ఉజ్జయిని-సింహస్థ కుంభమేళా: 650 ఏళ్ల నాటి షాహీ మసీదు భాగం తొలగింపును ఆపాలన్న పిటిషన్ తిరస్కరణ

ఫొటో సోర్స్, ANI
- రచయిత, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ కోసం షాహీ మసీదులోని ఒక భాగాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగనున్నాయి.
సింహస్థ కుంభమేళా 2028 సన్నాహాల్లో భాగంగా నగరంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే, దాదాపు 650 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చెబుతున్న ఉజ్జయినిలోని షాహీ మసీదు విషయంలో సోమవారం ఉదయం వివాదం తీవ్రమైంది.
ఆదివారం రాత్రి నుంచే ఛత్రీ చౌక్ ప్రాంతంలోని మసీదు వద్దకు భారీగా జనం చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగి, కొద్దిసేపటికే అది హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో రాళ్లు రువ్వడం, దాడులు చేసుకోవడం లాంటి పరిస్థితులు తలెత్తాయి. గుంపును అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రస్తుతం షాహీ మసీదు ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
"సింహస్థ 2028 సన్నాహాల కోసం మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అన్ని మతాలు, వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా దీనికి సహకరిస్తున్నారు" అని ఉజ్జయిని కలెక్టర్ రౌషన్ సింగ్ చెప్పారు.
"రోడ్డు విస్తరణ పరిధిలోకి వస్తున్న ఇళ్లు, ధార్మిక స్థలాలను చాలామంది సొంతంగా తొలగిస్తున్నారు. ఛత్రీ చౌక్‌లో రోడ్డు పరిధిలోకి వస్తున్న షాహీ మసీదు భాగాన్ని కూడా ముస్లిం సమాజం వారే స్వయంగా తొలగిస్తున్నారు. ఎవరూ వదంతులను నమ్మవద్దని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వానికి సహకరించాలని అందరినీ కోరుతున్నాను" అని కలెక్టర్ పేర్కొన్నారు.

"ఆదివారం రాత్రి మసీదు కమిటీ, జిల్లా యంత్రాంగం మధ్య జరిగిన చర్చల తర్వాత, ఆ భాగాన్ని స్వయంగా తొలగించాలని కమిటీ నిర్ణయించింది. వదంతుల కారణంగా కొందరు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. కానీ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది" అని ఉజ్జయిని నగర ఖాజీ ఖలీక్ ఉర్ రెహమాన్ బీబీసీతో తెలిపారు.
శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్పీఎఫ్ జవాన్లను కూడా అక్కడికి రప్పించారు. సీనియర్ పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా అక్కడే ఉన్నారు.
ఉజ్జయిని నగరపాలక సంస్థ 15 మీటర్ల మేర వెడల్పు చేయాలనుకుంటున్న రోడ్డు ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో మసీదు తొలగించాల్సిన భాగం ఉంది.
సింహస్థ సమయంలో పెరిగే ట్రాఫిక్, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుంటే ఇది అవసరమని అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, SAMEER KHAN
మసీదు కమిటీ లాయర్ ఏం చెప్పారు?
సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌పై ఆదేశాలు జారీ చేసిందని మసీదు కమిటీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అజర్ వార్సీ తెలిపారు.
"మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, దానిని పాటించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత కమిటీ తరఫున డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీల్ దాఖలు చేశాం" అని ఆయన చెప్పారు.
విచారణ సందర్భంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలనే సూచనను కూడా కోర్టు ముందు ఉంచారు.
"అధికారులు, మసీదు కమిటీ మధ్య జరిగిన చర్చల్లో మసీదుకు చెందిన సుమారు మూడు అడుగుల భాగాన్ని యథాతథంగా ఉంచాలనే అంశాన్ని కూడా లేవనెత్తారు. రోడ్డు విస్తరణలో తీసుకునే భాగానికి బదులుగా నిబంధనల ప్రకారం ఎఫ్‌ఏఆర్, టీడీఆర్ ప్రయోజనాలు కల్పిస్తామని నగరపాలక సంస్థ తన అఫిడవిట్‌లో పేర్కొంది" అన్నారు వార్సీ.
కోర్టు అఫిడవిట్‌లో ఇచ్చిన షరతులను పాటించాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను డివిజన్ బెంచ్ ఆదేశించింది.
కోర్టు ఆదేశాల తర్వాత ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగనున్నాయి. విచారణ సందర్భంగా మసీదు కమిటీ తరఫున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రభావిత భాగానికి సంబంధించిన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, ANI
రోడ్డు విస్తరణపై వివాదం
ఉజ్జయిని నగరపాలక సంస్థ ప్రకారం, ఉజ్జయిని అభివృద్ధి ప్రణాళిక 2035 కింద రోడ్డు విస్తరణ పనులను చేపడుతున్నారు. 15 మీటర్ల మేర వెడల్పు చేయాలని భావిస్తున్న రోడ్డు మార్గంలోనే షాహీ మసీదు కూడా ఉంది. ఈ ప్రతిపాదిత రోడ్డు పరిధిలోకి మసీదులోని ఒక భాగం వస్తోంది.
ముస్లిం సమాజం సింహస్థను వ్యతిరేకించబోదని ఖాజీ ఖలీక్ ఉర్ రెహమాన్ చెప్పారు.
"సింహస్థ గతంలోనూ జరిగింది, భవిష్యత్తులోనూ జరుగుతుంది. ముస్లిం సమాజం ఎప్పుడూ దానికి మద్దతుగానే ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, ఏ ధార్మిక స్థలాన్ని కూల్చవద్దని మాత్రమే మేం కోరుతున్నాం. ఎందుకంటే వీటిలో చాలా వరకు చారిత్రక కట్టడాలున్నాయి. షాహీ మసీదునే తీసుకుంటే, అది దాదాపు 650 ఏళ్ల నాటిది" అని రెహమాన్ మీడియాతో చెప్పారు.

ఫొటో సోర్స్, SAMEER KHAN
పిటిషన్లను ముందే కొట్టివేసిన హైకోర్టు
షాహీ మసీదులోని ఒక భాగాన్ని తొలగించాలన్న మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను మధ్యప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 9న కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.
రోడ్డు విస్తరణ చర్యల వల్ల మసీదు ప్రార్థనా మందిరంలోని ఒక భాగం, సుమారు 120 అడుగుల ఎత్తైన మినార్, మజహర్ చౌక్ షాహీ ప్రభావితమవుతాయని పిటిషనర్లు పేర్కొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ నిర్దేశిత చట్టపరమైన ప్రక్రియను పాటించిందని, ప్రభావిత వర్గాలకు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించిందని జస్టిస్ సందీప్ ఎన్ భట్ ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, ధార్మిక స్థలం అనే కారణంతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని మసీదు పక్షం వాదించింది. కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.
కోర్టు ముందు ఉంచిన రికార్డుల ప్రకారం, ఇదే రోడ్డులో పది దేవాలయాలు, ఒక మసీదు భాగాలను ఇంతకుముందే తొలగించారు. ఉజ్జయినిలోని సుమారు 80 ధార్మిక స్థలాలకు సంబంధించిన నిర్మాణాలపై తీసుకున్న చర్యలను కూడా కోర్టు ఆదేశాల్లో ప్రస్తావించారు.
సంబంధిత ఆస్తి ధార్మిక స్థలం అయినంత మాత్రాన మున్సిపల్ కార్పొరేషన్ చర్యను ఏకపక్షంగా పరిగణించలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఫొటో సోర్స్, shrimahakaleshwar.mp.gov.in
2028 సింహస్థ సమయంలో వచ్చే భక్తుల సంఖ్య, ట్రాఫిక్ నిర్వహణ అవసరాన్ని కూడా కోర్టు తన ఆదేశాల్లో ప్రస్తావించింది.
షాహీ మసీదు మహాకాళేశ్వర్ ఆలయానికి దాదాపు ఎదురుగా, క్షీప్రా నదికి సమీపంలో ఉంది. సింహస్థ సమయంలో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజల రాకపోకలు ఉంటాయని, రోడ్డు విస్తరణ ఉద్దేశం ట్రాఫిక్, ప్రజా భద్రతకు సంబంధించినదని కోర్టు పేర్కొంది.
హైకోర్టు నుంచి ఉపశమనం లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మసీదు కమిటీకి చెందిన వారు చెప్పారు.
నగర ఖాజీ ప్రకారం, ఈ మసీదు నిర్మాణం దాదాపు 1390లో జరిగింది. ప్రస్తుతం ఛత్రీ చౌక్, షాహీ మసీదు పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు. మసీదు కమిటీ, జిల్లా యంత్రాంగం మధ్య జరిగిన చర్చల తర్వాత కుదిరిన ఒప్పందం మేరకు, రోడ్డు విస్తరణ పరిధిలోకి వచ్చే భాగాన్ని కమిటీ స్వయంగా తొలగించే చర్యలు చేపడుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































