UPI Payments: దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా, కరెన్సీ నోట్లకు ఇంకా డిమాండ్ ఎందుకు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నగదు, నోట్ల చలామణి, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రస్తుతం రూ. 17,600 కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయి.
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ప్రతి ఏటా ట్యాప్, స్కాన్, స్వైప్ చేసి పేమెంట్స్ చేసే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో కాగితపు కరెన్సీని తమ వద్ద భద్రంగా దాచుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం 17,600 కోట్ల బ్యాంక్ నోట్లను చలామణిలో ఉంచింది. ఏటా ఆరు డినామినేషన్స్‌లో 28-30 బిలియన్ల కొత్త నోట్లను వాడుకలోకి తీసుకొస్తోంది. ఏడాదిలో 21 బిలియన్ నోట్లను తొలగిస్తుంది. ఇది భారీ స్థాయిలో చేపట్టే నిర్వహణ ప్రక్రియ.

అయితే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) డిజిటల్ చెల్లింపులు రోజుకు వందల కోట్లవైపు పెరుగుతున్న సమయంలో కూడా నోట్ల చలామణి వేగంగా పెరుగుతూనే ఉంది.

"వ్యక్తిగత లావాదేవీల్లో నోట్ల మార్పిడి తగ్గుముఖం పట్టినప్పటికీ కరెన్సీ చలామణీ రేటు మాత్రం రెండు అంకెల వృద్దిరేటును నమోదు చేస్తోంది. ఈ కాంబినేషన్, భవిష్యత్ డిమాండ్‌ను అంచనా వేయడంలో ఇబ్బందిగా మారుతోంది. డిమాండ్, పంపిణీ విషయంలో మా ప్రణాళికలను దెబ్బతీస్తోంది" అని గత నెలలో జకార్తాలో జరిగిన సెంట్రల్ బ్యాంకర్స్ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము వెల్లడించారు.దీనిని ఆయన నగదు వైరుధ్యంగా అభివర్ణించారు.

మరి కరెన్సీ ఇంతగా ఎందుకు చలామణిలో ఉంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సామాన్య ప్రజలు, వ్యాపారుల వద్ద ఉన్న భౌతిక రూపంలో ఉన్న బ్యాంకు నోట్లు, చిల్లర, వారు ఖర్చు పెట్టినా, వారి వద్ద ఉంచుకున్న మొత్తాన్ని చలామణిలో ఉన్న నగదుగా చెప్పవచ్చు.

భారత్‌లో నాలుగు ప్రధాన మార్గాల ద్వారా ప్రజల వద్దకు నగదు చేరుకుటుంది. ఆర్బీఐ పరిధిలో ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాలు, బ్యాంక్ బ్రాంచ్‌లు, 2,50,000పైగా ఉన్న ఏటీఎంలు, నగదు పంపిణీ కేంద్రాలు.

వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో బ్యాంకింగ్ సేవలు అందించే బిజినెస్ కరస్పాండెంట్స్, స్థానిక ఏజెంట్ల ద్వారా కూడా నగదు చలామణిలోకి వస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నగదు, నోట్ల చలామణి, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్

ఫొటో సోర్స్, LightRocket via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో చిన్న చిన్న విరాళాలు ఇచ్చేందుకు ఇప్పటికీ నగదు ఉపయోగిస్తున్నారు.

నగదు చెల్లింపులు తగ్గినా నగదు వాడకం పెరిగింది.

ముర్ము చెప్పిన వివరాలు పరిశీలిస్తే గత ఏడాది 56 బిలియన్ అమెరికన్ డాలర్లు, 30 బిలియన్ యూరోల విలువైన భారతీయ నోట్లు చలామణిలో ఉన్నాయి.

ఆర్బీఐ చెప్పిన వివరాలు ప్రకారం ఒక కీలక విషయాన్ని గమనించాలి.

తక్కువ విలువ కలిగిన నోట్ల వాటా ఎక్కువ ఉండటం వల్ల చిన్న చిన్న లావాదేవీలకు కూడా ఎక్కువ సంఖ్యలో నోట్లు అవసరం అవుతాయి.

అయితే ఇప్పటికీ భారతీయులు క్యాష్‌ రూపంలో ఎంత మేర లావాదేవీలు చేస్తున్నారనేది అసలు ప్రశ్న కానే కాదు.

అనిరుద్ టాగట్, మెహమెత్ ఓజ్మెన్, పుష్పా త్రివేదీ పరిశోధన ప్రకారం 2019 లెక్కల ప్రకారం 94 శాతం లావాదేవీలు క్యాష్ రూపంలో జరిగాయి.

రోజువారీ నగదు లావాదేవీలు తగ్గుతున్నా, నగదు వాడకం ఇంకా ఎలా పెరుగుతోందనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది.

"నగదు వినియోగం, నగదురహిత చెల్లింపుల విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నగదు వైరుధ్యంలో భారత్ తన ప్రత్యేకత చాటుకుంది" అని భారతీయుల చెల్లింపుల సరళిని అధ్యయనం చేస్తున్న టాగట్ బీబీసీతో చెప్పారు.

2007-08 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత డిజిటల్ చెల్లింపులతోపాటు నగదు చలామణి కూడా పెరగడం ప్రత్యేకంగా కనిపిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ రీసెర్చ్ చెప్పినట్టు ఆయన వెల్లడించారు.

మూడు ప్రధాన ప్రయోజనాలను అందిస్తోందనే కారణంగానే కరెన్సీ వాడకం పెరుగుతోందని టాగట్ అభిప్రాయపడ్డారు.

చెల్లింపు సాధనం(వస్తువు, సేవలు కొనడం)గా ఉన్న గుర్తింపు, విలువ నిధి(పొదుపుగా డబ్బులు దాచుకోవడం)గా ఉండటం, విపత్తుల నుంచి రక్షణ(అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి వీలుగా)గా ఉంటుందనే కారణాలను ఆయన చెప్పారు.

యాప్స్‌ను కేవలం చెల్లింపు సాధనంగానే భావిస్తున్నారు. అందుకే డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరిగినా నోట్లకు ఉన్న డిమాండ్ ఎందుకు తగ్గడం లేదో ఇది వివరిస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నగదు, నోట్ల చలామణి, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో చలామణిలో ఉన్న యూరో నోట్ల విలువ 2016లో ట్రిలియన్ యూరోలుఉండగా ఈ ఏడాది అది1.6 ట్రిలియన్ యూరోలకు పెరిగింది.

విదేశాల్లోనూ నగదుకు గిరాకీ

ప్రజలు తమ వద్ద ఎంత నగదు ఉంచుకుంటారనేది డిజిటల్ పేమెంట్లు వినియోగం ఒక్కటే నిర్ణయించదు.

డిజిటల్ పేమెంట్లతోపాటు ఇతర అనేక కారణాలు కూడా ప్రజల దగ్గర ఉండే క్యాష్ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయని ఫ్లోరిడా యూనివర్శిటీకి చెందిన డేవిడ్ హంఫ్రీ తన పరిశోధనలో పేర్కొన్నారు.

సహ రచయిత తానయి ఖియానరోంగ్‌తో కలిసి 14 ఆర్థిక వ్యవస్థల నగదు వినియోగంపై అధ్యయనం చేశారు.

బ్యాంకింగ్ వ్యవస్థ వెలుపల, అత్యవసర వినియోగం కోసం, భద్రత కోసం, బంగారం లాంటి ఆస్తులు కొనేందుకు ఎక్కువ నగదును భారతీయులు ఉంచుకుంటున్నారా? అనే ఇంకో ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.

ప్రధాన రిజర్వ్‌ కరెన్సీలకు సంబంధించి మరో అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

ఒక దేశం ముద్రించిన నోట్లు కేవలం ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ప్రజలు దాచుకోవడం వల్ల ఆ కరెన్సీ నోట్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది.

అమెరికా దీనికి చక్కని ఉదాహరణగా హంఫ్రీ చెబుతున్నారు.

అక్కడ సాధారణ దేశీయ నగదు లావాదేవీల్లో అరుదుగా కనిపించే 50, 100 డాలర్ల వంటి పెద్ద విలువ కలిగిన నోట్లు విదేశాల్లో విస్తృతంగా చలామణిలో ఉంటాయని తెలిపారు.

విదేశాల్లో చెల్లని కరెన్సీని ఫెడరల్ రిజర్వ్ తరచూ స్వీకరించి వాటి స్థానంలో చెల్లుబాటు అయ్యే నోట్లను పంపిస్తుందని, ఈ నోట్లు ఎక్కువగా 50 డాలర్లు, 100 డాలర్ల రూపంలో ఉంటుందని ఆయన వివరించారు.

దేశీయ ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే నగదు విలువ (ఇది ప్రధానంగా 20 డాలర్లు, 10 డాలర్లు, 5 డాలర్ల రూపంలో ఉండి రోజువారి ఖర్చులకు సూచికగా ఉంటుంది) తగ్గుతున్నప్పటికీ చలామణిలో ఉన్న అమెరికా కరెన్సీ మొత్తం విలువ ఎందుకు పెరుగుతూనే ఉందని ఫెడ్ నివేదిస్తుందో వివరించడానికి ఇది సహయపడుతుందని ఆయన అంటున్నారు.

హంఫ్రీ చేసిన పరిశోధన నగదు ఆర్థిక వ్యవస్థలో కనిపించని మరో కోణం కూడా ఉందని గుర్తించింది.

ఒక దేశంలో జరిగే అక్రమ లావాదేవీలు కూడా క్యాష్ డిమాండ్‌ను పెంచుతాయని పేర్కొంది. ఇది భారత్‌కు ప్రత్యేకంగా వర్తిస్తుంది.

భారత్‌లో ఆస్తుల కొనుగోలు అమ్మకాలు ఎక్కువగా క్యాష్ రూపంలో జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రభుత్వ ధరలు, స్టాంప్ డ్యూటీలు అసలు మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా ఉంటాయి.

దీని వల్ల కొనేవారు, అమ్మేవారు కలిసి పేపర్ల మీద తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చూపిస్తారు. మిగతా మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నగదు, నోట్ల చలామణి, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2016లో భారత ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ద్వారా 86శాతం నగదును చెల్లకుండా చేసింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితి మారలేదా?

2016లో చేపట్టిన 86 శాతంగా ఉన్న పెద్ద నోట్ల రద్దు నల్లధనంపై దాడి చేసినప్పటికీ పైన పేర్కొన్న నగదు ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం పేరుకుపోయిందని దశాబ్దాలుగా అంచనాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ ఒక విశ్వసనీయమైన సంఖ్యను ఎందుకు ఇవ్వలేకపోయిందో ఇది వివరిస్తుంది.

జనరల్ కన్స్యూమర్ రీసెర్చ్ లాంటి కొన్ని పరిశోధనలను ప్రస్తావించిన టాగట్ నోట్ల రూపంలోచెల్లింపులు చేసేటప్పుడు కలిగే బాధ తొలగించి డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు కలిగే సంతృప్తిని ఆన్‌లైన్ చెల్లింపులు కలిగిస్తాయని పేర్కొంటున్నారు.

ఇలా జనాలను బాధపడకుండా సులభంగా ఖర్చు పెట్టేలా డిజిటల్ పేమెంట్‌ డిజైన్ చేశారని అంటున్నారు.

సిద్ధాంతపరంగా చూస్తే ఇది నగదు డిమాండ్‌ను బాగా తగ్గించాలి.

కానీ అలా జరగడం లేదంటే, కరెన్సీని ఇంకేదో నడిపిస్తోందని అర్థం చేసుకోవాలి.

కేవలం ఖర్చు పెట్టేలానే భయంకంటే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విఫలమైనప్పుడు ఏం చేయాలనే భయం కూడా అయిఉండొచ్చని నిపుణులు అభిప్రాయం.

ఇక్కడ యూరప్ కథతో భారత్ గాథ పోలి ఉంటుంది.

పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీల్లో నగదు వాటా సగానికి పడిపోయినప్పటికీ, చలామణిలో ఉన్న యూరో నోట్ల విలువ 2016లో సుమారు 1 ట్రిలియన్ యూరోల నుంచి ఈ ఏడాది 1.6 ట్రిలియన్ యూరోలకు పెరగడాన్ని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గమనించింది.

లావాదేవీల్లో వినియోగించే కరెన్సీ నోట్ల సంఖ్య కంటే ఇంట్లో నిల్వ చేసుకునే నోట్ల సంఖ్య పెరుగుతూనే ఉందని ఐర్లాండ్‌లో జరిగిన ఒక వేసవి సదస్సులో ఈసీబీ ప్రధాన ఆర్థికవేత్త ఫిలిప్ లేన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జకర్తాలో ముర్ము చెప్పారు.

ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును ఖర్చు పెట్టకుండా, భద్రత కోసం నగదు రూపంలో ఇళ్లలోనే దాచి ఉంచుకోవడం, యూరోపియన్ యూనియన్ సరిహద్దులు దాటి, ఇతర బయటి దేశాల్లో కూడా ప్రజలు యూరో నోట్లను ఉపయోగించడం లేదా దాచుకోవడం కారణంగానే యూరో కరెన్సీ నోట్లకు డిమాండ్ పెరుగుతుందని 2021లో ఈసీబీ చేసిన ఒక పరిశోధనలో తేలింది.

ఇదే విషయాన్ని యూనివర్సిటీ కాలేజ్ కార్క్‌కు చెందిన ప్రొఫెసర్ ఆలివ్ మెక్‌కార్తి ప్రస్తావించారు.

విద్యుత్ కోతలు, సైబర్ దాడులు, లేదా యుద్ధం వంటి విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రజలు కొంత మొత్తంలో నగదు ఇంట్లో ఉంచుకోవాలని ఆస్ట్రియా, ఫిన్లాండ్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రభుత్వాలు సూచించాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నగదు, నోట్ల చలామణి, యూపీఐ, డిజిటల్ పేమెంట్స్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో 2.5 లక్షల కంటే ఎక్కువ ఏటీఎంలు, నగదు పంపిణీ యంత్రాల ద్వారా నోట్లు, నాణేలు పంపిణీ చేస్తున్నారు.

కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లు

భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో విపత్తుల కోసం కొంత నగదును క్యాష్ రూపంలో ఇంట్లో ఉంచుకోవడం పరిపాటిగా మారుతోంది.

వృద్ధులు, గ్రామీణ పేదలు, తమ ఖర్చులు, ఇతర వివరాలు ఇంతరులకు తెలియకుండా దాచుకోవాలనుకునే గృహ హింస బాధితులు, డబ్బు అంటే ఏంటో నేర్చుకుంటున్న పిల్లలు దీనిపై అత్యంత ఎక్కువగా ఆధారపడతారని మెక్‌కార్తీ పేర్కొన్నారు.

"నగదు ఇచ్చే గోప్యతను, సౌలభ్యాన్ని కొంతమంది వినియోగదారులు ఇష్టపడతారు" అని ఆమె చెప్పారు.

ఇది భారత్‌లో ఆర్బీఐకి ఇబ్బందికరమైన బడ్జెట్ సమస్యను సృష్టిస్తుంది.

ఇది స్వయం సమృద్ధి కోసం ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థలో భాగంగా సొంత కాగితం మిల్లులు, నాలుగు కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లు, ఇంక్ తయారీ కేంద్రాలను నిర్వహిస్తూనే ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన తక్షణ చెల్లింపు వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.

పదేళ్ల కిందట ప్రతిపాదించిన 10, 20 రూపాయల పాలిమర్ నోట్ల ప్రయోగాలు ఎట్టకేలకు ప్రారంభమవుతున్న సమయంలో నగదు నిర్వహణలో ఎంత పెట్టుబడి పెట్టాలి? డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో ఎంత వెచ్చించాలని అనేది ఆర్బీఐకి ఒక సంక్లిష్టమైన సమస్య ఎదురైందని టాగట్ పేర్కొన్నారు.

కాగితపు నోట్ల స్థానంలో తీసుకొస్తున్న పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దీని వల్ల పాడైపోయిన నోట్ల స్థానంలో కొత్తవి ముద్రించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. నోట్లను తరచూ మార్చాల్సిన అవసరం ఉండదు.

డిజిటల్ చెల్లింపు లాంటి ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ నగదు వినియోగాన్ని కొనసాగించడానికి ఆర్బీఐ వద్ద బలమైన కారణాలు ఉన్నాయని టాగట్ పేర్కొన్నారు.

వస్తున్న నివేదికల ప్రకారం చిన్న మొత్తాల చెల్లింపులపై లావాదేవీల రుసుం వసూలు చేయడం ప్రారంభిస్తే మాత్రం, కేవలం పొదుపు విషయంలోనే కాకుండా చెల్లింపుల విభాగంలో కూడా నగదు వినియోగం పెరుగుతుందని ఆయన వెల్లడించారు.

తాజాగా వినియోగదారులకు యూపీఐ సేవలను పూర్తిగా ఉచితంగానే కొనసాగిస్తూ, ఎంపిక చేసిన కొన్ని మర్చెంట్ లావాదేవీలపై సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. ఈ విధానం 2026 అక్టోబర్ 15 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. దీనివల్ల కరెన్సీ నోట్ల వినియోగంలో ఏ మేరకు మార్పు వస్తుందో భవిష్యత్తులో తెలుస్తుంది.

మొత్తం మీద డిజిటల్ చెల్లింపులు ఎప్పటికీ నగదును వాడుకలో లేకుండా చేయలేదు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఎంత ఉన్నప్పటికీ, నగదు అనేది ఎవరూ వదులుకోవడానికి ఇష్టపడని బీమా పాలసీ లాంటిదనే ఇప్పటికే విధాన రూపకర్తలకు అర్థమైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)