‘హెయిర్ కట్’: ‘రుణ మాఫీ’లో భాగంగా కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించడానికి సుభాష్ చంద్రకు ఎలా ఆమోదం లభించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ భల్లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
దేశంలో రుణదాతలకు ఓ వ్యక్తి వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నప్పుడు ఒక ఒప్పందం కింద ఆ రుణంలో ఎంత మొత్తాన్ని చట్టబద్ధంగా మాఫీ చేయొచ్చు?
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గత మంగళవారం(ఆగస్టు 25)ఇచ్చిన తీర్పు దీనికి దిగ్భ్రాంతికరమైన సమాధానం ఇచ్చింది.
రుణాలు ఇచ్చినవారిలో మెజారిటీ సభ్యులు ఒప్పందానికి అనుకూలంగా ఉంటే చట్టపరమైన ప్రక్రియను అనుసరించి దాదాపు మొత్తం రుణాన్ని కూడా మాఫీ చేసే అవకాశం ఉంది.
ఈ కేసు మీడియా వ్యాపారవేత్త డాక్టర్ సుభాష్ చంద్రకు సంబంధించినది. తన కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన వ్యక్తిగత హామీ ఇచ్చారు.
ఆ కంపెనీలు రుణాలను తిరిగి చెల్లించలేకపోవడంతో రుణదాతల్లో ఒకటైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2022లో సుభాష్ చంద్రపై దివాలా ప్రక్రియను (ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్) ప్రారంభించింది.

99.97% హెయిర్‌కట్
సుభాష్ చంద్ర 2022 ఆగస్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి, ఈ ప్రక్రియపై స్టే విధించింది. దీంతో దాదాపు రెండేళ్లపాటు ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ స్టేను ఎత్తివేసింది. 2024 ఏప్రిల్‌లో ఆ పిటిషన్‌ను అధికారికంగా స్వీకరించడంతో పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది.
సుభాష్ చంద్రపై రుణదాతలు చేసిన క్లెయిమ్‌ల మొత్తం విలువ 22వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని ఎన్సీఎల్టీ ఉత్తర్వులో ఉంది.
ఆమోదించిన రీపేమెంట్ప్లాన్లో సుమారు రూ. 6.50 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఇందులో రుణదాతలకు రూ. 6.25 కోట్లు, దివాలా ప్రక్రియ ఖర్చుల కోసం రూ. 25 లక్షలు ఉన్నాయి.
ఇది మొత్తం క్లెయిమ్‌లో 0.03 శాతం మాత్రమే. ఆర్థికపరిభాషలో దీన్ని "హెయిర్‌కట్" అంటారు. అంటే రుణదాతలకు తిరిగి చెల్లించే మొత్తంలో తగ్గింపు. ఈ కేసులో అది 99.97 శాతం.
ఆస్తులు, కంపెనీలను విక్రయించడం ద్వారా మొత్తం రూ. 45,000 కోట్ల రుణంలో దాదాపు రూ. 43,000 కోట్లను ఇప్పటికే తిరిగి చెల్లించినట్టు సుభాష్ చంద్ర వాదించారు.
2026 ఆగస్టు 25న ఈ హెయిర్‌కట్ తీర్పును ఎన్సీఎల్టీ సభ్యుడు నీలేశ్శర్మ ఇచ్చారు.
అంతకుముందు ఈ కేసును విచారించిన ట్రిబ్యునల్‌లోని ఇద్దరు సభ్యులు 2025 సెప్టెంబర్ 3న భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసి వేర్వేరు తీర్పులిచ్చారు.
రీపేమెంట్ ప్లాన్ ఆమోదించడాన్ని వాళ్లు సమర్థించినప్పటికీ, కొన్ని క్లెయిమ్‌లు తప్పుగా అంగీకరించారని గుర్తించి వాటిని తొలగించాలని ఆదేశించారు.
ఇంత భారీ రుణమాఫీని చట్టబద్ధంగా ఎలా ఆమోదించారో అర్థం చేసుకోవాలంటే ఈ తీర్పుకు ఆధారమైన దివాలా చట్టాన్ని అర్ధం చేసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్సీఎల్టీ ఉత్తర్వులో ఏముంది?
దివాలా, దివాలా పరిష్కార కోడ్(బ్యాంక్రప్టసీ కోడ్ -ఐబీసీ) కింద ఒక కంపెనీ తన రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే ఆ రుణానికి వ్యక్తిగత హామీ ఇచ్చిన వ్యక్తిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
దివాలా ప్రక్రియను నిర్వహించడానికి నియమితులైన ఒక పరిష్కార నిపుణులు రుణగ్రహీత ఆస్తులను అంచనా వేసి, రీపేమెంట్ ప్లాన్ రూపొందించడంలో సాయపడతారు. ఆ తర్వాత ఈ ప్రణాళికను ఓటింగ్ కోసం రుణదాతల కమిటీ ముందు ఉంచుతారు.
75శాతానికిపైగా రుణదాతలు ఓటింగ్‌లో ఈ ప్రణాళికను ఆమోదిస్తే చట్టపరమైన తుది ఆమోదం కోసం దాన్ని ఎన్సీఎల్టీకి పంపుతారు.
సుభాష్ చంద్ర కేసులో ఈ ప్రణాళికకు 80.81 శాతం ఓట్లు అనుకూలంగా వచ్చాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అనుకూలంగా ఉన్నవారంతా సుభాష్ చంద్ర కుటుంబానికి సంబంధించినవారే’
అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సహా మూడు ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు దీనిని వ్యతిరేకించిన రుణదాతలలో ఉన్నాయి.
సుభాష్ చంద్ర 2018లో ప్రకటించిన రూ. 40 వేల కోట్లకు పైగా ఉన్న మొత్తం ఆస్తులతో పోలిస్తే రూ. 6.50 కోట్ల ప్రతిపాదన చాలా తక్కువని వాదించాయి.
ఈ ప్రణాళికకు అనుకూలంగా ఓటు వేసిన రుణదాతలు సుభాష్ చంద్ర కుటుంబానికి సంబంధించిన వారేనని ఆ సంస్థలు ఆరోపించాయి.
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ను నివారించడానికి, రుణగ్రహీతతో సంబంధం ఉన్న ‘అసోసియేట్స్’ లేదా సంబంధిత పక్షాలు రీపేమెంట్ ప్లాన్‌పై ఓటు వేయకుండా చట్టపరంగా నిషేధం ఉంది.
తొలి ధర్మాసనంలోని న్యాయసభ్యుడు ఈ ప్రణాళికను ఆమోదిస్తూ రుణదాతల 'వాణిజ్యపరమైన నిర్ణయాన్ని' ఎన్సీఎల్టీ ప్రశ్నించలేదని అన్నారు.
ట్రిబ్యునల్ సాంకేతిక సభ్యుడు సెప్టెంబర్ 2025 నిర్ణయంలో దీంతో విభేదించారు.
పరిష్కారానికి చేరుకునే ప్రక్రియ "తొందరపాటుగా, పారదర్శకత లేకుండా'' జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
భిన్నాభిప్రాయాల కారణంగా ఈ కేసును నీలేశ్ శర్మకు అప్పగించారు. ఆయన న్యాయ సభ్యుడి అభిప్రాయంతో ఏకీభవించారు.
ఒక ఆర్థిక పరిష్కారం న్యాయమైనదా, హెయిర్ కట్ చాలా ఎక్కువగా ఉందా అని నిర్ణయించడం ఎన్సీఎల్టీ పాత్ర కాదని, చట్టపరమైన ప్రక్రియను పాటించారా లేదా అనేదే నిర్ధరించుకోవడమే దాని పాత్ర అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.
అవసరమైన 75 శాతం కంటే ఎక్కువ మెజారిటీ లభించినందున, ప్రణాళికకు అనుకూలంగా ఓటేసిన సంస్థలు చట్టపరంగా ‘అసోసియేట్స్’ నిర్వచనం పరిధిలోకి పూర్తిగా రానందున, ఐబీసీ నిబంధనల ప్రకారం 99.97 శాతం రుణమాఫీని ఆమోదించడానికి ట్రిబ్యునల్‌కు చట్టబద్ధంగా సాధ్యమైందని తీర్పు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
మొత్తం వ్యవస్థ లోపమా? న్యాయ ప్రక్రియ లోపమా?
ఐబీసీ ప్రకారం ‘అసోసియేట్’గా ఎవరిని పపరిగణించాలనేది నీలేశ్ శర్మ ముందున్న ప్రధాన న్యాయపరమైన ప్రశ్న.
ఈ ప్రణాళికను అనుకూలంగా ఓటు వేసిన సంస్థలు సుభాష్ చంద్ర విస్తృత కుటుంబసభ్యుల(బంధువుల) నియంత్రణలో ఉన్నాయని దీన్ని వ్యతిరేకించిన బ్యాంకులు వాదించాయి.
దివాలా ప్రక్రియలో ఓటింగ్‌ను ప్రభావితం చేయడానికి రుణగ్రహీత కుటుంబం నియంత్రణలో ఉన్న కంపెనీలను ఉపయోగించకుండా నిరోధించడమే చట్టం ఉద్దేశమని, ఆ ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్‌ను కోరాయి.
నీలేశ్ శర్మ ఐబీసీలోని సెక్షన్ 79(2)(జీ)ని వర్తింపజేశారు.
దీని ప్రకారం రుణగ్రహీత ఒంటరిగా లేదా ఇతర అసోసియేట్లతో కలిసి 50శాతానికిపైగా షేర్ క్యాపిటల్‌ను కలిగి ఉన్న కంపెనీ లేదా దాని డైరెక్టర్ల బోర్డుపై నియంత్రణ కలిగి ఉన్న కంపెనీని అసోసియేట్‌గా పరిగణించవచ్చు.
ఈ ఓటింగ్ సంస్థల్లో సుభాష్ చంద్రకు నేరుగా ఎలాంటి వాటాలు లేవని ఆయన అన్నారు.
వ్యక్తిగత దివాలా కేసుల విషయంలో చట్టం పరిమితమైన, నిర్దిష్టమైన భాషను ఉపయోగించిందని, దాన్ని న్యాయపరమైన వ్యాఖ్యానం ద్వారా మార్చలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫోరెన్సిక్ ఆడిట్‌పై ఏమన్నారు?
సుభాష్ చంద్ర అప్రకటిత ఆస్తులను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని బ్యాంకులు కోరాయి. ప్రారంభ రీపేమెంట్ ప్లాన్ దశ ఒక సహాయక, కోర్టు వెలుపల జరిగే రాజీ ప్రక్రియగా రూపొందిందని, ఐబీసీ ప్రకారం ఫోరెన్సిక్ ఆడిట్ తప్పనిసరి కాదని నీలేశ్శర్మ అన్నారు.
మోసం లేదా దాచిన ఆస్తుల అనుమానం రుణదాతలకు ఉంటే వారు ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా ఓటు వేసి, రుణగ్రహీతను అధికారిక దివాలా ప్రక్రియలోకి పంపే అవకాశముందని, దీనివల్ల మరింత లోతైన దర్యాప్తు చేయడానికి వీలవుతుందని తెలిపారు.
మెజారిటీ రుణదాతలు ప్రణాళికకు అనుకూలంగా ఓటు వేసినందున, మైనారిటీ రుణదాతల అనుమానాల ఆధారంగా ట్రిబ్యునల్ ఏకపక్షంగా దర్యాప్తుకు ఆదేశించలేదని ఆయన అన్నారు.
దివాలా ప్రక్రియలో ఒక లోపం ఉందని కూడా నీలేశ్శర్మ చెప్పారు.
అవసరమైన పత్రాలు లేకుండానే 1,060 మంది తరఫున దాఖలు చేసిన క్లెయిమ్‌లను అంగీకరించినట్టు ఆయన గుర్తించారు.
అలాంటి క్లెయిమ్‌లను ధ్రువీకరించడం రిజల్యూషన్ ప్రొఫెషనల్ బాధ్యతలకు అనుగుణంగా లేదని ఆయన తేల్చారు.
అయితే రీపేమెంట్ ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేసేంత తీవ్రమైనదిగా ఆయన ఈ లోపాన్ని పరిగణించలేదు.
ఈ 1,060 క్లెయిమ్‌లను మినహాయించి, ప్రణాళిక కింద అందుబాటులో ఉన్న మొత్తాన్ని మిగిలిన అర్హులైన రుణదాతలకు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఈ ఉత్తర్వును నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో సవాలు చేయనున్నట్టు ప్రకటించాయి.
ఒక పరిష్కార ప్రణాళికను ఆమోదించే ఎన్సీఎల్టీ ఉత్తర్వులపై అప్పీలు చేయాలంటే కొన్ని నిర్దిష్ట కారణాలుండాలి. ఆ ప్రణాళిక చట్టానికి విరుద్ధంగా ఉండటం లేదా పరిష్కార నిపుణులు తన అధికారాలను వినియోగించడంలో ‘తీవ్రమైన అవకతవకలకు’ పాల్పడడం వంటివి ఇందులోకి వస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
''హెయిర్ కట్'' వ్యవహారం రాజకీయ వివాదమేంటి?
సుభాష్ చంద్ర 2016లో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఈ రుణమాఫీపై రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే సుభాష్ చంద్రకు ప్రయోజనం కలిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
చట్టంలోని నిబంధనలను ఎన్సీఎల్టీ అమలు చేసిందని, అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇంత భారీ నష్టం వాటిల్లడంపై ప్రజల్లో ఏర్పడే అభిప్రాయాన్ని విస్మరించడం కష్టమని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ సహ వ్యవస్థాపకులు దేవాంశు ముఖర్జీ బీబీసీతో చెప్పారు.
"వ్యక్తులకు భారీ మొత్తంలో రుణాలున్న, ఒక రకంగా కార్పొరేట్ రుణాలను పోలిన పెద్ద దివాలా కేసుల్లో, కార్పొరేట్ దివాలా కేసులలో చేసినట్టుగానే, సంబంధిత పక్షాలను ఓటింగ్ నుంచి మినహాయించాలని వాదించవచ్చు" అని ఆయన అన్నారు.
అయితే ఒకే ఒక్క కేసు ఆధారంగా మొత్తం ఐబీసీ వ్యవస్థను వైఫల్యంగా ముద్ర వేయవద్దని ముఖర్జీ హెచ్చరించారు.
2017లో ఐబీసీ అమల్లోకివచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) గణనీయంగా తగ్గాయని ఆయన చెప్పారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు మార్చి 2021లో 9.11 శాతం నుంచి మార్చి 2025 నాటికి 2.58 శాతానికి తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
దివాలా కేసుల పరిష్కారానికి చట్టం 330 రోజుల గడువును నిర్దేశించినప్పటికీ రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ గణాంకాల ప్రకారం సగటు పరిష్కార సమయం 744 రోజులుగా ఉంది.
అదే సమయంలో రుణదాతలు తాము అంగీకరించిన క్లెయిమ్‌లలో సగటున 31శాతాన్ని మాత్రమే తిరిగి పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్టాంపింగ్ ట్రిబ్యునల్‌గా మారిపోకూడదు’
ఎన్సీఎల్టీ చట్టాన్ని కఠినంగా అర్ధం చేసుకున్న తీరు ట్రిబ్యునల్ దృష్టిలో ప్రక్రియకు అనుగుణంగానే ఉన్నప్పటికీ ఇది "ఒక ముఖ్యమైన మలుపు" అని న్యాయవాది, న్యూమాన్ లా ఆఫీసెస్లో భాగస్వామి అయిన ఆరుష్ ఖన్నా అభిప్రాయపడ్డారు.
ఈ కేసుకు విస్తృత ప్రచారం లభించడం, ఒక వ్యక్తిగత హామీదారుడి దివాలా కేసులో ఇంత భారీ రుణమాఫీ (హెయిర్‌కట్) మునుపెన్నడూ చూడకపోవడమే దీనికి కారణమన్నారు.
ప్రణాళికకు అనుకూలంగా ఓటు వేసిన రుణదాతల బృందాన్ని ట్రిబ్యునల్ మరింత లోతుగా పరిశీలించలేదని ఆరుష్ ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రణాళికపై షెడ్యూల్డ్ ఆర్థిక సంస్థలు అసంతృప్తిగా ఉంటే అనుకూలంగా ఓటు వేసిన వారిలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది సంబంధిత పక్షాలేనని ఆరోపణలు ఉన్నప్పుడు, ప్రణాళిక విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన అన్నారు.
రుణదాతల వ్యాపారపరమైన నిర్ణయానికి చట్టపరంగా ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ట్రిబ్యునల్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని ఆరుష్ ఖన్నా విశ్లేషించారు.
ఎన్సీఎల్టీ కేవలం స్టాంపింగ్ ట్రిబ్యునల్‌గా మారిపోకూడదని, సంబంధిత పక్షాల ప్రమేయం, వ్యక్తిగత హామీదారు నికర ఆస్తి విలువలో భారీ తగ్గుదల వంటి అంశాలపై చట్టబద్ధంగా జోక్యం చేసుకోవాల్సిన కొన్ని అభ్యంతరాలు ప్రాథమికంగా ఉన్నందున ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇంత భారీ హెయిర్‌కట్‌కు ఇటీవల పోల్చదగిన ఉదాహరణ వీడియోకాన్ గ్రూప్ ఉదంతం.
వీడియోకాన్ బ్యాంకులకు దాదాపు 65,000 కోట్ల రుణం బాకీ ఉండగా, దాని పరిష్కారం కోసం వేదాంత గ్రూప్ కంపెనీ అయిన ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ 95 శాతానికి పైగా కోత విధించి, రూ. 2,962 కోట్లు చెల్లించే ప్రతిపాదన చేసింది. అంటే 95శాతానికిపైగా హెయిర్ కట్.
అయితే అది కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ. సుభాష్ చంద్ర కేసు వ్యక్తిగత హామీదారు దివాలాకు సంబంధించినది.

ఫొటో సోర్స్, Getty Images
సుభాష్ చంద్ర ఏమంటున్నారు?
సుభాష్ చంద్ర తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను పీల్చేశారనే ఆరోపణలు తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని ఆయన వీడియోలో అన్నారు.
తనతో పాటు కుటుంబ ఆస్తులను, జీ కంపెనీని విక్రయించడం ద్వారా మొత్తం రూ. 45,000 కోట్ల బకాయిల్లో దాదాపు రూ. 43,000 కోట్లు ఇప్పటికే తీర్చేశానని చెప్పారు.
తన ఆస్తుల విలువ భారీగా పడిపోవడంపై బ్యాంకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
"నేను 2016లో రాజ్యసభ సభ్యుణ్ణి అయినప్పుడు నా నికర ఆస్తి విలువ 39 కోట్లు. 2017 నాటికి అది 45 వేల కోట్లు ఎలా అవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.
తన వాదనలు నిజమో కాదో తెలుసుకోడానికి ఒక స్వతంత్ర ఆడిటర్‌ను నియమించాలని ఆయన ఆర్థిక మంత్రికి, బ్యాంకింగ్ కార్యదర్శికి సవాలు విసిరారు. తన ఇంటిలోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి జీవనం సాగిస్తున్నానని కూడా సుభాష్ చంద్ర చెప్పారు.
తన రుణాలు, ఇటీవలి ఎన్సీఎల్టీ చర్యలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆ గ్రూపు మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సుభాష్ చంద్ర ఆరోపించారు.
అయితే, సుభాష్ చంద్ర నిరాధార వ్యాఖ్యలు చేశారని రిలయన్స్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
"రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన మీడియా సంస్థలపై చేసిన ఆరోపణలను, పరోక్ష నిందలను మేం పూర్తిగా ఖండిస్తున్నాం" అని రిలయన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఎవరిపైనా దాడి చేయడానికి తమ మీడియా బ్రాండ్లను ఎన్నడూ ఉపయోగించలేదని, భవిష్యత్తులోనూ అలా చేయబోమని ఆ గ్రూప్ తెలిపింది.
సుభాష్ చంద్రను ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా రిలయన్స్ గ్రూప్ ఎంతో గౌరవిస్తుందని, ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటుందని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























