‘దూరంగా వెళ్లమని చెబుతున్నా వచ్చి నన్ను ఢీకొట్టి వెళ్లాడు’-గురుగ్రామ్‌ మహిళా బైకర్ యాక్సిడెంట్ వైరల్ వీడియోలో ఏముంది? పోలీసులు ఏం చెప్పారు?

గురుగ్రామ్

ఫొటో సోర్స్, rebelwheels_sia_/Instagram

ఫొటో క్యాప్షన్, యాక్సిడెంట్ దృశ్యాలు బైక్‌కు అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

హరియాణాలోని గురుగ్రామ్‌లో ఆదివారం గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్‌ను ఓ దుండగుడు కారుతో ఢీకొట్టిన ఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు.

ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సోషల్ మీడియా వెబ్‌సైట్ ఎక్స్‌ ద్వారా గురుగ్రామ్ పోలీసులు ప్రకటించారు.

నిందితులను గుర్తించామని, వారిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని కూడా పోలీసులు తెలిపారు.

కారు యజమాని అని చెబుతున్న వ్యక్తి తన స్నేహితుడు ఆ కారును రెండు రోజుల అవసరం కోసం తీసుకున్నాడని వెల్లడించారు.

మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మహిళల భద్రతపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గురుగ్రామ్

ఫొటో సోర్స్, rebelwheels_sia_/Instagram

మహిళా బైకర్ ఎవరు?

సియా అనే మహిళా బైకర్ ఆదివారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఆమె బైక్‌ను కారు ఢీకొన్న ఘటన బైక్‌కు అమర్చిన కెమెరాలో రికార్డ్ అయింది.

ఆదివారం ఉదయం తన స్నేహితులతో కలిసి బైక్ రైడ్ చేస్తుండగా, ఒక కారు తనను వెంబడించిందని సియా ఆరోపించారు.

గురుగ్రామ్

ఫొటో సోర్స్, rebelwheels_sia_/Instagram

‘‘గోల్ఫ్ కోర్స్ రోడ్డులో నేను రైడ్ చేస్తుండగా, ఒక కారు డ్రైవర్ మొదటి నుంచి నన్ను వెంబడిస్తున్నాడు. అతను కారు నుంచి ఏదో సైగ చేశాడు. నేను అతడిని కాస్త దూరంగా నడపమని చెప్పాను. దానికి అతను, 'బైక్ ఆపు' అన్నాడు. అతను మద్యం సేవించి ఉన్నాడు’’ అని సియా చెప్పారు.

"అతను తన కారుతో నా బైక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు, నేను అతనికంటే కొంచెం ముందు వెళ్లడానికి ప్రయత్నించా. సరిగ్గా అదే క్షణంలో, నా ఫ్రెండ్ ఒకరు నా వెనుక్కు వచ్చి నన్ను కవర్ చేయడానికి ప్రయత్నించారు. అయినా ఆ కారు డ్రైవర్ నన్ను వెంబడిస్తూనే, చివరికి అడ్డంగా వచ్చి నన్ను ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు"

"అతను నన్ను ఢీకొట్టినప్పుడు, నా ఫ్రెండ్ అతడిని కారు ఆపమని చెప్పాడు. మళ్ళీ సిగ్నల్స్ వద్ద నా స్నేహితుడు అతడిని ఆపి, కారులోంచి దిగమని చెప్పాడు. కానీ అతను, 'అందులో నా తప్పు లేదు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు" అని సియా చెప్పారు.

ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని గురుగ్రామ్ పోలీసులకు సియా విజ్ఞప్తి చేశారు.

బైకర్ సియా సోమవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘అందరికీ నమస్కారం, మీ అందరి మద్దతుకు చాలా ధన్యవాదాలు. చాలామంది ఆ వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు నేను గమనించాను. అలాగే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని కోరుతూ నాకు సందేశాలు కూడా వస్తున్నాయి. ఈ సాయంత్రంలోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను నా న్యాయవాదితో మాట్లాడతా" అని అన్నారు.

‘‘నాకు న్యూస్ చానెళ్లు, పాత్రికేయుల నుంచి ఇంటర్వ్యూల కోసం చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. దయచేసి ఓపికగా, ప్రశాంతంగా ఉండండి. నా గుర్తింపునుగానీ, ముఖాన్ని గానీ వెల్లడించాలని నేను కోరుకోవడం లేదు. ఈ సమయంలో నేను ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వబోవడం లేదు. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. నేను మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాను. ఏ సమాచారం కోసమైనా, దయచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేయండి. నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’ అని సియా తన పోస్టులో వెల్లడించారు.

గురుగ్రామ్

ఫొటో సోర్స్, rebelwheels_sia_/Instagram

ఫొటో క్యాప్షన్, కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్న సియా స్నేహితుడు

గురుగ్రామ్ పోలీసులు ఏం చెప్పారు?

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో తాము చర్యలు మొదలుపెట్టామని పోలీసులు ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

‘‘బాధితురాలి నుంచి ఇంకా ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ, గురుగ్రామ్ పోలీసులు వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించి, ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేస్తాం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని ఎక్స్‌లో రాసిన పోస్టులో పోలీసులు చెప్పారు.

‘‘ఈ ఘటనలో నిందితుడిని గుర్తించాం. మూడు బృందాలను రంగంలోకి దించాం. నిందితుడు తలదాచుకున్న ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నాం. త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని తర్వాత చేసిన మరో పోస్టులో పోలీసులు వెల్లడించారు.

గాయపడిన మహిళను సంప్రదించామని గురుగ్రామ్ ఏసీపీ అభిలాష్ జోషి ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు .

"వాహనం ఆధారంగా నిందితుడి వివరాలను పరిశీలిస్తున్నాం. వీడియోలోని మహిళ చేసిన ఆరోపణల ప్రకారం విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు.

కారు యజయాని ఎవరు?

మహిళా బైకర్ వీడియోలో కనిపించిన కారు మారుతి సుజుకి సియాజ్ మోడల్. ఈ కారు యజమానిగా భావిస్తున్న మనీశ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

కల్యాణ్ సింగ్ అనే తన స్నేహితుడికి తాను కారు ఇచ్చానని ఆయన వెల్లడించారు.

‘‘ఆ కారు నాదే. నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా స్నేహితుడు కారు తీసుకున్నాడు. ఎక్కడికో వెళ్లాలని చెప్పి రెండు రోజులపాటు దాన్ని తీసుకువెళ్లారు" అని తెలిపారు.

"నాకు ప్రమాదం గురించి ఈ ఉదయం తెలిసింది. నేను అతనికి ఫోన్ చేశాను, కానీ అతను ఫోన్ ఎత్తలేదు. నేను మా నాన్నను, ఇతరులను అతని ఇంటికి పంపించాను. అతను హరియాణాలోని పల్వాల్ జిల్లాకు చెందినవాడు’’ అని మనీశ్ వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)