‘‘డయానా మరణ వార్త విని ప్రిన్స్ చార్లెస్ అమితానందానికి లోనయ్యారు, లాటరీ గెలిచినట్లు ఫీలయ్యారు’’ అంటూ డయానా సోదరుడు రాసిన పుస్తకంపై వివాదం ఏంటి?

యువరాణి డయానా మరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ డయానా
    • రచయిత, షాన్ కూలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

వేల్స్ యువరాణి డయానా విషాదకర మరణం మిగిల్చిన గాయం ఇప్పటికీ బ్రిటిష్ రాజకుటుంబానికి అత్యంత సున్నితమైన అంశంగానే ఉంది. డయానా సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ తాజాగా విడుదల చేసిన పుస్తకం ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.

డయానా మరణించి దాదాపు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, పుస్తకంలోని ఆరోపణలకు బకింగ్‌హామ్ ప్యాలెస్ తీవ్రమైన ఆగ్రహంతో స్పందించడం ఈ విషయం ఇప్పటికీ ఎంత ప్రాధాన్యమైనదో సూచిస్తోంది.

డయానా మాజీ భర్త, అప్పటి ప్రిన్స్ చార్లెస్ ఆమె మరణంపై సానుభూతి లేకుండా స్పందించారన్న ఆరోపణలను రాజభవనం ఖండించింది.

1997 వేసవి చివర్లో జరిగిన పరిణామాలు రాజకుటుంబం ప్రజలకు దూరంగా ఉందన్న భావనను కలిగించాయి. డయానా మరణంతో ప్రజలు తీవ్రంగా కలత చెందినా, రాజకుటుంబం వారి బాధను అర్థం చేసుకోలేకపోతోందన్న అభిప్రాయం ఏర్పడింది. రాజకుటుంబం ప్రజల మద్దతు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

రాజకుటుంబం తమ వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొంటూనే, ప్రజాప్రతిష్ఠకు సంబంధించిన సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంది. 'పీపుల్స్ ప్రిన్సెస్'గా ప్రజల అభిమానాన్ని పొందిన డయానా పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించడంతో, ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహానికి రాజకుటుంబమే కేంద్రంగా మారే ప్రమాదం ఏర్పడింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"అప్పటి పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రజలు ఇంత భావోద్వేగానికి గురవుతారని, రాజకుటుంబం పట్ల ఇంత వ్యతిరేకత ఉంటుందని ఎవరూ ఊహించలేదు. డయానాతో రాజకుటుంబం సరిగ్గా వ్యవహరించలేదని ప్రజలు భావించారు" అని రాజకుటుంబంపై రచనలు చేసే ‘వాలెంటైన్ లో’ (వ్యక్తి పేరు) గుర్తుచేసుకున్నారు.

డయానా అంత్యక్రియలు జరిగిన వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఉన్న వాలెంటైన్, ఆ రోజు ఎర్ల్ స్పెన్సర్ చేసిన ఎమోషనల్ ప్రసంగానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను గుర్తుచేసుకున్నారు.

"నాకు ఒక శబ్దం వినిపించింది. అదేంటో మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత స్పీకర్ల ద్వారా ప్రసంగాన్ని వింటున్న ప్రాంగణం బయట ఉన్న జనసమూహం నుంచి ఆ శబ్దం వస్తోందని అర్థమైంది" అని ఆయన చెప్పారు.

యువరాణి డయానా మరణం

ఫొటో సోర్స్, Liba Taylor/CORBIS/Corbis via Getty Images

"ఆ శబ్దం ప్రాంగణం రాతి గోడలను దాటి లోపలికి వచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత లోపల ఉన్న ప్రజలు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. చార్లెస్, మొత్తం రాజకుటుంబం ఎదుట అలా జరగడం అసాధారణమైన విషయం" అని ఆయన అన్నారు.

డయానా మరణం తర్వాత ప్రజల్లో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. చివరకు ప్రజలను ఉద్దేశించి ప్రత్యక్ష ప్రసారంలో అప్పటి రాణి ఎలిజబెత్ స్వయంగా మాట్లాడాల్సి వచ్చింది. యువరాణికి నివాళి అర్పించిన ఆమె, విషాదాన్ని మాటల్లో వ్యక్తం చేయడం చాలా కష్టమని అన్నారు.

"మనమంతా మనకు సాధ్యమైన విధంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాం. మనకు కలిగిన నష్టం ఇంతని చెప్పడం సులభం కాదు. ఎందుకంటే మొదట కలిగే దిగ్భ్రాంతి తర్వాత అవిశ్వాసం, అర్థంకాని ఆవేదన, కోపం, మిగిలిపోయిన వారి పట్ల ఆందోళన వంటి అనేక భావాలు కలగలిసిపోతాయి" అని ఆమె అన్నారు.

ఈ ప్రసంగం వెనుక ఆ సమయంలో కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన టోనీ బ్లెయిర్ ఆధునిక ఆలోచనల ప్రభవం, ప్రమేయం ఉన్నాయని భావిస్తారు. హెలెన్ మిర్రెన్ నటించిన 'ది క్వీన్' సినిమాలో కూడా ఈ పరిణామాన్ని చూపించారు.

రాజకుటుంబంలో ఇప్పుడు కనిపిస్తున్న అనేక ఉద్రిక్తతలు, ఆవేశాలకు 1997 నాటి ఆ విషాద సంఘటనలతో సంబంధం ఉందని చెప్పచ్చు. చిన్న వయసులో తల్లిని కోల్పోవడం ఆమె కుమారులపై తీవ్ర ప్రభావం చూపడం సహజమే. పరిష్కారంకాని ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది.

యువరాణి డయానా మరణం

ఫొటో సోర్స్, Anwar Hussein/Getty Images

ఫొటో క్యాప్షన్, డయానా శవపేటిక వెనుక ప్రిన్స్‌లు నడవడం సరైనదేనా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి

డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ 'స్పేర్' అనే ఆత్మకథలో తల్లి డయానా లేని లోటు గురించి విస్తృతంగా రాశారు. ఆమెను కోల్పోయిన బాధ తనలో ఇంకా అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమె శవపేటిక వెనుక నడిచిన సందర్భం తనను ఎంతగా కలచివేసిందో కూడా వివరించారు. ఈ విషయంలో ఎర్ల్ స్పెన్సర్ వ్యతిరేకతను కూడా హ్యారీ ప్రస్తావించారు.

"మమ్మీ సోదరుడు అంకుల్ చార్లెస్ (చార్లెస్ ఎర్ల్ స్పెన్సర్) తీవ్రంగా ఆగ్రహించారు. 'ఈ అబ్బాయిలను వారి తల్లి శవపేటిక వెనుక నడిపించకూడదు ఇది చాలా తప్పు' అని ఆయన అన్నారు" అని హ్యారీ రాశారు.

రాజకుటుంబ ప్రయోజనాలకు వ్యక్తుల సంతోషంకంటే ప్రాధాన్యత ఇచ్చారని హ్యారీ చేసిన ఆరోపణ కూడా, ఆయన రాజకుటుంబ సభ్యుడిగా తన బాధ్యతల నుంచి తప్పుకోవడం, సోదరుడు ప్రిన్స్ విలియంతో విభేదాలు కొనసాగడం వంటి పరిణామాలకు దారితీసిన కథనంలో భాగమైంది.

డయానా మరణం తర్వాత కుటుంబంలో, అలాగే అత్తమామల మధ్య ఏర్పడిన వివాదాలు ఎర్ల్ స్పెన్సర్ పుస్తకం 'స్వాన్ సాంగ్: డయానా, మై సిస్టర్'లో మరోసారి బహిరంగంగా చర్చకు వచ్చాయి. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా వార్తా శీర్షికల్లో నిలిచింది. కింగ్ చార్లెస్ వ్యక్తిత్వం, యువరాణి డయానాతో ఆయన వ్యవహరించిన తీరు, ఇప్పుడు క్వీన్ కామిలాతో ఆయన సంబంధం వంటి పాత ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.

రాయల్ హాలోవే, యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ పాలిన్ మాక్లారన్ సోషల్ మీడియాలో డయానా అభిమానులు ఎర్ల్ స్పెన్సర్ చెప్పిన విషయాలను నమ్ముతున్నారని అన్నారు. "అందమైన యువరాణి జీవితం ఇంత విషాదకరమైన, స్పష్టత లేని పరిస్థితుల్లో అర్ధంతరంగా ముగిసింది" అనే కథనాన్ని గుర్తుచేసే ఏ విషయానికైనా రాజకుటుంబం ఇప్పటికీ "తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితిలో" ఉందని ఆమె చెప్పారు.

రాయల్ కామెంటేటర్ జెన్నీ బాండ్ ఈ పుస్తకాన్ని "చాలా ప్రతికూల స్వభావం కలిగిన అసభ్యకరమైన పుస్తకం"గా అభివర్ణించారు. "ఇందులో ఒక వ్యక్తి గురించి చాలా అసహ్యకరంగా రాశారు. కానీ అది ఆయన జ్ఞాపకం. నిజం ఏంటనేది ఎవరికి తెలుసు?" అని ఆమె అన్నారు.

డయానా మరణం తర్వాత అప్పటి ప్రిన్స్ చార్లెస్‌తో జరిగిన సంభాషణపై ఎర్ల్ స్పెన్సర్ ఇచ్చిన వివరాలే ప్రధాన వివాదానికి కారణంగా మారాయి. డయానా మరణించిన తర్వాత చార్లెస్ తనతో "మనం ఆమెను త్వరలోనే మర్చిపోతాం" అని అన్నారని ఎర్ల్ స్పెన్సర్ ఆరోపించారు.

యువరాణి డయానా మరణం

ఫొటో సోర్స్, JOHN STILLWELL/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఎర్ల్ స్పెన్సర్ తన సంతాప ప్రసంగాన్ని ముగించినప్పుడు, వెస్ట్‌మిన్‌స్టర్ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది

డయానా మరణవార్త విన్న తర్వాత చార్లెస్ "అమితమైన ఆనందంతో", లాటరీ గెలిచిన వ్యక్తిలా కనిపించారని కూడా ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలకు బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పందించింది. రాజసభకు తగిన మర్యాదపూర్వక భాషలోనే స్పందించినప్పటికీ, ఆ సంభాషణ ఎర్ల్ స్పెన్సర్ చెప్పిన విధంగా జరగలేదని రాజభవనం స్పష్టం చేసింది.

"సోదరిని కోల్పోయిన విషాదంలో వివేచన మసకబారచ్చు, నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. ఇతరులు గుర్తించని విధంగా జ్ఞాపకాలను కూడా ప్రభావితం చేయవచ్చు" అని రాజు పేర్కొన్నట్లు వెల్లడించింది.

సైకోథెరపిస్ట్ నిక్ హాటర్, ఈ సంఘటనలో ఎవరి వాదన నిజమో అన్న విషయంపై తనకు అభిప్రాయం లేదన్నారు. అయితే విషాదకర సంఘటనల సమయంలో జ్ఞాపకాలు కాస్త మారే అవకాశం ఉందని చెప్పారు. ఫోన్ సంభాషణలో ఎదుటిమనిషిని చూడలేమని వారి శరీర భాష కనపడదని, అందువల్ల పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమవుతుందని ఆయన అన్నారు.

విషాదాన్ని ఎదుర్కొనే విధానం ఒక్కొక్కరిలో ఒక్కోలా, ఊహించలేని విధంగా ఉంటుందని హాటర్ చెప్పారు. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన తర్వాత కొందరిలో "బిరీవ్‌మెంట్ మేనియా" అనే పరిస్థితి ఏర్పడవచ్చని, అప్పుడు వారు అనుచితంగా ఉత్సాహంగా లేదా ఆనందంగా కనిపించవచ్చని వివరించారు.

ఈ విషయం మొత్తంలో ఎవరిని నమ్మాలో తెలుసుకునేందుకు యూగోవ్ నిర్వహించిన తొలి పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇందులో 31 శాతం మంది ఎర్ల్ స్పెన్సర్ ఆరోపణలను నమ్ముతున్నట్లు, 36 శాతం మంది అవి నిజం కాకపోవచ్చని భావిస్తున్నట్లు, 33 శాతం మంది తమకు తెలియదని చెప్పినట్లు వెల్లడైంది.

ఈ పుస్తకం పెద్దగా అభిప్రాయాలను మార్చే అవకాశం లేదని వాలెంటైన్ భావిస్తున్నారు. "చార్లెస్‌ను ఎలా చూస్తారు, డయానా కాలాన్ని ఎలా గుర్తుచేసుకుంటారు అనే విషయంలో ప్రజలు ఇప్పటికే తమ తమ అభిప్రాయాలకు స్థిరపడిపోయారు" అని ఆయన చెప్పారు.

యువరాణి డయానా మరణం

ఫొటో సోర్స్, Princess Diana Archive/Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్, మామ ఎర్ల్ స్పెన్సర్‌(ఎడమ)తో ప్రిన్స్‌లు

ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకురావడం "అసహ్యంగా" అనిపించవచ్చని కూడా ఆయన అన్నారు.

చరిత్రకారుడు, రచయిత సర్ ఆంథోనీ సెల్డన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డయానా అంత్యక్రియల సమయంలో ఎర్ల్ స్పెన్సర్ ఎంతో ధైర్యం ప్రదర్శించారని ఆయన అన్నారు. అయితే ఆయన జ్ఞాపకాల పుస్తకం "విచారకరమైన, అవసరం లేని ప్రచురణ" అని అన్నారు.

రాయల్ వ్యాఖ్యాత రిచర్డ్ పాల్మర్, ఈ పుస్తకం రాజకుటుంబాన్ని 1997లోని ఆ సంక్లిష్టమైన రోజులకు తిరిగి తీసుకెళ్లే ప్రమాదం ఉందన్నారు.

"ఈ పుస్తకం, వచ్చే ఏడాది జరగనున్న డయానా 30వ వర్ధంతికి ముందు నెలకొనే పరిణామాలు, చార్లెస్, కామిలాల ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేందుకు రాజకుటుంబం మూడు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు.

ఎర్ల్ స్పెన్సర్ ఇప్పుడు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం "వింతగా" అనిపిస్తోందని డయానా అంత్యక్రియలపై బీబీసీ ప్రసారానికి నాయకత్వం వహించిన సీనియర్ ప్రసారకర్త డేవిడ్ డింబుల్‌బీ అన్నారు.

పుస్తకం విడుదలకు ముందు ఇచ్చిన ప్రకటనలో ఎర్ల్ స్పెన్సర్ మాట్లాడుతూ, తన సోదరి గురించి ఇంటర్వ్యూలు ఇవ్వాలని తనకు అనేక అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. డయానా మరణించి 30 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో, ఇతరుల అభిప్రాయాలను మళ్లీ చదవాల్సిన పరిస్థితి కాకుండా, తన జ్ఞాపకాలను స్వయంగా రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇతరుల అభిప్రాయాలలో చాలా విషయాలు నిజం కాకపోయినా, కాలక్రమేణ అవే నిజాలుగా ప్రజలు నమ్ముతున్నరని ఆయన అన్నారు.

యువరాణి డయానా మరణం

ఫొటో సోర్స్, Jayne Fincher/Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ చేరుకున్న డయానా శవపేటికను చూసేందుకు ఆమె భర్త కింగ్ చార్లెస్, ఆమె సోదరీమణులు లేడీ జేన్ ఫెలోస్ (ఎడమవైపు) లేడీ సారా మెక్‌ కార్కోడేల్‌లతో కలిసి నడుస్తున్న దృశ్యం.

వారాంతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో, బీబీసీ జర్నలిస్ట్ లారా కుయెన్స్‌బర్గ్‌తో మాట్లాడినప్పుడు కూడా ఎర్ల్ స్పెన్సర్ తన ఆరోపణలు నిజమైనవేనని గట్టిగా సమర్థించారు.

"ఆయన సరిగ్గా ఆ మాటలే అన్నారని నేను ఇప్పుడే, ఇక్కడే చెప్పగలను. ఆయన ఏం చెబుతున్నారో నేను చాలా అప్రమత్తంగా విన్నాను. ఆయన సరిగ్గా ఆ మాటలే చెప్పారు. నేను ఇప్పుడు మీకు హామీ ఇస్తున్నాను. నిజంగానే ఆయన అలా అన్నారు. ఆయన అలా చెప్పలేదని అంటున్నట్లు నేను వినలేదు" అని ఆయన చెప్పారు.

వ్యక్తిగతంగా చూస్తే ఎర్ల్ స్పెన్సర్ చాలా స్నేహపూర్వకంగా, ఆకర్షణీయంగా కనిపించే వ్యక్తి. రాజకుటుంబంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన రచయిత ఆయన. వాటికి సంబంధించిన కథలు, కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమైనవీ, ఆయన దగ్గర ఉన్నాయి.

ఆయన చేసిన ఆరోపణలు మరింత ప్రభావం చూపే అవకాశం ఉండటానికి కారణం, ఆయన వ్యాఖ్యాతగా లేదా విశ్లేషకుడిగా రాయడం లేదు. తన సోదరి, ఆమె అత్తమామలతో కలిసి ఒకే టేబుల్ వద్ద కూర్చున్న వ్యక్తిగా రాస్తున్నారు. ఇది దూరం నుంచి చూసి రాసిన కథనం కాదు. భావోద్వేగాలతో కూడిన అత్యంత సన్నిహితమైన అనుభవం.

ఈ పుస్తకం డయానా మరణం మిగిల్చిన ప్రభావం నుంచి రాజకుటుంబం ఇంకా పూర్తిగా బయటపడలేదని చూపిస్తే, ఆ మరణం చూపిన ప్రభావం నుంచి ఎర్ల్ స్పెన్సర్ కూడా బయటపడలేదని చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)