‘మాకు కొత్త జీవితం ఇవ్వండి, లేదంటే కారుణ్య మరణానికి అనుమతివ్వండి’, బిడ్డలను ప్రసవించిన ఈ తల్లులు చావు ఎందుకు కోరుకుంటున్నారు?

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

    • రచయిత, మోహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 9 నిమిషాలు

"మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి లేదా ఆత్మహత్య చేసుకోనివ్వండి."

రాజస్థాన్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌పై ఉన్న ఐదుగురు మహిళలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేసుకున్న విజ్ఞప్తి ఇది. వీరు కారుణ్య మరణానికి అనుమతించాలని కోరారు.

తాము ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లామని, కానీ ఇప్పుడు తమ ప్రాణాలు వారానికి రెండుసార్లు చేసే డయాలసిస్‌పై ఆధారపడి ఉన్నాయని ఈ మహిళలు చెబుతున్నారు.

"మేం డయాలసిస్‌తో ఐదు, ఆరు నెలలు మాత్రమే బ్రతకగలం. మమ్మల్ని ఆత్మహత్య చేసుకోనివ్వండి లేదా మా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించండి" అని ఈ మహిళల్లో ఒకరైన ధాన్లీ సుమన్ అన్నారు.

ఈ మహిళలకు అసలేం జరిగిందనే దానిపై విచారణ జరిగినప్పటికీ, ఆ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. (ఈ వార్త రాసే సమయం వరకు.)

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సిజేరియన్ తర్వాత క్షీణిస్తున్న ఆరోగ్యం

రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మహిళల ఆరోగ్యం క్షీణించడం, చనిపోవడం వంటి ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి.

ఇలా ఎందుకు జరుగుతున్నాయనే కారణాలను మాత్రం ప్రభుత్వం బయటకు రానివ్వడం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

"బీజేపీ ప్రభుత్వం సకాలంలో ప్రతిపక్షాల, బాధితుల గొంతు విని ఉంటే ఇప్పడు ఈ దురదృష్టకరమైన పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే నిస్సహాయ బాధితులు రాష్ట్రపతిని కారుణ్య మరణం కోరాల్సి వస్తోంది" అని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు.

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది.

పదుల సంఖ్యలో బాలింతల మరణం

ఈ విషయంపై ప్రభుత్వ స్పందన తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్, ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖీంవసర్, వైద్య శాఖ కార్యదర్శి గాయత్రి రాథోడ్‌లను సంప్రదించడానికి బీబీసీ పలుమార్లు ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు.

రెండున్నర నెలలుగా రాజస్థాన్‌లోని కోటా, బికనేర్, జోధ్‌పూర్, భిల్వారా, బాన్స్‌వారా జిల్లాల్లో ప్రసవానంతరం మహిళల ఆరోగ్యం క్షీణిస్తోందని, కొందరు మరణిస్తున్నట్లు కథనాలొచ్చాయి.

మే 4 నుంచి మే 7 మధ్య కోటాలో ఈ ఘటనలు మొదలయ్యాయి. ప్రసవ నొప్పులతో 18 మంది మహిళలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ మహిళలు సిజేరియన్ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చారు.

"వారిలో ఐదుగురు మహిళలు మరణించారు. ప్రస్తుతం మరో ఐదుగురు మహిళలు డయాలసిస్ చేయించుకుంటున్నారు" అని కోటాలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ న్యూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలేశ్ జైన్ బీబీసీతో చెప్పారు.

కోటాకు చెందిన ఈ ఐదుగురు మహిళల కిడ్నీలు పనిచేయకపోవడంతో వారికి గత 72 రోజులుగా వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు.

కోటా తర్వాత బికనేర్‌లో కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి. ఐదుగురు మహిళలు మరణించారు.

జోధ్‌పూర్‌లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే, అక్కడ ప్రాణనష్టం లేదు.

ఇటీవల భిల్వారాలో ఐదుగురు, బాన్స్‌వారాలో నలుగురు మహిళలు చనిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, కారణ్య మరణానికి అనుమతివ్వాలని కోరుతూ మహిళలు రాష్ట్రపతికి లేఖ రాశారు.

దర్యాప్తు కమిటీలు వేసినా తేలని కారణాలు

ఈ ఘటనలతో ప్రజలు ఆందోళనల బాటపట్టారు. దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది.

ప్రజా నిరసనలు చెలరేగాయి. విచారణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లను మూసివేశారు. నమూనాలను పరీక్షల కోసం పంపించారు.

దిల్లీ ఎయిమ్స్, జైపుర్ నిపుణుల బృందాలు నమూనాలను పరీక్షించాయి. ఆస్పత్రులను పరిశీలించాయి.

కానీ, రెండు నెలలు గడచినా దర్యాప్తు నివేదికలో ఏం తేలిందో ప్రభుత్వం వెల్లడించలేదు.

ఇటీవల కోటాలో ఈ మహిళలను కలిసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా దర్యాప్తు నివేదికలోని నిజాలను ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు.

ప్రసూతి శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించే కొన్ని మందులను కూడా నిషేధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వైద్య శాఖ వెంటనే చర్యలు చేపట్టి ఇద్దరు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేసింది.

"అన్ని ఘటనలను ఒకే కారణానికి ముడిపెట్టడం సరికాదు" అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖీంవసర్ అన్నారు.

"తీవ్రమైన అధిక రక్తపోటు, అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు పలు సందర్భాల్లో నమోదయ్యాయని, ఇవి కాలేయం, మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు" అని మంత్రి చెప్పారు.

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని బాధిత మహిళలు చెప్పారు.

రాష్ట్రపతికి రాసిన లేఖలో ఏముందంటే..

మొత్తం 11 మంది తల్లుల్లో ఐదుగురు మరణించారని, మరో ఐదుగురికి కిడ్నీలు పనిచేయకపోవడంతో నిరంతరం డయాలసిస్ చేయించుకుంటున్నారని న్యూ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలేశ్ జైన్ బీబీసీకి తెలిపారు.

ఈ ఐదుగురు మహిళలు గత 72 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన చెప్పారు.

ఈ మహిళలు తమ నవజాత శిశువులను కనీసం చూడలేకపోయారు. వీరు కోటాలోని సాధారణ కుటుంబాలకు చెందినవారు.

ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాగిణి మీణా, ధాన్లీ సుమన్, పింకీ ఏర్వాల్, ఆర్తి చోబ్దార్, సుశీల మహావార్ రాష్ట్రపతికి లేఖ రాశారు.

ఆ లేఖను స్పీడ్ పోస్ట్ ద్వారా రాష్ట్రపతికి పంపారు.

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, ఐదుగురు మహిళలు రాష్ట్రపతికి లేఖ రాశారు.

"మేం శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కిడ్నీలు పాడవడం వల్ల గత రెండు నెలలుగా ప్రతి 24 గంటలకు 500 మిల్లీలీటర్ల నీటితోనే బతుకుతున్నాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. ప్రతి 48 గంటలకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. మా భర్తల ప్రైవేట్ ఉద్యోగాలు పోయాయి. ఇలాంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో, గౌరవప్రదమైన జీవితం గడపడానికి మాకు మార్గం లేదు" అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

''మాకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించి, మాకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాకు తగిన నష్టపరిహారం అందించాలి. ప్రభుత్వ యంత్రాంగం మాకు న్యాయం అందించలేకపోతే, గౌరవప్రదంగా మా జీవితాలను ముగించుకోవడానికి కారుణ్య మరణానికి మాకు అనుమతి ఇవ్వాలి" అని బాధిత మహిళలు విజ్ఞప్తి చేశారు.

"ఐదుగురు మహిళలు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారు తమ కిడ్నీ మార్పిడి ఉచితంగా, త్వరగా జరగాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత చేసే చికిత్స కూడా ఉచితంగానే అందించాలని కోరుతున్నారు" అని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలేశ్ జైన్ బీబీసీతో ఫోన్‌లో చెప్పారు.

"డయాలసిస్‌తో మేమెంతకాలం బతుకుతాం. మహా అయితే ఆర్నెళ్లు" అని ధాన్లీ సుమన్ ఏడుస్తూ మీడియాతో అన్నారు.

"డయాలసిస్ చేయించుకోవడం కన్నా చనిపోవడమే మేలు. డయాలసిస్ వల్ల వాంతులు, జ్వరం, తల, చేతులు, కాళ్ళలో భరించలేని నొప్పి వస్తాయి. మా కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మేమెంత బాధపడుతున్నామో మాకే తెలుసు. అందుకే మేము కారుణ్య మరణానికి అనుమతి కోరుతున్నాం" అని రాగిణి అనే మరో మహిళ బీబీసీతో ఫోన్‌లో చెప్పారు.

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, బాధితులను రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పరామ్శించారు.

డయాలసిస్‌కు నిరాకరించిన మహిళలు

బాధిత మహిళలు జులై 13న డయాలసిస్‌ చేయించుకోబోమని ఆస్పత్రి యాజమాన్యానికి తెలిపారు. ఆ తర్వాత వారు జులై 15న రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. తర్వాతే అధికారులు మహిళల సమస్యపై స్పందించారు.

కోటా అదనపు జిల్లా కలెక్టర్ వినోద్ మల్హోత్రా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలేశ్ కుమార్ జైన్, నెఫ్రాలజీ విభాగం హెచ్‌ఓడి డాక్టర్ వికాస్ ఖండేలియా జులై 16న మహిళలతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

"మేం ఆస్పత్రి, జిల్లా యంత్రాంగంతో మాట్లాడాం. లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే మహిళలు డయాలసిస్ చేయించుకున్నారు" అని రాగిణి మీణా భర్త లోకేశ్ మీణా బీబీసీతో చెప్పారు.

"బాధితులకు డయాలసిస్, ఇతర వైద్య సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా అందిస్తామని, దీంతో పాటు బాధితుల కుటుంబ సభ్యుల సౌలభ్యం మేరకు, జోధ్‌పూర్ ఎయిమ్స్‌తో సహా రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలోనైనా కిడ్నీ మార్పిడి, ఆ తర్వాత చేసే చికిత్స అంతా ఉచితంగా అందిస్తాం" అని హామీ పత్రంలో ఉంది.

"డయాలసిస్ శరీరాన్ని చల్లగా మారుస్తుంది, వాంతులవుతాయి. తల తిరుగుతుంది. శరీరం పూర్తిగా బలహీనమవుతుంది" అని మీడియాతో మాట్లాడుతూ, ఏడుస్తూ ధాన్లీ తన బాధను వ్యక్తం చేశారు.

"కిడ్నీ మార్పిడి కోసం ఒక మెడికల్ బోర్డు ఉంది. మేం ఈ ప్రతిపాదనను ఆరోగ్య శాఖకు పంపించాం" అని కోటా జిల్లా కలెక్టర్ పీయూష్ సామరియా బీబీసీకి తెలిపారు.

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

ఫొటో క్యాప్షన్, కుటుంబ సభ్యులతో బాధిత మహిళలు ధాన్లీ సుమన్, ఆర్తీ చౌబ్‌దార్, పింకీ ఏర్వాల్

పసికందులకు దూరమైన తల్లులు

రాగిణి మీణాకు ఇదివరకే ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇప్పుడు ఆమె మూడవ బిడ్డకు జన్మనిచ్చారు. అనారోగ్యం కారణంగా ఆమె తన కుమారుడి ముఖం కూడా చూడలేకపోతున్నారు. ఆమె సోదరుడు వికాస్ ఆసుపత్రిలోనే ఉన్నారు.

"మా సోదరి మే 4న బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని గంటల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మే 7న డయాలసిస్ ప్రారంభించారు" అని వికాస్ బీబీసీకి తెలిపారు.

"మా అక్క ఆసుపత్రికి వచ్చినప్పుడు 63 కేజీలు బరువు ఉండేది. ఇప్పుడు మా అక్క బరువు 41 కేజీలకు తగ్గింది. ఆమె అత్తమామలు శిశువును చూసుకుంటున్నారు" అని వికాస్ చెప్పారు.

"నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాణ్ని. మొదట్లో మెడికల్ లీవ్‌లో ఉన్నాను. కొన్ని రోజులు సెలవులో ఉండడంతో నా జీతానికి కోతపెట్టారు. ఇప్పుడు నా ఉద్యోగం పోయింది. కుటుంబం మొత్తం నా జీతంపైనే ఆధారపడి ఉంది" అని రాగిణి భర్త లోకేశ్ చెప్పారు.

ఈ పరిస్థితి కేవలం రాగిణి కుటుంబానిదే కాదు మొత్తం ఐదు కుటుంబాల పరిస్థితీ ఇలాగే ఉంది.

"మాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ సిజేరియన్ ద్వారానే పుట్టారు. మూడో బిడ్డ పుట్టిన కొద్ది గంటలకే ఆ బిడ్డను తల్లి నుంచి వేరుచేయాల్సి వచ్చింది. ధాన్లీ సుమన్ ఎంత బాధపడుతోందో కూడా నేను అర్ధం చేసుకోలేను'' అని ఆమె భర్త అన్నారు.

"మే 4 సాయంత్రం 5 గంటలకు ధాన్లీ బిడ్డకు జన్మనిచ్చారు. అప్పుడు ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ రాత్రి కూడా ఎలాంటి సమస్యాలేదు. జులై 5, తెల్లవారుజామున 5 గంటల సమయంలో తీవ్ర రక్తస్రావం అయింది. ధాన్లీ సుమన్‌కు మరో ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆమెను గైనకాలజీ వార్డుకు తరలించారు. అక్కడ సాయంత్రానికి ఆమెకు కామెర్లు వచ్చాయి" అని తెలిపారు.

"ఆ రాత్రే ఆమెను నేరుగా నెఫ్రాలజీ విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచారు. నాలుగు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఐసీయూలో ఉన్నప్పుడు ఒకసారి మాత్రమే బిడ్డను చూశారు. ఆ తర్వాత మళ్లీ చూడలేకపోయారు. బిడ్డను పిన్ని చూసుకుంటున్నారు" అని చెప్పారు.

"ఇది మా మొదటి బిడ్డ. సుశీల ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. నిన్న బిడ్డను కూడా ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. తల్లిపాలు అందకపోవడంతో రెండున్నర నెలల బిడ్డకు పాలపొడితో పాలు పట్టించాం. దానివల్ల బిడ్డ కడుపులో గడ్డ ఏర్పడింది" అని సుశీల భర్త ఓం ప్రకాశ్ బీబీసీతో ఫోన్‌లో చెప్పారు.

రాజస్థాన్, ప్రసవం, ఆస్పత్రి, డయాలసిస్, రాష్ట్రపతి

ఫొటో సోర్స్, Mohar Singh Meena

మౌలిక సదుపాయాలపై ప్రశ్నలు

ఇది చాలా తీవ్రమైన విషయమని రాజస్థాన్‌లో మహిళల ఆరోగ్య సమస్యలపై పనిచేస్తున్న 'జన్ స్వాస్థ్య అభియాన్ రాజస్థాన్' సమన్వయకర్త ఛాయా పచౌలి బీబీసీతో అన్నారు.

"కోటా, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రసూతి మరణాల ఘటనలను కేవలం ఆస్పత్రుల నిర్లక్ష్యంగా కొట్టిపారేయలేం. అవి క్షేత్రస్థాయి నుంచి వైద్య కళాశాలల వరకు మన ప్రసూతి ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి."

"ప్రమాదకర గర్భాలను ముందే గుర్తించడం, పర్యవేక్షించడం, సకాలంలో పెద్ద ఆస్పత్రులకు సిఫార్సు చేసే వ్యవస్థ ఎందుకు సమర్థవంతంగా లేదు అన్నదే ప్రశ్న.

మహిళలకు చికిత్స అందించిన ఆస్పత్రుల్లో నిర్దేశించిన అన్ని నియమ నిబంధనలు పాటించారా లేదా, తగినంత మంది నిపుణులైన వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారా లేదా, రోగులకు నాణ్యమైన మందులు అందించారా లేదా వంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం" అని ఛాయా పచౌలి అన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉండి ఉంటే, ఎంతో మంది మహిళల ప్రాణాలను కాపాడటంతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా నివారించగలిగే వారని ఆమె అంటున్నారు.

"అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ఘటనలపై దర్యాప్తు చేసిన నిపుణుల కమిటీల నివేదికలను ఇంకా బహిర్గతం చేయలేదు. ఈ కమిటీల్లో ఎయిమ్స్ దిల్లీ బృందం కూడా ఉంది."

ప్రభుత్వం పారదర్శకత పాటించి ఈ నివేదికలను బహిరంగపరచాలని పచౌలి డిమాండ్ చేశారు. తద్వారా మరణాలకు గల అసలు కారణాలు తెలుస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించవచ్చని అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)