంగా చిత్రీకరించే అవకాశం ఉందన్న ఆందోళనలతో తమ కార్యక్రమాల్లో ఈ గ్లాసెస్ ధరించడాన్ని నిషేధించింది.

ఇదిలా ఉండగా, మహిళల దగ్గరికి వెళ్లి వారి ఫోన్ నంబర్ అడుగుతూ, పిక్‌అప్ లైన్లకు (ఎదుటివారితో ఆకట్టుకునేలా మాట్లాడి వారిని ప్రేమ లేదా రొమాన్స్‌లోకి దించే ప్రయత్నం) వారు ఎలా స్పందిస్తున్నారో చిత్రీకరించే టిక్‌టాక్ వీడియోలు తరచూ #howtogetagirlfriend అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ అవుతున్నాయి. వీటికి వేలాది వ్యూస్ వస్తున్నాయి.

మెటా గ్లాసెస్, ప్రైవసీ
ఫొటో క్యాప్షన్, వ్యక్తుల గోప్యతకు ఈ గ్లాసులు భంగం కలిగించే అవకాశం ఉందని మహిళా హక్కుల ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు.

వేధింపుల ఆందోళనలు

ఈ గ్లాసెస్‌ను ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై అవగాహన లేకపోవడం వల్ల సమ్మతికి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని విమెన్స్ రిసోర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో మహిళా రంగం తరఫున లాబీయిస్ట్‌గా పనిచేస్తున్న ఎలైన్ క్రోరీ అన్నారు.

"ప్రస్తుతం మీరు కెమెరాతో లేదా ఫోన్‌తో చిత్రీకరిస్తుంటే, సాధారణంగా అది నాకు కనిపిస్తుంది. అప్పుడు నేను దానికి దూరంగా ఉండగలను. కానీ ఏఐ కెమెరాతో మిమ్మల్ని చిత్రీకరిస్తున్న విషయం మీకు తెలియకపోవచ్చు" అని ఆమె అన్నారు.

ప్రస్తుతం చట్టవిరుద్ధమైన అప్‌స్కర్టింగ్ (ఒక వ్యక్తి అనుమతి లేకుండా, వారి స్కర్ట్ లేదా దుస్తుల కింద ఫోటోలు లేదా వీడియోలు తీయడం)వంటి చర్యలకు కూడా ఈ గ్లాసెస్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నాయని ఆమె తెలిపారు.

వీడియోలను తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను కోరే అవకాశం ప్రజలకు ఉందని, కొన్ని వేదికలు కూడా పరిస్థితిని బట్టి కేసు ఆధారంగా నిషేధాలు విధించాయని క్రోరీ చెప్పారు. అయితే సాంకేతికత అభివృద్ధికి అనుగుణంగా చట్టాలు మారలేదని ఆమె భావిస్తున్నారు.

"వీధిలో, బస్సులో, తరగతి గదిలో చిత్రీకరించినా దానికి వ్యతిరేకంగా చట్టపరమైన పరిహారం పొందే అవకాశం ఒక వ్యక్తికి లేదు" అని ఆమె అన్నారు.

మెటా గ్లాసెస్, ప్రైవసీ
ఫొటో క్యాప్షన్, ఆప్టోమెట్రిస్ట్ జియోఫ్ మెక్‌కాన్‌విల్లే

‘ప్రయోజనాలూ ఉన్నాయి’

ఈ కళ్లజోళ్లను అనుచితంగా ఉపయోగించే అవకాశం గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, ఈ సాంకేతికతకు ప్రయోజనకరమైన అంశాలు కూడా ఉన్నాయని బెల్‌ఫాస్ట్‌లో మెటా గ్లాసెస్ విక్రయిస్తున్న ఆప్టోమెట్రిస్ట్ జియోఫ్ మెక్‌ కాన్‌విలే అన్నారు.

ఏఐ సహాయంతో టెక్స్ట్‌ను వాయిస్‌గా మార్చే ఫీచర్లను తన క్లయింట్లు ఉపయోగిస్తున్నారని, దీంతో వారు వార్తాపత్రికలు, బోర్డులపై ఉన్న సమాచారాన్ని చదవగలుగుతున్నారని ఆయన చెప్పారు.

"నా దగ్గరికి వచ్చే వృద్ధులు, దృష్టి లోపం ఉన్న రోగులకు ఇవి విప్లవాత్మకమైనవి. అద్భుతమైనవి" అని ఆయన అన్నారు.

దృష్టి లోపం లేదా వినికిడి సమస్యలు ఉన్నవారికి ఈ గ్లాసెస్ "అత్యంత కీలకమైన కొత్త సాంకేతికత"ను అందిస్తున్నాయని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సాంకేతికతను ప్రజలు ఎలా ఉపయోగించవచ్చనే దానిపై పరిమితులు విధించడం ఒక వెనకడుగే అవుతుందని పేర్కొంది.

"సహజంగానే కొన్ని ప్రదేశాల్లో అసలు చిత్రీకరించకూడదు. అది కరక్టే. అయితే నిబంధనలను అందరికీ ఒకే విధంగా వర్తింపజేయాలి" అని మెటా తెలిపింది.

‘‘ప్రజలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధిస్తూ కంటెంట్‌ను పోస్ట్ చేస్తే ఆ కంటెంట్‌ను తొలగిస్తాం’’ అని ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మొసెరీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)