సల్మాన్ ఖాన్: ‘ఒక మహిళ తల్లి అయినా ట్రోల్ చేస్తున్నారు, ఈసారి చిరిగిన షూ వేసుకు వస్తా.. ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి’

రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సందర్భంగా ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వృత్తిగత జీవితంపై ట్రోల్ ఓకే, కానీ వ్యక్తిగత జీవితాలపై ట్రోలింగ్ తగదని సల్మాన్ ఖాన్ అన్నారు
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆన్‌లైన్ ట్రోలర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'రియాలిటీ షో' బిగ్ బాస్‌లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ సమాజంలో ట్రోలింగ్ సంస్కృతి సాధారణమైపోయిందన్నారు.

ఒకరి వయస్సు, ఆరోగ్యం, రూపం, కుటుంబం, చివరికి తల్లి కావడంపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. కానీ, ఇటీవల బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌పై జరిగిన ట్రోలింగ్ ఘటన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భర్త విక్కీ కౌశల్‌తో కలిసి కత్రినా కైఫ్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత కత్రినా కైఫ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు నిరుడు నవంబర్‌లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బాబు పుట్టాక దాదాపు తొమ్మిది నెలల తర్వాత కత్రినా మొదటిసారిగా ఆ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. తల్లి అయిన తర్వాత ఆమె రూపంలో వచ్చిన మార్పులను చూసి సోషల్ మీడియాలో కొందరు ఆమెను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

కొందరు యూజర్లు ఆమె బరువు పెరగడంపై రకరకాల ప్రశ్నలు గుప్పిస్తూ ఆమె ఫోటోలపై కామెంట్లు చేశారు. కొందరు ఆమెను బాడీ షేమింగ్ కూడా చేశారు.

అయితే, మరికొందరు మాత్రం ఆ ట్రోలర్ల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ... గర్భధారణ, ప్రసవం ఒక మహిళ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, శరీరంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వివరించారు.

బిగ్ బాస్ షో సందర్భంగా తన టీ షర్ట్ విప్పి ఫిట్‌నెస్‌ను చూపిస్తూ, తనకు ముసలితనం వచ్చిందని ప్రజలు ట్రోల్ చేస్తున్నారని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తనకు ముసలితనం వచ్చిందని ప్రజలు ట్రోల్ చేస్తున్నారని సల్మాన్ ఖాన్ చెబుతూ బిగ్ బాస్ షోలో తన టీ షర్ట్ విప్పి తన శారీరక దారుఢ్యాన్ని చూపారు.

ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే..

ట్రోలింగ్ ధోరణిని రియాలిటీ షో బిగ్ బాస్‌లో సల్మాన్ ఖాన్ తప్పుబట్టారు.

ప్రతి షోలోనూ ప్రజలు తన వయస్సును ఎత్తిచూపుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సల్మాన్ ఖాన్‌కు ముసలితనం వచ్చిందని జనాలు అంటున్నారని పేర్కొన్నారు.

''ప్రతి షోలోనూ జనాలు నా వయస్సుపై కామెంట్లు చేస్తారు. నాకు ముసలితనం వచ్చిందని అంటారు. అసలు మీరు దేని ఆధారంగా ట్రోలింగ్ చేస్తున్నారు? ఒకరి బరువు, రూపం, వారి కుటుంబం.. చివరకు నవ్వినా ట్రోలింగ్ చేస్తారు, సినిమా ఫ్లాప్ అయినా ట్రోల్ చేస్తారు. చివరికి ఒక మహిళ తల్లి అయినా వదలకుండా ట్రోల్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మీ పెంపకం ఎలాంటిదో మీరే బయటపెట్టుకుంటున్నారు. నన్ను కూడా ట్రోల్ చేశారు. ముసలివాడు అయ్యాడని అంటున్నారు. నాకు అరవై ఏళ్లు వచ్చాయి భయ్యా. ట్రోల్ చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి'' అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత షో జరుగుతుండగానే సల్మాన్ ఖాన్ తన టీ-షర్టు తీసి, తన శరీరాన్ని చూపుతూ ... ''భాయ్ (సల్మాన్ ఖాన్) లావెక్కాడని జనాలు అంటున్నారు. భాయ్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా కామెంట్లు చేసేవారు మొదట తమ ముఖాలు, తమ శరీరాలు అద్దంలో చూసుకోవాలి. ఆ తర్వాతే వేరే వాళ్లను ట్రోల్ చేయాలి. ముందు మీ తల్లిదండ్రులను చూడండి. వారి ఆరోగ్యాన్ని గమనించండి. ఆ తర్వాత వచ్చి ట్రోల్ చేయండి'' అని వ్యాఖ్యానించారు.

భాయ్ బరువు పెరిగారనో, తగ్గారనో ఎవరైనా అంటే అర్థం ఉంటుందని... కానీ, జనాలు ఎగతాళి చేస్తున్నారని సల్మాన్ ఖాన్ అన్నారు.

''సొహైల్ (సల్మాన్ సోదరుడు), వరుణ్‌లను కూడా ఇలాగే ట్రోల్ చేస్తున్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి ట్రోలర్లు ఉన్నారు. నేను కొన్నిసార్లు చిరిగిన బూట్లు కూడా వేసుకుంటాను. వచ్చేసారి అవే వేసుకొని వస్తాను. ట్రోలర్లకు ఎలాగూ పని లేదు కాబట్టి అప్పుడు కూడా ట్రోల్ చేసుకోండి. రాజకీయ నాయకులు, నటులు... ఇలా అందరినీ వీళ్లు ట్రోల్ చేస్తారు. వారి పని తీరు బాగా లేకపోతే... 'మీరు మంచి నాయకుడు లేదా నటుడు కాదు' అని చెప్పండి.'' అని సల్మాన్ హితవు పలికారు.

ఇటీవల ఒక కార్యక్రమానికి భర్త విక్కీ కౌశల్‌తో హాజరైన కత్రినా కైఫ్‌ను లుక్స్ పరంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవల ఒక కార్యక్రమానికి భర్త విక్కీ కౌశల్‌తో హాజరైన కత్రినా కైఫ్‌ రూపాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

కత్రినా కైఫ్‌పై నెటిజన్లు, ప్రముఖులు ఏమన్నారంటే..

కత్రినా కైఫ్‌పై జరిగిన ట్రోలింగ్‌ను ఆమె గురించి వచ్చిన కామెంట్లను 'బాడీ షేమింగ్' గా పలువురు సోషల్ మీడియా యూజర్లు, విలేకరులు, వినోద రంగానికి చెందిన విశ్లేషకులు అభివర్ణించారు. ఒకరి శరీరాన్ని, రూపాన్ని లేదా ఆకృతిని ఎగతాళి చేయడం లేదా విమర్శించడం సరైనది కాదని వారు స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఈ అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.

''ప్రియమైన మహిళలారా... మీ బరువు పెరిగినా లేదా తగ్గినా, మీ వయస్సు, మీ రూపం, మీ శరీరం లేదా చర్మం ఎలా ఉన్నా... వాటి గురించి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికీ మీరు ఎలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు కత్రినా.. రేపు మరొకరు కావచ్చు... మనం ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు'' అని ఆమె ట్వీట్ చేశారు.

నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా 'ఎక్స్'లో స్పందించారు.

''కత్రినా, మీరు మీ జీవితంలో ఎల్లప్పుడూ గౌరవంగా, సౌమ్యంగా, ఆత్మగౌరవంగా జీవించారు. ఇకముందు కూడా మీరు ఇలాగే జీవించండి. మీ శరీరం గురించి ఎవరికీ ఎలాంటి వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లి కావడం గురించి గానీ, బరువు పెరగడం గురించి గానీ ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎలా కనిపిస్తున్నారనే దానిపై కూడా ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన పనిలేదు.

సౌందర్యం అనేది చూసేవారి కళ్లలో ఉంటుందని అంటారు. ఈ విషయంలో వేరేవారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది కాదు'' అని ఖుష్బూ పేర్కొన్నారు.

ఇటీవలి ఫోటోల్లో కత్రినా కైఫ్ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని వినోద రంగానికి చెందిన విశ్లేషకులు ఫరీదూన్ షహరియార్ వ్యాఖ్యానించారు.

ప్రతికూల, విషపూరిత కామెంట్లతో ఇతరుల జీవితాల్లోని సంతోషకరమైన, వ్యక్తిగత క్షణాలను పాడు చేయవద్దని ఆయన విమర్శకులకు విజ్ఞప్తి చేశారు.

''ఇలాంటి కారణాల వల్లే చాలామంది కళాకారులు బరువు తగ్గడానికి అసహజమైన పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల చాలామంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు.

కత్రినా కైఫ్ తన జీవితంలో ఎంతో సాధించారు. ఆమె జీవితంలో ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఆమె బిడ్డ ఆమెకు ఎంతో ముఖ్యం'' అని ఫరీదూన్ అన్నారు.

సోషల్ మీడియాలో ఇలాంటి ధోరణి వల్ల సెలబ్రిటీలకే కాకుండా, మామూలు మహిళల ఆత్మవిశ్వాసంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

స్త్రీ శరీరంలో సంభవించే సహజమైన మార్పుల పట్ల సమాజంలో మరింత అవగాహన, సానుభూతి, బాధ్యతాయుతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)