ఇరాక్ నుంచి డ్రోన్ దాడి.. 12 వందల కిలోమీటర్ల కీలక చమురు పైపులైన్‌ను మూసివేసిన సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Planet Labs PBC
- రచయిత, టిఫనీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు విస్తరిస్తుండటం, ఇరాక్ నుంచి డ్రోన్ దాడులు జరగడంతో సౌదీ అరేబియా కీలక చమురు పైపులైన్‌ను మూసివేసింది.
తమ పొరుగుదేశంలోని ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై జరిగిన డ్రోన్‌దాడి తమ దేశంలోని ఇరాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఓ ప్రావిన్స్ నుంచే జరిగిందని అంగీకరించిన ఇరాక్ ఓ సైనిక కమాండర్‌ను పదవి నుంచి తొలగించి దర్యాప్తును ప్రారంభించింది. ఇరాన్ అండ ఉన్న ఇరాక్‌లోని మిలీషియా దళాలు తమ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సౌదీ అరేబియా గతంలో ఆరోపించింది.
ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా.. హార్ముజ్ జలసంధి దాటాల్సిన అవసరం లేకుండానే, 1,200 కిలోమీటర్ల ఈ పైప్‌లైన్ ద్వారానే చమురును తరలించగలుగుతోంది.
అమెరికా-ఇరాన్ యుద్ధం ఏడో నెలలోకి అడుగుపెట్టడం, యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హూతీ రెబల్స్ దూసుకువస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. అంతర్జాతీయ చమురు రవాణా మార్గాలపై ఒత్తిడి పెరుగుతోంది.

దాడి జరిగిన ప్రాంతం సమీపంలో భూమి నల్లగా మారి , పొగ అలుముకున్న ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా పైప్‌లైన్‌ను మూసివేసినట్లు సౌదీ అరేబియా శుక్రవారం ప్రకటించింది.
ఈ దాడి కారణంగా పలువురికి గాయాలు కావడంతో పాటు కొంత నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నామని సౌదీ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
నౌకల కదలిలకను పర్యవేక్షించే సంస్థలు, విశ్లేషకులను ఉటంకిస్తూ.. ప్రపంచ చమురు సరఫరాలో 4 శాతం నుంచి 5 శాతం మేర ఈ పైప్‌లైన్ ద్వారానే రవాణా అవుతోందని వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది.

ప్రతీకార చర్యలకు దూరం..
ఇరాక్ ప్రధానితో మాట్లాడిన తర్వాత, ప్రస్తుతానికి ప్రతీకార చర్యలు అవసరం లేదని సౌదీ అరేబియా నిర్ణయించుకుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇరాక్ గడ్డ మీదుగా పొరుగు దేశాలపై జరిగే దాడులను నిరోధించేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని సౌదీ పేర్కొంది.
"దేశ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకోవడానికి, స్థావరాలను రక్షించుకోవడానికి, పౌరులతో పాటు దేశంలోని ఇతర నివాసితుల భద్రతకు భరోసా ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని సౌదీ అరేబియా స్పష్టం చేస్తోంది" అని సౌదీ ఆ ప్రకటనలో వివరించింది.
ఇరాన్ సరిహద్దులోని మేసన్ ప్రావిన్స్ నుంచే ఈ డ్రోన్ దాడి జరిగిందని నిర్ధరణ కావడంతో, అక్కడి ఆపరేషన్స్ కమాండర్‌ను పదవి నుంచి తొలగించినట్లు ఇరాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, కువైట్ ప్రతినిధులతో కూడిన గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఈ దాడి ప్రమాదకరమైన రీతిలో పరిస్థితులను తీవ్రతరం చేస్తోంది. సౌదీ అరేబియా భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు, కీలక స్థావరాలకు ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ముప్పు. అలాగే అంతర్జాతీయ న్యాయ సూత్రాలను బాహాటంగా ఉల్లంఘించడమే" అని గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్బుదైవి అన్నారు.
మళ్లీ పెరిగిన ముడి చమురు ధరలు
ఈ వారం యెమెన్‌లో మెరుపు వేగంతో చొచ్చుకువచ్చిన హూతీ మిలిటెంట్లు, దేశ తీరప్రాంతంలోని అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఎర్ర సముద్రం, సూయజ్ కాలువకు ముఖద్వారమైన బాబ్ అల్-మండెబ్ జలసంధి కూడా తమ గుప్పిట్లోనే ఉందని ఆ గ్రూప్ ప్రకటించింది. అయితే, సముద్ర రవాణా "సౌదీ నౌకలకు తప్ప మిగతా అన్ని కంపెనీలకు సురక్షితమే" అని హూతీ స్పష్టం చేసింది.
ఈ తాజా పరిణామాలు అరేబియా ద్వీపకల్పంలోని ఇరువైపులా తీవ్ర ఒత్తిడి పెంచాయి. దీంతో జులై తర్వాత తొలిసారిగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి ఎగబాకాయి. ఇంధన ధరలు అమాంతం పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కూడా ఎక్కువయ్యాయి. ఇది ప్రభుత్వాల రుణ సమీకరణ వ్యయాలను మరింతగా పెంచుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























