క్రాటమ్: ఈ ఆకుపొడి ‘పెట్రోలు బంకుల్లో కూడా దొరికే హెరాయిన్’ అంటూ అమెరికాలో ఆందోళన ఎందుకు పెరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రాండన్ డ్రెనన్, మ్యాడలిన్ హాల్పర్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన 58 ఏళ్ల జెఫ్రీ డీవర్ చాలాకాలంగా తీవ్రమైన తుంటి, మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఉపశమనం కోసం నాలుగేళ్లుగా క్రాటమ్ తీసుకుంటున్నారు.
వైద్యులను సంప్రదించినా నొప్పి నుంచి ఉపశమనం లభించకపోవడం, శస్త్రచికిత్సల కోసం వేచి ఉండాల్సి రావడంతో ఆయన ఈ మూలికా పదార్థం గురించి తెలుసుకున్నారు.
మొదట భయపడి కొద్దిగా తీసుకోవడం ప్రారంభించి, ఆ తర్వాత నొప్పి తగ్గిపోయే వరకు క్రమంగా మోతాదును పెంచుతూపోయారు.
"అది ఒక అద్భుతంలా అనిపించింది. నేను నిద్రపోగలిగాను. నా పనులు చేసుకోగలిగాను’’ అన్నారాయన.
"ఇది లేకపోయుంటే నేను ఏం చేసేవాడినో నాకు తెలియదు" అని డీవర్ చెప్పారు.

మాదకద్రవ్యాల వంటి ప్రభావాలు కలిగించే మూలిక క్రాటమ్ గత దశాబ్దంలో అమెరికాలో ప్రజాదరణ పొందింది. సాధారణంగా దీన్ని వైద్యుల సిఫార్సు లేకుండా కొనుగోలు చేసి మాత్రలు లేదా ద్రవ రూపంలో తీసుకుంటారు.
ఈ వారం మిసిసిపీ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. వారి వద్ద ప్యాక్ చేసిన క్రాటమ్ను దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే వారి మరణాలకు క్రాటమ్ కారణమని నిర్ధరించలేదు. అయినప్పటికీ, అధికారులు ఇప్పుడు క్రాటమ్ వినియోగంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
క్రాటమ్ను వ్యతిరేకించే వారు కొన్నేళ్లుగా దీనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ వంటి కొన్ని దేశాల్లో దీనిని వాడటం చట్టవిరుద్ధం. అయితే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం క్రాటమ్ను నిషేధించ లేదు. మిసిసిపీ సహా కొన్ని రాష్ట్రాల్లో ఇది చట్టబద్ధంగా ఉంది.
క్రాటమ్ అంటే ఏంటి?
క్రాటమ్ అనేది థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఒక చెట్టు.
దీనిలో ఉత్తేజపరిచే లక్షణాలు ఉండడంతో దీన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులను పొడిగా చేసి, టీ రూపంలో తీసుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ పెరగడంతో, 2016 ప్రాంతంలో ఇది అమెరికా మార్కెట్లో ఫుడ్ సప్లిమెంట్‌గా ప్రవేశించింది.
"సమస్యలు నిజంగా అక్కడి నుంచే మొదలయ్యాయి" అని ఆర్కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీలోని న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఆస్టియోపతిక్ మెడిసిన్ సంస్థ డీన్ డాక్టర్ షేన్ స్పైట్స్ అన్నారు.
అమెరికాలో క్రాటమ్ను ఎక్కువగా అధిక సాంద్రత కలిగిన రూపాల్లో విక్రయిస్తున్నారని స్పైట్స్ చెప్పారు. ఇది మాత్రలు, పొడి లేదా ద్రవ రూపంలో లభిస్తుంది.
ఇది విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. కన్వీనియన్స్ స్టోర్లు, పెట్రోల్ బంకుల నుంచి వేప్ షాపుల వరకు అనేక చోట్ల దీన్ని అమ్ముతున్నారు.
అలాగే, సప్లిమెంట్‌గా వర్గీకరించడంతో క్రాటమ్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదు.
"మీరు సరిగ్గా ఏం తీసుకుంటున్నారో తెలుసుకునే మార్గం లేదు" అని స్పైట్స్ అన్నారు. "ఎవరైనా తమ ఇంటి బేస్మెంట్లో ఏదో ఒకటి తయారు చేసి, దాన్ని సప్లిమెంట్‌గా మార్కెట్ చేయచ్చు. అందులో ఏముందో ఎవరూ వచ్చి తనిఖీ చేయరు."

ఫొటో సోర్స్, Getty Images
క్రాటమ్ను దేనికి ఉపయోగిస్తారు?
క్రాటమ్ను తరచుగా నొప్పి నియంత్రణ, ఆందోళన, డిప్రెషన్‌కు ఉపయోగపడే సురక్షితమైన సహజ మూలికా పదార్థంగా చెబుతుంటారు.
తక్కువ మోతాదుల్లో ఇది ఉత్తేజపరిచే ప్రభావాలను కలిగిస్తుందని, "కెఫీన్ తీసుకున్నప్పుడు కలిగే ఉత్సాహం లాంటి అనుభూతిని" ఇస్తుందని స్పైట్స్ వివరించారు.
మాదకద్రవ్యాల వంటి ప్రభావాలు ఉండటంతో, ఫెంటానిల్ వంటి నిజమైన ఓపియాయిడ్ వ్యసనాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కూడా కొందరు దీన్ని ఉపయోగిస్తున్నారు.
ఈ ప్రభావాలకు క్రాటమ్లోని 7-హైడ్రాక్సీమిట్రాజైనిన్ వంటి కెమికల్స్ డోపమైన్ సహా వివిధ హార్మోన్లను యాక్టివేట్ చేయమే కారణం.

ఫొటో సోర్స్, Getty Images
దీని ప్రభావాలు ఏంటి? ఎంత ప్రమాదకరం?
"ఇది దాదాపు మత్తుమందు తీసుకున్నట్లే ఉంటుంది" అని స్పైట్స్ అన్నారు. "అధిక మోతాదుల్లో ఇది మరింత ఆనందానుభూతిని, మత్తు కలిగించే అనుభూతిని కలిగించవచ్చు." అన్నారాయన.
దీనివల్ల భ్రాంతులు కూడా కలగవచ్చు. అధిక మోతాదుల్లో ప్రతికూల దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇందులో కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మందగించడం కూడా ఉంది. "మరణాలు సంభవించేది ఇక్కడే" అని స్పైట్స్ అన్నారు.
కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మందగించడం వల్ల గుండె, రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడం, శ్వాస ఆగిపోవడం జరగవచ్చు.
క్రాటమ్ను మానేయడం వల్ల విత్‌డ్రాయల్ సింప్టమ్స్ కనిపించడంతో పాటు, దీనికి బానిసలయ్యే ప్రమాదం కూడా ఉందని మౌంటెన్సైడ్ రీహాబిలిటేషన్ సెంటర్లోని క్లినికల్ ఇంటిగ్రేషన్ డైరెక్టర్ జానా వూ తెలిపారు.
"ఇది దాంపత్య జీవితాలు, రిలేషన్‌షిప్‌లపై కూడా ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. కొందరు ఉద్యోగాలు కోల్పోవడం, నెలకు వేల డాలర్లు దీనిపై ఖర్చు చేయడం నేను చూశాను" అని ఆమె అన్నారు.
ఈ మూలికకు త్వరగా అలవాటయ్యి దాని ప్రభావలను తట్టుకునే అవకాశం ఎక్కువ ఉండటంతో, కాలక్రమేణా అదే ప్రభావం పొందేందుకు యూజర్లు మరింత ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకోవాల్సి రావచ్చు.
‘‘రోజుకు 20వరకు మాత్రలు తీసుకునేవారు నాకు తెలుసు’’ అని వూ చెప్పారు.
క్రాటమ్పై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే అతిపెద్ద ప్రమాదమని నిపుణులు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రాటమ్ చట్టబద్ధమేనా?
అమెరికాలోని 11 రాష్ట్రాల్లో క్రాటమ్పై నిషేధం ఉంది. క్రాటమ్ను చట్టవిరుద్ధం చేసిన చివరి రాష్ట్రం మసాచుసెట్స్.
దానికి పదేళ్ల ముందు, అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ క్రాటమ్ను అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యాల కేటగిరీగా చెప్పే షెడ్యూల్ 1లో చేర్చేందుకు ప్రయత్నించింది. ఇది ప్రజల భద్రతకు తక్షణ ముప్పు అని పేర్కొంది.
అయితే కొన్ని నెలల తర్వాత ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి అనేక అభిప్రాయాలు వచ్చాయని న్యాయ శాఖ తెలిపింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తామే చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల క్రాటమ్తో తయారు చేసిన పానీయాలను విక్రయిస్తున్న ఒక కంపెనీపై అరిజోనా రాష్ట్రం దావా వేసింది.
క్రాటమ్ను వ్యతిరేకించే వర్గాలు రాష్ట్రాలు మరింత చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. "గ్యాస్ స్టేషన్లలో విక్రయించే డ్రగ్స్ మన కమ్యూనిటీలను విషపూరితం చేస్తున్నాయి" అని అవి చెబుతున్నాయి.
క్రాటమ్కు అనుకూలంగా ఉన్న అమెరికన్ క్రాటమ్ అసోసియేషన్ వంటి సంస్థలు సహజమైన క్రాటమ్ పేరుతో విక్రయిస్తున్న సింథటిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
అంతర్జాతీయంగా చూస్తే, బ్రిటన్‌లో క్రాటమ్పై నిషేధం ఉంది. యూరప్‌లో ఒక్కో దేశంలో ఒక్కో విధమైన చట్టాలు ఉన్నాయి.
క్రాటమ్ చెట్టు సహజంగా పెరిగే మలేషియాలో 1952 నాటి పాయిజన్స్ చట్టం ప్రకారం దీని వినియోగం, విక్రయం నిషేధం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























