92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్

మీరు బాగా గుర్తు తెచ్చుకోండి.. ఇప్పటి వరకూ మీరు కలిసిన వైద్యుల్లో అత్యంత ఎక్కువ అనుభవం ఉన్న వారు ఎవరు? 30 ఇయర్స్ ఇండస్ట్రీలాగా అన్నమాట.. 30? 40? పోనీ 50! కానీ మీరెప్పుడైనా సుమారు 70 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ ను కలిశారా?
70 అంటే వయసు కాదండీ.. ఎంబీబీఎస్ పాసైన తరువాత.. కచ్చితంగా చెప్పాలంటే అక్షరాలా 68 సంవత్సరాలకు పైగా ప్రాక్టీస్ లో ఉన్న డాక్టర్ తెలుసా మీకు? నాకు ఒకరు కనిపించారు..
అటువంటి అరుదైన వైద్యురాలు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ వయసులో అంటే, తన 92వ ఏట కూడా ఆ డాక్టరు ఇంకా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు.
1958లో ఎంబీబీఎస్ పాస్ అయిన డా. సూరి శ్రీమతి ఇప్పటికీ నిత్యం రోగులను చూస్తూ, అప్పడప్పుడు సిజేరియన్ సీ సెక్షన్ ఆపరేషన్లు చేస్తూ చలాకీగా, యువ వైద్యులకు తీసిపోకుండా వైద్యసేవలు అందిస్తున్నారు.
90ల వయసు వస్తే నడవడం, సొంతంగా పనులు చేసుకోవడమే కష్టం అని చాలా మంది భావించే స్థితిలో ఆవిడ ఏకంగా స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేయడమే కాక, బ్లేడ్ పట్టుకుని సర్జరీలు ఎలా చేస్తున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆసుపత్రికి ఇప్పటికీ కారు సొంతంగా నడుపుకుంటూ వెళ్తున్నారు. 92 ఏళ్ల వయసులో కూడా డా.శ్రీమతి జ్ఞాపకశక్తి చెదరలేదు, చెయ్యి వణకడం లేదు.
అయినప్పటికీ ఆపరేషన్లు చేసేప్పుడైనా చేతులు వణకవా అని ఆమెను అడిగాను.
''వణకవు'' అన్నారామె. అంతేకాదు, ''ఇదిగో నా చేతులు మీరే చూడండి..'' అంటూ చేతులు చూపించారామె. అందరు వైద్యులు గుర్తుపెట్టుకున్నట్టే మందుల పేర్లు గుర్తు పెట్టుకుంటానని చెప్పారు శ్రీమతి.

అమ్మమ్మ, అమ్మ, కూతురుకి కూడా వైద్యం అందించిన డాక్టర్
''ఆవిడ చెయ్యి పొరబాటున కూడా వణకదు. మన చెయ్యి అయినా వణుకుతుందేమో కానీ.. ఆవిడ యోగా, ధ్యానం చేస్తారు. మంచి డిసిప్లిన్, డెడికేషన్ టు ద ప్రొఫెషన్, నో స్ట్రెస్, ఇంకా యోగా. అలాగే డైట్. నిద్రలేకుండా కూడా పనిచేయగలదు ఆవిడ'' అంటూ డా. శ్రీమతి గురించి బీబీసీకి చెప్పారు ఆమె సహ వైద్యురాలు డా. రజనీ కుమారి.
శ్రీమతి పేషెంట్లలో మూడు తరాలు వైద్యం అందుకున్న మహిళలు కూడా ఉన్నారు. అమ్మమ్మ, అమ్మ, కూతురు.. ముగ్గురికీ వైద్యం చేసినట్టు చెప్పారామె. ''చాలా మంది తమ చిన్నప్పటి ఫోటోలు చూపించి, నా డెలివరీ మీరే చేశారని'' చెబుతుంటారన్నారు డా. శ్రీమతి.
''ఆవిడ ఓర్పుగా వింటారు. 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానం చెప్తారు. మొదటిసారి ఆవిడను చూసినప్పుడు కొద్దిగా భయం వేసింది. ఇంత పెద్ద వయసు డాక్టర్ కదా. ఈమె కరెక్ట్ గానే సిజేరియన్ చేయగలరా లేదా అని.
కాకపోతే, రాను రాను ఆమె దగ్గర వెళ్తూ ఆమె దగ్గర చూపించుకున్న పేషెంట్స్ రివ్యూస్, ఆమె చూసే విధానం అన్నీ చూసిన తర్వాత నమ్మకం వచ్చింది. సర్జరీలో ఆమె దగ్గర అసిస్టెంట్స్ ఉన్నా మెయిన్ పార్ట్ ఆవిడదే. నా మూడవ డెలివరీ ఎమెర్జెన్సీగా వస్తే టీ కూడా తాగకుండా వచ్చేసి మొత్తం అయ్యాక అప్పుడు ఆహారం తీసుకున్నారావిడ'' అని బీబీసీతో చెప్పారు ఆమె దగ్గర డెలివరీ చేయించుకున్న తులసి.

నిరంతర అప్డేట్స్...
వైద్య శాస్త్రం చాలా వేగంగా మార్పులు చెందే రంగం. కొత్త కొత్త మందులు, కొత్త పరిశోధనలు, కొత్త పరీక్షలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఆ క్రమంలో తనను తాను నిరంతరం అప్డేట్ చేసుకుంటున్నానని చెప్పారు శ్రీమతి.
''నేను కాన్ఫరెన్సులకు వెళ్తాను. మీటింగులకు వెళ్తాను. లిటరేచర్, జర్నల్స్ చదువుతాను. మెడికల్ రిప్రజంటేటివ్స్ కొత్త మందులు పరిచయం చేస్తుంటారు. రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ తెలుసుకుంటాను'' అన్నారావిడ.
''మేడమ్ దగ్గర మంచి విషయం ఏంటంటే, సబ్జెక్ట్ అడ్వాన్స్మెంట్స్ ఈ రోజుకీ నేర్చుకుంటారు. కొత్త టెక్నిక్ వస్తే తెలుసుకుంటారు'' అని వివరించారు సర్జరీల్లో ఆమెతో కలసి పనిచేసే సహ వైద్యురాలు, గైనకాలజిస్ట్ డా.రజనీ కుమారి.
''ప్రతీ ఒక్కరికీ టైం ఎక్కువ ఇస్తారు. అన్ని ప్రశ్నలకూ ఓపికగా సమాధానం చెప్తారు. విసుక్కోరు'' అని గుర్తు చేసుకున్నారు.

ప్రభుత్వ వైద్యురాలిగా..
డా.సూరి శ్రీమతి, 1958లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచీ ఎంబీబీఎస్ పాస్ అయ్యారు. (అప్పటికీ ఉస్మానియా మెడికల్ కాలేజీ రాలేదు). తరువాత కొంతకాలం ప్రభుత్వ వైద్యురాలిగి పనిచేసి, గైనకాలజీలో ఎండీ చదివారు. సుదీర్ఘ కాలం హైదరాబాద్ లోనే పనిచేశారు.
''గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ అలా చేశాను. నిజామాబాద్, కర్నూలు, కరీంనగర్ ఆసుపత్రుల్లో కూడా చేసి చివరగా దాదాపు పదేళ్లకు పైగా నీలోఫర్ లో చేసి, అక్కడే రిటైర్ అయ్యాను'' అన్నారు శ్రీమతి. ఉస్మానియా, గాంధీ, కర్నూలు మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పారు.
"ఎంబీబీఎస్ పూర్తై సంగారెడ్డిలోని ఒక ఆసుపత్రిలో వైద్యురాలిగా చేరినప్పుడు మొదటి కేసే 13-14 ఏళ్ల బాలిక వచ్చింది. మా అమ్మాయి గర్భవతి కాస్త చూడండి అని తల్లి తీసుకువచ్చింది. నేను పరీక్ష చేసి ఆశ్చర్యపోయాను. అప్పటికే ఆ పాపకు 8వ నెల. అదే నా మొదటికేసు.
నేను మత్తు మందు ఇచ్చి, సీ సెక్షన్ చేశాను. నేనే సర్జన్, నేనే అనస్థీషియా, నేనే పీడియాట్రీషియన్ కూడా. ఎందుకంటే, ఆ ఆసుపత్రిలో వేరే వైద్యులు లేరు. హౌస్ సర్జెన్సీలో అనుభవం అక్కడ ఉపయోగపడింది."
ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తారు. ప్రస్తుతం శ్రీమతి ఓపీకి 300 రూపాయలు తీసుకుంటారు. ఫీజు ఇవ్వలేని వారి దగ్గర తీసుకోనని చెప్పారు. ''సంపాదన కాదు. నేను సంపాదించింది తృప్తికరంగా, ఒకరిని బాధ పెట్టకుండా తీసుకున్నాను. ఆ తృప్తి ఉంది'' అన్నారు డా. శ్రీమతి.
అయితే, సిజేరియన్లు క్రమంగా తగ్గించుకున్నారు డాక్టర్ శ్రీమతి. నెలకు ఒకటి నుంచి మూడు నాలుగు వరకూ మాత్రమే చేస్తున్నారు. ప్రస్తుతం డా.శ్రీమతి సిజేరియన్లు చేసేప్పుడు, తనతో పాటు మరో గైనకాలజిస్ట్‌ను అసిస్టెంట్ డాక్టర్‌గా తీసుకుంటారు. ప్రధాన సర్జరీ ప్రక్రియ శ్రీమతే చేస్తారు.
1988-91 మధ్య ఉస్మానియా మెడికల్ కాలేజీలో గైనకాలజీలో ఎండీ చదివిన డా.రజనీ కుమారి ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూనే, డా. శ్రీమతి కేసుల్లో సహాయకారిగా ఉంటారు.
''1986లో సీనియర్ హౌస్ సర్జన్ కింద మేడం దగ్గర జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను మేడంతో అనుబంధం కొనసాగిస్తున్నాను. నాకు సర్జరీ నేర్పిన గురువు ఆమె. నాకు పెద్ద ఆసుపత్రుల్లో ఎంత వర్క్, డిమాండ్ ఉన్నా, శ్రీమతి గారి కేసులకే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. ఆవిడ ఉన్నంత కాలం, నేను ఉన్నంత కాలం ఇది కొనసాగుతుంది'' అని బీబీసీతో చెప్పారు డా.రజనీ కుమారి.
ఏడు దశాబ్దాల క్రితం మొదటిసారి బ్లేడ్ పట్టుకున్నప్పటికీ, ఇప్పటికీ ఆపరేషన్లలో వచ్చిన మార్పేంటి అని అడిగితే, ''ఆపరేషన్ పద్ధతులు, కుట్లు వేసే మెటీరియల్, మత్తు ఇచ్చే పద్ధతి ఇవన్నీ చాలా మారాయి. వాటికి నేను కూడా అడాప్ట్ అయి నేర్చుకున్నాను'' అని సమాధానమిచ్చారు డా. శ్రీమతి.
అప్పటికీ ఇప్పటికీ వైద్యరంగంలో వచ్చిన మార్పుల గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. ''అప్పుడు పేషెంట్లు డాక్టర్ అనే భక్తి తో వచ్చేవారు. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం, డిమాండింగ్ టైప్‌లో వస్తున్నారు. జనరల్‌గా అలా అనిపిస్తుంది'' అన్నారామె.
''చాలా మంది రోగులకు ఆవిడంటే నమ్మకం. ఏ సౌకర్యాలూ లేని రోజుల్లోనే ఆమె అంత వర్క్ చేశారు. ఒక దశలో మేం నెలకు 120 డెలివరీలు చేసినవి ఉన్నాయి. అవి కూడా పెద్దగా వసతులు లేని మారుమూల కూడా చేశాం. ఆవిడ సమర్థత, ఆవిడ మాట్లాడే విధానంతో చాలా మంది వస్తారు. లేకపోతే ఆమె చేత ఆపరేషన్ కోసం రారు'' అన్నారు డా.రజనీ కుమారి.

తండ్రి నుంచి యోగా...
శ్రీమతి తండ్రి యోగా ప్రచారకులు. దిల్లీలో ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గర యోగా నేర్చుకుని ఉమ్మడి ఏపీలో విస్తృతంగా యోగా గురించి ప్రచారం చేశారు. అలా శ్రీమతికి కూడా యోగా అలవాటు అయింది. ఇప్పటికీ ఆమె యోగ సాధన చేస్తారు.
మెడిసిన్ వైపు ఎందుకు వచ్చారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు శ్రీమతి. ''అప్పట్లో తల్లిదండ్రులు ఏది చదవమంటే అది చదవడమే. మా నాన్నగారు మెడిసిన్ చదవమన్నారు. చదివాను. అప్పట్లో ఎంట్రన్స్ పరీక్షలు లేవు. మార్కుల ఆధారంగా సీటు ఇచ్చారు. వాస్తవానికి, నాకు పిల్లల డాక్టర్ (పీడియాట్రిక్స్) చదవాలని ఉండేది. కానీ మా ఫ్రెండ్స్ అంతా గైనకాలజీకి వెళ్లి నన్నూ తీసుకెళ్లారు'' అంటూ తన ప్రస్థానం ప్రారంభమైన విషయాలు చెప్పారు శ్రీమతి.
అయితే డా. శ్రీమతి పెళ్లి చేసుకోలేదు. ఎందుకని అడిగితే, ''జరగలేదంతే..'' అని సరిపుచ్చారు.

''నాకు తెలివి వచ్చినప్పటి నుంచి మా అక్క డాక్టర్ అనే తెలుసు. చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు ఆవిడ చూస్తుంటారు. ఒక టైం అంటూ ఉండదు. ఎప్పుడు అర్జెంటుగా కావాలన్నా ఆవిడ చూస్తారు'' అని బీబీసీతో చెప్పారు డా. శ్రీమతి తమ్ముడు సూరి రామనాథ శాస్త్రి.
శ్రీమతి కంటే 19 ఏళ్ల చిన్నవారైన రామనాథ శాస్త్రి కెమిస్ట్రీ లెక్చరర్‌గా చేసి రిటైర్ అయ్యారు. డా. శ్రీమతి ప్రస్తుతం తన సోదరుడు, ఆయన కుటుంబంతో కలసి పూర్వీకుల ఇంట్లోనే ఉంటున్నారు.
తన సోదరి ఈ వయసులో మరీ అంత కష్టపడడం ఆయనకు నచ్చకపోయినా, ''ఆవిడకు చెప్పే ధైర్యం నాకు లేదు. ఆవిడ ఎనర్జీ లెవెల్స్, ఆ కమిట్మెంట్ వేరు. వైద్యం కావాలని అర్జెంటుగా ఎవరైనా వస్తే చూడకు అని నేనెలా అనగలను?'' అన్నారు రామనాథ శాస్త్రి.
ప్రపంచం అంతా ఎర్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతోన్న వేళ, 90వ పడిలో పడినా ఎందుకు పనిచేస్తున్నారని శ్రీమతి గారిని అడిగినప్పుడు, ''భగవంతుడు నాకు ఓపిక ఇచ్చినంత కాలం పనిచేస్తాను. అన్నం తినడం నుంచి విశ్రాంతి తీసుకోనప్పుడు, పనిచేయడం నుంచి ఎందుకు తీసుకోవాలి?" అన్నారామె.

ఫొటో సోర్స్, Tulasi
'మీరు సరస్వతి వెనుక ఉండండి, లక్ష్మి వెంబడిస్తుంది'
వైద్యవృత్తిలోకి రావాలనుకునే వారికి సలహా ఇస్తూ, " మీరు సరస్వతి వెనుక ఉండండి, లక్ష్మి వెంబడిస్తుంది. ఫీజు కోసం వెళ్లకండి. మీ సేవ మీరు చేస్తూ ఉండండి, ఆటోమేటిక్‌గా మిగతావి వెంబడిస్తాయి'' అని ఆమె అన్నారు.
గతంలో గంపెడు పిల్లల్ని కనేవారు మహిళలు, ఇప్పటి ఆడవారికి ఆ శక్తి లేదు అనే మాట తరచూ వినిపిస్తూంటుంది. అయితే, దీనితో విభేధించారు శ్రీమతి.
''తట్టుకోలేకపోవడం అనేది కాదు. బాధ్యతలు పెరిగాయి. బలంంలో అప్పుడూ, ఇప్పుడూ పెద్ద తేడా ఉండదు. బహుశా ఆహారంలో కొంచెం మార్పు వచ్చింది. అప్పుడేమో అన్పాలిష్డ్ తినేవాళ్లు. మనుషులు కూడా అన్పాలిష్డ్‌గా ఉండేవాళ్లు. ఇప్పుడు పాలిష్డ్ అన్నింటిలోనూ ఎక్కువైంది. మనుషులలోనూ తినుబండారాలలో కూడా. ఇక జీవన శైలి మార్పులు వల్ల డయాబెటిస్, శారీరక శ్రమ తగ్గిపోవడం, స్ట్రెస్, ఓర్పు తగ్గడం వంటివి కనిపిస్తున్నాయి.''
గతంలో కంటే మహిళలకు వైద్యం, ఆరోగ్యంపై అవగాహన పెరిగిందనీ, సమాచారం, అవకాశాలు, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆమె అన్నారు.
ఇన్నాళ్ల మీ ప్రస్థానం గురించి ఒక్కమాటలో చెప్పమంటే.. ఆనందం, తృప్తి అన్నారు డా. శ్రీమతి.
డా. శ్రీమతి చెప్పిన ఆరోగ్య రహస్యాలు:
- ''రోజూ ఉదయాన్నే లేచి యోగా, ప్రాణాయామం చేస్తాను. అప్పుడప్పుడు టీవీ చూస్తాను'' అన్నారామె.
- ఉదయాన్నే మంచి గాలిలో ప్రాణాయమం చేయాలి. ఆక్సిజన్ అందుతుంది శరీరానికి. మిగిలిన రోజంతా చురుగ్గా ఉంటుంది.
- తేలికగా జీర్ణం అయ్యే ఏ ఆహారం అయినా తినవచ్చు. రోస్ట్ చేసిన ఏదీ పోషకాలతో ఉండదు. అది నాలుక కోసం తప్ప.
- సమయానికి తిండి, సమయానికి నిద్ర కావాలి. విటమిన్ డీ, కాల్షియం చాలా కీలకం శరీర ఆరోగ్యానికి.
- మా రోజుల్లో ఆరు బయట ఆటలు, ఇంటి పనులు, ముగ్గు వేయడాలు వీటి వల్ల సూర్య రశ్మి తగిలేది. ఇక బడికి, కాలేజీకి నడచి వెళ్లేవాళ్లం. అలా శరీరం కదలిక ఉండేది. ఇప్పుడు శరీరం కదలికలు తగ్గిపోయాయి.
- సూర్యకాంతి తగలాలి, నిరంతం వ్యాయామం లేదా శారీరక శ్రమ లేదా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి.
- బయటి తిండి వదలాలి, తిండి సమయానికి తినాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఒకే సమయానికి విశ్రాంతి తీసుకోవాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































