‘‘మా హెడ్ టీచర్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతూ మేమిద్దరం దగ్గరయ్యాం, పెళ్లి కూడా చేసుకున్నాం’’

- రచయిత, ఎండాంగ్ నుర్దిన్, రెబెకా హెన్ష్కే
- హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
(హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక దాడికి సంబంధించిన వివరాలు ఉన్నాయి)
అర్జంటుగా తనకు ఫోన్ చేయాలంటూ తన సోదరి మెసేజ్ చేయడంతో యుస్రోన్ అజ్జాహిదీ ఆమె నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలవైపు వినిపించిన గొంతు యుస్రోన్‌లో కలవరం పుట్టించింది.
అవతల లైన్‌లో ఉన్నది తన సోదరి కాదు. యుస్రోన్ చదువుకున్న స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన యుస్రోన్ వాళ్ల ఇంటికి వచ్చారు. '' అప్పుడు ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు స్పష్టంగా తెలుసు'' అని యుస్రోన్ చెప్పారు.
అహ్మద్ ఇమానుద్దీన్ సుమార్‌ను ఆయన విద్యార్థులు అబా (తండ్రి అనే అర్థం) అని పిలిచేవారు. ఆయనకు మంచి పేరు, గౌరవం ఉంది. ఇండోనేషియాలోని లొంబోక్ ద్వీపంలోని ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌కు ఆయన గౌరవాధిపతి.
యుస్రోన్, ఆయన స్నేహితులు.. కొంతమంది విద్యార్థుల నుంచి తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తున్నారని అబా తెలుసుకున్నారు. అబా తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇండోనేషియాలోని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూళ్లలో లైంగిక వేధింపుల ఘటనలను మహిళలపై హింసకు సంబంధించిన జాతీయ కమిషన్ ఒకటి దీనిని నేషనల్ ఎమర్జెన్సీగా అభివర్ణించింది.
అయితే చాలా కేసులు కోర్టుల వరకు వెళ్లడం లేదు.
బాధితులను తమ ఆరోపణలను వెనక్కి తీసుకునేలా ఒప్పించడం లేదా మౌనంగా ఉండేలా ఒత్తిడి చేయడమే ఇందుకు కారణమని న్యాయనిపుణులు చెబుతున్నారు
ఇప్పుడు అబా కూడా యుస్రోన్‌కు ఫోన్ చేసింది అందుకే. ఆయన కూడా తనపై వచ్చిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
''నీ టీచర్ పరువు కాపాడు. అందరూ తప్పులు చేస్తారు బిడ్డా'' అంటూ ఆయన ఏడుస్తూ అన్నారు.
అబా మాట్లాడిన ప్రతి మాటను యుస్రోన్ రికార్డ్ చేస్తున్నాడన్న విషయం ఆయనకు తెలియదు. అబాపై యుస్రోన్ దర్యాప్తు ప్రారంభించడానికి కారణం ఏడాది కిందట జరిగిన ఓ ఘటన.
యుస్రోన్‌కు తన స్కూల్ మేట్ అయిన జియాదుతర్ రహమా ఒక విషయం చెప్పడంతో ఇది మొదలైంది. వాళ్లిద్దరూ లొంబోక్‌లోని అబూ బరోకత్ పాఠశాలలో చదువుకునే వారు. తెలివైన విద్యార్థులుగా వారికి పేరుండేది.
ఇప్పుడు ఇద్దరూ యూనివర్శిటీలో చదువుతున్నారు. రాజధాని జకర్తాలో యుస్రోన్ చదువుతుండగా, జియాదుతుర్ ఈజిప్ట్‌లోని కైరోలో చదువుకుంటున్నారు. పాఠశాల రోజుల్ని గుర్తు చేసుకుంటూ వారు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లు.
జియాదుతుర్‌ను ఆమె స్నేహితులు జియా అని పిలుస్తారు. ఓ రాత్రి యుస్రోన్‌కు జియా ఒక విషయం చెప్పారు. తనకు పదహారేళ్ల వయసులో అబా లైంగికదాడికి పాల్పడ్డారని జియా చెప్పారు.
అప్పట్లో ఓసారి క్లాస్ జరుగుతుండగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందనీ, తాను టాయ్‌లెట్ వైపు వెళ్తుండగా స్కూల్ తోటలో అబా ఆపి అక్కడే ఉన్న వాళ్ల ఇంటికి రావాలని కోరారని యుస్రోన్‌కు చెప్పారు జియా.
''ఇంట్లోకి వెళ్లిన తర్వాత నన్ను ప్రేమిస్తున్నానని అబా నాతో చెప్పారు. ఆయన నన్ను దగ్గరకు లాక్కుని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టారు. నా శరీరాన్ని నిమురుతూ తాకుతున్నారు'' అని ఆమె ఆ తర్వాత బీబీసీతో చెప్పారు.
ఆయనలాగే తనను కూడా చేయమని అడిగారని జియా గుర్తుచేసుకున్నారు.

అంతలోనే అబా పిల్లల్లో ఒకరు తాళం వేసి ఉన్న తలుపును గట్టిగా కొట్టడం ప్రారంభించడంతో బయటికి వెళ్లాలని అబా తనకు సైగ చేసి చెప్పినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆమె ఇంటి వెనకవైపు నుంచి బయటకు పరుగెత్తారు కానీ, ఆ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది.
''నాకు చాలా అసౌకర్యంగా, జరగరానిదేదో జరిగినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపించింది'' అని జియా చెప్పారు.
జియా చెప్పిన విషయం విన్నప్పుడు యుస్రోన్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ల పాఠశాలలో 'మేము చెప్పింది వింటాం, విధేయత చూపుతాం' అనే విషయాన్ని గట్టిగా నూరిపోశారు.
కానీ, ఆ విషయం గురించి ఆలోచించకుండా యుస్రోన్ ఉండలేకపోయారు.
అందుకే జియాను ఆమె స్కూల్ ఫ్రెండ్స్ వాండా హమీదా, మహిమా ఏకాలతో కలిసి ఆమె చెప్పిన విషయానికి మరిన్ని ఆధారాలను సేకరించాలని యుస్రోన్ సూచించారు.
వాళ్లు స్కూల్లోని ఇతర తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా అనేక విషయాలు బయటకు వచ్చాయి.
వాటిలో ముఖ్యమైన సమాచారం వాండా స్నేహితురాలు చెప్పారు. స్కూల్‌లో తాను చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పాఠశాల బాత్‌రూమ్‌లో ఒక చిన్న వయసు అమ్మాయి ఏడుస్తూ ఉండటం చూశానని ఆమె చెప్పారు.
ఆ అమ్మాయి కోసం అబా వెతుక్కుంటూ వచ్చారని, అప్పుడాయన ముఖం ఎర్రగా కంది ఉందని, ఆయాసంతో రొప్పుతున్నారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ అమ్మాయి పేరు సుక్మా రోహ్నా. ఆమె అప్పటికి అదే పాఠశాలలో చదువుతోంది. తనకు ఎదురైన అప్పటి అనుభవం గురించి ఆమె బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Yusron Azzahidi
సుక్మాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు న్యూ ఇయర్ ప్రార్థనల కోసం తనతో రావాలని అబా కోరారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత తనను పడుకోమని అబా చెప్పారని, ఆ తర్వాత నడుము కింద ఉన్న దుస్తులు విప్పేశారని సుక్మా చెప్పారు.
''ఇక తనను తాను నియంత్రించుకోలేకపోతున్నానని అబా పదేపదే అన్నారు. నా లోదుస్తుల మీదగా నన్ను తాకుతూ లైంగికంగా వేధించారు. నాపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చి అబా కడుపుపై గట్టిగా తన్నా. అక్కడి నుంచి పారిపోయా. పరిగెత్తుకుంటూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే అబా టార్చ్ లైట్‌తో నన్ను వెతుకుతూ కనిపించారు'' అని సుక్మా వివరించారు.
ఇలాంటి ఆధారాలు బయటకు వస్తున్న కొద్దీ యుస్రోన్ వాటన్నింటినీ సమన్వయం చేసి, ఆరోపణలు చేసిన విద్యార్థులకు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకునేవారు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా రాసుకునేవారు.
సుక్మా, జియాతోపాటు మరో నలుగురు మాజీ విద్యార్థులపై లైంగిక వేధింపుల గురించి ఏడు పేజీల పత్రాన్ని యుస్రోన్ తయారు చేశారు.
నహదత్ ఉల్ వతన్ దినియా ఇస్లామియా (ఎన్‌డబ్ల్యూడీఐ) సంస్థ ప్రతినిధులతో సమావేశాన్ని వాండా ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ వారి పాఠశాలతో పాటు, వందల పాఠశాలలను నిర్వహిస్తోంది. కైరోలో చదువుతున్న కొంతమంది విద్యార్థుల చదువుకు కూడా ఈ సంస్థ ఆర్థిక సాయం అందిస్తోంది.
సమావేశం బాగా జరిగిందని స్నేహితులు తెలిపారు. ఈ కేసును పోలీసుల వద్దకు తీసుకెళ్లేందుకు తాము సహాయం చేస్తామని ఎన్‌డబ్ల్యుడీఐ ప్రతినిధులు చెప్పారని వారు తెలిపారు.

ఫొటో సోర్స్, Abu Barokat Facebook
అయితే, మూడు వారాల తర్వాత యుస్రోన్‌కు తన సోదరి నుంచి మెసేజ్ వచ్చింది. ఆమెకు తిరిగి ఫోన్ చేయగా యుస్రోన్ ఇంట్లో అబా ఫోన్ ఎత్తారు. దీంతో యుస్రోన్ తయారుచేసిన పత్రాలను అబాకు ఎన్‌డబ్ల్యూడీఐ అందించిందని స్పష్టమైంది.
''ఇది మీడియాకు లీక్ అయితే నేను నాశనమైపోతాను'' అని ఫోన్ సంభాషణలో అబా అన్నారు. యుస్రోన్ ఈ కాల్‌ను రికార్డు చేశారు.
తన కోసం అబద్ధం చెప్పాలని యుస్రోన్‌ను అబా వేడుకున్నారు. తాను సేకరించిన ఆధారాల పత్రాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉపయోగించుకోగల కొన్ని అబద్ధపు కథనాలను కూడా ఆయన యుస్రోన్‌కు చెప్పారు.
ఆ తర్వాత ఆయన జియాకు కూడా ఫోన్ చేసి ఇదే విధంగా ఒత్తిడి చేశారు. యుస్రోన్‌లాగే జియా కూడా ఆ ఫోన్ సంభాషణను రికార్డ్ చేశారు. ఆ సంభాషణలో అబా తాను ఆమెను వేధించిన విషయాన్ని అంగీకరించారు.
ఆ విషయం బయటకు చెప్పకుండా మౌనంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సుక్మాను అబా ఇంటికి పిలిచారు. అప్పుడక్కడ ఇద్దరు పోలీసులు, ఎన్‌డబ్ల్యుడీఐకి చెందిన ఒక న్యాయవాది ఉన్నారని ఆమె తెలిపారు. తన ఆరోపణలన్నీ అబద్ధమని చెప్పే ఒక పత్రంపై సంతకం చేయాలని వారు తనను ఒత్తిడి చేశారని సుక్మా చెప్పారు.
ఆ తర్వాత అబా భార్య హుర్మియాతిని ప్రశ్నిస్తూ సుక్మా రహస్యంగా చేసిన ఫోల్ కాల్ రికార్డింగ్ కూడా ఈ ఆరోపణలకు బలాన్నిచ్చింది.
ఏమీ జరగలేదని చెప్పే తమ ఒప్పందానికి అంగీకరించాలని హుర్మియాతి ఆమెతో చెప్పడం ఆ రికార్డింగ్‌లో వినిపిస్తోంది.
''ఇది జీవితాంతం నిన్ను వెంటాడాలని అనుకుంటున్నావా... ఇది నీ పెళ్లి అవకాశాలను దెబ్బతీయాలని కోరుకుంటున్నావా'' అని ఆమె సుక్మాను ఫోన్‌లో అడిగారు.

యుస్రోన్ తల్లిదండ్రులు కూడా జకర్తాకు వెళ్లి యూనివర్సిటీలో ఉన్న తమ కుమారుడి గురించి తెలుసుకోవాలని అబా కోరడంతో ఈ ఒత్తిడి మరింత పెరిగింది. యుస్రోన్ వారికి కనిపించ లేదు. ఆయన ఒక హోటల్‌లో దాక్కున్నారు.
అయితే ఈ మొత్తం వ్యవహారం యుస్రోన్ తల్లిని తీవ్రంగా కలచివేసింది. ఈ ఒత్తిడి తనను చంపేస్తోందని ఆమె తన కుమారుడితో చెప్పారు.
దీంతో యుస్రోన్‌కు ఇష్టం లేకపోయినా తన దర్యాప్తును ఆపేశారు.
ఇది ఇలా ఉండగానే, నెమ్మదిగా యుస్రోన్, జియాల మధ్య బంధం బలపడింది. వారి స్నేహం ప్రేమగా మారింది. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు.
‘‘ఆమె చాలా ఇబ్బంది పడుతోందని నేను గమనించా. అబా చేసిన పని గురించే నేను మళ్లీ మళ్లీ ఎందుకు ఆలోచిస్తున్నాను అని ఆమెను అడిగేవాడిని’’ అని యుస్రోన్ అన్నారు.
తాను ప్రేమలో పడుతున్న ఆ అమ్మాయికి సహాయం చేయాలా లేక తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా అనే విషయంలో యుస్రోన్ అయోమయంలో పడ్డారు.
ఆ తర్వాత ఎనిమిది నెలలకు, ఇస్లామిక్ స్కూళ్లల్లో లైంగిక వేధింపుల పట్ల అవగాహన కల్పిస్తున్న ఒక బృందం గురించి యుస్రోన్ తెలుసుకున్నారు.
ఆ బృందాన్ని ఆయు మస్రురో అనే యువతి ఏర్పాటు చేశారు. మరో స్కూల్‌కి చెందిన మోచ్ సుబ్చి అజల్ త్సాని అనే ఉపాధ్యాయుడి చేతిలో లైంగిక దాడికి గురైన తన స్నేహితురాలికి న్యాయం దక్కేలా ఆమె అప్పట్లో సహాయపడ్డారు.
దీని గురించి గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో చురుకుగా పోస్ట్ చేయడం ప్రారంభించారు ఆయు.
దీంతో ప్రేరణ పొందిన జియా, వేధింపులకు గురైన ఇండోనేషియా విద్యార్థులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించమని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
అబా తన ప్రవర్తనను మార్చుకుంటానని హామీ ఇచ్చినప్పటికీ, మళ్లీ అదే తప్పు చేశారని ఆమెకు తెలిసింది. జియా చదివే స్కూల్‌కు చెందిన ఒకరు ఆమెను సంప్రదించి, అబా తనను కూడా లైంగికంగా వేధించారని చెప్పారు.
జియా, యుస్రోన్‌లకు ఆయన ఇచ్చిన హామీ తర్వాత దాదాపు ఏడాదికి ఈ వేధింపులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
"అబా నిజానికి అస్సలు మారలేదని నాకు అర్థమయ్యేలా చేసింది. మానేస్తానని ఆయన చెప్పినవన్నీ ఒట్టి అబద్ధాలే" అని జియా అన్నారు.
న్యాయం కోసం జియా, సుక్మా చేస్తున్న పోరాటాన్ని కొనసాగించడంలో వారికి సహాయపడటానికి యుస్రోన్ తల్లిదండ్రులు ఎట్టకేలకు అంగీకరించారు.
కానీ ఈసారి, ఆ ఇద్దరూ దీన్ని భిన్నంగా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వారు ఆయు మస్రురోను సంప్రదించారు. లాయర్ దగ్గరకు వెళ్లాలని ఆమె సూచించారు. లైంగిక వేధింపుల బాధితులకు ప్రాతినిధ్యం వహించడంలో అనుభవజ్ఞుడైన ఒక న్యాయవాదిని ఆమె వారికి పరిచయం చేశారు.
విద్యార్థులు చేసిన ఆరోపణల గురించి స్పందన కోసం హెడ్ టీచర్ అబా, ఆయన భార్య హుర్మియాతిలను బీబీసీ సంప్రదించింది. ఈ ఆరోపణలపై వారు స్పందించలేదు.
ఆ ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని ఎన్‌డబ్ల్యూడీఐ తెలిపింది. లైంగిక వేధింపు ఆరోపణలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన విమర్శలను ఆ సంస్థ ఖండించింది.
కొందరు వ్యక్తుల చేసిన ఈ ఆరోపణల వల్ల సంస్థకు మచ్చ పడకుండా కాపాడాల్సిన బాధ్యత తమకు ఉందని అది పేర్కొంది.
గతేడాది ఫిబ్రవరిలో అబా గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సుక్మా . ఆయనపై చర్యలు తీసుకుంటారేమోనని ఆమె ఇంకా వేచిచూస్తున్నారు. కానీ, అబా ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారు.
‘‘నాకు జరిగింది నేను కోరుకోలేదు, ఇతర విద్యార్థులకు జరగాలని అనుకోవడం లేదు. నాకు న్యాయం కావాలి’’ ఆమె బీబీసీతో అన్నారు.
అయితే, ఈ విచారణ జియా, యుస్రోన్‌లను మరింత దగ్గర చేసింది. మూడేళ్లపాటు మెసేజ్‌లు చేసుకుని, మాట్లాడుకున్న తర్వాత, ఆమెతో కలిసి ఉండటం కోసం కైరోకు వెళ్లాలని గత ఫిబ్రవరిలో యుస్రోన్ నిర్ణయించుకున్నారు.
జియో, యుస్రోన్‌లు ప్రస్తుతం కైరోలో ఉంటున్నారు. తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల నుంచి ఒకరిపై మరొకరం నమ్మకాన్ని పెంపొందించుకున్నామని వారు చెబుతున్నారు.
''నేను అలసిపోయాను. జకర్తాలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే, నేను నా మొత్తం సమయం పోలీసు కేసులతోనే తిరుగుతున్నా. కానీ, ఆ సమయంలో నేను జియాను చూస్తే...అది ఒక మెడిసిన్‌లాగా అనిపిస్తుంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.
అతనితో నిత్యం మాట్లాడుతుండటం తనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుందని జియా చెప్పారు.
''అప్పుడే ఆయన ఈ విషయం (ప్రేమ) లో ఎంత సీరియస్‌గా ఉన్నాడో నాకు అర్థమైంది. సుదూరం నుంచి ఆయన నాకోసం ఈజిప్ట్ వచ్చారు. ఆయనపై నమ్మకం ఉంది. అందుకే ఆయనతో ఉన్నా'' అని తెలిపారు.
న్యాయం కోసం వారు కలిసి చేస్తున్న పోరాటం కూడా వారి మధ్యనున్న ఈ నమ్మకానికి ఒక కారణం. గత నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
విద్యార్థుల ధైర్యం, కచ్చితత్వం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని వారి న్యాయవాది జోకో జుమాడి అన్నారు.
వారు రహస్యంగా సేకరించిన రికార్డింగ్‌లు వారు మౌనంగా ఉండేలా ఒత్తిడికి కారణమయ్యాయని, అవి అత్యంత విలువైనవని ఆయన మాతో చెప్పారు.
"అనేకమంది బాధితుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. బాధితులు ఈ వేధింపుల గురించి చెప్పారు. ఇవి కీలకమైన సాక్ష్యాలు" అని ఆయన అన్నారు.
గత మూడేళ్లుగా, జోకో, ఆయన టీమ్ తమ స్థానిక వెస్ట్ నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌కు సంబంధించి 20 లైంగిక వేధింపుల కేసులను పరిష్కరించారు.
ఇవి కొన్ని కేసులు మాత్రమేనని ఆయన భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























