హూతీల దూకుడుతో ఇరాన్-అమెరికా యుద్ధం ప్రమాదకర మలుపు తీసుకుంటోందా...

అమెరికా, ఇరాన్, హూతీ, యెమెన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, పౌల్ ఆడమ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

దక్షిణ టిహామా ప్రాంతంలో హూతీలు మెరుపు వేగంతో ముందుకుదూసుకెళ్లడం చాలామంది పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసినట్టు కనిపిస్తోంది. టిహామా అంటే యెమెన్‌లోని పొడి, ఎడారి వాతావరణం ఉండే తీరమైదానం.

ఈ మధ్యకాలం వరకు హూతీలకు వ్యతిరేకంగా ఉన్న నేషనల్ రెసిస్టెన్స్ అనే కూటమి యెమెన్‌లోని ఎర్రసముద్రంలో చాలా ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. కానీ, కొద్దిరోజుల్లోనే ఆ ప్రాంతంలో చాలాభాగం మళ్లీ హూతీల చేతుల్లోకి వెళ్లిపోయింది.

యెమెన్ తీర ప్రాంతంలో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన 130 కిలోమీటర్ల వరకు ప్రాంతాన్ని ఇరాన్ మద్దతున్న ఈ తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని కొన్ని అంచనాల ద్వారా తెలుస్తోంది.

గత కొన్నేళ్లలో హూతీలకు లభించిన గొప్ప సైనిక విజయాల్లో ఇది ఒకటి.

12ఏళ్లగా కొనసాగుతున్న అంతర్యుద్ధం, సౌదీఅరేబియా చేసిన భారీ వైమానిక దాడులు, అలాగే అమెరికా, ఇజ్రాయెల్, యూకే దళాల దాడులు జరిగినప్పటికీ హూతీలు ఓ శక్తిగానే ఉన్నారని, వారిని తేలిగ్గా తీసుకోకూడదని ఈ పరిణామం తెలియజేస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రత్యర్థులు షాక్‌కు గురై ధైర్యం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నందున హూతీలను అక్కడి నుంచి అంత త్వరగా పంపించడం సాధ్యమయ్యేలా కనిపించించడం లేదు.

''ఇప్పుడు వారు అక్కడికి చేరుకున్నారు కాబట్టి అక్కడ తమ స్థావరాలను బలంగా ఏర్పాటు చేసుకుంటారు. వారిని బయటకు పంపించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది'' అని బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పీస్‌కు చెందిన సీనియర్ విశ్లేషకులు హిషామ్ అల్-ఒమిసీ బీబీసీతో అన్నారు.

‘‘హూతీలు ఒంటరిగా లేరు. వారికి ఇరాన్ మద్దతుంది. ఇప్పుడువారికి మద్దతివ్వడం ఇరాన్‌కు కూడా అవసరం. ఎందుకంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌గా పిలిచే లెబనాన్‌లోని హిజ్బొల్లా, గాజాలోని హమాస్, సిరియాలోని అసద్ ప్రభుత్వం ఇటీవల ఎదురుదెబ్బలు, పరాజయాలను చవిచూశాయి. ''అందుకే ఇరాన్ తన మద్దతును హూతీలవైపు మళ్లించించింది. హూతీలకు కూడా ఆ మద్దతు అవసరమే’’ అని అని అల్-ఒమిసీ చెప్పారు.

అమెరికా, ఇరాన్, హూతీ, యెమెన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్

‘అణుబాంబు ఉన్నంత శక్తినిచ్చే పరిణామం’

హూతీలను కేవలం ఇరాన్ చేతిలో కీలుబొమ్మలుగా పేర్కొనడం సరికాదని చాలామంది విశ్లషకులు అంగీకరిస్తున్నారు. కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు కొత్త వాస్తవికతను కళ్లముందుంచుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భారీ దాడులు ప్రారంభించి ఏడు నెలలు గడిచాయి. ఇప్పడు ఇరాన్‌లోని పాలకుకు ప్రపంచంలోని రెండు అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలను నియంత్రించే అధికారం లభించింది. అందులో ఒకటి పర్షియన్ గల్ఫ్ ప్రవేశద్వారం దగ్గర ఉన్న హార్ముజ్ జలసంధి. మరొకటి ఎర్రసముద్రానికి(అలాగే సూయజ్ కాలువకు) వెళ్లే ప్రధానమార్గమైన బాబ్ అల్-మందేబ్ జలసంధి.

''ఇప్పుడు ఇరాన్ నేరుగా, అలాగే తనకు మద్దతిచ్చే వర్గాల ద్వారా ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైన రెండు సముద్రమార్గాలను నియంత్రిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధనం, చమురు వ్యాపారంలో 35శాతానికి పైగా ఈ మార్గాలపై ఆధారపడిఉంది'' అని లండన్‌లోని చాథమ్ హౌస్ పరిశోధకులు ఫరియా అల్-ముస్లిమీ చెప్పారు.

‘‘ఇది అణుబాంబు వల్ల లభించేంత శక్తివంతమైన ప్రభావం ఇరాన్‌కు ఇస్తుంది'' అని ఆయన అన్నారు.

హూతీలు ఎర్రసముద్రంలోని పెరిమ్‌తో సహా కొన్ని కీలకమైన దీవులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటే, అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించే వారి సామర్థ్యం మరింత పెరిగి ఉండేది.

అమెరికా, ఇరాన్, హూతీ, యెమెన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, యెమెన్‌లోని చాలా భాగాలను హూతీలు నియంత్రిస్తున్నారు.

‘అమెరికా దాడి చేస్తుందన్న భయం ఉందా..?’

ఇజ్రాయెల్‌ గాజాపై యుద్ధం ప్రారంభించిన తర్వాత హూతీలు చేసిన దాడులు కూడా ఈ విషయాన్ని తెలియజేశాయి. హూతీల క్షిపణులు, డ్రోన్లు, చిన్న స్థాయి దాడులుచేసే పడవలకు ఎర్రసముద్రంలో ప్రయాణించే నౌకలు చాలా సులభ లక్ష్యాలుగా మారే పరిస్థితి ఉంది.

''ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే బాబ్ అల్-మందెబ్ నుంచి సూయజ్ వైపు వెళ్లే నౌకల రాకపోకలను, అక్కడి నుంచి బయటకు వెళ్లే నౌకలను వారు నియంత్రించగలిగారు'' అని యెమెన్ నిపుణురాలు ఐయోనా క్రెయిగ్ శుక్రవారం బీబీసీ రేడియో 4టుడే కార్యక్రమంలో చెప్పారు.

''ఇప్పుడు బాబ్ అల్-మందెబ్‌ను నేరుగా పర్యవేక్షించే ప్రాంతం వారి నియంత్రణలో ఉంది. దీంతో వారికి మరింత ఎక్కువ ఒత్తిడి చేసే శక్తి లభించింది'' అని ఆమె చెప్పారు.

శుక్రవారం (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం హూతీ సైన్యం విడుదల చేసిన ఓ ప్రకటనను నౌకాయాన సంస్థలు అంతగా నమ్మకపోవచ్చు. సముద్రరవాణా అన్ని కంపెనీలకు సురక్షితంగానే ఉంటుంది. అయితే ఇప్పటికే తమపై దిగ్బంధం విధించిన సౌదీ నౌకలకు మాత్రం ఇది వర్తించదు'' అని హూతీ సైన్యం ఆ ప్రకటనలో పేర్కొంది.

గతంలో జరిపిన దాడుల సమయంలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని హూతీలు చెప్పారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధంలేని నౌకలపై కూడా వారు దాడి చేశారు. వాటిలో నార్వే జెండాతో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్ కూడా ఉంది.

అయితే హూతీలు అన్ని నౌకలపై దాడులు చేయకపోవచ్చని, ఆపరేషన్ రఫ్ రైడర్ మాదిరిగా మరోసారి అమెరికా దాడులును భారీగా ఎదుర్కోవాల్సివస్తుందనే భయం వారికుండొచ్చని క్రెయిగ్ అన్నారు. 2025లో ఆపరేషన్ రఫ్ రౌడర్ పేరుతో ఆరువారాల పాటు అమెరికా వైమానిక, నౌకాదళ దాడులను భారీ ఎత్తున చేసింది.

''వారు ఇప్పటికే అమెరికా ఆగ్రహాన్ని చవిచూశారు'' అని ఆమె చెప్పారు.

అమెరికా, ఇరాన్, హూతీ, యెమెన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ‘యెమెన్‌లో పెరుగుతున్న ఘర్షణపై అమెరికా ఆందోళన చెందుతోంది’ అని నిపుణులు అంటున్నారు.

ట్రంప్ జోక్యం చేసుకుంటారా?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చేస్తున్న యుద్ధానికి ఇప్పటికే ప్రజల్లో అంత మద్దతులేదు. చమురు ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్న సమయంలో మరో కొత్త యుద్ధ రంగాన్ని ప్రారంభించడం వల్ల ట్రంప్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అనుకోవడం కష్టం. అలాగే నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలకు కూడా ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

అమెరికా జోక్యం చేసుకోవాలని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన విజ్ఞప్తులకు ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆక్సియోస్ వెబ్‌సైట్ తెలిపింది.

''యెమెన్‌లో పెరుగుతున్న ఘర్షణపై అమెరికా ఆందోళన చెందుతోంది'' అని ఆక్సియోస్ కథనంలో ఉంది. అదేసమయంలో సౌదీ అరేబియాకు తన మద్దతును పెంచేందుకు ప్రయత్నిస్తూ, ప్రత్యక్ష సైనిక జోక్యానికి మాత్రం దూరంగా ఉండాలని అమెరికా భావిస్తోంది.

అయితే సౌదీ అరేబియాను భయపెడుతున్న విషయం బాబ్ అల్-మందెబ్‌కు ఎదురయ్యే ముప్పు మాత్రమే కాదు.

సౌదీ అరేబియాలోని ఈస్ట్-వెస్ట్ చమురు పైప్‌లైన్‌పై హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్టు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి ఈ ఏడాది ప్రారంభంలో మూతపడ్డ తర్వాత చమురు ఎగుమతికి ఈ పైప్‌లైన్ ఓ కీలక ప్రత్యమ్నాయంగా మారింది. ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల ఇప్పటికే ఏర్పడ్డ ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు ఇరాన్‌కు మద్దతిచ్చే యెమెన్‌లోని హూతీలు ఈ దాడికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది.

ఈ దాడికి ఇరాన్ నేరుగా ఆదేశాలివ్వకపోయినా దానివల్ల లాభపడేది మాత్రం ఇరానే.

అమెరికా, ఇరాన్, హూతీ, యెమెన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, AL MASIRAH/Handout via REUTERS

ఫొటో క్యాప్షన్, మోఖాలో హూతీ ఫైటర్లు ఉన్నట్లుగా చెబుతున్న దృశ్యాలను హూతీల నిర్వహణలోని 'అల్-మసిరా టీవీ' ప్రసారం చేసింది.

ఇరాన్ వ్యూహం అదేనా..?

తాజా ఘర్షణలు పెరగడానికి కారణాలను 2022లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ తర్వాతి పరిణామాల్లో చూడొచ్చని లండన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు, విశ్లేషకులు బరా షైబాన్ అన్నారు. 2022 తర్వాత ఇంత తీవ్రస్థాయి ఘర్షణలు పెరగడం ఇదే తొలిసారని తెలిపారు. జూలైలో ఒక హూతీ ప్రతినిధి బృందం ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై తిరిగి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు మొదలయ్యాయని ఆయన చెప్పారు.

''ఆ వెంటనే ఘర్షణలు తీవ్రస్థాయిలో పెరగడం మొదలయింది. ఎర్రసముద్రంలో మరింత బలమైన స్థావరాన్ని ఏర్పరుచుకోవాలని ఇరాన్ ఇప్పుడు నిర్ణయించుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపించింది'' అని ఆయన చెప్పారు.

యెమెన్ మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం అంచుకు చేరుకుంటోంది. సౌదీ అరేబియా తన ఆర్థికవ్యవస్థకు కీలకమైన ఎర్ర సముద్రమార్గాన్ని కాపాడుకోవడంపై ఆందోళన చెందుతోంది. అదే సమయంలో డోనల్డ్ డ్రంప్ ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడం లేదని అనిపిస్తోంది. దీంతో ఇరాన్‌తో అమెరికా ఘర్షణ ఇప్పడు మరింత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన కొత్త దశలోకి ప్రవేశించింది.

అయితే యెమెన్ ప్రజలకు పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశముంది. 12ఏళ్లగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చినవారు, బాంబు దాడులకు గురైనవారు, ఆకలితో అలమటించినవారు, పేదరికంలోకి వెళ్లిపోయిన వారు...ఇలా యెమెన్‌లోని ప్రజల జీవితాలను తాజా పరిణామాలు మరింత క్లిష్టంగా మార్చే అవకాశముంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)