రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్: 15 లక్షల కోట్ల ‘నకిలీ ఆదాయం’ చూపిందని సెబీ ఆరోపిస్తున్న కంపెనీలో ఎల్ఐసీ భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టింది?

ఎల్ఐసీ, సెబీ, ఆర్థిక నేరం, బీజేపీ, కాంగ్రెస్, స్విట్జర్లాండ్

ఫొటో సోర్స్, REL

ఫొటో క్యాప్షన్, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం ఈ కంపెనీ ప్రమోటర్ రాజేష్ మెహతా
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

స్టాక్‌మార్కెట్‌‌ను పర్యవేక్షించే నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పరిశీలనలో ఉన్నరాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 2020-21, 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య తన ఆదాయాన్ని రూ.15.15 లక్షల కోట్ల మేర పెంచి చూపించిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.

అయితే సెబీ ఆరోపణలను బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు సమర్పించిన వివరణలో కంపెనీ ఖండించింది.

తమ రాబడికి సంబంధించిన సరైన గణాంకాలనే విడుదల చేశామని, ఎలాంటి తప్పూ చేయలేదని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

తన విదేశీ అనుబంధ సంస్థల(సబ్సిడిరీల) ద్వారా అనేక సంవత్సరాలుగా తన కార్యకలాపాలను ఈ కంపెనీ ఎక్కువ చేసి చూపించిందని జూన్ 4న విడుదల చేసిన 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులో సెబీ ఆరోపించింది.

గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో (2020-21 నుంచి 2024-25 వరకు) ఈ కంపెనీ ఖాతాల్లో భారీగా అవకతవకలు జరిగాయని సెబీ తెలిపింది.

సుమారు 158.3 బిలియన్ డాలర్లు (దాదాపు 15 లక్షల 16 వేల కోట్ల రూపాయలు) తప్పుడు ఆదాయాన్ని చూపించినట్టు పేర్కొంది.

ఈ మొత్తం గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో కంపెనీ చూపిన మొత్తం రెవెన్యూలో ఇది సుమారు 99.8 శాతం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎల్ఐసీ, సెబీ, ఆర్థిక నేరం, బీజేపీ, కాంగ్రెస్, స్విట్జర్లాండ్

ఫొటో సోర్స్, Timon Schneider/SOPA Images/LightRocket via Getty Images

ఫొటో క్యాప్షన్, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్ఐసీ వాటా 10.80శాతంగా ఉంది.

మ్యూచువల్ ఫండ్స్ దూరం జరిగితే ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టింది

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఆభరణాలు, బంగారం శుద్ధి(గోల్డ్ రిఫైనింగ్) చేసే వ్యాపారం నిర్వహిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1995లో స్టాక్‌ఎక్స్ఛేంజ్‌‌లో నమోదైంది.

మ్యూచువల్ ఫండ్స్‌గా పేరుగాంచిన దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గత 10 సంవత్సరాలుగా రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లలో పెట్టుబడి పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అందుబాటులో ఉన్న వాటాదారుల సరళి చూపుతోంది.

ఈ కాలంలో మ్యూచువల్ ఫండ్ల వాటా దాదాపుగా నామమాత్రంగానే ఉంది.

మార్చి 2017నాటికి రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ వాటా 0.46 శాతం మాత్రమే. తర్వాత కూడా చిన్న చిన్న మార్పులతో అదే స్థాయిలో కొనసాగింది.

అయితే ప్రభుత్వ నియంత్రణలోని బీమా రంగ సంస్థ ఎల్ఐసీ మాత్రం తన పెట్టుబడిని క్రమంగా పెంచింది.

మార్చి 2026 నాటి కంపెనీ గణాంకాల ప్రకారం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్ఐసీ 10.80 శాతం వాటాను కలిగి ఉంది. వాటాదారుల నమూనాను పరిశీలిస్తే ఆ కంపెనీలో ఎల్ఐసీ మాత్రమే ఏకైక ప్రధాన దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు అని కూడా అర్ధమవుతుంది. మార్చి 2017లో ఎల్ఐసీ వాటా 1.19 శాతంగా ఉండగా పదేళ్లలో అది 10.80 శాతానికి పెరిగింది.

బంగారు ఆభరణాల వ్యాపారం చేసే ఈ కంపెనీపై మరే ఇతర బీమా సంస్థ కూడా ఆసక్తి చూపకపోవడం విశేషం.మార్చి 2026 నాటికి ఇతర బీమా కంపెనీలకు ఇందులో అతి స్వల్ప వాటా మాత్రమే ఉంది.

సుప్రియా శ్రీనేత్

‘ఐదేళ్ల నుంచి స్కామ్ సాగుతుంటే ఏం చేస్తున్నారు?’

దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలొస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ దీనిని ఒక పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు.

"ఐదేళ్లలో ఈ కంపెనీ రూ.15.5 లక్షల కోట్ల నకిలీ ఆదాయాన్ని చూపించింది. స్విస్ కంపెనీ వాల్‌కంబి ఎస్ఏ వంటి విదేశీ అనుబంధ సంస్థల నుంచి భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి కస్టమర్ వివరాలు గానీ, రసీదులు గానీ లేవు’’ అన్నారు సుప్రియ.

‘‘ప్రమోటర్లకు సంబంధించిన కంపెనీలకు అనుమతి లేకుండా నిధులను బదిలీ చేశారు. జూన్ 3న సెబీ ఈ కంపెనీని స్టాక్ మార్కెట్ నుంచి నిషేధించింది. కంపెనీ షేర్లు 80శాతం పడిపోయాయి. ఇన్వెస్టర్లు రూ. 12,726 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఎల్ఐసీ ఈ కంపెనీలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టగా అందులో సుమారు రూ.1,600 కోట్లు నష్టపోయింది’’ అని పేర్కొన్నారు.

‘‘ఈ కుంభకోణం మోదీ ప్రభుత్వానికి తెలియకుండా ఎలా కొనసాగింది? ప్రధానమంత్రి మోదీ రాజేశ్ మెహతాతో కలిసి ఫోటోలకు కూడా పోజులిచ్చారు. మోసగాళ్లు, చట్టం నుంచి తప్పించుకుంటున్నవారు మోదీ కళ్లెదుట విదేశాలకు పారిపోతూనే ఉన్నారు’’ అని విమర్శించారు.

‘‘గత 12 ఏళ్లలో వారిలో ఒక్కరిని కూడా భారత్‌కు తిరిగి తీసుకురాలేదు. 'నేను తినను, ఇతరులను కూడా తిననివ్వను' అనే వ్యక్తి డొల్ల, అబద్ధపు మాటలు మరోసారి గట్టిగా ప్రతిధ్వనిస్తున్నాయి!" అని సుప్రియా శ్రీనేత్ ఆరోపించారు.

"ఒక కంపెనీ 12 సంవత్సరాలుగా రూ. 15 లక్షల కోట్ల విలువైన నకిలీ ఎగుమతులను చూపిస్తూ దొరికిపోకుండా ఎలా తప్పించుకోగలిగింది?" అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించారు.

''ట్యాక్స్ హెవెన్ దేశాల నుంచి ఈ డబ్బును మనీ లాండరింగ్ చేశారా? ఈ కంపెనీని ఎవరు కాపాడుతున్నారు? అధికారంలో ఉన్నవారితో దీనికి ఉన్న సంబంధాలు ఏంటి? ఈ ఫోటో ఒక క్లూ ఇవ్వవచ్చు!'' అంటూ ప్రశాంత్ భూషణ్ ఓ ఫోటో పోస్టు చేశారు.

స్విట్జర్లాండ్‌కు చెందిన తమ అనుబంధ సంస్థ వల్‌కాంబి ఎస్ఏ, తమ బహుళ-బిలియన్ డాలర్ల ప్రపంచవ్యాప్త వ్యాపారానికి ప్రధాన ఆధారం అని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ పేర్కొంది. అయితే ఆ అనుబంధ సంస్థ వాస్తవ ఆదాయం, కంపెనీ నివేదించిన గణాంకాలలో అర శాతం కంటే కూడా తక్కువగా ఉందని ఆడిట్‌లో తేలింది.

కంపెనీ రూ.11,487 కోట్లకు పైగా అమ్మకాలు, రూ.11,488 కోట్లకు పైగా కొనుగోళ్లతో సహా బిలియన్ల రూపాయల విలువైన మోసపూరిత లావాదేవీలను నమోదు చేసినట్టు కూడా సెబీ కనుగొంది.

రాజేశ్ మెహతా తన వ్యక్తిగత హోదాలో చేసిన గోల్డ్ డెరివేటివ్ డీల్స్‌ను కూడా కంపెనీ ఖాతాల్లో చేర్చినట్టు విచారణలో తేలింది.

"ఆర్ఈఎల్ (రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్) తన వెబ్‌సైట్‌లో వల్‌‌కాంబి ఎస్ఏ ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలను బహిరంగపరచలేదని, తద్వారా కంపెనీ వాస్తవ ఆర్థిక స్థితికి సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని పెట్టుబడిదారులకు అందకుండా చేసిందని కూడా తేలింది'' అని సెబీ తన ఉత్తర్వులో పేర్కొంది.

ఎల్ఐసీ, సెబీ, ఆర్థిక నేరం, బీజేపీ, కాంగ్రెస్, స్విట్జర్లాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తామెలాంటి అవకతవకలకు పాల్పడలేదని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తెలిపింది.

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి వివరణ

జూన్ 4వ తేదీన స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో సెబీ ఆదేశం ఒక మధ్యంతర ఉత్తర్వు అని "ఇది ఎలాంటి తుది ప్రతికూల నిర్ధరణకు దారితీయదు" అని రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్పష్టం చేసింది.

తాము 'ఎలాంటి తప్పూ చేయలేదని', తాము ప్రకటించిన ఆదాయ గణాంకాలు సరైనవేనని ఆ కంపెనీ పేర్కొంది.

ఆ ఉత్తర్వులోని ప్రధాన అభ్యంతరం ఆదాయాన్ని తప్పుగా నివేదించారనే ఆరోపణకు సంబంధించిందని, సెబీ తన గణనలకు వల్‌కాంబి ఆదాయానికి బదులుగా దాని ఈబీఐటీడీఏను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల గందరగోళం ఏర్పడిందని కంపెనీ వాదించింది.

ఆదాయంలో సుమారు 97 శాతం వ్యత్యాసాన్ని సెబీ చూపించడానికి ఇదే ప్రధాన కారణమని, వల్‌కాంబీ ఆర్థిక వివరాలను సరైన విధంగా అర్ధం చేసుకుంటే ఎలాంటి అవకతవకలూ కనిపించవని పేర్కొంది.

అయితే సెబీ జరిపే సమగ్ర దర్యాప్తు, తదుపరి విచారణల తర్వాతే ఈ విషయంపై తుది నిర్ణయం వెలువడుతుంది.

అమెరికాకు చెందిన పైన్‌ట్రీ మాక్రో వ్యవస్థాపకుడు రితేశ్ జైన్ 'ఎక్స్'లో చేసిన ఒక పోస్ట్‌లో సెబీ దర్యాప్తులోని అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

"కంపెనీ ఖాతాలలో 158 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15.15 లక్షల కోట్లు) తప్పుడు ప్రకటనలు లేదా పెంచి చూపిన గణాంకాలను సెబీ గుర్తించిందని" పేర్కొన్న రాయిటర్స్ ఆసియా నివేదికను షేర్ చేస్తూ దేశం సమగ్ర వ్యాపార డేటాను జైన్ ప్రశ్నించారు.

ఆదాయ గణాంకాలలో నిజంగానే ఇంత పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంటే అది మొత్తం దేశ వాణిజ్య, ఎగుమతి గణాంకాల విశ్వసనీయతపై కూడా ప్రభావం చూపవచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)