'మాలో ఒకరిపై దాడి జరిగితే, ముగ్గురిపై దాడిగా పరిగణిస్తాం': పాకిస్తాన్, సౌదీ, తుర్కియేల మధ్య రక్షణ ఒప్పందం

ఫొటో సోర్స్, Turkish Presidency / Murat Cetinmuhurdar / Handout/Anadolu via Getty Images
సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో శుక్రవారం సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్‌ల మధ్య త్రైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన ప్రకారం, మూడు దేశాల నాయకులు సౌదీ అరేబియాకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ , పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఒక సదస్సులో ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
ఒప్పందం ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క సభ్య దేశంపై ఆయుధాలతో దాడి జరిగినా, దానిని అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించడానికి, అన్ని స్థాయిలలో రక్షణ సహకారాన్ని పెంచడానికి మూడు దేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి.
సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ల మధ్య ఇదివరకే రక్షణ ఒప్పందం ఉంది. దాని ప్రకారం, ఆ రెండు దేశాల్లో ఏ ఒక్క దానిపై దాడి జరిగినా, దానిని రెండూ తమపై జరిగిన దాడిగానే భావిస్తాయి. ఇప్పుడు ఈ ఒప్పందంలో తుర్కియే కూడా చేరింది.
సౌదీ అరేబియా వద్ద ఆర్థిక బలం ఉంది. పాకిస్తాన్ వద్ద అణు సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణులు, మానవ వనరులు ఉన్నాయి. తుర్కియే వద్ద సైనిక అనుభవం ఉంది, అది రక్షణ రంగాన్ని బాగా అభివృద్ధి చేసుకుంది.
ఈ మూడు ప్రాంతీయ శక్తుల మధ్య సహకారం నిరంతరం పెరుగుతున్న సమయంలో ఈ ఒప్పందం కుదిరింది.
పశ్చిమ ఆసియా విషయంలో పాకిస్తాన్, భారతదేశాల వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భారతదేశం ఇజ్రాయెల్‌కు మిత్రదేశం కాగా, పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఉనికిని అంగీకరించదు.
తుర్కియేతో పాకిస్తాన్ మైత్రిని కూడా భారతదేశ ప్రయోజనాలకు అనుకూలమైనదిగా పరిగణించరు.


ఫొటో సోర్స్, Turkish Presidency / Murat Cetinmuhurdar / Handout/Anadolu via Getty Images
మూడు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం
పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో మూడు దేశాల మధ్య రక్షణ సదస్సు జరిగినట్లు పేర్కొంది.
ఆ ప్రకటన ప్రకారం, "మక్కా అల్-ముకర్రమా ఉమ్మడి రక్షణ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇందులో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలను సమీక్షించారు."
"మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్,రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్, షాబాజ్ షరీఫ్ 'మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం'పై సంతకాలు చేశారు. ప్రాంతంలో, వెలుపల శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడం, సురక్షితమైన, సమృద్ధిగా ఉండే భవిష్యత్తు కోసం మూడు దేశాల ఉమ్మడి భద్రతను మరింత బలోపేతం చేయడానికి గల ఉమ్మడి కట్టుబాటును ఈ ఒప్పందం ప్రతిఫలిస్తుంది"
ఏదైనా దురాక్రమణ చర్యకు వ్యతిరేకంగా ఉమ్మడి నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది.
పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం, "ఒప్పంద నిబంధనల ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దానిపై ఆయుధాలతో దాడి జరిగినా, దానిని మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అంతేకాకుండా, మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని రంగాలను మరింత బలోపేతం చేయడానికి కూడా ఈ ఒప్పందం తోడ్పడుతుంది".
ఒప్పందం కుదరడానికి ముందు, ఖతార్‌లోని లుసైల్ యూనివర్సిటీకి చెందిన మధ్య ప్రాచ్య వ్యవహారాల నిపుణుడు డాక్టర్ మొహమ్మద్ మజార్ సాహిన్ ఎక్స్ వేదికగా, "ఈ డిఫెన్స్ ప్యాక్ట్ కనుక కుదిరితే, మధ్య ప్రాచ్యం ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతుంది. అక్కడ చాలా మార్పులు రావచ్చు" అని రాశారు.
రెడ్ సీ, బాబ్ అల్-మందేబ్ స్ట్రెయిట్, ఏడెన్ గల్ఫ్‌లలో వాణిజ్య నౌకలు, ఇంధన సరఫరా మార్గాల రక్షణ కోసం సౌదీ అరేబియా ఒక బహుళ జాతీయ నౌకాదళ రక్షణ కూటమిని ప్రకటించిన వారం రోజులకే ఈ ఒప్పందం జరగడం గమనార్హం. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల నుంచి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా ఈ చర్య చేపట్టారు.
సౌదీ అరేబియా నాయకత్వంలోని ఈ చర్యకు అధికారికంగా మద్దతు తెలిపిన 14 దేశాలలో నాటో సభ్య దేశమైన తుర్కియే, అణు సామర్థ్యం ఉన్న పాకిస్తాన్ కూడా ఉన్నాయి.
అయితే ఈ కూటమిలో తాము ప్రత్యక్ష పాత్ర పోషిస్తామా లేదా అనేదానిపై తుర్కియే ఇంకా ఏ ప్రకటన చేయలేదు. కానీ గత నెలలో హౌతీలు సౌదీ అరేబియాకు ఇచ్చిన ముట్టడి హెచ్చరికలను తుర్కియే ఖండించింది. రెడ్ సీలో నౌకల రాకపోకలకు ఎదురవుతున్న ముప్పుపై రియాద్‌కు సంఘీభావం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పర్యటన వెనుక కథ
జోర్డాన్‌లో ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెల్ అతీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్‌దార్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌లతో తుర్కియే విదేశాంగ మంత్రి హాకాన్ ఫిదాన్ జరిపిన సమావేశం తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇది నాలుగు దేశాల కూటమికి చెందిన ఐదో సమావేశం.
'ఆర్-4 మెకానిజమ్' మార్చిలో రియాద్‌లో జరిగిన సమావేశాల తర్వాత ప్రారంభమైంది. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావాలను పరిమితం చేయడం, దౌత్య యత్నాల్లో సమన్వయాన్ని పెంచడం, ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు తుర్కియే, ఈజిప్ట్, పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య సమన్వయం నెలకొల్పడం దీని ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు విస్తృత ప్రాంతీయ మద్దతును కూడగట్టేందుకు తుర్కియే ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు, దాని పెరుగుతున్న ప్రభావం అస్థిరతను సృష్టిస్తున్నాయని తుర్కియే భావిస్తోంది.
ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ, విస్తరణవాద ఆకాంక్షలను కలిగి ఉన్న ప్రధాన భాగస్వాముల్లో ఇజ్రాయెల్ ఒకటని గురువారం అంకారాలో సిరియా విదేశాంగ మంత్రి అసద్ అల్-షిబానీతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేఖరుల సమావేశంలో హాకాన్ ఫిదాన్ అన్నారు.
గల్ఫ్ దేశాలతో రక్షణ ఎగుమతులను పెంచడానికి, సంయుక్త రక్షణ ఉత్పత్తిని విస్తరించడానికి తుర్కియే ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ పెరుగుతున్న ప్రాంతీయ సహకారం వెలుగులోకి వస్తోంది.
2023లో సౌదీ అరేబియా, తుర్కియేకి చెందిన రక్షణ సంస్థ 'బే కార్' నుంచి డ్రోన్ల కొనుగోలుకు పెద్ద ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత 2024లో యుఏవి ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, సౌదీ అరేబియాలో సిబ్బందికి శిక్షణపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. వీటిని తుర్కియేకి చెందిన అతిపెద్ద రక్షణ ఎగుమతి ప్యాకేజీగా పరిగణిస్తారు.
తుర్కియే అధికారిక గణాంకాల ప్రకారం, 2025 చివరి నాటికి తుర్కియే, సౌదీ అరేబియాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 8.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెండు దేశాల మధ్య వేగంగా మెరుగవుతున్న సంబంధాలలో రక్షణ సహకారం ఒక ముఖ్యమైన పునాదిగా మారింది.
ఎర్డోవాన్ గతంలో ఫిబ్రవరిలో సౌదీ అరేబియాలో పర్యటించారు. ఆ సమయంలో రియాద్‌లో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమై, మరుసటి రోజు ఈజిప్ట్ పర్యటనకు వెళ్లారు.
కొత్త రక్షణ ఒప్పందంలో తుర్కియే చేరడం అనేది సున్నీ ముస్లిం ప్రపంచ నాయకత్వం కోసం గతంలో ప్రత్యర్థులుగా ఉన్న తుర్కియే, సౌదీ అరేబియాల మధ్య సంబంధాలలో ఒక కొత్త యుగాన్ని సూచిస్తుంది.
ఏళ్ల తరబడి ఉన్న వైషమ్యాలను పక్కనబెట్టి, రెండు దేశాలు ఆర్థిక, రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై పనిచేస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























