పాక్ పాలిత కశ్మీర్: ఇక్కడ పదుల సంఖ్యలో యువకుల ప్రాణాలు పోతున్నాయి... అసలేం జరుగుతోంది?

- రచయిత, కరోలిన్ డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
పాక్ పాలిత కశ్మీర్‌లోని రవాలాకోట్ నగరంలో ప్రధానంగా ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి డాక్టర్ అన్వర్ తాత్కాలికంగా ఏర్పాటుచేసిన క్లినిక్ పెద్ద దూరంలో ఉండదు. ఇంట్లో ఓ అదనపు బెడ్రూమ్ను వైద్యపరికరాల గదిగా ఉపయోగిస్తున్నారు. బయట ఓ మంచం ఉంది. పైన ఎరుపురంగు టార్పాలిన్ ఉంది.
మంచం మీద పడుకున్న వ్యక్తిపేరు షఫ్ఖత్ హుస్సేన్. ఆయనకు ఛాతీలో గాయమయింది. ఆయన కింద ఉన్న దుప్పటిపై అంతకుముందు గాయపడిన వారి రక్తపు మరకలున్నాయి. ఆయన ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.
గత రెండు నెలల్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) గ్రూప్‌కు చెందిన నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఈ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
45 లక్షల జనాభా ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.
రవాలాకోట్ వెళ్లడానికి, నిరసనల ప్రాంతంలో ఉన్నవారితో మాట్లాడడానికి అనుమతి లభించిన తొలి మీడియా సంస్థ బీబీసీ.

‘ఆస్పత్రులకు వెళ్లాలన్నా భయమే’
నిరసనల్లో పాల్గొనేవారిని భద్రత కోసం ఈ కథనంలో చాలామంది పేర్లను మార్చాం. డాక్టర్ అన్వర్ది కూడా మారిన పేరే.
''ప్రాథమిక చికిత్స అందించడానికి కావాల్సిన సదుపాయాలు మా దగ్గర ఉన్నాయి. రక్తస్రావాన్నిఆపడం, గాయాలను శుభ్రపరిచి కట్టుకట్టడం, పైపైన ఉన్న బుల్లెట్లను తొలగించడం వంటివి చేయగలం. కానీ ఛాతీ, పొత్తి కడుపు, తల, ఇతర కీలక అవయవాలకు తీవ్ర గాయాలైనవారికి మెరుగైన ఆస్పత్రులు అవసరం'' అని అన్వర్ చెప్పారు.
ఒకే సమయంలో అలాంటి రోగులు చాలామంది వస్తే పెద్ద ఆస్పత్రులకు కూడా ఇబ్బందవుతుంది'' అని ఆయన అన్నారు.
''జూలై 27నుంచి క్లినిక్‌లో తీవ్రగాయాలతో ఉన్న దాదాపు 50 నుంచి 60మందికి చికిత్స అందించాం. 15 నుంచి 20మంది కాల్పుల గాయాల బాధితులకు నేనొక్కణ్నే చికిత్స అందించా'' అని అన్వర్ చెప్పారు.
ప్రధాన ఆస్పత్రులకు వెళ్లడానికి నిరసనకారులు భయపడుతున్నారు. తమను అరెస్టు చేస్తారేమో, కాల్చేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇవి ఆధారంలేని ఆరోపణలని అధికారులు చెప్పారు.
''చనిపోయినవారు, తీవ్రంగా గాయపడిన వారులో ఎక్కువమంది 15నుంచి 16ఏళ్ల నుంచి 32 నుంచి 35ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత. 40ఏళ్లకు పైబడిన రోగులు చాలా తక్కువ కనిపించారు'' అని అన్వర్ తెలిపారు.

‘ప్రాథమిక అవసరాల గురించే అడుగుతున్నాం’
హుస్సేన్ మంచం పక్కన ఆయన స్నేహితుడు అలీ ఉన్నారు. షాల్‌తో కన్నీళ్లు తుడుచుకుంటున్నారు.
''కొనుక్కోగల ధరలో పిండి, కరెంటు, ఇతర ప్రాథమిక అవసరాలగురించి మాత్రమే మేం అడుగుతున్నాం. దానికి బదులు వాళ్లు మా సోదరులను చంపేస్తున్నారు. మేం చేసిన నేరమేంటి? మా మీదకు బుల్లెట్లు ఎందుకు ప్రయోగించారు'' అని ఆయన ఏడుస్తూ ప్రశ్నించారు.
ప్రజల హక్కుల కోసం నిరసనలు జరుగుతున్నాయని జేఏఏసీకి చెందిన ఆందోళనకారులు అన్నారు. కరెంటు ధరలు, విద్య, ఆరోగ్యం సహా పలు విషయాల గురించి మాట్లాడుతున్నామని వారు చెప్పారు. అక్టోబరులో పాకిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఈ సమస్యలను పరిష్కరించాల్సిఉందని, కానీ అది అమలు చేయడం లేదని జేఏఏసీ తెలిపింది.
ఈ ఆరోపణలతో స్థానిక ప్రభుత్వం ఏకీభవించడం లేదు.
ఆ సంస్థ ఆయుధాలు ప్రయోగిస్తోందని, ఎన్నికలకు ఆటంకం కలిగించడానికే ఇదంతా చేస్తోందని స్థానిక ప్రభుత్వం అంటోంది. ప్రాంతీయ రాజధాని ముజఫరాబాద్‌కు నిరసనకారులను వెళ్లనివ్వడానికి తాము సిద్ధంగా లేమని తెలిపింది.
జేఏఏసీపై జూన్‌లో నిషేధం విధించారు. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న ఉగ్రవాదులుగా వారిపై ముద్రవేశారు. తమపై చేస్తున్న ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. తాము శాంతియుతంగా ఉన్నామని తెలిపింది. విదేశాల్లో నివసిస్తున్న పాక్ పాలిత కశ్మీర్ ప్రజల నుంచి తమకు నిధులు అందుతున్నాయిగానీ భారత్ నుంచి కాదని వెల్లడించింది.
తాము హింసను ప్రేరేపించడం లేదని, హింసను మొదలుపెట్టలేదని, తాము బాధితులమని, పాకిస్తాన్‌కు చెందిన భద్రతాబలగాలు తమపై కాల్పులు జరుపుతున్నాయని తెలిపింది.
ఇంటర్నెట్ నిలిపివేయడం, రోడ్లను నిర్బంధించడం, భద్రతాదళాలను మోహరించడం వంటివాటితో సమాచారం అందడం కష్టంగా మారింది.

ఫొటో సోర్స్, EPA
‘జియా ఉల్ హక్, ముషారఫ్ పాలనలోనూ ఇలా లేదు’
నిరసనకారులపై జరిగిన కాల్పుల్లో తమవారిని కోల్పోయిన అనేక కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది.
తన ఒక్కగానొక్క కొడుకుపై కాల్పులు జరిపిన సమయంలో తాను స్వయంగా ఆందోళనలో భాగంగా ఉన్నానని ఆస్మా చెప్పారు.
''మేం మా హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నాం. ఉగ్రవాదులం కాదు. వీడికన్నా మంచి కొడుకు మరొకరు ఉండరు. అక్కడ ప్రమాదం ఉందని వాడికి తెలుసు. కానీ న్యాయం కోసం నిలబడడం, మద్దతివ్వడం ముఖ్యమని వాడు అనుకున్నాడు. న్యాయమైన కారణం కోసం మరణించడం గౌరవమైన విషయమని వాడెప్పుడూ చెబుతుండేవాడు'' అని ఆస్మా ఆవేదన వ్యక్తంచేశారు.
సల్మాన్ తన సోదరుణ్ని పోగొట్టుకున్నారు.
''కుటుంబంలో వాడే చిన్న. అందరికీ ఇష్టమైన వ్యక్తి. మేమెంతో విలువైనవ్యక్తిని పోగొట్టుకున్నాం. అదే సమయంలో నేను గర్వపడుతున్నా. ప్రజల హక్కుల కోసం పోరాడుతూ వాడు ప్రాణాలు విడిచారు. ఎవరిమీద దాడి చేయలేదు. ఎవరితో గొడవపడలేదు'' అని సల్మాన్ అన్నారు.
గతంలో భద్రతాబలగాల్లో పనిచేసిన ఆయుబ్ తన కొడుకును పోగొట్టుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్నిగానీ, సైన్యాన్ని గానీ ఆయన నిందించడం లేదు. పాక్ పాలిత కశ్మీర్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. పారామిలటరీ బలగాలను ప్రయోగించింది స్థానిక ప్రభుత్వమేనని చెప్పారు.
''నేను రిటైరైన సైనికుణ్ని. జనరల్ జియా ఉల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ కాలంలో సైనిక పాలనను నేను ప్రత్యక్షంగా చూశాను. కానీ ఇప్పుడు జరుగుతున్నవంటివాటిని ఎప్పుడూ చూడలేదు. ఇది ఘోర అన్యాయం''అని ఆయన అన్నారు.
''నా కొడుకు ఏ తప్పూ చేయలేదు. నిరసనకారులెవరూ తప్పు చేయలేదు'' అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

‘మా మధ్యలోకి తమ వాళ్లను పంపించి’
శాంతియుత నిరసనకారులపై విచక్షణారహితంగా భద్రతాబలగాలు కాల్పులు జరిపాయన్న ఆరోపణలను ఖండిస్తున్నామని పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. చట్టాన్ని అమలుపరిచేవారిపై దాడులకు దిగినవారిపై, ప్రజా భద్రతకు ప్రమాదంగా మారినవారిపై, అధికారులను అడ్డుకుంటున్నవారిపై మాత్రమే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
అక్కడ ఆహారకొరత ఉండడాన్ని బీబీసీ ప్రత్యక్షంగా గమనించింది. తమ దగ్గర ఉన్న ఆహారాన్ని నిరసనకారులు తోటివారితో పంచుకుంటున్నారు. ఎక్కువభాగం షాపులు మూసి ఉన్నాయి. బైక్‌లపై బియ్యం సంచులను రహస్యంగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు బీబీసీతో చెప్పారు.
చెట్లను నరికి, నగరంలోని కొన్ని రోడ్లును దిగ్బంధంలో ఉంచారు. జేఏఏసీ ఇలా చేసిందని అధికారులంటున్నారు. ప్రధాన రహదారిపైకి వెళ్లే ఇతర మార్గాల్లో సెక్యూరిటీ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. రవాలాకోట్కు ఆహారం, మందులు రాకుండా అడ్డుకుంటున్నారన్న దాంట్లో నిజం లేదని, అసలు తాము ప్రత్యేకంగా వాటికి ప్రవేశం కల్పిస్తున్నామని పాక్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చెబుతోంది.
జేఏఏసీ హింసాత్మక సంస్థ అని అధికారులు పదే పదే ఆరోపిస్తున్నారు. భవనాలపై తుపాకులు పట్టుకున్న వ్యక్తులు జేఏఏసీ సభ్యులేనంటూ డ్రోన్ దృశ్యాలు షేర్ చేశారు.
ఆ సంస్థ నుంచి సేకరించామని చెబుతున్న తుపాకులను న్యూస్ కాన్ఫరెన్స్‌లో పోలీసు అధికారులు ప్రదర్శనకు ఉంచారు.
భద్రతా అధికారులు గాయపడ్డారని, చనిపోయారని స్థానిక మీడియాకు చెబుతున్నారు.
ఒక్కో పారామిలటరీ అధికారిని చంపితే కోటి రూపాయల బహుమతి ఇస్తామని తమకు చెప్పినట్టు విచారణలో ఆ గ్రూప్‌కు చెందిన ఒకరు వెల్లడించారని పోలీసు అధికారులు తెలిపారు.
జేఏఏసీ కోర్ కమిటీ సభ్యులు ఉమర్ నజీర్ ఈ ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం ఆయన రవాలాకోట్లో ఉన్నారు. అయితే భద్రతా బలగాల అధికారులు చనిపోయారని ఆయన తెలిపారు.
''బహుశా భద్రతా అధికారులు చనిపోయి ఉంటారు. నేను దానిపై ఎలాంటి కామెంట్ చేయను''అని ఆయనన్నారు.
''వాళ్ల నియంత్రణలో ఉన్న కొన్ని వర్గాలకు చెందినవారు మా మధ్య చొరబడ్డారని నేను అనుకుంటున్నా. అలాంటి వ్యక్తులు కచ్చితంగా మా మధ్య ఉన్నారు. తాము చెప్పిన మాటలకు సమర్థన దొరకడానికి వీలుగా వారు తమపై తామే అలాంటి చర్యలకు దిగి ఉంటారని నేను భావిస్తున్నాను. నేను కచ్చితమైన ఆరోపణ చేయడం లేదు. కానీ మా వైపు నుంచి అలాంటి హింస జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు'' అని ఉమర్ నజీర్ అన్నారు.
వారి ఉద్యమంలోకి ఎవరో వచ్చారన్న ఆరోపణకు ఆయన ఎలాంటి ఆధారాలూ చూపలేదు.
సోషల్ మీడియాలో జేఏఏసీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని అధికారులు ఆరోపించారు.
జేఏఏసీ నిరసనలను బీబీసీ గమనించింది. వాళ్ల దగ్గర ఆయుధాలున్నట్టుగానీ, కాల్పులు జరిపినట్టుగానీ ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు. రాత్రంతా కాల్పుల శబ్దం వినిపించినప్పటికీ వాళ్ల దగ్గర నుంచి అలాంటి శబ్దం వినపడలేదు. ఎవరు కాల్పులు జరుపుతున్నారనేదానిపై స్పష్టత లేదు.
అక్కడ ఉద్రిక్త, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఎప్పుడు మరింత ప్రమాదకరంగా మారుతుందో ఎవరికీ తెలియదు.
తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని నజీర్ చెప్పారు. అయితే ప్రస్తుతం మరిన్ని ఆందోళనలకు ప్రణాళికవేసుకున్నామని తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























