''పారాచూట్‌ లేకుండానే ఫైటర్ జెట్ నుంచి దూకి ఇరాన్‌లో పడిపోయా, అక్కడ 48 గంటలు గడిపి బయటపడ్డా'' అంటున్న అమెరికన్ సైనికుడి కథ

అమెరికా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం

ఫొటో సోర్స్, CBS

ఫొటో క్యాప్షన్, సీబీఎస్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఈ పైలట్ పేరును బ్రావో అని పేర్కొన్నారు.
    • రచయిత, మాక్స్ మాట్జా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

"ఒక దశలో నేను పైకి చూశాను. కానీ పారాచూట్ కనిపించలేదు. నా జీవితంలోనే అత్యంత భయానక క్షణం అది"

ఇరాన్‌ గగనతలంలో కూలిపోయిన ఫైటర్ జెట్‌ను నడుపుతున్న అమెరికన్ ఎయిర్‌ ఫోర్స్ పైలట్ చెప్పిన మాటలివి. ఆయన పారాచూట్ పనిచేయకపోవడంతో వేగంగా కిందికి పడిపోయారు.

ఆ తర్వాత ఆయనను రక్షించేందుకు అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ జరిగింది.

అమెరికా పైలట్ ఈ వివరాలను సీబీఎస్ న్యూస్ కార్యక్రమం 60 మినిట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆయన అసలు పేరును వెల్లడించలేదు.

ఈ కార్యక్రమం ఆదివారం నాడు ప్రసారమైంది. ఈ యేడాది ఏప్రిల్‌లో ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో పాల్గొన్న పైలట్ తొలిసారిగా తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సీబీఎస్ కార్యక్రమంలో ఆ పైలట్‌ను కేవలం బ్రావో (ధైర్యవంతమైన వ్యక్తి) అంటూ పరిచయం చేశారు. ఆయన ఇంటర్వ్యూ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠను కలిగించింది.

ఇరాన్ దాడికి దెబ్బతిన్న విమానంలో ఉన్న ఇద్దరు అమెరికా వైమానిక సిబ్బంది బయటకు దూకారు. ఆ తర్వాత వారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి దాక్కున్నారు. అమెరికా ప్రత్యేక దళాలు వచ్చి వారిని రక్షించే వరకు ఇరాన్ సైనికులకు చిక్కకుండా దాక్కోవాల్సి వచ్చింది.

పారాచూట్ లేకుండా పడిపోతున్నప్పుడు ఏమనిపించిందని అడిగినప్పుడు " గాల్లో ఏ ఆధారం లేకుండా పడిపోవడం అని అనడం కరెక్టుగా ఉంటుంది" అని బ్రావో అన్నారు.

"నేను ఎంత వేగంగా కిందికి పడిపోతున్నాననే దానిపై దృష్టి పెట్టలేదు. ఎదురైన సమస్యలను అధిగమించడంపైనే దృష్టి పెట్టాను. పారాచూట్ తెరుచుకునేలా చేయడానికి లేదా దాని భాగాలను వదులుగా చేయడానికి నాకు సాధ్యమైందంతా చేశాను" అని ఆయన చెప్పారు.

ప్రాణాలతో తాను బయటపడటాన్ని బ్రావో ‘ఒక మిరకిల్’గా అభివర్ణించారు. అయితే ఆయన వెన్ను, భుజం, చేతిలో ఎముకలు విరిగాయి. నేలను తాకే సమయానికి ఆయన గంటకు 70 నుంచి 100 మైళ్ల వేగంతో అంటే గంటకు 113 నుంచి 161 కిలోమీటర్ల వేగంతో కిందికి పడుతున్నారని చెప్పారు.

కూల్చివేసిన విమానంలో ఉన్న మరో అమెరికన్ వైమానిక సిబ్బంది పేరును ఆయన అసలు పేరు కాకుండా ఆల్ఫా అని చెప్పారు. సీబీఎస్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అమెరికాలో సీబీఎస్‌కు బీబీసీ భాగస్వామ్య ప్రసార సంస్థ.

రెండు సీట్ల ఎఫ్-15ఈ విమానాన్ని షోల్డర్ ఫైర్డ్ మిస్సైల్ (భుజాల మీదు నుంచి కాల్చే క్షిపణి) కూల్చివేసినట్లు సీబీఎస్ తెలిపింది. ఆ విమానం విలువ 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.288 కోట్లు). క్షిపణి విలువ సుమారు 1 లక్ష డాలర్లు(సుమారు రూ.96 లక్షలు).

గాయాలైనప్పటికీ నడుచుకుంటూ, ఒక ఎత్తైన కొండ శిఖరానికి చేరుకున్నానని బ్రావో చెప్పారు. ఆ మార్గంలో నడుస్తుంటే ఇరాన్ సైనికులు తనను పట్టుకుంటారేమోనన్న భయం అనుక్షణంవెంటాడిందని బ్రావో అన్నారు.

ఆ పరిస్థితిలో తనను తాను ఓదార్చుకునేందుకు "ధైర్యం కోల్పోవద్దు. లేకపోతే ఇరాన్ సైనికులు నిన్ను పట్టుకుంటారు. నువ్వు ఇరాన్ టీవీలో కనిపిస్తావు" అని తనకు తానే చెప్పుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆల్ఫాను ఆరు గంటల్లోనే రక్షించినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారీగా కాల్పులు జరిగాయని చెప్పారు.

"నిరంతరం కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వారు ఆల్ఫాను రక్షించగలిగారు" అని హెగ్సెత్ అన్నారు.

శత్రు భూభాగంలో బ్రావో 48 గంటలు గడిపాక ఆయన్ను రక్షించగలిగారు.

అమెరికా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుద్ధ విమానం (ప్రతీకాత్మక చిత్రం)

'మా సొంత హెలికాప్టర్లను కూడా ధ్వంసం చేయాల్సి వచ్చింది' - అమెరికా

ఈ ఆపరేషన్‌లో ఒక దశలో 90 మందికి పైగా అమెరికా సైనికులు ఇరాన్‌లో ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా సైనికులు ఇరాన్‌లో కార్యకలాపాలు నిర్వహించారని చెప్పారు.

అయితే సైనికులను రక్షించేందుకు వచ్చిన విమానాలు, హెలికాప్టర్లు ఎడారి ఇసుకలో చిక్కుకుపోయాయి. దీంతో వాటిని ధ్వంసం చేయాల్సి వచ్చింది. మరో బృందం వచ్చే వరకు ప్రత్యేక దళాల సైనికులు వేచి ఉండాల్సి వచ్చింది.

ధ్వంసమైన రెండు అమెరికా విమానాల విలువ ఒక్కొక్కటి సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.959 కోట్ల) అని సీబీఎస్ కథనం తెలిపింది. ఇరాన్ చేతుల్లోకి వాటి సాంకేతిక పరిజ్ఞానం వెళ్లకుండా మరికొన్ని లిటిల్ బర్డ్ అనే హెలికాప్టర్లను కూడా ధ్వంసం చేశారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం మొదలైన సుమారు ఐదు వారాల తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టారు.

ఇప్పుడు ఈ యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించింది. అమెరికా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా దగ్గరపడుతోంది. ఇదే సమయంలో ఈ యుద్ధంపై అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరగడం, దాని ప్రభావం ఇతర వస్తువులు, సేవలపై పడటం ప్రజల్లో పెరుగుతున్న ఈ ఆగ్రహానికి ప్రధాన కారణాల్లో ఒకటి.

యుద్ధం నవంబర్ 3న జరిగే ఎన్నికల రోజు వరకు కొనసాగే అవకాశముందని గత వారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)