లిఫ్టు ప్రమాదాలకు కారణమేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలంగాణలో లిఫ్టు పాలసీ ఏమైంది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
హైదరాబాద్‌లో ఓ భవనం రెండో అంతస్తులో లిఫ్టు నుంచి దిగుతున్న సమయంలో ఓ వ్యక్తి గ్రిల్స్‌లో ఇరుక్కుపోయారు. హైడ్రా సిబ్బంది దాదాపు గంటన్నరపాటు శ్రమించి లిఫ్ట్ గోడ బద్దలు కొట్టి ఆయన్ను బయటకు తీశారు.
తెలంగాణలో లిఫ్టు ప్రమాదాలు కొత్తేమీ కాదు, గతంలోనూ తరచూ జరుగుతుండేవి. లిఫ్టులు, ఎస్కలేటర్లకు సంబంధించి రాష్ట్రంలో చట్టం తీసుకువచ్చే ప్రక్రియ గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది.
''చట్టం వస్తే వినియోగదారులు, లిఫ్టుల నిర్వాహకులకు ప్రయోజనం ఉంటుంది'' అని తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా అవినాశ్ బీబీసీతో చెప్పారు.
తెలంగాణలో లిఫ్టుల భద్రతపై 2025లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నేపథ్యంలో లిఫ్టులు, ఎస్కలేటర్ల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చెప్పాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2025 సెప్టెంబరు 9న తెలంగాణలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్‌కు సంబంధించి చట్టం తీసుకు రావడానికి ముసాయిదా విడుదల చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఫొటో సోర్స్, Getty Images
పదేళ్ల నుంచి ప్రతిపాదనలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ముసాయిదా ఇంకా చట్ట రూపం దాల్చాల్సి ఉంది. బిల్లుకు ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన కోసం దాన్ని పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఈ ఏడాది జులైలో తెలంగాణ హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌లో వెల్లడించింది.
తెలంగాణలో లిఫ్టు పాలసీ తీసుకురావాలనే ప్రతిపాదన తొలిసారిగా 2015లోనే తెరపైకి వచ్చింది. కానీ ముందడుగు పడలేదు. ఇటీవల కాలంలో లిఫ్టు ప్రమాదాలు పెరగడంతో 2025లో దానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.
తెలంగాణలో ఏటా సగటున 50 లిఫ్టు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ ఎలివేటర్ల అసోసియేషన్ చెబుతోంది. అయితే బీబీసీ ఈ సంఖ్యను స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.

ఫొటో సోర్స్, teea.org.in
ముసాయిదాలో ఏం ఉన్నాయంటే..
తెలంగాణ తీసుకువచ్చిన ముసాయిదా చట్టంలో కొన్ని ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
''లిఫ్టులను తయారు చేసే కంపెనీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. భవనాలు, ఇళ్లలో ఏర్పాటు చేసిన లిఫ్టులు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్ తప్పనిసరిగా బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిబంధనలకు అనుగుణంగా ఉండాలి'' అని ముసాయిదా బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది ఆమోదం పొంది, అమల్లోకి వస్తే, ప్రభుత్వం నియమించే ఇన్‌స్పెక్టర్ల ద్వారా వార్షిక తనిఖీలు నిర్వహించే వీలు కలుగుతుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులు, ఏజెన్సీల ద్వారా మాత్రమే నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది.
సాధారణంగా ఎవరైనా లిఫ్టుల నిర్వహణ విభాగంలోకి వస్తే కచ్చితంగా 90 రోజులపాటు టెక్నీషియన్లుగా శిక్షణ పొందాల్సి ఉంటుంది.
నిర్వహణ సరిగా లేకనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్ల సంఘం అధ్యక్షుడు బి.నర్సింగ్ రావు బీబీసీతో చెప్పారు.
''సాధారణంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు కొత్తగా పెట్టాక ఏడాదిపాటు ఏఎంసీ (వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్) ఉంటుంది. ఆ సమయంలో కంపెనీల తరఫున సాంకేతిక నిపుణులు వెళ్లి నిర్వహణ పనులు చూస్తుంటారు'' అని ఆయన చెప్పారు.
ఏఎంసీ గడువు ముగిసిన తర్వాతే సమస్యలు మొదలవుతున్నాయని నర్సింగ్ రావు అన్నారు.
''గుర్తింపు లేని ఏజెన్సీలు, వ్యక్తులతో నిర్వహణ లేదా మరమ్మతులు చేయించడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వార్షిక నిర్వహణ సరిగా లేక ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతోంది'' అని చెప్పారు.
సాధారణంగా నెలకోసారి లిఫ్టులను తనిఖీ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
అలాగే ప్రభుత్వం తీసుకువచ్చిన ముసాయిదా బిల్లులో భాగంగా లిఫ్టుల పరంగా ఏవైనా ఇబ్బందులు లేదా కంపెనీల తరఫున నిర్లక్ష్యం ఉంటే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించే అవకాశం కల్పించింది.
ఇదే తరహాలో ఆంధ్ర ప్రదేశ్‌లోనూ 2025 మార్చిలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు, ఎస్కలేటర్ల చట్టం-2025ను ప్రభుత్వం తీసుకువచ్చింది.
తెలంగాణలో తీసుకురావాల్సిన బిల్లు ఎందుకు ఆలస్యమవుతోందో తెలుసుకునేందుకు తెలంగాణ అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్‌ను బీబీసీ ఈమెయిల్ ద్వారా సంప్రదించింది. ఈ విషయంపై ఆయన స్పందన రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, ChallaAvinash
గ్రిల్ తరహా లిఫ్టులతో జాగ్రత్త
''లిఫ్టులో వెళ్లేటప్పుడు అనుకోని ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు ముందుగా అపార్ట్‌మెంట్లు, భవనాల యజమానులు తెలంగాణ ఎలివేటర్ల సంఘంతో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది'' అని చల్లా అవినాశ్ చెప్పారు.
మరోవైపు, లిఫ్టు ప్రమాదాలకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఏడాది జులై 29న కీలక తీర్పు చెప్పింది.
లిఫ్టు ప్రమాదాలకు తయారీదారు, నిర్వహణ ఏజెన్సీ, భవన యజమానులు బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
ప్రమాదాలకు గ్రిల్ తరహా లిఫ్టులు ఎక్కువగా కారణమవుతున్నాయని అవినాశ్ అభిప్రాయపడ్డారు.
''గ్రిల్ తరహా లిఫ్టుల్లో డోర్ సరిగా మూసి ఉందా.. లేదా.. చూడకుండానే లిఫ్టు ఎక్కుతుంటారు. మొబైల్ చూస్తూ లిఫ్టు ఆపరేట్ చేస్తుంటారు. దీనివల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు'' అని ఆయన చెప్పారు.
ఇప్పటికే ముంబయి, బెంగళూరు వంటి చోట్ల గ్రిల్ తరహా లిఫ్టులపై నిషేధం ఉందని తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.నర్సింగ్ రావు చెప్పారు.
''సెకండ్ హ్యాండ్‌లో వస్తోందనో.. తక్కువ ధరకు వస్తోందనో.. లేదా సర్వీసు తక్కువ ధరలో వస్తోందనో.. ఇలా రకరకాల కారణాలతో లిఫ్టుల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం జరుగుతోంది. ఆటో డోర్ సౌకర్యం, భద్రతతో కూడిన లిఫ్టులు భవనాలకు ఏర్పాటు చేయించుకోవడం మంచిది'' అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలంటే..
లిఫ్టు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా అవినాశ్ వివరించారు.
- పిల్లలను ఒంటరిగా లిఫ్టులు ఆపరేట్ చేసేందుకు అనుమతించకూడదు.
- మొబైల్ చూస్తూ, మాట్లాడుకుంటూ లిఫ్టులు ఎక్కడం, దిగడం చేయకూడదు.
- లిఫ్టు మధ్యలో ఆగిపోతే వెంటనే బెల్ లేదా ఫోన్ ద్వారా ఇతరులను అప్రమత్తం చేయాలి. అంతేగానీ, అందులోంచి దిగేందుకు ప్రయత్నించకూడదు. దానివల్ల మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.
- భవనాలకు ఆటోడోర్ లిఫ్టులు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
- లిఫ్టు కంపెనీలకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చూడాలి.
- లిఫ్టు ఏర్పాటు చేసుకునే ముందు సర్వీసు కూడా సదరు కంపెనీ ఇస్తుందో లేదో చూసుకోవాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























