ఇరాన్ ఇంకెన్నాళ్లు యుద్ధం చేయగలదు? అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంతో పనవుతుందా?

యుద్ధం, ఇరాన్, తెహ్రాన్, అమెరికా, హార్ముజ్ జలసంధ, ఆర్థిక వ్యవస్థ, సైన్యం, ఆయుధాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, సయీద్ జాఫరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

యుద్ధం మొదలై ఏడు నెలలు గడిచినా, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, దాని మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఉన్నా, ఆ దేశ నాయకులు దానిని ముగించడానికి ఇప్పటికీ ఏమాత్రం తొందరపడటం లేదు.

యుద్ధ గమనాన్ని నిర్దేశించేది కేవలం అమెరికా మాత్రమే కాదని తెహ్రాన్ నిరూపించాలనుకోవడం దీనికి ఒక కారణం కావచ్చు.

అలాగే, వాషింగ్టన్‌కు సైనిక, ఆర్థిక, రాజకీయ వ్యయాలను పెంచి, అంతిమంగా ట్రంప్ యంత్రాంగాన్ని తన డిమాండ్లలో కొన్నింటికి అంగీకరించేలా ఒత్తిడి తీసుకురావడం కూడా ఒక కారణం కావచ్చు.

అయితే, ఒక కీలకమైన ప్రశ్నకు లభించే సమాధానంపైనే యుద్ధగతి చాలా వరకు ఆధారపడి ఉంటుంది.

అదే 'అసలు ఇరాన్ నిజంగా ఈ యుద్ధంలో ఇంకెంతకాలం కొనసాగగలదు?’ అన్నదే ఆ ప్రశ్న.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యుద్ధం, ఇరాన్, తెహ్రాన్, అమెరికా, హార్ముజ్ జలసంధ, ఆర్థిక వ్యవస్థ, సైన్యం, ఆయుధాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇరాన్ సైన్యం పరిస్థితి ఏంటి?

ఇరాన్ రక్షణ పరిశ్రమ రంగాలు, క్షిపణి ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరిగినప్పటికీ జరిగిన నష్టాన్ని చెప్పగలిగే స్వతంత్ర గణాంకాలు ఏవీ లేవు.

ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న క్షిపణి నిల్వలపై విశ్వసనీయమైన అంచనా ఏదీ లేదని చాథమ్ హౌస్ థింక్ ట్యాంక్ తన తాజా విశ్లేషణలో పేర్కొంది.

యుద్ధం మొదలైనప్పటి నుంచి కాలక్రమేణా ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాల పరంపర తగ్గింది. కానీ యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని కేవలం క్షిపణుల సంఖ్యతోనే కొలవలేం. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేయడం సులభం. పైగా వేగంగా కూడా తయారు చేయవచ్చు.

ఇప్పటికే మరణించిన కమాండర్ల స్థానంలో కొత్తవారిని నియమించారు. వారి కమాండ్ వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉంది.

జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ మొహమ్మద్ ఘైదీ ఈ అంశంపై బీబీసీ న్యూస్‌తో మాట్లాడారు.

"ఇరాన్ బహుశా తక్కువ తీవ్రతతోనైనా చాలాకాలం పాటు క్షిపణులను ప్రయోగించే తన సామర్థ్యాన్ని కొనసాగించగలుగుతుంది. హార్ముజ్ జలసంధిలో అలజడి సృష్టించగలుగుతుంది'' అని ఘైదీ అన్నారు.

సుదీర్ఘ సంఘర్షణ తమ శత్రువుకు కూడా హాని కలిగించగలదని ఇరాన్ విధానకర్తలు భావిస్తున్నారు.

ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే క్రమంలో అమెరికా రక్షణ నిల్వల్లో కొంత భాగం ఖర్చయింది. అయితే, ఈ ఆయుధాలను వేగంగా భర్తీ చేయడం సాధ్యం కాదని కొన్ని అమెరికా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి.

"చమురు ధరలపై యుద్ధ ప్రభావం, యునైటెడ్ స్టేట్స్‌లోని అంతర్గత రాజకీయ పరిస్థితుల్లాంటి వాటి ద్వారా... తమ షరతులలో కొన్నింటిని అంగీకరించేలా వాషింగ్టన్‌ మీద ఒత్తిడి చేయగలమనే ఆశను తెహ్రాన్‌లో రేకెత్తించాయి" అని కూడా ప్రొఫెసర్ ఘైదీ పేర్కొన్నారు.

దేశీయంగా, రిపబ్లికన్ ఓటర్లలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు మద్దతు సాపేక్షంగా బలంగా ఉన్నప్పటికీ, ఈ సంఘర్షణ పట్ల అమెరికన్ల వ్యతిరేకత కారణంగా ట్రంప్ తన యుద్ధ లక్ష్యాలను సాధించలేకపోతున్నారనే ఆందోళనను పోల్స్ నిరంతరం చూపిస్తున్నాయి.

తెహ్రాన్ అంచనా సరైనదైతే, అమెరికాను సైనికంగా ఓడించడమే దాని లక్ష్యం కాకపోవచ్చు. సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన యుద్ధమే ఒత్తిడి తెచ్చే ఒక మార్గం కావచ్చు.

ప్రస్తుతానికి, కేవలం సైనిక పరిమితులు మాత్రమే ఇరాన్‌ను యుద్ధాన్ని ఆపడానికి ఒత్తిడి చేస్తాయనడానికి ఎటువంటి సూచనలు లేవు.

యుద్ధం, ఇరాన్, తెహ్రాన్, అమెరికా, హార్ముజ్ జలసంధ, ఆర్థిక వ్యవస్థ, సైన్యం, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక ప్రణాళికల సంగతేంటి?

యుద్ధం ప్రారంభం కావడానికి ముందే, ఆర్థిక వ్యవస్థ, అధిక ద్రవ్యోల్బణం, పెట్టుబడుల లేమి, రియాల్ (ఇరాన్ కరెన్సీ) విలువ పడిపోవడంలాంటి సమస్యలను ఇరాన్ ఎదుర్కొంటోంది.

ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం, 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సుమారు 2.7% మేర కుచించుకుపోయింది. అందులో చివరి కొన్ని వారాలు మాత్రమే యుద్ధం ప్రభావం ఉంది.

యుద్ధం కొత్త ఒత్తిడులను సృష్టించింది. ఇరాన్ స్టాటిస్టిక్ సెంటర్ గణాంకాల ప్రకారం, వార్షిక ద్రవ్యోల్బణం 62 శాతానికి చేరుకుంది. యుద్ధ ప్రభావాలకు ఎక్కువగా గురైన దక్షిణ ప్రావిన్సులలో ఈ ఒత్తిడి అత్యధికంగా ఉంది. ఉదాహరణకు, హార్మూజ్‌గాన్‌లో ద్రవ్యోల్బణం 101 శాతాన్ని మించిపోయింది.

ఇరాన్ కార్మిక శాఖా ఉపమంత్రి అభిప్రాయం ప్రకారం, కార్మిక మార్కెట్‌లో యుద్ధం కారణంగా 10 లక్షలమందికి పైగా ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులుగా మారారు.

2026లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సుమారు 5.4% మేర కుచించుకుపోతుందని, ద్రవ్యోల్బణం 69%కి చేరుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా అంచనా వేస్తోంది.

యుద్ధం కొనసాగే కాలవ్యవధి, అలాగే వాణిజ్యానికి, చమురు ఎగుమతులకు కలిగే అంతరాయాల తీవ్రత భారీ ప్రభావాన్ని చూపుతాయి.

హార్ముజ్ జలసంధి ఒకవైపు ఒత్తిడి సాధనంగా, మరోవైపు బలహీనమైన ప్రదేశంగా ఉంది. ఈ మార్గంలో అంతరాయాలు ఏర్పడితే అమెరికాకు యుద్ధ వ్యయం, ప్రపంచ ఇంధన మార్కెట్‌పై భారం పెరగవచ్చు. అంతేకాకుండా, అమెరికా నౌకా దిగ్బంధనం, నౌకాయాన ఆంక్షలు ఇరాన్ చమురు ఎగుమతులకు కూడా ఆటంకం కలిగిస్తున్నాయి.

ఆర్థిక ఒత్తిడి ఇరాన్‌పై ప్రభావం చూపుతుందా? కాదంటారు ఘైదీ. అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో కూడా నిరంకుశ ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి మనుగడ సాగించగలవని ఘైదీ పేర్కొన్నారు. ''ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవస్థాగత అసమతుల్యతలు అసంతృప్తిని పెంచవచ్చు. కానీ, ప్రభుత్వంలో విస్తృత నిరసనలు లేదా విభేదాలు వాటితో పాటుగా సంభవిస్తే తప్ప తెహ్రాన్ సైనిక విధానాన్ని మార్చలేవు'' అని ఘైదీ అభిప్రాయపడ్డారు.

యుద్ధం, ఇరాన్, తెహ్రాన్, అమెరికా, హార్ముజ్ జలసంధ, ఆర్థిక వ్యవస్థ, సైన్యం, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్‌లో విభేదాలు

ముందుకు వెళ్లడానికి ఉత్తమ మార్గం ఏమిటనే దానిపై తెహ్రాన్‌లో ఏకాభిప్రాయం లేదు.

పార్లమెంట్ స్పీకర్, ఇరాన్ సంప్రదింపుల ప్రతినిధి బృందం అధిపతి కూడా అయిన మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, వార్ ఆఫ్ ఆట్రిషన్ ( అన్నిరకాలుగా క్షీణించే వరకు యుద్ధం చేయడం) వలలో ఇరాన్ చిక్కుకోకూడదని గతంలో హెచ్చరించారు. చర్చలను వ్యతిరేకించిన వారిని ఆయన విమర్శించారు. అయితే, అమెరికా ఇరాన్ షరతులన్నింటినీ అంగీకరించి ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ యుద్ధం కొనసాగుతుందని పార్లమెంటులో తెహ్రాన్ అతివాది అమీర్‌హొస్సేన్ సబెటి అన్నారు.

ఈ విభేదాన్ని కేవలం యుద్ధానికి అనుకూలం, శాంతికి అనుకూలం అనే రెండు వర్గాలుగా విభజించలేము. ఎందుకంటే ఇరాన్ హక్కులకు హామీ ఇవ్వని ఒప్పందాన్ని తానూ అంగీకరించబోనని ఘాలిబాఫ్ పేర్కొన్నారు.

నిరంతర ఒత్తిడి ఎంతకాలంపాటు తెహ్రాన్‌పై ఒత్తిడిని చూపించగలదు, ఏ దశలో దాని ప్రయోజనాలకంటే నష్టాలే ఎక్కువవుతాయి అనే విషయాలలోనే అసలు విభేదం ఉంది.

మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? యుద్ధం కొనసాగింపుపై స్వతంత్రమైన, విశ్వసనీయమైన అభిప్రాయ సేకరణలు లేవు, సోషల్ మీడియా మొత్తం సమాజ అభిప్రాయాన్ని ప్రతిబింబించదు.

అయితే, ''ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అత్యంత ప్రమాదకరమైన రంగం అంతిమంగా అంతర్గతమైనదే కావచ్చు'' అని బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఇరాన్ నిపుణుడు, జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ (ఎస్‌డబ్ల్యూపీ )లో విజిటింగ్ పరిశోధకుడైన హమీద్రేజా అజీజీ అభిప్రాయపడ్డారు.

తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలు, దేశ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతోందని ఆయన అంటున్నారు.

యుద్ధం, ఇరాన్, తెహ్రాన్, అమెరికా, హార్ముజ్ జలసంధ, ఆర్థిక వ్యవస్థ, సైన్యం, ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

నిష్క్రమణ వ్యూహం అవసరమైన యుద్ధం

సుదీర్ఘ యుద్ధం ఇరాన్‌పై ప్రాంతీయంగా కూడా ప్రభావం చూపించవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో, తెహ్రాన్ గల్ఫ్ అరబ్ దేశాలతో, ముఖ్యంగా సౌదీ అరేబియాతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించింది. ఈ దేశాల్లోని స్థావరాలు, మౌలిక సదుపాయాలు, నౌకా మార్గాలపై కొనసాగుతున్న దాడులు ఈ ప్రయత్నాలకు అడ్డంకిగా మారవచ్చు.

ఇప్పటివరకు, ఈ దేశాలు ఉద్రిక్తతలను తగ్గించి, చర్చలను పునఃప్రారంభించడానికి ప్రయత్నించాయి. కానీ, ఇరాన్ లేదా దాని మిత్రదేశాల నుంచి తమపై దాడులు జరిగే అవకాశం ఉందని అవి ఎంత ఎక్కువగా భావిస్తే, అమెరికాతో ఇరాన్‌కు వ్యతిరేకంగా రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుసుకునేందుకు అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

సుదీర్ఘ యుద్ధం అమెరికాపై కలిగించే ఒత్తిడిని తెహ్రాన్ చర్చల దగ్గర రాయితీలుగా మార్చుకోగలిగితేనే దానికి రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది. యుద్ధానికి ఇరాన్‌కు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అందించే ఒప్పందం ఎలా ఉంటుందో, లేదా అటువంటి ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకోవచ్చో ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

"యుద్ధ సమయంలో పొందిన ప్రభావాన్ని శాశ్వత రాజకీయ ఒప్పందంగా ఎలా మార్చగలమనే దానిపై స్పష్టమైన ఆలోచన ఇరాన్ వ్యూహంలో కొరవడింది" అని ప్రొఫెసర్ అజీజీ అంటున్నారు.

"ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించి, అమెరికా, దాని మిత్రదేశాలపై ఒత్తిడి తీసుకురాగలమని తెహ్రాన్ నిరూపించింది. అయితే, అమెరికా, ఇంకా కొన్ని గల్ఫ్ దేశాలతో శాశ్వతంగా ఘర్షణ వైఖరిని ఎలా కొనసాగించగలదనే దానిపై అనిశ్చితి నెలకొని ఉంది" అంటున్నారు అజీజీ.

ఇప్పటి వరకు, సైనిక, ఆర్థిక లేదా రాజకీయ పరిమితులలో ఏ ఒక్కటీ ఇరాన్‌ను యుద్ధాన్ని కొనసాగించకుండా నిరోధించలేకపోయింది. కానీ ఈ సంఘర్షణ ఎంతకాలం కొనసాగితే, అంతర్గత ఆర్థిక ఒత్తిడి అంత పెరుగుతుంది, ఇరాన్ ప్రాంతీయ సంబంధాలు అంతగా క్షీణిస్తాయి.

దీనివల్ల ఈ నష్టాలను భర్తీ చేసే ఒప్పందానికి రావడం కష్టమవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)