పింక్ హెల్మెట్ ధరించి, ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే ఒక పెద్ద కాలువ బాధ్యతలు చూసుకుంటున్న ఇల్యా ఎస్పినో డీ మారోట్టా ఎవరు?

ఫొటో సోర్స్, Granted by the Panama Canal Authority
- రచయిత, రోనాల్డ్ అలెగ్జాండర్ అవిలా-క్లాడియో
- హోదా, బీబీసీ న్యూస్ ముండో
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
గత మే నెలలో ఒక మధ్యాహ్నం మేం ఇల్యా ఎస్పినో డీ మారోట్టాతో కలిసి పనామా కాలువ పసిఫిక్ వైపు ఉన్న పారైసో డాక్‌కు చేరుకున్నప్పుడు, అక్కడ పనిచేస్తున్న కార్మికులు మా దగ్గరకు వచ్చారు. వారంతా దాదాపు పురుషులే.
ఇంటర్ ఓషియానిక్ వాటర్‌వేలో ప్రయాణించేందుకు మమ్మల్ని తీసుకెళ్లే పడవ వద్దకు మేం వెళ్తుండగా.. ఒకే పదం పదేపదే వినిపించింది.. అదే ''బాస్.. బాస్...బాస్'' అని
ఆమె ఒకసారి ఆగి, అక్కడున్న వారందర్ని పలకరించి, వారితో సెల్ఫీలు దిగి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మా మీటింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు.. పనామా కాలువ 112 ఏళ్ల చరిత్రలో ఆ కాలువను నడిపించే మొట్టమొదటి మహిళా అధిపతిగా ఈ మెరైన్ ఇంజనీర్ నియమితులయ్యారు.
ఈ వారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బహిరంగ వేడుకలో ఆమె అధికారికంగా ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుకకు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో హాజరయ్యారు.

ఎస్పినో డి మారోట్టా తన ప్రసంగాన్ని రేవులో మేం చూసిన ఆప్యాయతను అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక జ్ఞాపకంతో ప్రారంభించారు.
"1985 జూన్ 17న, ఒక యువ ఇంజనీర్ పనామా కాలువ రిపేర్ డాక్‌లో తాత్కాలికంగా పనిచేయడానికి వచ్చింది. ఇక్కడ మీ ముందు ఉండి, దాని నిర్వహణ బాధ్యతను తీసుకుంటుందని కనీసం ఆరోజు ఆమె ఊహించి ఉండదు" అని ఆమె తన కుటుంబ సభ్యులతో, సహోద్యోగులతో, అధికారులతో అన్నారు.
ఈ పని చాలా పెద్దది. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ గుండానే ప్రపంచ వాణిజ్యంలో సుమారు 6 శాతం జరుగుతుంది.

ఫొటో సోర్స్, Reuters
మధ్య అమెరికా దేశానికి, దాని ఆర్థిక వ్యవస్థలో సుమారు 10 శాతం, ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లే 3 బిలియన్ డాలర్లకు పైగా (రూ.28,666 కోట్లకు పైగా) మొత్తాన్ని ఇదే అందిస్తుంది.
అయితే, ఈ పనిని క్లిష్టతరం చేసేది కేవలం దాని ఆర్థిక ప్రాముఖ్యత మాత్రమే కాదు. ఈ కాలువ అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతల మధ్య చిక్కుకుంది.
అంతేకాకుండా వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏర్పడుతున్న నీటి కొరత నుంచి ఇది తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది.
వారం క్రితం, రిజర్వాయర్లలో నీటిమట్టాలు తక్కువగా ఉండటం వల్ల, ఆ కాలువను దాటడానికి అనుమతించే ఓడల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి తన వద్ద ఒక ప్రణాళిక ఉందని ఎస్పినో డీ మారోట్టా చెప్పారు.
''ఈ కాలువ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతిసారీ, ప్రతిరోజూ పనిచేసే ప్రజల కృషితో ఏమాత్రం ఆగకుండా తనను తాను సరికొత్తగా మలుచుకుంటూనే ఉంది'' అని ప్రస్తుతం తాను నాయకత్వం వహిస్తున్న దాదాపు 9 వేల మంది ఉద్యోగులను ఉద్దేశించి ఆమె అన్నారు.
అమెరికా సైన్యం నిర్మించి, 1914లో ప్రారంభించిన ఈ భారీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన తొలి మహిళ కావడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆమె చెప్పారు.
"దానివల్ల అంచనాలు పెరుగుతాయని నాకు తెలుసు. కానీ, నేను ఒక మహిళ అయినందువల్ల ఇక్కడికి రాలేదు" అని ఎస్పినో డీ మారోట్టా అన్నారు.
"41 ఏళ్లుగా కష్టపడి, ఈ బాధ్యతకు నన్ను నేను సిద్ధం చేసుకున్నందువల్లే ఇక్కడికి రాగలిగాను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Granted by the Panama Canal Authority
పింక్ హెల్మెట్
ఎస్పినో డి మారోట్టా పనామా కాలువలో తన మొదటి ఉద్యోగాన్ని షిప్‌యార్డ్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రారంభించారు. ఆమె స్వయంగా తన ప్రసంగంలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కడ ఆమె టగ్‌బోట్లు, లాంచ్‌లు, క్రేన్‌లు, డ్రెడ్జ్‌ల వంటి పరికరాలను నిర్వహించేవారు.
కానీ, సముద్రంతో ఆమె సంబంధం అంతకు చాలా కాలం క్రితమే ప్రారంభమైంది.
''చిన్నప్పటి నుంచి నాకు సముద్రమంటే ఇష్టం. మెరైన్ బయాలజీ చదవాలని అనుకున్నా. ఎందుకంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు, ఫ్రెంచ్ డైవర్ (చిత్రనిర్మాత, సముద్ర శాస్త్రవేత్త) జాక్వెస్ కౌస్టో చేసిన వర్క్ గురించి నేను తెలుసుకున్నా'' అని ఆమె 2019లో డీడబ్ల్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
స్కూబా డైవింగ్‌ను 16 ఏళ్ల వయసుకే ప్రారంభించారు. పనామాలో పరిమితి ఉద్యోగవకాశాలు ఉండటంతో.. అమెరికాలో టెక్సాస్ ఏ&ఎం యూనివర్సిటీలో మెరైన్ ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నారు.
గ్రాడ్యుయేట్ అయిన తర్వాత.. కెనాల్ వద్ద తాను నిజంగా కోరుకున్న ఉద్యోగం ఇండస్ట్రియల్ డైవర్. కానీ, అది ఆమెకు లభించలేదు.
''అది 1985లో జరిగింది. వాళ్లు నాకు చెప్పకపోయినా, నేను ఒక మహిళను కాబట్టే అలా జరిగింది" అని ఆమె డీడబ్ల్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ తర్వాత దశాబ్దాల్లో కెనాల్ వద్ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రాన్సిట్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటి పలు పదవులను నిర్వహించారు.
చివరి పదవిలో ఈ జలమార్గం విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2012 నుంచి ఆమె ఈ ప్రాజెక్ట్ చివరి దశకు నాయకత్వం వహించారు.
''కొందరు పురుషులు నా నియామకాన్ని ప్రశ్నించారు. కానీ, నేను దీన్ని సమర్థవంతంగా నిర్వహించగలను'' అని యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుకు చెందిన బ్లాగ్‌కు 2016లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశారు.
ఈ ప్రాజెక్టుకు బ్యాంకు 500 మిలియన్ డాలర్ల (రూ.4,777 కోట్ల) నిధులను అందించింది.

ఫొటో సోర్స్, EPA
నిర్మాణ సమయంలో.. గులాబీ రంగు హెల్మెట్ ధరించారు మారోట్టా. ''ఈ పనిని ఒక మహిళ చేయగలదనే దానికి ఇది నిదర్శనం'' అని ఆమె చెప్పారు.
ఈ విస్తరణ నౌకల కోసం మూడో లేన్‌ను అందించింది. ఎక్కువ కార్గో సామర్థ్యం కలిగిన పెద్ద నౌకల రాకపోకలను ఈ లేన్ అనుమతించింది.
నేడు, ఎస్పినో డి మారోట్టా స్వయంగా పనామా మీడియాకు తెలిపినట్లుగా, ఆ ప్రాజెక్ట్ పనామా కాలువ వార్షిక ఆదాయంలో 50 శాతం సమకూరుస్తోంది.
సోమవారం ఆమె కొత్త బాధ్యతలను స్వీకరించినప్పుడు, ఈ కాలువ దేశానికి ఎంత అవసరమో చెబుతూ, దానిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
''ఈ కాలువ ఫలితాలు యాధృచ్ఛికమైనవి కావు. కానీ, 30 ఏళ్ల క్రితం మా ప్రధాన సంస్థ నిర్వహణపై పనామా వాసులు తీసుకున్న నిర్ణయ ఫలితాలే ఇవి'' అని ఆమె చెప్పారు.
''అప్పటి నుంచి పనామా కాలువ ద్వారా దేశ ఖజనాకు 31 బిలియన్ డాలర్లు చేకూరుతుంది. అంటే, అమెరికా తన 85 ఏళ్ల పరిపాలనలో పనామాకు అందించిన దానికంటే 17 రెట్లు ఎక్కువ" అని కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, Ronald Alexander Ávila-Claudio
ముందున్న సవాళ్లేంటి?
పనామా కాలువ నిర్వాహకులు తమ బాధ్యతలను చేపట్టే కార్యక్రమం, ఒక పాలకుడి విధానానికి ఏమాత్రం తీసిపోదు.
అంతేకాదు, పనామా కెనాల్ అథారిటీ (ఏసీపీ) స్వయంగా ఒక ప్రచార వీడియోలో దీనిని "అధికార స్వీకరణ (టేకోవర్)" అని పేర్కొంది.
ఈ వేడుకలో, ఎస్పినో డీ మారోట్టా తన కొత్త బాధ్యతలను అధికారికంగా ధ్రువీకరించే ఒక పత్రంపై సంతకం చేసి... అధికారులు, ఏసీపీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సభ్యులు, అధ్యక్షుడు ములినో, ప్రథమ మహిళ మరిసెల్ కోహెన్‌లతో కలిసి ఫోటోలు దిగారు.
పసిఫిక్ మహాసముద్రాన్ని అభిముఖంగా ఉన్న విశాలమైన స్తంభాలు, పాలరాతి నేలతో కూడిన సుందరమైన అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట చేసిన ప్రసంగంలో, కాలువ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా సమీక్షించి, సంస్థ పట్ల తన దృక్పథాన్ని కొత్త నాయకురాలు వివరించారు.
"కాలువ పనామాలోనే ఉన్నప్పటికీ, దాని వ్యాపారం, కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తమైనవి. అందువల్ల, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాతావరణ సంఘటనలు నష్టాలను, అవకాశాలను రెండింటినీ తెచ్చిపెడుతున్నాయి" అని ఆమె అన్నారు.
తాను ఏ భౌగోళిక-రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తున్నారో ఆమె వివరంగా చెప్పనప్పటికీ, ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం కోసం చైనా, అమెరికా మధ్య నెలకొన్న వివాదంలో పనామా కాలువ గత కొన్ని నెలలుగా కేంద్ర బిందువుగా మారింది.
2025లో తన రెండో పదవీకాలాన్ని ప్రారంభించినప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. ఈ కాలువపై పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఉటంకిస్తూ, అమెరికా నౌకల నుంచి పనామా "హాస్యాస్పదమైన, అత్యంత అన్యాయమైన" రుసుములను వసూలు చేస్తోందని ఆరోపించారు.
ఆ ప్రాజెక్ట్‌పై తిరిగి నియంత్రణ సాధిస్తామని హెచ్చరించారు.
ఆ తర్వాత వాషింగ్టన్, పనామా మధ్య ఘర్షణకు ప్రధాన అంశాలుగా మారిన రెండు ఓడరేవులను హాంకాంగ్‌కు చెందిన కంపెనీ సీకే హాచిసన్ (CK Hutchison) నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఒక అమెరికా పెట్టుబడి సంస్థ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Ronald Alexander Ávila-Claudi
ఏసీపీకి ఈ పరిస్థితి అత్యంత సున్నితమైనది. ఎందుకంటే అమెరికా, చైనాలే దాని అతిపెద్ద వినియోగదారులు.
బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో, కెనాల్ ఒక రాజకీయ సంస్థ కాదని, అది ఒక స్వతంత్ర, ఫలితాల ఆధారిత సంస్థ అని ఎస్పినో డీ మారోట్టా నొక్కి చెప్పారు.
''దౌత్యపరమైన విషయాలు ప్రభుత్వమే చూసుకుంటుంది'' అని చెబుతూనే.. ఈ జలమార్గం అంతర్జాతీయంగా పోటీతత్వంతో ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.
నీటి కొరత గురించి కూడా వివరించారు.
వాతావరణ మార్పులు కారణంగా ఎక్కువ కాలం పాటు, తరచూ సంభవిస్తున్న కరువులు మరోసారి ఇంటర్ ఓషియానిక్ వాటర్‌వేను ప్రభావితం చేశాయి.
సముద్ర మట్టానికి పైన కృత్రిమమైన సరస్సుల వ్యవస్థగా నిర్వహించిన ఈ కాలువ, వర్షపాతంపైనే ఆధారపడి ఉంది.
ఇదే రిజర్వాయర్లు కొలోన్ నుంచి పనామా సిటీ వరకు నివసిస్తున్న 20 లక్షల మందికి మంచి నీటిని సరఫరా చేస్తున్నాయి. అంటే పనామా జనాభాలో వీరు దాదాపు సగం మంది.
ఏసీపీ 2027లో నిర్మాణాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. కానీ, ఈ ప్రాజెక్ట్ కారణంగా పునరావాసం పొందాల్సిన 30కి పైగా కమ్యూనిటీల నివాసితుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది.
ఈ ప్రక్రియను చర్చల ద్వారా చేపట్టినట్లు ఎస్పినో డీ మారోట్టా చెప్పారు. ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చిన వారికి తమ సంస్థ నష్టపరిహారం చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
''ఇది కాలువ ప్రాజెక్టు కాదు. ఇది దేశ ప్రాజెక్టు అని అర్థం చేసుకోవాలి'' అని ఆమె పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























