కాబుల్ మహాగణపతి: అఫ్గానిస్తాన్‌లో ఒకప్పుడు కనిపించిన ఈ విగ్రహం ఇప్పుడు ఏమైంది, ఇది చెప్పిన రహస్యాలేంటి...

ఫొటో సోర్స్, Archaeological Survey of India
- రచయిత, జాహ్నవి మూలె
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
అది 1956, మే నెల. భారత ప్రభుత్వ పురావస్తు శాఖకు చెందిన ఓ బృందం అఫ్గానిస్తాన్ వెళ్లింది.
కాబూల్‌లో ఈ బృందానికి భారత్‌లో ఒక దేవుడికి సంబంధించిన చరిత్రలో ఓ కొత్త, కీలక అధ్యాయాన్ని చేర్చే సమాచారం లభించింది.
కాబూల్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గార్డెజ్ సమీపంలో 20వ శతాబ్దంలో లభించిన పాలరాతి గణేశుడి విగ్రహం గురించి బృంద సభ్యులకు సమాచారం అందింది.
ఈ విగ్రహాన్ని కాబూల్‌లోని పీర్ రతన్ నాథ్ మందిరంలో ప్రతిష్ఠించారు.
ఆ నగరంలో నివసించే హిందువులు దీనిని పూజించేవారు.

1956లో అఫ్గానిస్తాన్ వెళ్లిన ఈ బృందంలో పురావస్తు శాఖకు చెందిన ఇద్దరు అధికారులు టీఎన్ రామచంద్రన్, వైడీ శర్మ ఉన్నారు.
ఈ ఇద్దరు అధికారులు ఈ విగ్రహానికి సంబంధించిన నివేదికను న్యూదిల్లీలో సమర్పించారు.
విగ్రహం పరిమాణం, నిర్మాణంతో పాటు దాని కింద చెక్కిన అక్షరాలని కూడా ఆ నివేదికలో పొందుపరిచారు.
ఆ తర్వాత కూడా అఫ్గానిస్తాన్, ముఖ్యంగా ఆ దేశ తూర్పు ప్రాంతంపై పరిశోధనలు చేసిన పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ విగ్రహం గురించి రాశారు.
చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త మధుకర్ కేశవ్ ధవళీకర్ ఈ విగ్రహాన్ని ప్రస్తావిస్తూ "ఈ విగ్రహం ఇండో అఫ్గాన్ కళకు ఉదాహరణ. ఇది తక్కువ నాణ్యత ఉన్న పాలరాతితో తయారు చేశారు. దీని ఎత్తు 24 అంగుళాలు, వెడల్పు 14 అంగుళాలు" అని రాశారు.
విగ్రహంలో దేవుడు నిల్చుని ఉన్నట్లు కనిపిస్తాడు. ఆయనకు ఏనుగు తల ఉంటుంది. తొండం విరిగిపోయింది. అయితే అది ఎడమవైపు వంగి ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆ దేవుడికి నాలుగు చేతులు ఉన్నాయి. కాని అవి కూడా విరిగిపోయాయి.
నడుము చుట్టూ పులి చర్మం కట్టుకున్నట్లు ఉంది. మెడ చుట్టూ పాముని చుట్టినట్టు ఉంది.
విగ్రహానికి పెద్ద పొట్ట ఉంది. ఇది గణపతి లంబోదర రూపాన్ని గుర్తుకు తెస్తుంది.
విగ్రహానికి ఉన్న బలమైన చేతులు, విశాలమైన భుజాలు ఇండో గ్రీకు కళ ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. తలపై ధరించిన కిరీటం పర్షియన్ లేదా ఇరానియన్ కళకు దగ్గరగా ఉంటుంది. ఈ కిరీటాన్ని ఒక రిబ్బన్‌తో కట్టారు.
అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు, కళా చరిత్రకారులు ఈ విగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉందని భావిస్తారు.
ఈ విగ్రహం భారతీయ, గాంధార అంటే ఇండో గ్రీకు, పర్షియన్ సంస్కృతుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కాబూల్ 'మహావినాయకుడి' విగ్రహం ఎంత పురాతనమైంది?
ముందుగా ఈ విగ్రహాన్ని ఒక దేవుడిదని ఎలా గుర్తించారో తెలుసుకుందాం. నిజానికి విగ్రహం అడుగు భాగంలో రెండు పంక్తుల అక్షరాలను చెక్కనట్లుగా ఉంది. చరిత్రకారులు డీసీ సర్కార్ దీన్ని అధ్యయనం చేశారు.
ఆయన ప్రకారం ఈ శాసనం సంస్కృత భాషలో, బ్రాహ్మీ సిద్ధమాత్రిక లిపిలో రాసి ఉంది.
అందులో కొన్ని వ్యాకరణ దోషాలు ఉన్నాయి. కొన్ని పదాల అర్థాన్ని కూడా చిత్రాల ఆధారంగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.
అయితే ఆ దాని సారాంశం ఇంచుమించు ఇలా ఉంది:
"మహారాజాధిరాజ శాహీ ఖింగల్ తన పాలనలో ఎనిమిదో సంవత్సరంలో మహాజ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష త్రయోదశి రోజున, విశాఖ నక్షత్రంలో, సింహ లగ్నంలో ఈ మహావినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు"
ఖింగల్ రాజు ఎవరు అనే విషయంలో పురావస్తు శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు.
క్రీ.శ. ఐదో, ఆరో శతాబ్దాల్లో హూణుల కాలంలో ఈ ప్రాంతాన్ని ఖింగల్ పేరుతో కనీసం ఇద్దరు రాజులు పాలించినట్లు ఆధారాలు ఉన్నాయి.
విగ్రహ నిర్మాణ కళ, చెక్కి ఉన్న రాత లిపిని పరిశీలించిన నిపుణులు ఇది ఐదు లేదా ఆరో శతాబ్దానికి చెందినదై ఉండవచ్చని అంచనా వేశారు.
చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త మధుకర్ కేశవ్ ధవళీకర్ అంచనా ప్రకారం ఈ విగ్రహం ఐదో శతాబ్దపు ఆఖరి సంవత్సరాలకు చెందినది.
అయితే కాబూల్‌లో పురావస్తు శాస్త్రవేత్తలకు లభించిన గణేశుడి విగ్రహం ఇదొక్కటే కాదు.
1956లో సమర్పించిన నివేదికలో మరో విగ్రహం గురించి కూడా ప్రస్తావించారు.
ఈ రెండో విగ్రహం కాబూల్‌కు ఉత్తరాన సుమారు 10 మైళ్ల దూరంలో ఉన్న సక్కర్ ధర్ అనే ప్రదేశంలో లభించింది. చారిత్రకంగా ఈ ప్రాంతాన్ని శంకర్ ధర్గా భావిస్తారు. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని కాబూల్‌లోని జాతీయ మ్యూజియానికి తరలించారు.
ఈ విగ్రహం నాలుగో శతాబ్దం మధ్యకాలానికి చెందినదై ఉండవచ్చని ధవళీకర్ అంచనా వేశారు.

ఫొటో సోర్స్, Archaeological Survey of India
కాబూల్ గణపతికి ఆ తర్వాత ఏమైంది?
సక్కర్ ధర్, గార్డెజ్ ప్రాంతాల్లో లభించిన గణేశుడి విగ్రహాల కథ చదివినప్పుడు సహజంగానే ఓ ప్రశ్న తలెత్తుతుంది. ఈ విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?
దురదృష్టవశాత్తూ దీనిపై కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.
సోవియట్ దళాలు అఫ్గానిస్తాన్‌పై దాడి చేసిన తర్వాత గార్డెజ్ విగ్రహాన్ని కాబూల్‌లోని జాతీయ మ్యూజియానికి తరలించినట్లు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.
అయితే 1996 తర్వాత తాలిబన్ల పాలనలో ఈ మ్యూజియం తీవ్రంగా ధ్వంసమైంది.
అనేక విగ్రహాలు ధ్వంసమయ్యాయి లేదా దొంగిలించారు. అందుకే ఇప్పుడు ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈ విగ్రహాలను గణేశుడికి సంబంధించిన అత్యంత పురాతన విగ్రహాలు, చిత్రాల్లోవిగా పరిగణిస్తారు.
నేడు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పూజించే గణపతి రూపంతో పోలిస్తే ఈ విగ్రహాలు కొంత భిన్నంగా కనిపించవచ్చు.
అంటే గణపతి అక్కడికి భారత్ నుంచి వెళ్లాడా? లేక గణేశుడి ఆరాధించే సంప్రదాయం అక్కడి నుంచే భారత్‌కు వచ్చిందా?
గణపతి ఆరాధన ఎక్కడ ప్రారంభమైందనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పలేం.
అయితే కాలక్రమేణ ఆయన ఆరాధన, రూపం ఎలా మారుతూ వచ్చాయో మతపరమైన గ్రంథాల్లో చూడచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
గణపతి రూపం ఎలా మారింది?
గణేశుడి హారతి తర్వాత పఠించే మంత్రాల్లో ఋగ్వేదంలోని కొన్ని శ్లోకాలు ఉంటాయి.
సాధారణంగా పఠించే మొదటి మంత్రంలోనే గణపతి పేరు వస్తుంది.
మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ మంత్రాన్ని విని ఉండవచ్చు. "గణానాం త్వా గణపతిం హవామహే."
అయితే ఋగ్వేదంలో ప్రస్తావించిన గణపతి నేటి ఏనుగు తల ఉన్న గజాననుడు కాదు. అక్కడ గణపతి అంటే బృహస్పతి దేవుడు.
ఋగ్వేదంలో ప్రధానంగా కుబేరుడు, ఇంద్రుడు, అగ్ని వంటి దేవతల గురించి ప్రస్తావన ఉంటుంది.
అయితే ఋగ్వేదం తర్వాత రాసిన గ్రంథాల్లో మరెన్నో దేవతల ప్రస్తావన కనిపించడం ప్రారంభమైంది. క్రీ.పూ. ఐదో శతాబ్దంలో మతపరమైన ఆచారాలపై 'మానవగృహ్యసూత్రం' అనే గ్రంథం రాశారు.
అందులో హస్తిముఖ, వక్రతుండ, దంతిన్, లంబోదర అనే నలుగురు వినాయకుల ప్రస్తావన ఉంది.
తర్వాత కాలంలో ఈ నలుగురు వినాయకుల రూపాలు ఒకే వినాయకుడి రూపంలో కలిసిపోయాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
కాలక్రమేణ గణపతి రూపం, ఆయనకు ఆపాదించిన లక్షణాలు కూడా మారుతూ వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
కాబూల్‌లోని జాతీయ మ్యూజియం. తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి అక్కడి కళాఖండాల భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పురావస్తు శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త కురుష్ ఎఫ్. దలాల్ "మొదట్లో గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు కాదు. విఘ్నాలు కలిగించే దేవుడిగా ఆయనను భావించేవారు" అని చెప్పారు.
"మీరు ఆయనకి ప్రాధాన్యం ఇవ్వకపోతే, ఆయన మీ మార్గంలో సమస్యలు సృష్టిస్తారనే నమ్మకం ఉండేది. అందుకే ముందుగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం ముఖ్యంగా భావించేవారు."
"అయితే కాలక్రమేణ గణపతి రూపం క్రమంగా మారిపోయింది" అని ఆయన అంటారు.
రచయిత, పురాణాల నిపుణులు దేవదత్త పట్నాయక్ తన '99 థాట్స్ ఆన్ గణేశ' పుస్తకంలో గణపతి రూపం, ఆయన ఆరాధనా పద్ధతుల్లో వచ్చిన మార్పుల గురించి రాశారు.
గతంలో హిందువులు యజ్ఞాలు చేసేవారని పట్నాయక్ వివరిస్తారు. దేవతలను ఆహ్వానించేందుకు మంత్రాలు పఠించి, అగ్నిలోకి నైవేద్యాలు సమర్పించేవారు.
అయితే క్రమంగా సామాన్య ప్రజల్లో కొత్త రకమైన ఆరాధన ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రజలు విగ్రహాలను పూజించడం ప్రారంభించారు.
"క్రీ.పూ. 326లో అలెగ్జాండర్ భారత్‌పై దాడి చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మౌర్య సామ్రాజ్యం దేశంలోని పెద్ద భాగానికి విస్తరించింది."
"ఆ కాలానికి చెందిన అనేక ఇండో గ్రీకు నాణేలపై ఏనుగులు లేదా ఏనుగు ఆకారంలోని బొమ్మలు కనిపిస్తాయి. అందుకే గణేశుడి విగ్రహ రూపం గ్రీకు సంస్కృతి ప్రభావంతో ఏర్పడి ఉండవచ్చని చాలామంది భావిస్తారు." అని ఆయన రాశారు.
గ్రీకులు భారత్‌కు రావడానికి ముందే ఈజిప్టును స్వాధీనం చేసుకున్నారని పట్నాయక్ పేర్కొన్నారు.
ఈజిప్టులో మానవ శరీరంతో పాటు కొంత భాగాన్ని జంతువు ఆకారంలో చూపించిన అనేక దేవతల చిత్రాలు కనిపిస్తాయి.
విభిన్న సంస్కృతుల సమ్మిళిత ప్రభావంతో ఏనుగు తల ఉన్న దేవుడి ఆరాధన ఉద్భవించి ఉండవచ్చని భావించవచ్చు.
"తర్వాత రోమన్ సామ్రాజ్య కాలంలో వాణిజ్యం కారణంగా రోమన్లు కూడా భారత్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నారు" అని పట్నాయక్ రాశారు
"రోమన్ దేవుడు జానస్, గణేశుడి లక్షణాల్లో కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరికీ విఘ్నాలు, మార్పులతో సంబంధం ఉంది. గ్రీకు, రోమన్, ఈజిప్షియన్ దేవతలు భారతీయుల గణేశుడి భావన, చిత్రణపై ఏదైనా ప్రభావం చూపాయా అనేది మనం కేవలం ఊహించగలం" అని పట్నాయక్ అంటారు.
ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుల కాలంలో హిందూ మతంలో అనేక మార్పులు జరిగాయి. ఈ కాలంలో శైవ, శాక్త, వైష్ణవ, సౌర, గాణపత్య సంప్రదాయాల ప్రభావం కనిపించడం ప్రారంభమైంది.
10వ శతాబ్దం తర్వాత గణపతిని ప్రధాన దైవంగాగా భావించే గాణపత్య సంప్రదాయం విస్తరించింది.
ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లో గణపతి ఆలయాల నిర్మాణం ప్రారంభమైన కొద్దీ దేవుడి రూపం కూడా మారుతూ వచ్చిందని కురుష్ దలాల్ వివరిస్తారు.
"గణపతి కూడా సాత్విక రూపాన్ని సంతరించుకున్నాడు. మహారాష్ట్రలో ఆయన పీష్వాలు, బ్రాహ్మణులకు ప్రధాన దేవతగా మారాడు. శివుడు, పార్వతిల కుమారుడైన గణపతి శాకాహార దేవుడిగా కూడా మారాడు" అని చెప్పారు.
గణపతి సంస్కృతుల సమ్మేళనం
బౌద్ధంలోని కొన్ని సంప్రదాయాల్లో కూడా వినాయకుడి ప్రస్తావన ఉంది.
ముఖ్యంగా టిబెట్‌లోని వజ్రయాన బౌద్ధ సంప్రదాయంలో వినాయకుడిని విఘ్నాలు కలిగించే దేవుడిగా భావిస్తారు.
బోధిసత్వుడు అవలోకితేశ్వరుడు వినాయకుడిని ఓడించినట్లు చెప్పే కథలు కూడా ఉన్నాయి.
బౌద్ధంతో పాటు గణపతి తూర్పు దేశాలకు చేరుకున్నాడు. జపాన్‌లో కూడా గణేశుడిని పూజించేవారు. గణేశుడి రూపంలో కనిపించే వివిధ సంస్కృతుల ఈ సమ్మేళనం నిపుణుల దృష్టిలో ఎంతో ముఖ్యమైంది.
దీనిపై చరిత్రకారులు ఆనంద్ కానిత్కర్తో బీబీసీ మాట్లాడింది.
కానిత్కర్ ప్రదయ హెరిటేజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థకు డైరెక్టర్. అఫ్గానిస్తాన్‌లోని బామియాన్, హెరాత్ ప్రాంతాల్లో యునెస్కో ప్రాజెక్టులపై కూడా ఆయన పనిచేశారు.
"భారత చరిత్రను పరిశీలించేటప్పుడు అప్పట్లో నేటిలా సరిహద్దులు లేవనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి" అని చెప్పారు.
"మగధ నుంచి గాంధారంలోని తక్షశిల వరకు వాణిజ్య మార్గాల ద్వారా అప్పటికే సంబంధాలు ఉండేవి."
"గాంధారం నుంచి ఉత్తర అఫ్గానిస్తాన్ లోని బాల్ఖ్ వరకు కూడా వాణిజ్య మార్గాల ద్వారా సంబంధాలు ఉండేవి."
"కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతాలన్నీ ఒకే పాలన కింద ఉండేవి. అందువల్ల అక్కడ భారతీయ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం ఆశ్చర్యకరం కాదు."
బాల్ఖ్ నుంచి పాటలీపుత్ర వరకు పాలించిన కుషాణ రాజుల నాణేలపై ఇరానియన్, భారతీయ, గ్రీకు దేవతల చిత్రాలు కనిపిస్తాయని కూడా కానిత్కర్ చెబుతున్నారు.
"ప్రాచీన చరిత్రను పరిశీలిస్తే ఏదీ పూర్తిగా విడివిడిగా, ఒకదానితో మరొకటి సంబంధం లేని భాగాలుగా ఉండేది కాదని తెలుస్తుంది" అని ఆయన చెప్పారు.
"అఫ్గానిస్తాన్‌లో పశ్చిమం నుంచి వచ్చిన ఇరానియన్ సంస్కృతి, స్థానిక గ్రీకు రాజుల గ్రీకు సంస్కృతి, ఉత్తరం నుంచి వచ్చిన మధ్య ఆసియా సంస్కృతి, ఆగ్నేయం నుంచి వచ్చిన భారతీయ సంస్కృతి కలుసుకున్నాయి."
"అందుకే గార్డెజ్‌లో లభించిన ఈ గణేశుడి విగ్రహంపై గ్రీకు, ఇరానియన్ కళల ప్రభావం కనిపిస్తుంది" అని ఆయన అన్నారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























